11, మే 2023, గురువారం
నగ్న సత్యం ...బట్టలిప్పితేనే మీడియా గుర్తిస్తుంది ....ఓ జ్ఞాపకం
నగ్న సత్యం
ఓ జ్ఞాపకం
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ... బట్టల పై పన్నులు విధించాలి అని నిర్ణయం ... దీనికి వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులతో కలిసి చంద్రబాబు ఇందిరాపార్క్ వద్ద ధర్నా .... ఈ పన్ను విధింపు వల్ల ప్రజలు ఇక బట్టలు కట్టుకోలేరు అని టీడీపీ తీవ్ర ఆందోళన ... దేశం లో ఎన్ని కోట్ల మంది బట్టలు వేసుకుంటారో , వారంతా కాంగ్రెస్ కు వ్యతిరేకం గా ఓటు వేస్తే ఏమవుతుందో వస్త్ర వ్యాపారాలు గణాంకాలతో సహా వివరిస్తున్నారు ... ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ... వర్షపు తుంపర్లు పడుతుంటే సునామీ అని ప్రచారం చేసే సత్తా ఆ పార్టీకి ఉంది ...
బాబు ధర్నా అంటే రిపోర్టర్ గా కవర్ చేయాలి . హడావుడిగా వెళ్లి ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియం లో బైక్ పార్క్ చేసి లాక్ వేస్తుంటే ...పక్కనే ఉన్న చెట్టు వెనక నుంచి ఓ ఆదిమానవుడి నా వైపు రాసాగాడు ...
80 ప్రాంతం లో తెలుగులో ఆదిమానవుల మూగ సినిమాలు చాలా వచ్చేవి . సినిమాలో మాటలు ఉండవు . శరీరం పై ఆకులే ఉండేవి ...
అలానే ఇతను శరీరం మీద నూలు పోగు కూడా లేదు . నడుముకు ఆకులు ఉన్నాయి ...
దగ్గరకు వచ్చి పలకరించి ఎలా ఉంది అని అడిగాడు ... వస్త్రాల పై పన్ను వేస్తే జనం ఇక బట్టలు కట్టుకోకుండా ఆకులు కట్టుకొని తిరుగుతారు అని సింబాలిక్ గా చూపిస్తున్నాడు అన్నమాట ..
పార్టీ నిరసన ప్రోగ్రాం ఏది జరిగినా ఈనాడు సిటీ పేజీ లో ఇతని ఫోటో రావలసిందే ...
రైతు , నిరుద్యోగి , ధరలు పెరిగితే కుటుంబరావు ఏ నిరసన ఐనా ఇతని ఫోటో తప్పని సరి ... రైతు ఆవేదన , నిరుద్యోగి ఆక్రోశం అంటూ క్యాప్షన్ తో ఇతని ఫోటో ... అన్ని వేషాలు ఒకే వ్యక్తివి అని ఫోటో గ్రాఫర్ కు తెలుసు సబ్ ఎడిటర్ కు తెలుసు . మంచి ఫోటో కావాలి అంటే తప్పదు ...
అతని పేరు కృష్ణ గౌడ్ అంబర్ పేట టీడీపీ చోటా లీడర్ ..
దగ్గరకు వచ్చి ఎలా ఉంది అని అడిగితే , నీ కోణం లో సూపర్ ... ధర్నాకు సంబంధించి బాబు ఫోటో వేసినా వేయక పోయినా నీ ఫోటో వేసి తీరాల్సిందే అన్నాను ..
అతను వెళ్ళాక మరో యువ లీడర్ చౌదరి అని మీ లాంటి వాళ్ళు కూడా అతన్ని ఎంకరేజ్ చేయడం బాగా లేదు ... మేం ధర్నాకు డబ్బు ఖర్చు చేసి ఏర్పాట్లు అన్నీ చేస్తే మాకు ప్రచారం రాదు ... అతను వచ్చి బట్టలు విప్పి ఆకులు కట్టుకుంటే ప్రచారం అని బాధ పడ్డాడు ... చూడు చౌదరి అతను చేసింది కరెక్ట్ అని నేను చెప్పలేదు ... అతని కోణం లో కరెక్ట్ అన్నాను ..
బట్టలు వేసుకొని రావడం కామన్ ... ఇది మీడియాకు నచ్చదు ...
పూర్వం మీడియా అంటే ప్రజలకు సమాచారం చేరవేసేది అని ... ఇప్పుడు మీడియా అంటే వినోదం , కాలక్షేపం ... విలువలు లేకుంటేనే మీడియాలో ప్రాధాన్యత లభిస్తుంది ... పైగా అదే మీడియా పడిపోతున్న విలువలు అంటూ గగ్గోలు పెడుతుంది .
దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కల అరుపులు వినిపించాయట ...
చెట్టు చాటు నుంచి ఆకులు కట్టుకొని వచ్చిన ఆ చోటా లీడర్ వచ్చినప్పుడు ... వెర్రి తలలు వేయబోతున్న మీడియా శబ్దాలు అప్పుడు వచ్చే ఉంటాయి ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం