20, జులై 2023, గురువారం
నంబర్ 2 లు అలా తెరమరుగయ్యారు కనిపించని దేవేందర్ గౌడ్ .. వినిపించని నాగం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
నంబర్ 2 లు అలా తెరమరుగయ్యారు
కనిపించని దేవేందర్ గౌడ్ .. వినిపించని నాగం ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
-------------------------------------------
ఆ చెప్పండి సార్ నాగం జనార్దన్ రెడ్డిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా పావుగా వాడుకుంటున్నాడు , వాళ్ళ వ్యూహం ఏమిటీ ? నాగం , జగన్ మోహన్ రెడ్డి కలిసి బాబును ఎలా దెబ్బ తీయబోతున్నారు అంటూ ఆ జర్నలిస్ట్ ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించే సరికి వామ్మో అని మనసులోనే అనుకోని .. చదువుల సారమెల్ల గ్రహించితిని తండ్రి అని హిరణ్య కశ్యపుడి కి చెప్పిన ప్రహ్లదుడు గుర్తుకు వచ్చి .. బాబూ నీకు ఇంకొకరు జర్నలిజం పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు . టీవీలకు నీలాంటి వారే కావాలి .. నీకు తిరుగులేదు . నువ్వు జర్నలిస్ట్ గా పుట్టుకతోనే తలపండిన వాడివి అని చెప్పి ఫోన్ కట్ చేశాను .
******
దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగింది ఇది . హెచ్ ఏం టివిలో ముక్కామల చక్రధర్ అని జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవారు . భూమి నుంచి బయటకు వెళ్లి హెచ్ ఎం టివిలో చేరాడు . ఓ రోజు ఫోన్ చేసి మా ఛానల్ లో కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ ఒకడు ఉన్నాడు . అతనికి పొలిటికల్ రిపోర్టింగ్ ఆసక్తి . మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు అని చెప్పాడు . రాజకీయ వార్తల కోసం నీతో మాట్లాడుతాడు , కాస్త సలహా ఇవ్వమని చక్రధర్ చెబితే , సరే కాల్ చేయమని చెప్పాను అతని పేరు గుతూ లేదుకానీ మాట్లాడిన మాటలు గుర్తున్నాయి .
బాబును మీడియా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రోజులు అవి . బాబు కోసం ఎన్టీఆర్ ను సైతం ఎదిరించిన మీడియా వెలిగిపోతున్న రోజులు . ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతుండడం , టీడీపీ బలహీన పడుతోంది . దాంతో తెలంగాణ టీడీపీ నాయకులు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు . భవిష్యత్తు ఏమిటా ? అనే ఆలోచన వారిని వెంటాడుతుంది . అప్పటివరకు తెలంగాణ తానే నంబర్ టూ అని భావిస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి దిక్కు తోచని పరిస్థితి . జేఏసీ నాయకునిగా ప్రొఫెసర్ కోదండరాం ను కెసిఆర్ ముందుకు తీసుకురావడం , రోజూ కోదండరాం మీడియాలో కనిపించడం తో నాగంను ఆందోళనకు గురి చేసింది . కోదండరాం తెలంగాణలో బలమైన రెడ్డి నాయకునిగా వెలుగులోకి వస్తున్నాడు అని ఓ సారి ఇష్టాగోష్టి లో చెప్పుకొచ్చారు .
టీడీపీలో ఉండలేడు , తెరాస లో చేరలేడు .. మరేం చేయాలో స్పష్టత లేదు . శాసన సభలోనే బాబు విధానాలపై విమర్శలు చేసి కలకలం సృష్టించి , తిరిగి బాబు పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టడం తో సీరియస్ నెస్ పోయింది .
ఈ దశలో మీడియాలో బోలెడు వార్తలు . నాగం తో వైయస్ జగన్ మోహన్ రెడ్డినే తిరుగుబాటు చేయిస్తున్నాడు అనేది మీడియా వార్తల సారాంశం . నాగం , జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ రెడ్డి నాయకులే ఈ ఒక్కటి తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి సామీప్యం లేదు . తెలంగాణ కు చెందిన నాగం , సమైక్యాంధ్ర ను కోరుకుంటున్న జగన్ చెప్పినట్టు ఎందుకు చేస్తారు ? చేస్తే అతనికి ఏ విధంగా ప్రయోజనం అనేది మీడియాకు అనవసరం , అంత ఆలోచించే ఓపిక లేదు . జగన్ చెబితేనే నాగం తిరుగుబాటు అంటే సరిపోతుంది . చాలా ఛానల్స్ లో, పత్రికల్లో ఇలానే వార్తలు వచ్చాయి .
హెచ్ ఏం టివి నుంచి ఫోన్ చేసిన కుర్ర జర్నలిస్ట్ నాగం విషయం ఏమిటీ అని ప్రశ్నిస్తే ఇది చెప్పేవాడిని , కానీ అతను ఫోన్ చేసి నాగం , జగన్ కుమ్మక్కు కుట్ర అని అతనే చెబుతుండడం తో ఇలాంటి వారికి చెప్పి వృధా అని నువ్వు అనుకుంటున్న విషయం తోనే ఛానల్ కు స్టోరీ చేసేయ్ అని చెప్పాను ...
టీడీపీలో దశాబ్దాల పాటు తెలంగాణకు సంబంధించినంత వరకు నంబర్ 2 గా అధికారం చెలాయించి తెలంగాణ ఉద్యమం తో ఎటు పోవాలో తెలియక , తెలంగాణ కోసం మొదట సొంత సంస్థ , తరువాత బిజెపి అటు నుంచి కాంగ్రెస్ లో చేరారు .
నాగం చెప్పలేదు , దేవేందర్ గౌడ్ చెప్పారు . మేం నంబర్ 2 గా ముందు వరుసలో ఉంటే కెసిఆర్ మూడవ వరుసలో ఉండేవారు , మేం తెరాస లో చేరి కెసిఆర్ నాయకత్వం లో పని చేయడం ఏమిటీ అందుకే అటు వెళ్లడం లేదు అని దేవేందర్ గౌడ్ చెప్పారు . నాగం మంత్రి అయినప్పుడు బహుశా రేవంత్ రెడ్డి విద్యార్ధి కావచ్చు . ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షుడు కాగా , నాగర్ కర్నూల్ నాయకునిగా నాగం కాంగ్రెస్ లో ఉన్నారు . నాగం కు నాగర్ కర్నూల్ టికెట్ కూడా గ్యారంటీ అని చెప్పలేం .
అచ్చిరాని నంబర్ 2
రాజకీయాల్లో నంబర్ 2 లు ఎప్పుడూ నంబర్ వన్ లకు అచ్చిరారు . అలానే నంబర్ 2 లకు కూడా నంబర్ వన్ ల నుండి గండం తప్పదు . ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం లో ఎన్ని జిల్లాల్లో దాదాపు అంతమంది నంబర్ 2 లు ఉండేవాళ్ళు . వీళ్ళలో కొందరు నంబర్ వన్ చేతిలో , కొందరు కాల ప్రవాహం లో కొట్టుకు పోయారు . నాదెండ్ల కో పైలట్ ను అని వెన్నుపోటుతో బయటకు వెళ్లారు . అలా నంబర్ 2 అనుకున్న దగ్గుబాటి తో సహా చాలా మందిని బాబు విజయవంతంగా బయటకు పంపారు . ఆ దశలోనే రాష్ట్రంలో ఒక నంబర్ 2 వద్దు , జిల్లాకో నంబర్ 2 ఉండాలి అని బాబు అలా మాధవరెడ్డి , నాగం , దేవేందర్ గౌడ్ అలా జిల్లా కొక నంబర్ 2ను ప్రోత్సహించారు .
తెలంగాణ ఉద్యమ సమయంలో దేవేందర్ గౌడ్ ఓ రోజు మేం ముందు వరుసలో ఉంటే కెసిఆర్ మూడవ వరుసలో ఉండేవారు . నేను అతని నాయకత్వంలో ఎలా పని చేస్తా అని ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో బాధపడ్డారు . మీరు మంత్రి కాక ముందు మీ జిల్లాలో వెలిగిపోయిన కాంగ్రెస్ నేతలు మారిన కాలంలో తెరమరుగు అయ్యారు . టివి 9 రవిప్రకాష్ సుప్రభాతంతో 3వేల జీతంతో పని చేసేప్పుడు నాకు భూమిలో అంతకు రెట్టింపు జీతం . ఇప్పుడు ఏమిటీ ? అనేది ముఖ్యం కానీ గతంలో నేను ఇది నువ్వు అది అంటే కుదరదు . సంపాదకుడిగా ఓ వెలుగు వెలిగిన పతంజలి రవిప్రకాష్ వద్ద పని చేశారు . ఈ రోజు ఏమిటీ అనేది ముఖ్యం కానీ నేను పైన ఉన్నప్పుడు కాలం అలానే ఆగిపోవాలి అని చాలా మంది కోరుకుంటారు . అది సాధ్యం కాదు . కాలం ఆగదు .
టీడీపీలో ఉండలేక , కాంగ్రెస్ లోకి వెళ్లలేక , తెరాస లో చేరే ఇష్టం లేక దేవేందర్ గౌడ్ తీవ్రంగా మదన పడ్డారు . ఆ దశలో కొందరు మేధావులకు ఆయన చిక్కి పోయారు .తెలంగాణ పేరుతో ఓ పార్టీ పెట్టారు . చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు .
బోర్డు ల మీద , వాహనాల మీద టిజి అని రాస్తే తెలంగాణ వస్తుందా ? ఇదేం ఉద్యమం అని అడిగితే .. ఎప్పుడు పెద్ద గడ్డం తో ఉండే ఓ మేధావి పేరు చెప్పి అతని సలహా .. ఇంకా వీటి పేర్లు మార్చాలి అని చెప్పాడో గుర్తు చేసుకున్నారు . రాజకీయంగా సంక్షోభ పరిస్థితి ఎదుర్కొని మానసికంగా దెబ్బ తిని , అనారోగ్యం పాలయ్యారు . నిజానికి రాజకీయాల్లో మంచి అభ్యుదయ కరమైన ఆలోచనలు ఉన్న కొద్ది మంది నాయకుల్లో దేవేందర్ గౌడ్ ఒకరు . సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక దెబ్బ తిన్నారు . ఆ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో నంబర్ 2 ల శకం ముగిసింది .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం