24, జులై 2023, సోమవారం

నాది విష్ణుమూర్తి అవతారం . . బ్లో ఔట్ ను ఆర్పేది నేనే స్వామిజీలతో నేతలు - సివిల్ సర్వీస్ అధికారుల బంధాలు .... జ్ఞాపకాలు -77

నాది విష్ణుమూర్తి అవతారం . . బ్లో ఔట్ ను ఆర్పేది నేనే స్వామిజీలతో నేతలు - సివిల్ సర్వీస్ అధికారుల బంధాలు జ్ఞాపకాలు -77 --------------------------------- కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులకు మేమే సర్వం తెలిసిన వాళ్ళం , మిగిలిన వాళ్ళు అజ్ఞానులు అనే భావం చాలా బలంగా ఉంటుంది . తమపై అధికారం చెలాయించే మంత్రులకు గౌరవం ఇస్తున్నట్టు పైకి నటించినా , వాళ్ళు లేనప్పుడు వీళ్ళకేం తెలుసు అని జోకులు వేసుకునే అధికారులు కూడా ఉండేవాళ్ళు . తమ గురించి తాము ఇలా భావించే అధికారులు సైతం స్వామీజీలకు భక్తులుగా ఉండడం చాలా చోట్ల కనిపించింది . అధికారులు , రాజకీయ నాయకులు , కొన్ని చోట్ల మీడియా పెద్దల ప్రాపకం సంపాదించారు అంటే ఆ స్వామికి తిరుగు ఉండదు . ఢిల్లీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరిచిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్ లభించలేదు . లెక్క లేనంత మంది మహిళలపై అత్యాచారాలు చేసి అరెస్ట్ చేయడానికి వెళితే యుద్ధ వాతావరణం సృష్టించిన డేరా బాబాకు లెక్క లేనన్ని సార్లు బెయిల్ లభించింది . బాబాల మహత్యం అది . వారి పవర్ అది . టివి 5 వచ్చిన కొత్తలో పెనుగొండ స్వామి కుంభకోణాలపై ఓ స్టోరీ చేశారు . ఓ సామాన్య భక్తుడి తో మాట్లాడితో అతను చెప్పిన మాట అలా గుర్తుండి పోయింది . స్వామిని ఎలా నమ్మారు అని జర్నలిస్ట్ అడిగితే .. జిల్లా కలెక్టరే హెలికాఫ్టర్ లో స్వామి వద్దకు వచ్చి వెళ్లే వారు . ఇక సామాన్యుడిని నేను ఎంత ? అని ఆ ఆ సామాన్య భక్తుడు బదులిచ్చాడు . ఆ భక్తుడికి తెలియక పోవచ్చు కానీ బాబాల విజయ రహస్యం ఇందులోనే ఉంది . మంత్రులు , మీడియా పెద్దలు , సివిల్ సర్వీస్ అధికారులు తమ దర్శనం కోసం రావడానికి స్వామీజీలు తీవ్రంగా ప్రయత్నిస్తారు . దీనికోసం స్వాములు , బాబాల వద్ద పి ఆర్ ఓ లు కూడా ఉంటారు . అధికారులు , మీడియా , మంత్రులు ఈ మూడు శక్తులు స్వామీజీల వద్ద కలుస్తాయి . పరస్పర ప్రయోజనాల కోసం వీరు ముగ్గురు స్వామి భక్తులు అవుతారు . వీరు ముగ్గురు స్వామి భక్తులు కావడం వల్ల స్వామి ఇమేజ్ పెరుగుతుంది . పెద్ద పెద్ద వాళ్ళే వెళుతున్నారు మనమెంత అని సామాన్యులు స్వామి దర్శనానికి క్యూ కడతారు . చాలా చోట్ల జరిగేది ఇదే . కొన్ని చోట్ల నిజంగానే భక్తి ఉండవచ్చు . ఉత్తరాదిలో కుమార్ విశ్వాస్ కు ఆథ్యాత్మిక ప్రచారంలో మంచి పేరుంది . ఆయన ప్రవచనాలను లక్షల మంది వస్తారు . ఓ టివి షోలో రాందేవ్ బాబా ను అడిగారు . మోడీ అధికారంలోకి వస్తే విదేశాల నుంచి నల్లధనం వస్తుంది అని మీరు హామీ ఇచ్చారు . నల్లధనం వచ్చే ఉంటుంది ఎక్కడుంది స్వామిజీ అని వ్యంగ్యంగా అడిగితే రాందేవ్ బాబా నవ్వి .. నాకూ కనిపించ లేదు . అందుకే ఈ మధ్య దాని గురించి మాట్లాడడం లేదు అన్నారు . ఢిల్లీ బాబాలను వదిలేస్తే ప్రతి జిల్లాలో చిన్న వారో పెద్ద వారో ఒక స్వామి కనిపిస్తారు . జిల్లాలలో పని చేసేప్పుడు ప్రతి జిల్లాల్లో ఓ స్వామి కలిశాడు . ********* పాశర్లపూడి పూడి బ్లో ఔట్ గుర్తుందా ? గోదావరి జిల్లాల్లో అప్పుడు బ్లో ఔట్ వార్త కవర్ చేసిన జర్నలిస్ట్ లు తమ జీవితంలో ఈ సంఘటన మరిచిపోరు . ఆ సమయంలో వరంగల్ జర్నలిస్ట్ లకు సైతం బ్లో ఔట్ కు సంబంధించి జ్ఞాపకం ఉంది . 94లో పాశర్ల పూడిలో బ్లో ఔట్ మంటలు ఆర్పేందుకు అమెరికా నుంచి ఓ నిపుణుడిని పిలిపించారు . ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అయితే అమెరికా ఏజెంట్ 007 ను పిలిపించినప్పుడు సినిమాలో ఆ సీన్ ఎలా ఉంటుందో , పాశర్ల పూడిలో అతని రాక అలా ఉండేది . అదే సమయంలో ఇక్కడ వరంగల్ లో ఉదయం జర్నలిస్ట్ మిత్రుడు మిట్టపల్లి శ్రీనివాస్ ఫోన్ చేసి బొట్టు స్వామి వద్దకు వెళదాం వస్తారా ? అని అడిగారు . చుక్కలు అన్ని కలిపితే దారి దొరుకుతుంది . ఇంత హఠాత్తుగా స్వామి వద్దకు ఎందుకా ? అంటే ? అప్పుడు పివి నరసింహారావు ప్రధాని . పీవీకి సింగపురం రాజేశ్వర రావు అత్యంత సన్నిహితులు . ఎంత అత్యంతం అంటే రాజ్య సభ సభ్యత్వం ఇచ్చే అంత . సింగపురం బొట్టు స్వామి భక్తుడు . అప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి ఉదయం ఓనర్ . సింగపురం రాజేశ్వర రావుకు సుబ్బరామిరెడ్డి పరిచయం .. ఉదయం ఓనర్ గా సుబ్బరామిరెడ్డి ఎడిటర్ ను ఆదేశిస్తారు .. ఎడిటర్ రిపోర్టర్ ను ఆదేశిస్తారు . రిపోర్టర్ స్వామి వద్ద ప్రత్యక్ష మవుతారు . ఇదేమీ బ్రహ్మ రహస్యం కాదు జర్నలిస్ట్ లందరికీ తెలిసిందే . ఎందో చూద్దాం అని బొట్టు స్వామి వద్దకు వెళ్ళాను . సాయంత్రం సమయం విశాలమైన ఆవరణలో స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు . అల్లా టప్పా దర్శనం కాదు . ఇంకా సెల్ ఫోన్ లు మన వద్ద మనుషుల చేతికి రాని రోజులు అవి . అచ్చం సెల్ ఫోన్ లో మిత్రులతో మాట్లాడుతున్నట్టుగానే బొట్టు స్వామి కైలాసం కు ఫోన్ చేసి శివునితో , పార్వతితో మాట్లాడారు . మన ఎదుట ఎవరైనా సెల్ ఫోన్ లో మాట్లాడితే వారు చెప్పింది నమ్మాలి కానీ అటు వైపు ఎవరు ఉన్నారో మనకు కనిపించదుకదా ? అలానే శివుడు , పార్వతి తో అతను మాట్లాడుతుంటే భక్తులు పారవశ్యంతో వింటున్నారు . భక్తులు అంటే పేద భక్తులు కాదు అక్కడున్నది చాలా మంది సంపన్న భక్తులే . తరువాత స్వామి మీడియాతోనో , అక్కడున్న భక్తుల ముందు సంచలన ప్రకటన చేశారు . అప్పటికే అమెరికా 007 ఎంత ప్రయత్నిస్తున్నా బ్లో ఔట్ ఎంతకూ ఆరడం లేదు . నేను విష్ణు మూర్తి అవతారాన్ని , నాలోని ఆగ్రహం బ్లో ఔట్ రూపం లో బయటకు వచ్చింది . ఆ మంటలు ఆపడం ఎవరి తరం కాదు . నేను ఆర్పితే తప్ప ఆరవు అని సెలవిచ్చారు . మీరు విష్ణు మూర్తి అవతారం కదా ? మరి ప్రజల కోసం మీరు రంగం లోకి దిగి ఆర్పుతారా ? అని భక్తి తో అడిగాను , నాలోని వ్యంగ్యం ఏమాత్రం బయటపడకుండా ....నా అంతట నేను వెళ్ళను , ప్రభుత్వం వచ్చి పిలిస్తే వెళతాను . అప్పటి వరకు వారు చేసే ప్రయత్నాలు అన్నీ వృధానే అని .. ప్రభుత్వమే తన వద్దకు వస్తుంది అని చాలా ధీమాగా చెప్పారు . స్థానికులు ఆయన్ని బొట్టు స్వామి అనే వారు . అయన పేరు కన్నా ఈ పేరుతోనే పాపులర్ . స్వామి మహిమలు మీకు తెలియవు స్వామి పేరు రాయకుండా బొట్టు స్వామి అని రాశారేమిటి అని కొందరు భక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు . ఇప్పటికి క్షమించేయండి .. ప్రభుత్వం ఎలాగూ దిగివచ్చి బ్లో అవుట్ ఆర్పేయమని బతిమిలాడుతారు . అప్పుడు స్వామి ఆర్పేస్తారు . ఆ ఆతరువాత మీలా నే నేనూ పూర్తి కాలం భక్తుడిగా మారిపోతాను అని హామీ ఇచ్చాను . *** *** అమెరికా నుంచి వచ్చిన నిపుణుడు బ్లో ఔట్ ఆర్పేయలేక పోయాడు .. మరి బొట్టు స్వామి ఆర్పేశాడా ? లేదు అక్కడి సామాన్య ongc కార్మికులే బ్లో ఔట్ ను ఆర్పేశారు . కాల చక్రం గిర్రున తిరిగింది . పివి, మాగుంట , సింగపురం లేరు ... మరి విష్ణు మూర్తి అవతారం సంగతి తెలుసుకుందామని వరంగల్ జిల్లా లోని జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేస్తే .. విష్ణు మూర్తి అవతారం చాలించారు అని తెలిసింది . వరంగల్ జిల్లాల్లో నేను తక్కువ కాలం పని చేయడం వల్ల ఆ స్వామి లీలలు ఎక్కువగా తెలుసుకోలేక పోయాను . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం