25, జులై 2023, మంగళవారం

తెలంగాణ లో రాజకీయ దుమారం లేపిన బెంగళూరు మిర్చి కథ... తెలంగాణ ను అడ్డుకోవడానికి క్యాప్సికం నూ వదల లేదు .... జర్నలిస్ట్ జ్ఞాపకం -79

తెలంగాణ ను అడ్డుకోవడానికి క్యాప్సికం నూ వదల లేదు . జర్నలిస్ట్ జ్ఞాపకం -79 -------------------------------------------------------------- ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం లో క్యాప్సికం కూడా రాజకీయాల్లో పెను దుమారం సృష్టించింది . తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన రాజకీయ పక్షాలు అన్నీ కెసిఆర్ పై దాడికి క్యాప్సికం తమకు లభించిన పెద్ద ఆయుధం అని సంబరపడ్డాయి . మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి ఎనిమిది ఎకరాల్లో టమాటా పంట పండించాడు . రెండు నెలల పంట ఇప్పటి వరకు ఏడు వేల బాక్స్ ల టమాటా అమ్మితే కోటిన్నర ఆదాయం వచ్చింది . మరో నెల రోజుల్లో ఇంకో ఐదువేల బాక్స్ ల టమాటా చేతికివస్తుందట . అంటే కోటిన్నర వచ్చింది , మరో కోటి వస్తుంది . టమాటా తో కోట్లు సంపాదిస్తున్న రైతు వార్త పత్రికల్లో చూడగానే తెలంగాణ ఉద్యమ కాలం లో పదేళ్ల క్రితం రాజకీయాల్లో దుమారం లేపిన క్యాప్సికం ( బెంగళూరు మిర్చి ) ఉదంతం గుర్తుకు వచ్చింది . టమాటా రైతులు కోట్లు సంపాదిస్తున్న వార్తలు మన వద్దనే కాదు దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నాయి . కానీ రైతు అంటే మాసిన ముతక బట్టలతోనే ఉండాలి అనేది చాలా మందిలో బలంగా ముద్రించుకొని పోయింది . మీడియా వారిలో సైతం . 2013 తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకుంది . కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సైతం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది . మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామం లో కెసిఆర్ కు దాదాపు 60 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది . ఉద్యమ కాలం లో ఈ వ్యవసాయ క్షేత్రం గురించి రాజకీయ నాయకులు రకరకాల ఆరోపణలు చేసేవారు . మీడియా లో సైతం అనేక కథనాలు రాసేవారు . ఈ కథనాల మధ్య ఓ సారి కెసిఆర్ జర్నలిస్ట్ లను తన వ్యవసాయ క్షేత్రం చూపించడానికి పిలిచారు . దాదాపు 50 మంది జర్నలిస్ట్ లు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు . ఆ క్షేత్రంలో అల్లం పంట , వివిధ రంగుల్లో ఉన్న క్యాప్సికం ( బెంగళూరు మిర్చి ) ను చూపించారు . బెంగళూరు మిర్చి సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది . ఈ వ్యవసాయ క్షేత్రంలో పసుపు పచ్చ , ఎరుపు రంగులో ఉన్న బెంగళూరు మిర్చి పండిస్తున్నారు . వ్యవసాయ క్షేత్రం అంతా చూశాక , కెసిఆర్ జర్నలిస్ట్ లతో పిచ్చా పాటి కబుర్లు మాట్లాడుతూ బెంగళూరు మిర్చి పంటపై కి చర్చ వెళ్ళింది . ఎకరానికి ఎంత పంట వస్తుంది ? రంగురంగుల్లో ఉన్న బెంగళూరు మిర్చిని ఎవరు తీసుకుంటారు అంటూ రకరకాల ప్రశ్నలు రాగా కెసిఆర్ వాటి గురించి వివరించారు . ఆకు పచ్చ రంగులో ఉండే బెంగళూరు మిర్చి మాములు ధర కే అమ్ముతారని , పసుపు రంగు , ఎరుపు రంగులో ఉండే బెంగళూరు మిర్చికి బెంగళూరులో మంచి డిమాండ్ ఉంటుందని ఒక్కో సారి మంచి ధర పలుకుతుందని , ధర బాగున్నప్పుడు రంగు రంగుల బెంగళూరు మిర్చికి ఎకరానికి 20 లక్షలు కూడా వస్తాయని కెసిఆర్ చెప్పుకొచ్చారు . ***** అంతే వరదలో కొట్టుకుపోయే వాడికి గడ్డి పోచ దొరికినట్టు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శక్తులన్నీ బెంగళూరు మిర్చిని పట్టుకొని రాజకీయం చేశాయి . ఉమ్మడి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మొదలుకొని అప్పటి నాయకులంతా బెంగళూరు మిర్చిపై రాజకీయం చేశారు . కెసిఆర్ నల్ల ధనాన్ని , తెల్ల ధనం గా మార్చడానికి బెంగళూరు మిర్చికి ఎకరానికి 20 లక్షల వరకు వస్తాయని చెబుతున్నారని ఆరోపించారు . దీనిపై విచారణ జరిపించాలి అని అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో డిమాండ్ చేశారు . మా వద్ద ఉన్న భూమి తీసుకోని ఎకరానికి 20 లక్షలు ఇచ్చి చూపండి అని అప్పుడున్న పలువురు మంత్రులు డిమాండ్ చేశారు . దాదాపు రెండు వారాల పాటు రాజకీయం మొత్తం బెంగళూరు మిర్చి చుట్టూ తిరిగింది . ఎకరానికి 20 లక్షలు వచ్చాయి అని చెప్పలేదు , మంచి ధర ఉంటే ఎకరానికి 20 లక్షలు కూడా రావచ్చు అని చెప్పిన అంశాన్ని పట్టించుకోకుండా మీడియా సైతం బెంగళూరు మిర్చి తెలంగాణ ఉద్యమం నుంచి తమను రక్షిస్తుంది అని బోలెడు ఆశలు పెట్టుకొంది . రాజకీయ నాయకులే కాదు అప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం జరిపేవారు సైతం బెంగళూరు మిర్చి ఎకరానికి 20 లక్షల ఆదాయం అనే దానిలో భారీ కుంభకోణం ఉందని తెగ ప్రచారం చేశారు . ధర లేక టమాటా రోడ్డు మీద పారబోస్తుంటారు .. మంచి ధర ఉంటే రైతుకు టమాటా కోట్లు తెచ్చి పెడుతోంది . కోటిన్నరకు టమాటా అమ్మి ఇంకో కోటి రూపాయల టమాటా ఉన్న రైతు మహిపాల్ రెడ్డి టమాటాలు పండించిన కౌడిపల్లి , కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి దగ్గర దగ్గరగానే ఉంటాయి . తెలంగాణ పల్లెల్లో వ్యవసాయ భూములు ఇప్పుడు కోట్ల రూపాయల పంటలు పండించడమే కాదు .. కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి . 2013 లో వ్యవసాయ క్షేత్రం దగ్గర ఓ రైతు కనిపిస్తే ఎకరం ఎంత ఉంటుంది అని మీడియా వాళ్ళు అడిగితే ఐదు లక్షలు అని చెప్పాడు . ఇప్పుడు నర్సాపూర్ , కౌడి పల్లి , గజ్వేల్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ధర పలుకుతుంది ఒక ఎకరం పొలం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం