23, మే 2023, మంగళవారం
ూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు:ఎన్టీఆర్ పయనమెటు ?: జర్నలిస్ట్ జ్ఞాపకం
మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు
జర్నలిస్ట్ జ్ఞాపకం
"ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా మారుమూలలో ఉండేవాడిని . మహానుభావుడు ఎన్టీఆర్ వల్ల ఇప్పుడు ఢిల్లీలో కేంద్రమంత్రిగా ఉన్నాను . ఆయన మహానుభావుడు కానీ ఆయన పిల్లలు ..... ఎన్టీఆర్ ను దించేసేప్పుడు నేనూ కొంత మందిమి బాలకృష్ణను కలిశాం లక్ష్మీ పార్వతిని బయటకు పంపాలి అంటే ఎన్టీఆర్ ను దించేయాలి . ఎన్టీఆర్ ను దించేసి లక్ష్మీ పార్వతి వెళ్ళాక మళ్ళీ సీఎం ను చేస్తాం అని చెప్పాం . మళ్ళీ సీఎం ను చేస్తారు కదా అని అమాయకంగా అడిగాడు .. ఒక సారి దించేశాక మళ్ళీ ఎవరైనా సీఎం ను చేస్తారా ? ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు రామకృష్ణ టాకీస్ లో వారం నిర్వహించాలి అనుకున్నాం వారం పాటు అక్కడ ఎన్టీఆర్ జీవిత విశేషాలతో ఎగ్జిబిషన్ నిర్వహించాలి అని హరికృష్ణను అడిగితే, వారం రోజులా ఇవ్వలేను ఒక్క రోజు ఐతే ఒకే అన్నాడు .." కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సముద్రాల వేణుగోపాల చారి ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో పంచుకున్న విషయాలు ఇవి . ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనక పోవడం పై వస్తున్న వార్తలు చదివాక ఇది గుర్తుకు వచ్చింది .
అది సరే జూనియర్ ఎన్టీఆర్ మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు అంటున్నావు . ఎలా ?
ఆ మాట నేనెక్కడన్నాను . మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించింది . జూనియర్ ఎన్టీఆర్ కాదు . చంద్రబాబు . మూడు తరాలను వాడుకున్నది, వారిని యూస్ అండ్ త్రో అని వదిలేసింది బాబు . ఎన్టీఆర్ నటుడు కానీ చంద్రబాబు కల్తీ లేని వందశాతం రాజకీయనాయకుడు . రాజకీయ నాయకుడికి రాజకీయం తప్ప ఇంకేమి ఉండకూడదు . ఒకసారి మోసపోతే మోసం చేసిన వారిది తప్పు . రెండవ సారి మూడవ సారి అలా మోసపోతూనే ఉంటే మోసపోయిన వారిది తప్పు అవుతుంది తప్ప మోసం చేసిన వారిది కాదు . బాబు ఎన్టీఆర్ ను కోలుకోకుండా దెబ్బ కొట్టారు . ఆ దెబ్బకు తట్టుకోక ఎన్టీఆర్ క్షోభ తో పోయారు . ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణను వెన్నుపోటు కన్నా ముందే బాబు రంగం లో దింపారు . అదే హరికృష్ణ బాబు తనను మోసం చేశాడు అని టీడీపీ నుంచి బయటకు వెళ్లి అన్నా తెలుగుదేశం అని ఓ పార్టీ పెట్టి బాబుది యూస్ అండ్ త్రో పాలసీ అని విమర్శించారు . అంతకు ముందు తన తండ్రి మరణం పై విచారణ జరపనందుకు నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు .ఆ తరువాత కూడా వారి కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ బాబు కోసం రంగం లో దిగారు . 2009 లో టీడీపీ , తెరాస కలిసి పోటీ చేశాయి . జూనియర్ బాబు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు . ప్రచారం లో ప్రమాదం ,గాయం . వాహనం లో జూనియర్ బెడ్ పై పడుకొని బాబు తో ఫోన్ సంభాషణ ... టివి లో లైవ్ ... మధ్యలో సంధాన కర్త కొమ్మినేని శ్రీనివాస్ ... ఆరోగ్యం జాగ్రత్త అని బాబు అంకుల్ మీ ఆరోగ్యం జాగ్రత్త అని జూనియర్ ... లైవ్ లో చూసిన వారికి రక్త సంబంధం సీన్ ను మించి రక్తి కట్టించింది .. ఆ ప్రచారం లో జూనియర్ రాజకీయ పంచ్ డైలాగులు అభిమానులను ఉర్రుతలూగించాయి . నువ్వు ఇంకా భ్రమల్లో ఉన్నావు జూనియర్ కోసం జనం గంటల తరబడి వేచి చూస్తున్నారు . నువ్వు ఇంకా కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నావు అని టీడీపీ మిత్రులు మందలించారు . గంటల తరబడి వేచి చూస్తున్నది నిజమే ... దూరం నుంచి చూస్తే చాలు జన్మ ధన్యం అయింది అనుకుంటున్నది నిజం . ఈలలతో యెగిరి గంతులు వేస్తున్నది నిజం ... ఐతే కాంగ్రెస్ గెలుస్తుంది . ఎందుకంటే ఈ అభిమానులు కొత్తగా వచ్చిన వారేమీ కాదు మొదటి నుంచి వారు మీ పార్టీ అభిమానులే . జూనియర్ ను చూసి సంబరపడుతున్నారు అంతే అన్నాను . ప్రచారం ముగిశాక కొద్ది మంది మీడియా వాళ్ళు జూనియర్ ను కలిస్తే - టీడీపీ అధికారం లోకి వస్తుంది . ఐతే తెరాస మద్దతు అవసరం లేకుండా అధికారం లోకి రావాలి అని కోరుకుంటున్నాను అని మనసులోని మాట బయట పెట్టారు . జూనియర్ కోరుకున్నట్టు టీడీపీ కి తెరాస మద్దతు అవసరం పడలేదు . ఎందుకంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నే గెలిచింది .
ఆ తరువాత పరిణామాలతో జూనియర్ ను బాబు బృందం దూరం పెట్టింది / జూనియర్ ఎన్టీఆర్ బాబు బృందాన్ని దూరం పెట్టారు . మొత్తం మీద దూరం పెరిగింది . 2014 ఎన్నికల సమయం లో జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాలపై అంతగా అవగాహన లేదు . అందుకే ప్రచారానికి వెళ్లడం లేదు అని ప్రకటించారు . 2009 లో రాజకీయ ప్రసంగాలతో అదరగొట్టిన వారు ఐదేళ్ల తరువాత మరింత రాటు దేలుతారు కానీ అవగాహన తగ్గుతుందా ? రాజకీయ పరిజ్ఞానం తక్కువ అని చెప్పడం ద్వారా తనకు రాజకీయ పరిజ్ఞానం పెరిగిందని నిరూపించారు .
ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ దూరంగా ఉండడం చర్చనీయాంశం గా మారింది . తాతయ్య కల , నాన్న కోసం అన్నీ హంబక్ . ఎవరి లెక్కలు వారికి ఉంటాయి .
ఈ ఎన్నికల్లో జూనియర్ ప్రచారం చేస్తే టీడీపీ గెలుస్తుంది అనుకుందాం . దాంతో ఆయన కేం లాభం బాబు సీఎం అవుతారు, వారసుడిగా లోకేష్ కు ఎదురు లేదు .టీడీపీ ఈసారి కూడా ఓడి పోతే నాయకత్వ మార్పు పై ఒత్తిడి పెరుగుతుంది . గత ఎన్నికల తరువాత చివరికి బాబు సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ లు చూపి నినాదాలు చేశారు .
2024 లో టీడీపీ ఓడిపోతే ... ఆ తరువాత పార్టీపై ఒత్తిడి పెరుగుతుంది . పార్టీ తన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది . 2029 నాటికి ఆర్థికంగా , సినిమా ఇమేజ్ పరంగా ఆగ్ర స్థానం లో ఉంటాడు . ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినా , చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి విఫలం అయినా , రజనీ కాంత్ రాజకీయ ప్రవేశం పై వెనకడుగు వేసినా ఈ అన్ని సందర్భాల్లో కాలం ది కీలక పాత్ర . తాత ఎన్టీఆర్ నే మట్టికరిపించిన బాబుకు మనవడు ఎన్టీఆర్ ను దెబ్బ తీయడం పెద్ద కష్టమా ? అనిపించ వచ్చు . నీటిలో ఉన్నంత వరకే మొసలికి బలం . తాతా మనవడు అని కాదు కలిసి వచ్చే కాలం , కలసి రాని కాలం అని కాలం ముఖ్యం .
మూడు తరాలను ఉపయోగించుకున్న బాబు ను తక్కువగా అంచనా వేయవద్దు . బాబు అల్లుడు , మామ ,షడ్డకుడు , అన్న ( రామ్మూర్తి నాయుడుకి ) ఇవేవి కాదు ఆయన నిఖార్సైన రాజకీయ నాయకుడు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం