4, మే 2023, గురువారం
జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ - టివి 9 యజమానుల నాడి నే జనం నాడి
జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ - టివి 9
యజమానుల నాడి నే జనం నాడి
ఓ జ్ఞాపకం 8
సోడాబుడ్డి కళ్లద్దాలు , పెరిగిన గడ్డం , లాల్చీ
పైజామా ... ఇదీ పాత తెలుగు సినిమాల్లో జర్నలిస్ట్ అనగానే కనిపించే రూపం .. జనం మనసు పై ఈ ముద్ర బలంగా పడిపోయింది. ఓ సారి విశ్వనాద్ ఆనంద్ ను ఒకరు ఏం చేస్తావ్ అని అడిగితే చెస్ ప్లేయర్ ను అని చెబితే ... చేస్ ఆడుతావు సరే బతకడానికి ఏం చేస్తావు అని అడిగారట .. సినిమాల్లోని ఈ జర్నలిస్ట్ రూపం పుణ్యమా అని జర్నలిస్ట్ ను అని చెబితే ,అది సరే బతకడానికి ఏం చేస్తావ్ అని అడిగే వారు ఓ కాలం లో .. పవర్ ప్రాజెక్ట్ లు, సొంత వ్యవహారాలు నడిపే వారు ఉన్నా చాలా కాలం పాటు సరే బతకడానికి ఏం చేస్తావ్ అని వినిపించేది . ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక పాత సినిమాల్లోని లాల్చీ పైజామా, పెరిగిన గడ్డం రూపం చెరిగి పోయింది .. అందమైన అమ్మాయిలు , సూటు బూటు రిపోర్టర్ లు ఆ స్థానం ఆక్రమించుకున్నారు .. బుర్రకు ప్రాధాన్యత తగ్గి రూపానికి , గడగడ మాట్లాడడానికి ప్రాధాన్యత పెరిగింది .. సినిమా యాక్టర్ లలా జర్నలిస్ట్ లకు ప్రచారం లభించింది . ఇలా ప్రచారం కల్పించడం లో టివి 9 ముందుంది .. అప్పటి వరకు కొమ్ములు తిరిగిన ప్రింట్ మీడియా జర్నలిస్ట్ లు కూడా వెనక్కి వెళ్లగా టివి జర్నలిస్ట్ లు ముందుకు వచ్చారు .
రజనీ కాంత్ ను బిగ్ డిబేట్ లో టివి 9 హైలెట్ చేయడం బాగుంది ... ఐతే .....
జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ అంటూ రజనీ కాంత్ ను ప్రోమోలో ఆకాశానికి ఎత్తిన ప్రచారం తో కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి . నిజంగా జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ నా ? అంటే ఏమో ....
2004-5 లో రజనీ కాంత్ టివి 9 లో తొలి వార్త ... కాంగ్రెస్ తెరాస పొత్తు తో పోటీ .కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది .మంత్రి వర్గం లో తెరాస చేరింది . తరువాత మంత్రులంతా రాజీనామా చేశారు . అప్పుడు విదేశాల్లో ఉన్న సంతోష్ రెడ్డి రాజీనామా చేయలేదు .. తెరాస ఆవిర్భావం తరువాత తొలి బెనిఫిషరీ అతనే ....
విదేశాల నుంచి వచ్చాక కూడా రాజీనామాకు వెనకడుగు . Ysr సన్నిహితం ... ఎట్టకేలకు రాజీనామాకు సిద్దపడి తెరాస కార్యాలయం వద్ద మీడియా తో నేను మంత్రి పదవికి రాజీనామా చేశాను . నాదే నిజమైన తెరాస . తెలంగాణ ఉద్యమాన్ని నేనే నడిపిస్తాను అని ప్రకటించారు ... వయసు వల్ల ఆయన వాయిస్ ఇంత స్పష్టంగా లేదు కానీ దాని అర్థం ఇదే .. టివి 9 జర్నలిస్ట్ గా రజనీకాంత్ తొలి కవరేజ్ ఇదే .
***
జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు . మాలతి అని టివి 9 టీడీపీ రిపోర్టర్ ... రజనీ కాంత్ ను నన్ను ఒకరికొకరిని పరిచయం చేశారు . రజనీ కాంత్ తో నా మొదటి మాట మీరు పలానా కదా ? ( ప్రాంతం , సామాజిక వర్గం , పార్టీ ఏదైనా ఉహించు కోవచ్చు ) అని అడిగాను . అతను నవ్వి నా యాసను బట్టి తెలుసు కున్నారా ? అని అడిగాడు .. మా సొంత జిల్లా సొంత గ్రామం వారి యాసను కూడా నేను గుర్తించ లేను .. కానీ మీ మొదటి వార్త వినగానే గ్రహించాను అన్నాను . సాధారణం గా జర్నలిస్ట్ తాను నిష్పక్ష పాతం అని నటించడానికి ప్రయత్నిస్తారు కానీ తెలిసి పోతుంది .. మీరు సంతోష్ రెడ్డి వార్త కవర్ చేస్తూ ఇక తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నాయకత్వం లో నడుస్తుందా ? సంతోష్ రెడ్డి నాయకత్వం లో నడుస్తుందా వేచి చూద్దాం అని ముగించారు . తెలంగాణ ను కోరుకునే హక్కు తెలంగాణ వారికి ఉన్నట్టే వద్దు అనే హక్కు ఇతర ప్రాంతాల వారికి ఉంటుంది . అందులో తప్పులేదు కానీ తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నాయకత్వం లోనా ? సంతోష్ రెడ్డి నాయకత్వం లోనా అనడం లోనే మతలబు ఉంది . అన్నాను .
రాజీనామా తో అప్పటి నుంచి సంతోష్ రెడ్డి రాజకీయ జీవితం ముగిసింది . తానే తెలంగాణ ఉద్యమం నడుపుతాను అని ప్రకటించి 19 ఏళ్ళు అవుతున్నా ఆయన ఉనికి ఎక్కడా కనిపించలేదు . వినిపించలేదు . వయసు అనారోగ్యం వల్ల ఇంటికే పరిమితం అయ్యారు .
***
2009 ఎన్నికల సమయం లో ఐ వెంకట్రావు మహా టివి. పెడితే రజనీ కాంత్ అందులో చేరారు . బాబును ఎలాగైనా అధికారం లోకి తీసుకు రావాలి అని ఛానల్ ద్వారా విశ్వ ప్రయత్నాలు .. ఒకరోజు వెంకట్రావు , రజనీకాంత్ ఇద్దరు ఛానల్ లో కూర్చొని ఫలితాలు తేల్చేశారు .ఏ నియోజక వర్గం లో ఏ కులం వారి ఓట్లు ఎన్ని ఉన్నాయి ? ఏ కులం వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తారో స్టూడియో లోనే వీళ్లిద్దరు తేల్చేసి బాబుకు 180 కి పైగా సీట్లు ఇచ్చి అధికారం లోకి తెచ్చారు . ఐతే ఈ లెక్కలు జనం మాట దేవుడెరుగు ఆ ఛానల్ ఉద్యోగులు కూడా నమ్మలేదు ... దాంతో మళ్ళీ ysr గెలిచారు .
***
ఇంతకూ రజనీ కాంత్ కు జనం నాడి తెలుసంటావా లేదా ?
మార్చురీలో శవాలు తప్ప ఎవరూ తటస్తంగా ఉండరు .
నాడి ?
జనం నాడి కాదు జర్నలిస్ట్ లకు తెలిసేది , తెలవాల్సింది యాజమాన్యాల నాడి .... యజమానులు తమ నాడి నే జనం నాడి అనుకుంటారు ... అనుకోవాలి అంటారు .. ఉద్యోగాల్లో ఉండాలో లేదో తేల్చేది యజమానుల నాడి నే కానీ జనం నాడి కాదు ...
ఇప్పుడు జనం నాడి ని నిర్ధేశించేంత బలం మీడియాకు లేదు ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం