31, మే 2023, బుధవారం

ఊ... అంటే రెండు వేల కోట్లకు అధిపతిని అయి ఉండేవాడిని... ఖరీదైన జీవిత పాఠం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -38 --------------------

ఊ... అంటే రెండు వేల కోట్లకు అధిపతిని అయి ఉండేవాడిని... ఖరీదైన జీవిత పాఠం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -38 ---------------------------------------------- ఊ అంటావా మామ ఊహు అంటావా మామ అని సమంత అడిగితే పాపం అమాయకురాలు అనిపించింది . ఊహు అని ఎవడంటాడు .. ఊ అనే అంటాడు కదా ? మేం అన్నాం ... ఇప్పుడు కాదు మూడున్నర దశాబ్దాల క్రితం . మేం అంటే నన్ను నేను గౌరవించుకోవడం కాదు . నేనొక్కడినే కాదు ఇంకో ముగ్గురం ఊహు అన్నాం . అబ్బా ఎంత పొరపాటు చేశాం అలా అని ఉండాల్సింది కాదు అని మా అమాయకత్వాన్ని తలుచుకొని మేమే నవ్వుకుంటాం . మా ఊహు విలువ ఒక్కొక్కరికి రెండు వేల కోట్లు . ఔను నిజం ***** ఏడాది క్రితం కా కాలనీ ప్రెసిడెంట్ హై టెక్ సిటీకి దగ్గర అని రెండు కోట్ల రూపాయలతో ఓ ఫ్లాట్ కొన్నాడు . గృహ ప్రవేశానికి పిలిస్తే ... డ్రైవర్ కు అడ్రెస్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటే . వెళ్లి ... వెళ్లి ఓ చోట ఆపి అడ్రెస్ చూస్తున్నాడు . ఎదురుగా చూస్తే తెల్లాపూర్ అని బోర్డు కనిపించింది . మెదక్ జిల్లాలో కూడా ఓ తెల్లా పూర్ ఉంది అని డ్రైవర్ కు చెబితే అతను అలానే నా వైపు చూస్తూ సార్ ఇది మెదక్ జిల్లాలోని తెల్లాపూర్ నే మనం వచ్చింది మెదక్ జిల్లా తెల్లా పూర్ కే అన్నాడు . ***** 1988-89 ప్రాంతం లో మెదక్ జిల్లా ఆంధ్రభూమి స్టాప్ రిపోర్టర్ ను . తెలుగు విశ్వవిద్యాలయం పి ఆర్ ఓ గా చేసి రిటైర్ అయిన చెన్నయ్య (ఈనాడు , మురళీ ధర్ శర్మ ( ఆంధ్ర జ్యోతి ) ఇంకో రిపోర్టర్ ఉండేవారు . జేసీ మహంతి అని ఒరిస్సాకు చెందిన ఐఏఎస్ జిల్లా కలెక్టర్ . తెగ ఉత్సాహంగా పని చేసే వాళ్ళం . ఉమ్మడి రాష్ట్రం లో అప్పుడు తొలిసారిగా తెల్లాపూర్ లో డ్రిప్ ఇరిగేషన్ మొదలు పెట్టారు . అక్కడ పూల తోటలు పెంచడానికి కలెక్టర్ చాలా ప్రోత్సాహం అందించారు . మీరు యువకులు జీవితం గురించి మీ అవగాహన తక్కువ . మీరు చేసేవి ప్రైవేటు ఉద్యోగాలు.. ఉద్యోగానికి , జీవితానికి భద్రత ఉండదు . మీకు ఒక్కొక్కరికి తెల్లాపూర్ లో ఐదెకరాల భూమి ఇస్తాను . మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూనే పూల తోటలు పెంచండి అని కలెక్టర్ సలహా ఇచ్చారు . అప్పుడు భూములు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్ లకు ఉండేది . ఆయన చెప్పగానే అందరం ఊహు .. అన్నాం . భూములు తీసుకుంటే ఆఫీస్ లో తెలుస్తుంది , ఉద్యోగాలు పోతాయి అని బయటకు చెప్పక పోయినా అందరి భయం అదే . అప్పుడు దాదాపు అందరికీ 900 నుంచి 11 వందల రూపాయల జీతం . ఆ ఉద్యోగం పోతే ఇంకేమన్నా ఉందా ? అనుకున్నాం . 87 లో ఆంధ్రభూమిలో జొన్నలగడ్డ రాధాకృష్ణ నన్ను ఉద్యోగంలో నియమించారు . జిల్లాకు వెళ్లేప్పుడు జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇస్తారు తీసుకో అని చెప్పారు కానీ , వ్యవసాయ భూమి ఇస్తా అంటే ఏం చేయాలో చెప్పలేదు . జేమ్స్ బాండ్ 007 లెవల్ లో అసలు కలెక్టర్ మనకు వ్యవసాయ భూమి ఎందుకు ఆఫర్ చేశారు . ఇందులో ఏమైనా కుంభకోణం ఉందా ? అని మాలో కొందరు పరిశోధన మొదలు పెట్టి , డ్రిప్ ఇరిగేషన్ లో ఏదో ఉండే ఉంటుంది అనుకుని సంతృప్తి పడ్డాం . బహుశా కలెక్టర్ మీ కర్మ అనుకోని ఉండొచ్చు . తరువాత ఆయన విదేశాల్లో శిక్షణ కోసం వెళ్లారు . ***** డ్రైవర్ ఇది మెదక్ జిల్లా తెల్లాపూర్ అనగానే అవన్నీ గుర్తుకు వచ్చాయి . అక్కడ పూల తోటలు లేవు . ఆకాశమంత ఎత్తులో అపార్ట్ మెంట్స్ ఉన్నాయి . మొక్క మహా వృక్షమై భూమి నుంచి ఆకాశాన్ని ముద్దాడి నట్టు కాంక్రీట్ జంగల్ లో ప్రతి భవనం ఆకాశానికి కన్ను గురుతుందేమో అనిపించేంత ఎత్తులో భవనాలు ... ఒక్క ఫ్లాట్ కే రెండు కోట్లు అంటే ఐదెకరాలు వెయ్యి కోట్లు , అపార్ట్ మెంట్స్ నిర్మాణానికి డెవలప్ మెంట్ కు ఇస్తే కనీసం వాటి విలువ రెండు వేల కోట్లు . ఒక్కో రిపోర్టర్ కు రెండువేల కోట్లు అంటే ? కోటి రూపాయల్లో ఎన్ని సున్నాలు ? వెయ్యి కోట్లలో ఎన్ని సున్నాలు ? ఇప్పుడు లెక్కలు బాగానే వస్తాయి కానీ అప్పుడు ముందు చూపు లేకుండే ... *** అంత ఆస్తి చే జారి పోయిందని దిగులు పడుతున్నాను అనుకుంటున్నారా ? అంత లేదు . ఇవన్నీ గాలిలో లెక్కలు . ఒక వేళ ఐదు ఎకరాలు తీసుకుంటే ఉద్యోగం పోయేదేమో , ఐదు ఎకరాలు అప్పుడు అమ్ముకుంటే లక్ష కూడా వచ్చేది కాదేమో . చచ్చి చెడి అమ్మకుండా అలానే ఉంచుకుంటే ఎవడో బకాసురుడు ఆక్రమించుకునే వాడేమో , నా భూమి అంటే హత్య చేసే వాడేమో , ఏమో ఏదైనా జరిగేది . ఇంతకూ చెప్పొచ్చేది ఏమిటంటే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందనంతగా ఉంటుంది . వర్షం పది నీరు నిలిస్తే ఇదేనా విశ్వనగరం అని టుంరీలు టీవీల్లో హడావుడి చేస్తారు . వర్షం పడితే అమెరికా అయినా హైదరాబాద్ ఐనా అంతే .. ఏ టుంరీ ఏమనుకున్నా హైదరాబాద్ విశ్వనగరమే. రింగు రోడ్డుకు అటా ఇటా అని కాదు ఎటో ఓ వైపు ఇంత స్థలం ఉండడం మంచిది . ఇప్పుడు కాక పోతే ఇంకెప్పుడు కొనలేరు . ప్రజలారా తొందర పడకండి భూమి రిజిస్ట్రేషన్ కు ఆధార్ అనుసంధానం చేస్తున్నారు దీనితో భూముల ఘోరంగా పడిపోతాయి అని మేధావి మిత్రుడు తెగ ప్రచారం చేశాడు . అతను ప్రచారం చేసినప్పుడు పది లక్షలకు ఎకరం అని చెప్పిన భూమి ఇప్పుడు రెండు కోట్లు . తెలంగాణ ఏర్పడగానే 2014 లో ఎన్ టివి లో గొప్ప స్టోరీ చేశారు . హైదరాబాద్ లో నిర్మాణ రంగం పడిపోయింది . బెంగళూరు వెళ్ళిపోయింది అని బెంగళూరులో జరుగుతున్నా నిర్మాణాలు చూపారు . పిల్లర్ల నిర్మాణానికి కనీసం 21 రోజులు పడుతుంది . కనీసం 21 రోజులు ఆగి ntv ఈ స్టోరీ చేసినా బాగుండేది . తెలంగాణ నిర్మాణం చేసిన క్షణం లోనే అంత పెద్ద నిర్మాణాలు ఎలా జరిగాయో . బయటకు వెళ్లి విచారిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏంటో తెలుస్తుంది . మీడియా తమ పార్టీలకు అనుగుణంగా వార్తలు వండుతుంది . వాటిని పట్టించుకోవద్దు హైదరాబాద్ లో ఇల్లు అంటే బంగారమే ... ఇక జర్నలిజం అంటే ఏదో దేశాన్ని పొడిచేద్దాం , ఉద్దరించేద్దాం అనే భ్రమలు వద్దు . డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జర్నలిస్ట్ కూడా ఆరు దశాబ్దాల క్రితమే చెప్పారు . సబ్బుల వ్యాపారం లాంటిదే జర్నలిజం అని . వారు ఆరు దశాబ్దాల క్రితం గ్రహించిన దానిని మనం ఇప్పటికైనా గ్రహించక పోతే ఎలా ? ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది . పార్టీల మీడియా కాలం ఇది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం