7, జులై 2023, శుక్రవారం

నక్సల్ గా వణికించాడు ... జర్నలిస్ట్ గా ఎడిటర్ కాటుకు బలయ్యాడు ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -68

నక్సల్ గా వణికించాడు ... జర్నలిస్ట్ గా ఎడిటర్ కాటుకు బలయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -68 -------------------------------------------------------- ఎడిటర్ , నేనూ ప్లై ఓవర్ కింద నిలబడి బోలెడు కబుర్లు చెప్పుకున్నాం ...ప్రేమలు , బంధాలు అన్నీ మాట్లాడుకున్నాం ... ఒకరి భుజం మీద ఒకరం చేయి వేసుకోని కబుర్లు చెప్పుకున్నాం అంటూ కేఎన్ చారి మురిపెంగా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు . ఓపెన్ గా ఏమైనా మాట్లాడుకునే స్నేహం ఉండడం వల్ల మధ్యలోనే ఆపేసి ... చూడు చారి ఇప్పుడు సంతోషంగా చెబుతున్నావు కానీ దెబ్బ తింటావు ... నా మాట విను ... నువ్వు సైనికుడివి సైనికుడితో స్నేహం చేయాలి కానీ రాజుతో స్నేహం చేయకూడదు .. రాజుతో స్నేహం చేస్తే నీ తప్పు ఉండవచ్చు , రాజుదే తప్పు కావచ్చు బలయ్యేది సైనికుడే అని చెబుతుంటే చారి నవ్వి భుజం మీద కొట్టి వెళ్లి పోయాడు ... నువ్వు సిద్ధాంతాలను చదివి ఉండొచ్చు నేను జీవితాన్ని చదివాను అన్నాను ... ఊహించినట్టే రాజు కాటుకు సైనికుడు దారుణంగా బలయ్యాడు . పోలీసుల తూటాల నుంచి తప్పించుకున్నంత ఈజీ కాదు మనిషి కాటు నుంచి తప్పించుకోవడం అని చారికి అంతిమ దశలో అర్థమై ఉటుంది . సగం వయసులోనే తనువు చాలించాడు . నేను పక్కా ఫ్యామిలీ మాన్ ను కుటుంబం పట్ల నా బాధ్యత నాకు ముఖ్యం . చారి దీనికి పూర్తిగా భిన్నం . ఐనా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది ... అతను మరణించిన తరువాతే అతని నక్సల్స్ జీవితం , లక్షల రూపాయల డెన్ కు బాధ్యుడుగా పని చేసింది తెలిసింది . ******** కెసిఆర్ కు మంత్రిపదవి రాకపోవడం వల్లనే తెరాస పుట్టింది . తెలంగాణ ఉద్యమం జరిగింది అని చాలా మంది భావిస్తుంటారు . 2001లో తెరాస పుడితే అంతకన్నా దాదాపు మూడు నాలుగేళ్ల ముందే ఈ అంశం పై కెసిఆర్ ఆధ్వర్యం లో విస్తృతంగా అధ్యయనం జరిగింది . తార్నాకలో ఒక ఆఫీస్ తీసుకోని అధ్యయనం జరిపేవారు . ఆ అధ్యయనంలో పని చేసింది చారి , మరో రిపోర్టర్ రామకృష్ణ . కొన్ని ప్రాంతాల్లో పేదరికం ఎందుకు ఉంటుంది , కొందరు పేదరికంలో ఎందుకు ఉండి పోతారు సమాజం ఇలా ఎందుకు ఉంది , మారాలి అంటే ఏం చేయాలి అని అధ్యయనం జరిగేది . చారి ఈ పనిలో ఉండేవాడని ఒక సారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ స్వయంగా శాసన సభలో చెప్పిన తరువాతనే అందరికీ తెలిసింది . కేఎన్ చారి ఒకప్పుడు నక్సలైట్ .... నక్సలైట్ గా ఉన్నప్పుడు వణికించాడు ... చాలా మందిలానే జనజీవన స్రవంతిలో కలిసి తరువాత ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా అటు నుంచి ఆంధ్రభూమికి ముందు కరీం నగర్ అటు నుంచి 95 లో హైదరాబాద్ కు వచ్చాడు . జిల్లాల్లో పని చేసి నేనూ 95లోనే హైదరాబాద్ కు వచ్చాను . చారి దాదాపు అదే సమయంలో హైదరాబాద్ వచ్చారు . ఆఫీస్ కు సంబంధించినంతవరకు ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం . ఎడిటర్ ఆఫీస్ లో ప్రతి మనిషిని ... ప్రతి మనిషిని అంటే ఎడిటోరియల్ సిబ్బంది మొదలుకొని అటెండర్ వరకు ... ************* ఎడిటర్ స్నేహం తో చారి వెలిగిపోతున్నాడు . కనకాంబరరాజు ను వారపత్రిక ఎడిటర్ గా తొలగించిన తరువాత చారిని ఎడిటర్ చేయబోయారు . ఏం జరిగిందో అది రద్దయింది . తరువాత ఢిల్లీ ప్రతినిధి గా పంపడానికి ఆర్డర్ తో సహా అన్నీ పూర్తయ్యాయి . ఉత్సాహం ఆగక ఢిల్లీలో ఉండే కృష్ణారావుకు ఫోన్ చేసి ఢిల్లీ వచ్చేస్తున్నా , తెలుగు వాళ్ళం అందరం కలిసి పని చేద్దాం అంటూ ఉపన్యాసం . సమాచారం ఎడిటర్ వరకు వచ్చి ఇగో దెబ్బతిని ఆర్డర్ రద్దు చేశారు . పాశం యాదగిరి జర్నలిజం లో ఉన్న సీనియర్ లు అందరికీ తెలిసిన పేరు . మేనేజ్ మెంట్ ద్వారా యాదగిరి ఢిల్లీ రిపోర్టర్ గా చేరారు . చేరారు కానీ ఒక్క వార్త కూడా రాలేదు . ఎందుకంటే ఓనర్ యాదగిరిని ఉద్యోగంలోకి తీసుకున్నారు . ఆ రోజుల్లో ఓనర్ కన్నా శాస్త్రిదే అధికారం ఎక్కువ . ఒక్క వార్త కూడా వేయవద్దని ఆదేశం . యాదగిరి ఫోన్ చేసి ఏమైంది వార్తలు వేయడం లేదు అని అడిగితే నీ వార్తలు వేస్తే ఎడిటర్ మా ఉద్యోగం తీసేస్తాడు అని సమాధానం . మీ అందరి ఉద్యోగాలు తీయడం ఎందుకు ? నేనే వెళ్ళిపోతాను అని యాదగిరి లాంటి సీనియర్ నెలకు మించి ఉండలేక పోయారు . నేను మిత్రులతో జోక్ గా చెప్పేవాడిని . ఆంధ్రభూమి తన సొంతం అని ఎడిటర్ అనుకుంటున్నారు అక్కడి వరకు పరవాలేదు . మేనేజ్ మెంట్ కూడా ఆంధ్రభూమి ఎడిటర్ దేమో అనుకుంటున్నారు అని .. ఏం జరిగిందో ఎక్కడ బెడిసిందో కానీ చారి ని ఎడిటర్ వేటాడడం మొదలు పెట్టారు . జూనియర్ ఐన సబ్ ఎడిటర్ అబ్దుల్ కు సహాయకుడిగా పని చేయమంటే చారి అక్కడకూ వెళ్ళాడు . ఐనా పగ చల్లారలేదు . ఏదో వంకతో ఉద్యోగం నుంచి వెళ్లిపోయేట్టు చేశారు . బతకాలి కాబట్టి తప్పఁడు అన్నట్టు ప్రకటనలు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే పని మొదలు పెట్టారు . ఈ పనితో ఎడిటర్ కు ఎలాంటి సంబంధం ఉండదు ఏజెన్సీ ల వాళ్ళు ఇంగ్లీషులో ప్రకటన ఇస్తే తెలుగులో అనువాదం చేయాలి . ఒక్కో ప్రకటన అనువాదానికి 200 రూపాయలు ఇచ్చే వారు . ఆ పని చేస్తుండగా చూసి .. ఆ పని చేయడానికి కూడా వీలులేదని ఎడిటర్ ఆపేయించారు . ఒకప్పుడు లక్షల రూపాయల నక్సల్స్ డెన్ చూసిన చారి మా జేబుల్లో 50 - వంద రూపాయలు ఉన్నా చేయి పెట్టి తీసుకునే స్థితికి వచ్చాడు . చివరకు ఆఫీస్ క్యాంటిన్ కూపన్లు తీసుకునేవాడు . ఒక వైపు మనిషి విషపు కాటుతో విలవిల లాడుతుంటే , మరో వైపు షుగర్ కాటేసింది . ******** ఓ రోజు వారాసిగూడ కేఫ్ లో నేనూ , చారి , ఎక్స్ ప్రెస్ రామకృష్ణ మాట్లాడుకుంటుంటే , చారికి అన్యాయం జరుగుతుంటే నీ లాంటి వాడు కూడా మాట్లాడాడా ? అని రామకృష్ణ అడిగాడు . ప్లై ఓవర్ కింద వర్షపు చినుకుల్లో తడుస్తూ ప్రేమ కబుర్లు చెప్పుకున్నాం అని చారి చెప్పినప్పుడు .. వద్దు దెబ్బ తింటావ్ అని చెప్పాను కానీ నన్ను కూడా తీసుకువెళ్ళు అని చెప్పలేదు అడుగు అని బదులిచ్చాను . వసీరా కవి భూమిలోనే పని చేసేవారు . నేను ఎడిటర్ కు క్లోజ్ అనుకోని ఓ సారి ... రాజు ఒక రహస్య పని అప్పగించినప్పుడు పని పూర్తి అయ్యాక వాడిని చంపేయాలి అనేది చాణుక్యుని నీతి అని నర్మగర్భంగా చెప్పల్సింది చెప్పారు . నాకు తెలుసు నేను నా ప్రాణం కన్నా కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తా .. ఆ కుటుంబం కోసం నాకు ఉద్యోగం ముఖ్యం ..నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్పాను .. ఉన్నాను . ****** ఆరోగ్యం క్షిణించి దసరా పండుగ రోజు చారి మరణించారు . రామకృష్ణ ఫోన్ చేసి ఎడిటర్ కు చెబితే పండుగ రోజు ఏంటీ అని చిరాకు పడి ఫోన్ పెట్టేశాడు . చారిని స్మరించుకుంటూ ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో రెండు సార్లు వ్యాసాలు వచ్చాయి . భూమిలో సింగిల్ కాలం వార్త కూడా రాలేదు . మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది చారినే .. లక్ష్మీపార్వతి తో మాట్లాడి 96లో ఎన్టీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయించారు . తరువాత బీజేపీ నుంచి గెలిచారు . చారి వల్లనే తానూ రాజకీయాల్లోకి వచ్చాను అని చారి పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు . చారి అంత్యక్రియల్లో వరవరరావు , గద్దర్ వంటి ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు . ********** తప్పంతా ఎడిటర్ దే అని చెప్పడం నా ఉద్దేశం కాదు . కాటు వేయడం పాము లక్షణం . కాటు వేటుకు పడకుండా జాగ్రత్తగా ఉండడం మనిషి బాధ్యత .ఎడిటర్ బాధ్యత ఎంత ఉందో ,, చారిది కూడా అంతే బాధ్యత ఉంటుంది . సిద్ధాంతాలు , విప్లవాలు , గాడిద గుడ్లు మనిషి చనిపోతే రోడ్డున పడే కుటుంబాన్ని ఆదుకోవు .... మన కాళ్ళు నెల మీద ఉండాలి . -బుద్దా మురళి

1 కామెంట్‌:

  1. చాలా రోజుల్నుంచి విడవక చదువుతున్నా! మీ డయరీలా అనిపించింది. పేరాలు విడదీయకపోడం తో విషయంలోంచి విషయంలోకి దొర్లిపోతుంటే గందరగోళంగా ఉంది, మొదట్లో, అలవాటైపోయింది లెండి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం