17, మే 2023, బుధవారం
బాబులో నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు ఓ జ్ఞాపకం
బాబులో నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు
ఓ జ్ఞాపకం
చంద్రబాబు ఇమేజ్ ను మీడియా ఏ స్థాయికి తీసుకువెళ్ళింది అంటే అధికారులు సైతం ఆయనలో భగవంతుడిని చూసే స్థాయికి తీసుకువెళ్ళింది .
జనం ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేంత వరకు అదే ఇమేజ్ భ్రమల్లో ఉండిపోయారు .
బాబు గారిని చూస్తూ , ఆయన ఎదుట కూర్చొని మాట్లాడుతుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తో నేరుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది ..
ఉద్యోగం వదిలి పోటీ చేస్తే ప్రభావం ఎలా ఉంటుంది ? ఏమవుతుంది? అనే ఆలోచనలు ఏమీ రాలేదు . ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టు ఉండింది - ఓ అధికారి చెప్పిన మాటలు ఇవి
*******
2004 ఎన్నికల సమయం లో చంద్రబాబు కొందరు అధికారులను ఎన్నికల రంగం లో నిలిపారు .అలా సూర్యాపేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కొత్త అభ్యర్థిని నిలపాలి అనుకోని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గా ఉన్న పాల్వాయి రజనీ కుమారిని నిలబెట్టారు . ఆమె ఓడిపోయారు . ఓసారి ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడినప్పుడు మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ , మున్సిపల్ కమిషనర్ గా జనం తో మాట్లాడి ఉంటారు .
అవన్నీ పోనివ్వండి .. 1999 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తో తెలుగుదేశం గెలిచింది . కాంగ్రెస్ టీడీపీ మధ్య ఓట్ల తేడా స్వల్పమే . ఆ తరువాత విద్యుత్ ఉద్యమం , కాల్పులు , తెలంగాణ ఉద్యమం , వరుసగా కరువు . ఒక్కో దానికి కనీసం ఒక శాతం ఓట్లు తగ్గుతాయి కదా ? టీడీపీ గెలుస్తుంది అని ఎలా అనుకున్నారు ? అని ఆమెను అడిగితే .
మీరు రిపోర్టర్ , అన్ని ప్రాంతాల వారితో మాట్లాడతారు అంచనా వేయడానికి మీ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు . మీడియాలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తారు . బిల్ గేట్స్ , క్లింటన్ వంటి వారే బాబు ఆలోచనలకు ఫిదా అయ్యారని మీ మీడియా వాళ్లే రాసేవారు . చంద్రబాబు నాయుడు పిలిచి ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే స్వయంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తో మాట్లాడుతున్నాను అని భావించాను కానీ ఈ ఆలోచనలు ఏమీ రాలేదు అన్నారు .
ఆమెకు టికెట్ ఇవ్వాలి అని అప్పటికప్పుడు నిర్ణయించి , ప్రధాని , సీఎం వంటి వారు పర్యటిస్తున్నప్పుడు ట్రాఫిక్ మొత్తం నిలిపి వారి వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు పాల్వాయి రజనీ కుమారిని ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తూ హైదరాబాద్ కు వచ్చేట్టు చేశారు .ఎన్నికల్లో నిలిచినా ప్రతి ఒక్కరికి గెలుస్తామని, మంత్రి అవుతామని ప్రోటోకాల్ మర్యాదలు ఉంటాయని ఆశ ఉండడం సహజం .
సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చెనందుకు ఆ ఒక్క రోజే ఆమెకు రాజభోగం . ఎన్నికల్లో ఓడిపోయాక వాస్తవం తెలిసి వచ్చింది .
****
బాబు హయం లో దాదాపు రెండు రోజులకు ఒక సారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరిపేవారు . ఆ సమీక్షల్లోని డొల్లతనం బహిరంగం గా అందరి ముందు బాబుకు చెప్పింది రజనీ కుమారి . ఓటమి తరువాత జరిగిన సమీక్ష లో సార్ మీరు రెండు మూడు రోజులకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అభివృద్ధి నివేదికలు అడిగే వారు . రెండు మూడు రోజుల్లో మార్పు ఏముంటుంది ? కొంత గడువు ఇస్తే బాగుండేది . దాంతో మేం గత సమీక్షలో చెప్పిన అంకెలు కొంత పెంచి చెప్పేవాళ్ళం . అందరూ ఇదే పని చేశారు అంటూ టెలికాన్ఫరెన్స్ ల డొల్ల తనాన్ని ఆమె బయటపెట్టారు . నిజానికి ఈ టెలికాన్ఫరెన్స్ లు మీడియా కోసం మీడియా సమక్షం లో జరిగేవి . వీటివల్ల మీడియాలో బోలెడు వార్తలు వచ్చాయి కానీ రాజకీయం గా ఉపయోగపడలేదు . స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ని చూసినట్టు తన్మయం చెందిన వారే రెండు వారాల్లోనే ధైర్యంగా బాబు ముందే టెలికాన్ఫరెన్స్ ల డొల్లతనం బయట పెట్టడం విశేషం .
ఖమ్మం జిల్లాకు చెందిన ఫణీశ్వరమ్మ ఎంపీ డివో గా ఉద్యోగం చేస్తుంటే పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు . ఓడిపోయాక ఆమె ఎన్టీఆర్ భవన్ లో జరిగే ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనే వారు. ఓసారి నృత్యం కూడా చేశారు . తిరిగి ఉద్యోగం లో చేరకుండా ఇదేంటి అని యాత్ర నాయకులు విస్తుపోయేవారు .
2004 లో టీడీపీ ఓడిపోయాక . ఉద్యోగం వదిలి ఎన్నికల్లో పోటీ చేసిన వారికి వై యస్ రాజశేఖర్ రెడ్డి తిరిగి ఉద్యోగం లో చేరే అవకాశం కల్పించారు . కొందరు ఉద్యోగం లో చేరారు . కొందరు ఎలాగూ బయటకు వచ్చాము వ్యాపారం చేద్దాం అని ఉద్యోగం లో చేరలేదు . ఉద్యోగులకు టికెట్ ఆఫర్ చేయడం లో బాబు గారికి , ప్రత్యర్థి పార్టీ వారు అయినా సరే ఓడిపోయిన వారికి తిరిగి ఉద్యోగం ఆఫర్ చేయడం లో వై యస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎవరి రాజకీయం వారికి ఉంటుంది . టికెట్ ఇవ్వడం లో బాబు లెక్కలు బాబుకు ఉంటే ఉద్యోగం లో చేరడానికి ఆఫర్ ఇవ్వడం వెనుక వై యస్ ఆర్ లెక్కలు వై యస్ ఆర్ లెక్కలు వై యస్ ఆర్ కు ఉంటాయి . ఉద్యోగం లో ఉంటే ఎంత ? రాజకీయంగా ఎదిగితే ఎంత అని అభ్యర్థులూ లెక్కలు వేసుకుంటారు . ఎవరి లెక్కలు వారు చూసుకొని లాభనష్టాలు బేరీజు వేసుకొని లాభసాటి నిర్ణయం తీసుకుంటారు . తీసుకున్న నిర్ణయం ఒక్కోసారి లాభసాటి కాక పోవచ్చు అది వేరు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం