2, జులై 2023, ఆదివారం
బాబు లోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయిన వేళ . .... రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -63
బాబు లోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయిన వేళ . ....
రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -63
అన్నమా చార్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32వేల కీర్తనలు రాశారట ...
ఔను అందరికీ తెలుసు ఐతే ?
ఎన్ని ఎకరాల స్థలం లో కూర్చోని ఈ కీర్తనలు రాసి ఉంటారు ?
ఇదేం ప్రశ్న ఇంట్లో ఓ గది ఉంటే చాలు . దీనికోసం ఎకరాలు కావాలా ? ఐనా నాకు తెలియదు .
పోనీ బాబు హైదరాబాద్ లో ఉన్నంత వరకు నాకు తెలుసు విజయవాడ వెళ్ళాక గాయని శోభారాజు గారు వచ్చి రాఖీ పౌర్ణమికి బాబుకు రాఖీ కట్టారా ?
కట్టలేదు ....
నువ్వే కాదు నేనూ చూడలేదు . 1999 నుంచి ఈ దృశ్యం ఎప్పుడైనా మళ్ళీ కనిపిస్తుందేమో అని చూశా .. 23 ఏళ్ళ నుంచి ఎదురు చూశా .. బతికి ఉన్నంత వరకు చూస్తూనే ఉంటా .. పోయే లోపు ఆ దృశ్యాన్ని ఒక్క సారైనా మళ్లీ చూస్తాను అనే ఆశ ఉంది ... అని గతం లో హైదరాబాద్ లో కలిసి పని చేసిన జర్నలిస్ట్ మిత్రుడు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు అతనికి చెప్పాను . మీ కోరిక ఏదో ఒక రోజు తీరాలి అని నేనూ కోరుకుంటున్నాను అని మితృడు మంచి మాట చెప్పాడు .
ఇంతకూ విషయం ఏమిటీ అంటే ఓ సినిమాలో బ్రహ్మానందం , మరో సినిమాలో వేణుమాధవ్ సంక్రాంతికి పటాకులు కాలుస్తారు , దీపావళికి రంగులు చల్లుకుంటారు . ఇదేంటి అంటే వెరైటీ అంటారు . అలా ఆకాలం లో పండుగ జరిపితే ఎలా ఉంటుంది ...?
*********
మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయిన వేళ . .
అన్నయ్య మిమ్ములను ఒక కోరిక కోరుతాను అని గాయని శోభారాజు ముందుకు రాగానే చంద్రబాబు బిత్తర పోయి .. ఏంటీ అన్నట్టు ముఖం పెట్టారు . మీకు రాఖీ కట్టాలి అని ఉందన్నయ్యా అని కోరిక బయట పెట్టారు . విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు అంతటి మహా నటుడు చంద్రబాబు ను నా కన్నా గొప్ప నటుడు అని మీడియా సమావేశంలోనే బహిరంగంగా ఒప్పుకున్నారు . బాలకృష్ణ మీ నట వారసుడు అంటేనే తనతో ఎవరినీ పోల్చడానికి ఇష్టపడని ఎన్టీఆర్ నే స్వయంగా బాబును తనకన్నా గొప్ప నటుడు అని ఒప్పుకున్నారు . అలాంటి చంద్రబాబు ఆ సీన్ లో ఏం చేయాలో తెలియక బిత్తర పోయారు . ఎందుకంటే రాఖీ పౌర్ణమి అయిపోయి అప్పటికి ఆరు నెలలు అవుతుంది . మళ్ళీ రాఖీ పౌర్ణమి రావాలి అంటే ఇంకో ఆరు నెలలు రావాలి . ఈ మధ్యలో రాఖీ కట్టడం ఏమిటా ? అని వారి ఆలోచన . ఈ దృశ్యాన్ని రిపోర్టర్ గా ప్రత్యక్షంగా చూసినందుకు నా కళ్ళు చెమ్మగిల్లాయి . అప్పుడెప్పుడో ఏదో సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెళ్లుగా అద్భుతంగ నటించి కంట తడి పెట్టించారు అంటారు . సావిత్రికి చెల్లెలుగా అంటే అక్కినేని తప్పుకున్నారు కానీ ఎన్టీఆర్ నటించారు అని ఈ మధ్యనే ఎక్కడో చదివాను . నటుడు ఏ పాత్రలో ఐనా జీవించాలి . శోభా రాజు రాఖీ పట్టుకొని ముందుకు రాగానే బాబు సహజంగా ముఖంలో ఏ ఫీలింగ్ లేకుండా అ ప్రయత్నంగా చేతిని ముందుకు చాపారు . ఆమె రాఖీ కట్టారు .
1999 ఎన్నికలకు ముందు హైటెక్స్ లో చంద్రబాబు పార్టీలకు అతీతంగా అంటూ మహిళా దీవెన నిర్వహించారు . తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావాలి అని దీవించే పార్టీలకు అతీత పార్టీ కార్యక్రమం . రాఖీ కడితే తప్పేంటీ ద్రోహి అంటారు . కాలం కానీ కాలం లో రాఖీ కట్టడం వల్ల నాకొచ్చిన నష్టం ఏమీ లేదు కానీ . రాఖీ తరువాత హై టెక్ సిటీ పక్కన వందల కోట్ల విలువైన భూమి ఎకరాల్లో శోభారాజుకు అన్నమా చార్య కీర్తనలు ఆలపించడానికి ఇచ్చారు . అప్పటి నుంచి నాకో అనుమానం అన్నామా చార్య కీర్తనలు ఆలపించడానికే అన్ని ఎకరాలు ఇస్తే ఆ కీర్తనలు రాసి ఆలపించడానికి అన్నామా చార్యులకు ఆ నాటి పాలకులు ఎన్ని ఎకరాలు ఇచ్చారా ? అని నెట్ లో అన్వేషించాను , తెలిసిన వారిని అడిగాను . ఇక ఇలా కాదని తిరుపతి నుంచి వచ్చేప్పుడు అన్నామా చార్య గ్రామం తాళ్ల పాక కూడా వెళ్ళాను . ఏమీ ఇవ్వలేదు అని తెలిసి బాబుకు ఉన్నంత విశాల హృదయం ఆ నాటి పాలకులకు లేదు అనిపించింది . అన్నమయ్య 12వ తరం వారు ఆగర్భ దరిద్రములో కొట్టుమిట్టాడుతున్నా రని , ప్రభుత్వం వారు పింఛన్లు ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు ( ఇది వికీపీడియా లో ఉంది ) అన్నమయ్యకు ఆనాటి పాలకులు భూమి ఇవ్వలేదు , వారి వంశస్తులు పేదరికం లో ఉన్నారు కానీ వారి కీర్తనలు ఆలపించడానికి అంత విలువైన భూమి ఎకరాల్లో ఇవ్వాలి అంటే ఎంత విశాల హృదయం ఉండాలి . ****
99లో తటస్థులు , మహిళల దీవెనలు బాగానే పని చేసి బాబు గెలిచారు . అలీఫ్ సంస్థ కోసం రమాదేవికి గాజుల రామారం లో మహిళా పారిశ్రామిక యూనిట్ల కోసం ఎకరాల్లో ఇచ్చారు . తటస్తులు కోటాలో రమాదేవి 99లో టీడీపీలో చేరారు . ఆ కాలం లో వీరి హడావుడి బాగా కనిపించేది . తరువాత ఏమయ్యారో అలీఫ్ పేరు కూడా తెలంగాణ వచ్చిన తరువాత పెద్దగా వినిపించలేదు .పేరు మారినట్టు ఉంది . శోభారాజు కు కీర్తనల కోసమే కాదు మాడుగుల నాగఫణి శర్మకు కూడా అవధానాల ప్రాక్టీస్ కోసం ఇక్కడే భారీగానే స్థలం కేటాయించారు . స్థలం విషయంలో శోభారాజు , మాడుగుల గొడవ , మీడియా ముందే తిట్టుకోవడం వల్ల బయటపడింది .
శోభారాజు గారి అన్నమాచార్య కీర్తనల పట్ల ఆకర్షితురాలై ఆమె లానే నేర్చుకొని కచేరీలు చేసిన కొండవీటి జ్యోతిర్మయి చౌదరి శోభారాజులానే హైటెక్ సిటీ వద్ద సొంత భూమిలో కీర్తనలు ప్రాక్టీస్ చేయాలి అని దరఖాస్తు పెట్టుకున్నా అప్పటికే ఆలస్యం కావడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది .
***
బాబు సీఎం గా ఉన్నప్పుడు ఓ రోజు టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు , దూళిపాళ నరేంద్ర ఇతర శాసన సభ్యుల హడావుడి సమావేశం . విషయం అడిగితే శాసన సభ్యులకు ఇంటి స్థలాలకు భూమి కేటాయింపు కోసం దరఖాస్తు అని చెప్పారు . బాబు ఒప్పుకోరు ఒప్పుకోవాలి అంటే ఓ ఐడియా అని చెప్పాను . మీ సంఘానికి తెలుగు పేరు ఉండవద్దు , ఎమేల్యేస్ ఇన్ఫో , టెక్నాలెజీ , ఐటీ ఇలా ఏదన్నా ఇంగ్లీష్ పేరు ఉండాలి అప్పుడు ఒప్పుకుంటాడు అని చెప్పాను . వాళ్ళు నా సలహా ఖాతరు చేయలేదు . వారి వినతి పత్రం వెలుగు చూడలేదు .
******
మరో రెండు నెలలు గడిస్తే ఆగస్టు 30న రాఖీ పౌర్ణమి గత 23 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న బాబుకు శోభారాజు రాఖీ కట్టే దృశ్యం ఈ సారైనా చూ స్తానేమో ...
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం