9, జులై 2023, ఆదివారం

93 అతని వయసు. 55 ఏళ్ళ నుంచి మీడియా కు అతనే అధ్యక్షుడు ... నియంతృత్వం రాజ్యమేలే మీడియాలో కార్మిక హక్కులు - సంఘాలు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -69

93 అతని వయసు. 55 ఏళ్ళ నుంచి మీడియా కు అతనే అధ్యక్షుడు నియంతృత్వం రాజ్యమేలే మీడియాలో కార్మిక హక్కులు - సంఘాలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -69 ---------------------------------- సంజీవ రెడ్డి కో హటావో - ఆంధ్రభూమికో బచావో ... కొన్ని వందల మంది జర్నలిస్ట్ లు డక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు చేరి నినాదాలు చేస్తున్నారు . 85 సంవత్సరాల డిసి చరిత్రలో , 65 ఏళ్ళ యూనియన్ చరిత్రలో , యూనియన్ అధ్యక్షుని గా 55 ఏళ్ళ సంజీవ రెడ్డి చరిత్రలో డిసి కార్యాలయం ముందు అంతమంది జర్నలిస్ట్ లు చేరి అలా నినాదాలు చేయడం మొదటి సారి . నెల నెల జీతం చెల్లిస్తూ , ఉద్యోగ భద్రత ఉన్నప్పుడు సగటు జీవి తన కుటుంబం కోసం బానిసత్వాన్ని సైతం స్వీకరిస్తాడు . జీతం లేదు , ఉద్యోగం లేదు పొమ్మన్నప్పుడు ఎవడి మీదైనా తిరుగుబాటుకు సిద్ధం అవుతాడు . రెండేళ్ల క్రితం అదే జరిగింది . డిసి కార్యాలయం ముందు చేరి సంజీవ రెడ్డి కో హటావో , ఆంధ్రభూమికి హటావో అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు . ఆ రోజే కాదు , ఈ రోజుకూ ఉద్యోగులు ఎవరూ మేనేజ్ మెంట్ ను విమర్శించరు . ఉద్యోగంలో ఉన్నప్పుడే కాదు రిటైర్ అయ్యాక కూడా ... నినాదాలు ఇస్తే ఏమైంది ? సంజీవ రెడ్డిని హటావో - ఆంధ్రభూమికో బచావో అంటే సంజీవరెడ్డికి పంపించి ,భూమిని రక్షించారా ? అంటే .. చేశారు కానీ పూర్తిగా రివర్స్ గా చేశారు . సంజీవ రెడ్డిని రక్షించి , భూమిని మూసేశారు . ఐతే ఘనత వహించిన నాయకులు గ్రాడ్యూటీ లేకుండా పంపాలని చూసినా మేనేజ్ మెంట్ ఒక్కొక్కరికి దాదాపు పది లక్షల వరకు గ్రాడ్యూటీ , దాదాపు అంతే మొత్తం ఏడాది జీతం బకాయిలు ఇచ్చి పంపించారు . కార్మికులు ఎక్కడైనా యాజమాన్యానికి వ్యతిరేకంగా , కార్మిక సంఘం అధ్యక్షునికి మద్దతుగా పోరాడుతారు . ఇక్కడ మాత్రం రివర్స్ . కార్మికులు అధ్యక్షుడిని వ్యతిరేకిస్తే , యమజన్యం మాత్రం అతనికి అండగా నిలుస్తుంది . వేజ్ బోర్డు అమలు చేసినా , ఏం జరిగినా సంజీవరెడ్డికి కార్మికుల జీతం కోసి గండ పెండేరమో , బంగారు కడియ మో తొడిగేవారు . యాజమాన్య ప్రాయోజిత యూనియన్ . అధ్యక్షుడి తీరు అలా ఉన్నా , ఆఫీస్ లో ఉండే కార్మిక నాయకులు మాత్రం చాలా మంది కార్మికుల కోసం చిత్తశుద్ధితో కృషి చేసే వారు . వారు లేక పోతే ఎడిటర్ చాలా మందిని బూడిద చేసి మందులో కలుపుకొని తాగేసేవాడు . ***** ప్రపంచ కార్మిక సంఘాల చరిత్రలో ఇదో రికార్డ్ . రోజూ వార్తలు అందించే పత్రికలు కూడా ఈ రికార్డ్ ను గుర్తించ లేదు . . ఒక దినపత్రికకు 55 ఏళ్ళ నుంచి ఒకరే కార్మిక సంఘం అధ్యక్షుడుగా ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేదు . గతంలో లేదు , కచ్చితంగా భవిష్యత్తులో రాదు . చిన్నా చితక పత్రిక కాదు . సుదీర్ఘమైన చరిత్రగల , ఉమ్మడి రాష్ట్రంలో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీష్ దినపత్రిక డక్కన్ క్రానికల్ గ్రూప్ కార్మిక సంఘానికి జి సంజీవ రెడ్డి అధ్యక్షుడు . 93 ఏళ్ళ సంజీవరెడ్డి కి పోటీ లేదు , రాదు , యాజమాన్యం రానివ్వదు . 1938 లో డక్కన్ క్రానికల్ ను రాజ్ గోపాల్ మొదిలియార్ అనే తమిళ వ్యక్తి ప్రారంభించారు . కీస్ హై స్కూల్ తో పాటు అనేక విద్యా సంస్థలు , వ్యాపార సంస్థల్లో వీరి భాగస్వామ్యం ఉంది . ప్రారంభం అయింది .దాదాపు అదే సమయంలో తెలంగాణ పత్రిక పేరుతో తెలుగు పత్రిక ప్రారంభించి , నిజాం తో గొడవ ఎందుకు లే అని మూసేశారు . 1960లో ఆంధ్రభూమి తీసుకువచ్చారు . 1957లో డక్కన్ క్రానికల్ కార్మిక సంఘం ఏర్పాటు అయింది . ముఖ్యమంత్రిగా పని చేసిన టి. అంజయ్య కూడా డక్కన్ క్రానికల్ యూనియన్ అధ్యక్షునిగా చేశారు . తరువాత వెంకటేశం అనే కార్మిక నాయకుడు . తరువాత 1968 లో జి సంజీవరెడ్డి యూనియన్ అధ్యక్షులు అయ్యారు . ఇప్పటికీ 55 ఏళ్ళ నుంచి ఆయనే అధ్యక్షుడు . డీసీ ప్రారంభించిన రాజగోపాల్ మొదలియార్ ఇద్దరు కుమారుల మధ్య వివాదం తలెత్తడంతో యూనియన్ అధ్యక్షునిగా ఉన్న సంజీవరెడ్డి తిక్కవరపు చంద్రశేఖర్ రెడ్డిని తీసుకువచ్చి డిసి కొనేట్టు చేశారు . దీనితో యాజమాన్యం ఆశీస్సులతో సంజీవరెడ్డి శాశ్వత అధ్యక్షునిగా ఉండిపోయారు . కార్మిక సంఘానికి అతను యాజమాన్యం తరపు అధ్యక్షుడు . దాదాపు మూడు దశాబ్దాల్లో ఎప్పుడు మాట్లాడినా భూమిని మూసేస్తారు అంటూ పెద్ద మనసుతో చెప్పిన గొప్పవారు . 55 ఏళ్ళ నుంచి గెలుస్తున్నారు అంటే అభిమానం ఉంటేనే కదా ? అనిపించవచ్చు . ఓటింగ్ జరిగితే కదా తెలిసేది . ఓటింగ్ ఉండదు , అంతా ఏకగ్రీవమే . ఒక వేళ ఉన్నా అధ్యక్షుడు మినహా మిగిలిన వాటికి ఉంటుంది . 87 నుంచి 2017 వరకు ఉద్యోగం చేసిన నేను మూడు దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఓటింగ్ చూడలేదు , ఓటు వేయలేదు . ఆంధ్రప్రభలో పి జనార్దన్ రెడ్డి సోదరుడు యూనియన్ నాయకుడిగా ఉండేవారు . చాలా బలమైన యూనియన్ అని పేరు . ఈ రెండు మీడియా సంస్థల్లో మాత్రమే బలమైన యూనియన్ . మిగిలిన సంస్థల్లో యూనియన్ ఉందని ఎవరికీ తెలియదు . రికార్డుల్లో ఉంటుంది దేవతా వస్త్రాల్లా .. కనిపించదు . ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో యూనియన్ ఉంటాయా ? ఏమో తెలియదు . అక్కడ చాలా ఛానల్స్ లో దిన దిన గండం ఆరు నెలల ఆయుస్సు అన్నట్టు ఉంటుంది . మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు అని సిబ్బంది దారిలో బైఠాయించినప్పుడు అప్పటికప్పుడు యూనియన్ తాత్కాలికంగా ఏర్పడుతుంది . మూడు నెలలు జీతాలు ఎందుకు ఇవ్వరు అంటే , సంస్థకు కట్టుబడి ఉంటారు ఎక్కడికీ వెళ్లరు అందుకే ఇవ్వం అని ఓ చోటా ఛానల్ ఓనర్ అద్భుతమైన సిద్ధాంతం చెప్పారు . ***** ఓ జర్నలిస్ట్ వామపక్ష కార్మిక నాయకుడికి ఫోన్ చేసి అన్నా నాకు అన్యాయం జరిగింది . ఆధారాలు అన్నీ ఉన్నాయి . మీరే న్యాయం చేయాలి అని చెప్పగానే నిమిషాల్లో ఆ కార్మిక నాయకుడు అతని ముందు వాలి పోయాడు . చెప్పన్నా ఆ కార్మిక ద్రోహి ఎవరో వాడి సంగతి తేలుద్దాం , పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ ఎర్ర డైలాగులన్నీ ఏకరువు పెట్టాడు . ఆ జర్నలిస్ట్ ఆధారాలు అన్నీ ఆ ఎర్రన్న ముందు పెట్టాడు . అవి చూడగానే ఆ ఎర్రన్న ముఖం నల్లబడింది . ఏంటన్నా నువ్వు మరీను మా పార్టీ పత్రిక గురించే నన్ను ఫైట్ చేయమంటున్నావు . జోక్ చేస్తున్నావా అని వెళ్ళిపోయాడు . మెదక్ జిల్లాకు చెందిన మురళీ అనే జర్నలిస్ట్ విషయంలో ఇది వాస్తవంగా జరిగింది . కేసు ఏమైందో తెలియదు కానీ అతను కోర్ట్ కువెళ్ళాడు . రాజీకి పిలిచారు అని ఓ ఐదేళ్ల కలిసినప్పుడు చెప్పాడు . కార్మికుల హక్కుల గురించి మీడియా ఎక్కువగా రాస్తుంది కానీ మీడియాలో అవి ఉండవు . ******** 48 ఏళ్ళ క్రితం 75లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రతి యేటా క్రమం తప్పకుండా ఎమర్జెన్సీ ఆకృత్యాలు అంటూ మన మీడియా తద్దినం పెట్టినట్టు వ్యాసాలు రాస్తూ హక్కుల అణిచివేత గురించి పూర్తి పేజీ వ్యాసాలు ప్రచురిస్తుంది . ఇందులో విశేషం ఏమీ లేదు ఇది అందరికీ తెలిసిందే . ఐతే ఆ వ్యాసం రాసే జర్నలిస్ట్ , ఎడిట్ చేసే సబ్ ఎడిటర్ , ప్రచురించే బాస్ వీరంతా నిత్యం తమ తమ మీడియా సంస్థల్లో అణిచి వేతను అనుభవిస్తున్న వారే . హక్కులంటే ఏమిటో ఉద్యోగంలో చేరినప్పుడే మరిచిపోయిన వారు . ఇందిరా గాంధీ 75 నుంచి 77 వరకు కేవలం 21 నెలలు మాత్రమే అత్యవసర పరిస్థితి విధించింది . మెజారిటీ మీడియాలో మాత్రం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయినంతవరకు అత్యవసర పరిస్థితి అనుభవించాల్సిందే . ఎవరైతే ఏదైతే తాము కాదో అది అని చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు అంటాడు ఓషో . విలువలు పాటించని రాజకీయ నాయకుడే విలువల గురించి ఎక్కువగా మాట్లాడతారు . మీడియాలోనూ అంతే హక్కులు , చట్టాల గురించి , కార్మికులకు జరిగే అన్యాయాల గురించి ఎక్కువగా రాసే మీడియాలో వాటిని పాటించడం ఉండదు . వీటిని పాటించక పోయినా వ్యాపార పత్రికలు కొంత నయం . వామపక్ష పత్రికల్లో మరీ అన్యాయం . వ్యాపార పత్రికలతో పోటీ పడి ప్రకటనలు సంపాదిస్తారు కానీ ఉద్యోగులకు జీతాలు అంతంత మాత్రమే . హక్కుల గురించి కావాలంటే పది పేజీల పత్రికలో ఐదు పేజీలు రాయగలరు కానీ ఆచరణలో శూన్యం . వాపపక్ష పత్రికల కన్నా వ్యాపార పత్రికలే ఈ విషయంలో కొంత నయం . ******** మీడియాలో కార్మిక సంఘాలు ఉండవా ? కార్మికులకు హక్కులు ఉండవా ? అంటే ఎందుకు ఉండవు . రికార్డుల్లో అద్భుతంగా ఉంటాయి . ఆచరణలోనే ఉండవు . రికార్డులు ముఖ్యం కానీ ఆచరణదేముంది . న్యాయమూర్తులు ఆలయాలను సందర్శించినప్పుడు ఎంత పెద్ద పత్రికలో నైనా పెద్ద ఫొటోతో వార్తలు వస్తాయి . ఎందుకు వస్తాయి అంటే వస్తాయి అంతే ... ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినంత వరకు డక్కన్ క్రానికల్ గ్రూప్ (ఆంధ్రభూమి )పత్రికల్లో , ఇండియన్ ఎక్ప్ ప్రెస్ ( ఆంధ్రప్రభ ) లో యూనియన్ చాలా బలమైంది . నిజంగా బలమైందే ఐతే వీటి ప్రెసిడెంట్ ను నిర్ణయించేది మాత్రం యాజమాన్యమే . ఇక మిగిలిన పత్రికల్లో సంఘాల సంగతి ఏమిటీ అంటే పెద్ద పెద్ద కుంభకోణాలను వెలికి తీసిన జర్నలిస్ట్ లు కూడా తమ పత్రికలో కార్మిక సంఘం ఉందని , ఉంటే ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అనేది పరిశోధించినా చెప్పలేరు . ఓ రోజు ఓ పత్రిక మిత్రుడితో మాట్లాడుతూ పోనీ రికార్డ్ లో యూనియన్ నాయకుడిగా ఎవరి పేరు ఉందో కనీసం వారికైనా తెలుసా ? అని అడిగితే , ఏమో అన్నాడు . జర్నలిస్టుల జీత భత్యాలు , సౌకర్యాలు , ఎలా ఉండాలో తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం వేజ్ బోర్డు ను నియమిస్తుంది . ఒక్కటంటే ఒక్క పత్రికలో కూడా ఇప్పుడు వేజ్ బోర్డు సిఫారసులు అమలు కావడం లేదు . చాలా మంది జర్నలిస్ట్ లకు వేజ్ బోర్డు అంటూ ఒకటి ఉంటుందనే తెలియదు . కార్మిక హక్కుల ఉద్యమాలకు నాయకత్వం వహించే వామపక్షాల మీడియాలో దీని గురించి అడగడం అనే ఆలోచన రావడం అంటే బొందితో కైలాసానికి వెళ్లాలనే అత్యాశ లాంటిదే . ******* డిసి యూనియన్ లో అధ్యక్షుడు ఎప్పుడూ మూసేస్తారు .. మూసేస్తారు అని నెగిటివ్ గా మాట్లాడినా ఆఫీస్ లో నాయకత్వం వహించిన విజయకుమార్ , ఆనంద్ , బాలకృష్ణ వంటి వారు తమ శక్తి మేరకు సిబ్బంది హక్కుల కోసం కృషి చేసేవారు . ఐదేళ్ల క్రితం చేసిన లెక్కల్లో ఏదో తేడా వచ్చిందని గ్రహించి , నిరూపించి ఆ మేరకు జీతం పెంచడం తో పాటు ఐదేళ్ల బకాయిలు ఇప్పించారు . పాత సినిమాలో విలన్ ఆర్ నాగేశ్వర్ రావు లా భారీకాయం తో భయపెట్టేట్టు ఉండేవారు ఆనంద్ అనే యూనియన్ నాయకుడు . ఎడిటర్ ఏంటీ ఓనర్ కూడా చూస్తే చాలు భయపడాలి . ఎంతో మందికి అండగా నిలిచాడు . వి ఆర్ యస్ ఇచ్చి ఒక్కొక్కరిని బయటకు పంపి యూనియన్ ను నిర్వీర్యం చేశారు . చివరకు తామే నిర్వీర్యం అయ్యారు . **** గతం లో ప్రతి తెలంగాణ జిల్లా నుంచి కనీసం ఒక్కరైనా ఆంధ్ర నుంచి వచ్చిన వారు శాసన సభ్యలుగా ఉండేవారు . తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లి గెలిచింది ఇద్దరే . ఒకరు పి శివశంకర్, రెండో వారు పివి నరసింహారావు ... వీరు ప్రధాని హోదాలో నంద్యాల నుంచి గెలిస్తే , శివశంకర్ సామాజిక వర్గం తో గెలిచారు . కానీ ఆంధ్ర , తెలంగాణ ,రాయలసీమ , ఉత్తరాంధ్ర , నెల్లూరు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఉమ్మడి రాష్ట్రం నలుమూలలా గెలిచిన ఏకైక కార్మిక నాయకుడు జి సంజీవరెడ్డి . రాష్ట్రంలో ఎక్కడ ఎడిషన్ పెట్టినా అక్కడ యూనియన్ కు మేనేజ్ మెంట్ నే సంజీవరెడ్డికి అధ్యక్షున్ని చేసేది . వారి అనుబంధం ఫెవికాల్ లాంటిది . .. **** సరే ఇప్పుడు హక్కులను అమలు చేయమంటావా ? అంటే చేయమని చెప్పడానికి నేనెవరిని , చేయడం లేదు అని చెబుతున్నాను అంతే .. పేరు గుర్తుకు వచ్చాక చెబుతాను హైదరాబాద్ లో ఒక వామపక్ష వాది ప్రింటింగ్ ప్రెస్ పెట్టి నిబంధనలను తూచా తప్పకుండా పాటించి కార్మికులకు జీతాలు , సౌకర్యాలు కల్పించారు . ఏడాది లోపే నిండా మునిగిపోయి వ్యాపారం ఎత్తేశాడు . నీతులు చెప్పేవారు పాటించరు . పాటించేవారు నిండా మునిగిపోతారు . బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం