6, జులై 2023, గురువారం

మీడియా బాస్ ల నియంతృత్వం ఎలా ఉండేదంటే ఉద్యోగం మానేసినా భయం వెంటాడుతూనే ఉంటుంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -67

మీడియా బాస్ లా నియంతృత్వం ఎలా ఉండేదంటే ఉద్యోగం మానేసినా భయం వెంటాడుతూనే ఉంటుంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -67 --------------------------------------- మీరు ఎడిటర్ కు చెబుతారేమో చెప్పుకోండి . నేనేమీ భయపడను అంటూ కాసింత కోపంతో అతను అనగానే నాకు నిజంగానే ఒక్కసారి భయం వేసింది . అతని వైపు అలానే చూస్తూ ఉండి పోయాను . మీడియాలో బాస్ ల నియంతృత్వం , సిబ్బందిని బానిసల్లా చూస్తూ మానసికంగా ఎంత హింసిస్తున్నారో ఒక్క సారి తలుచుకొంటూ అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయాను . ఎడిటర్ లు మానసికం గా వేధించడం గురించి తెలుసు . కానీ దాని ప్రభావం ఇంతగా ఉంటుంది అని తెలియదు . ఆంధ్రభూమిలో ఒక సబ్ ఎడిటర్ కుర్చీలో కూర్చొని అలా పని చేస్తూనే మరణించాడన్ని చూసిన వాడిని , ఆంధ్రప్రభలో బాసిజం తో మానసికంగా దెబ్బ తిన్న వారి గురించి తెలిసిన వాడిని . దాదాపు మీడియా అంతటా ఆ కాలంలో కొంచం ఎక్కువ , కొంచం తక్కువ అంటా ఇంతే . ఐనా అతను అన్న మాట ఆశ్చర్యం కలిగించింది . అతని మీద ఒక వైపు జాలి మరోవైపు అతను ఎంత క్షోభ అనుభవించాడో అనే సానుభూతి . ఆంధ్రభూమి ఆఫీస్ గేటు బయట మిత్రులతో కలిసి టీ తాగుతుంటే అక్కడ కనిపించారు . నన్ను చూసి మీరు ఎడిటర్ కు చెప్పినా భయపడను అన్నారు . పివిడియస్ ప్రకాష్ అనే జర్నలిస్ట్ . ఎడిటర్ వేధింపులను తట్టుకోలేక అతను అంతకు ముందే భూమి నుంచి వెళ్ళిపోయి దాదాపు మూడేళ్లు అవుతుంది . మంచి రచయిత . స్వాతి వారపత్రికలో ఎన్నో కథలు వచ్చాయి . భూమి నుంచి వెళ్లి పోయాక ఫ్రీ లాన్సర్ గా స్వాతితో పాటు పలు పత్రికల్లో రాస్తే వచ్చే పారితోషకమే అతని సంపాదన . చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు సంబంధించి పత్రికల్లో , మరికొన్ని పత్రికల్లో రాసి వారిచ్చే పారితోషకం తో గడిపేవారు . ఆంధ్రభూమిలో పర్మనెంట్ ఉద్యోగి . వెజ్ బోర్డు సిప్ఫారసులు అమలు చేస్తారు కాబట్టి మంచి జీతం . ఎడిటర్ కు ఎక్కడ కోపం వచ్చిందో సబ్ ఎడిటర్ గా కావాలని లెక్క లేనన్ని పేజీలు కంపోజింగ్ చేయించేవారు . ఎలాగైనా హింసించాలి అనే ఏకైక లక్ష్యం . అతనికి అర్థమా అయింది , నన్ను ఉంచరు ని ఐనా పని చేస్తుంటే సంగారెడ్డికి బదిలీ చేశారు . రెండు మూడు పత్రికలు మాత్రమే మంచి జీతాలు ఇచ్చే రోజులు . ఒక దానిలో ఉద్యోగం పోతే మరో దానిలో దొరికే అవకాశం లేదు . ఎలక్ట్రానిక్ మీడియా , యూ ట్యూబ్ లేని రోజులు . తొందరపడి రాజీనామా చేయవద్దు అని చెప్పినా అతను రాజీనామా చేశారు . మూడేళ్ళ తరువాత ఆంధ్రభూమివద్ద కనిపించి తాను ఎడిటర్ కు భయపడను అని చెప్పారు . అతనితో ఏమీ అనలేదు కానీ మిత్రులతో మాట్లాడుతూ ప్రకాష్ ఎంతగా భయపడుతున్నాడో ఆ ఒక్క మాటతో అర్థం అవుతుంది అన్నాను . సంస్థ నుంచి బయటకు వెళ్లి మూడేళ్ళ తరువాత ఎడిటర్ కు నేను భయపడను అంటున్నాడు అంటే ఎంత భయపడ్డాడు , భయపడుతున్నాడో అర్థం అవుతోంది అన్నాను . సంస్థలో పనిచేస్తున్న నేను ఎడిటర్ మీద జోకులేసి మాట్లాడుతుంటే మూడేళ్ళ క్రితం వెళ్లిపోయిన అతను భయ పడడం లేదు అంటున్నాడు అంటే భయం తెలుస్తుంది అన్నాను . బయటివారు ఇలాంటి పరిస్థితి ఊహించరు , నమ్మడం కూడా కష్టమే . కానీ ఆ రోజుల్లో ఉండే పరిస్థితిని ఆసరాగా తీసుకోని కొందరు ఎడిటర్ లు , బాస్ లు తమలోని రాక్షస ప్రవృత్తిని బయటపెట్టుకునేవారు . ****** బావమరిది పెళ్లి బావ హడావుడి ఈనాడు ఎండీ రమేష్ బాబు బంధువు చెన్నయ్య చౌదరి అని టీడీపీ మీడియా ఇంచార్జ్ గా ఉండేవారు . ఒకసారి బంధువుల ఇంట్లో ఏదో పంక్షన్ రమేష్ బాబు రాత్రికి రాత్రే తిరుగుప్రయాణం అవుతుంటే నువ్వు లేకుంటే ఏదో ఈనాడు ఆగిపోతుంది అని ఆ హడావుడి ఏమిటీ ? ఈ రోజు ఉండి ఉదయం వెళ్ళమంటే .. నేను ఈ రాత్రికి వెళ్ళాక పోతే ఈనాడు ఆగిపోదు , యధావిధిగా తెల్లవారు జామునే పత్రిక వస్తుంది నా సమస్య కూడా అదే అన్నారట . మనం లేకపోయినా పత్రిక యధావిధిగా వస్తుంటే మన ఉద్యోగానికి ఎసరు వస్తుంది అని .. అందుకే మనం లేనిదే పత్రిక రాదు అనుకోవాలి అంటే ఉండాల్సిందే అని వెళ్లిపోయారని చెన్నయ్య ఓ సారి చెప్పారు . సరదాగా చెప్పినా అక్షర సత్యం . చాలా మంది అప్పటి ఎడిటర్ లు తాము లేనిదే పత్రిక రాదు అనే అభిప్రాయం కలిగించేందుకు తెగ ప్రయత్నించేవారు . శాస్త్రి బావమరిది పెళ్లి తెనాలిలో జరిగితే ఆ రోజుల్లో అప్పటికప్పుడు నానా తంటాలు పడి తెనాలి లాడ్జ్ లో తాత్కాలిక ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టించేందుకు ఎంత ఇబ్బంది పడింది మిత్రులు కథలు కథలుగా చెబుతారు. ఎడిటర్ లేక పోతే పేపర్ మరింత బాగా వస్తుందేమో అని వారి భయం . నా లాడ్జ్ లో తాత్కాలికం గా నైనా ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టించేందుకు మీరెవరు ? అని లాడ్జ్ ఓనర్ గొడవ , రిసెప్షన్ వద్దకు వెళ్లి ఫోన్ మాట్లాడను నా రూమ్ లో ఉండాల్సిందే అని ఎడిటర్ .. ఇద్దరి మధ్య నలిగిపోయిన రిపోర్టర్ లు . ఇలాంటివి ఓనర్ కు తెలియవా ? అంటే తెలుసు కానీ వ్యాపారులు తమకు ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం పై దృష్టి పెట్టి తక్కువ లాభం , ఎక్కువ చికాకులు అనుకునే వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలను ఎవరో ఒకరిని నమ్మి అప్పగిస్తారు . అలాంటి అదృష్టం శాస్త్రిని వరించింది . పత్రిక గతిని మార్చింది లేదు , సర్క్యులేషన్ పెంచింది లేదు . కానీ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ప్రయోజనం పొందారు . *** ** ఆంధ్రప్రభ పాత యాజమాన్యం లోనూ ఇదే పరిస్థితి . శాస్త్రి ఈ లక్షణాలను ఆంధ్రప్రభ నుంచే నేర్చుకొని భూమికి వచ్చాడు అంటారు . ఓ సారి సుందరం( ఎక్స్ ప్రెస్ ) , దీక్షితులు( ప్రభ ) ఢిల్లీ వెళ్లారు . అప్పుడు ఢిల్లీలో వై యస్ ఆర్ రాజశేఖర్ రెడ్డి వీరికి ఆతిధ్యం . ఆ పార్టీలో ద్రోణం రాజు సత్యనారాయణ కూడా ఉన్నారు . ఒక రౌండ్ అయ్యాక ( దీక్షితులు మద్యం తీసుకోరు ) ఏ ..... లు పేపర్ ను చంద్రప్రభగా మార్చేశావ్ అంటూ ద్రోణం రాజు అనగానే , ఏం చెబుతాడో అని వైయస్ ఆసక్తి చూపించారు . ఆ మరుసటి రోజు దగ్గుబాటి ఇంట్లో ఆతిధ్యం . అప్పుడు బాబు , దగ్గుబాటి విడిపోయారు . దగ్గుబాటి ల్యాండ్ లైన్ నుంచి తొలుత సుందరం ఆఫీస్ కు ఫోన్ చేసి ఏం పెడుతున్నారు అంటూ క్లాస్ తీసుకోని బాబు ఫోటో పెట్టాలి అని ఆదేశం . సుందరం ను అనుసరించే దీక్షితులు ప్రభకు ఫోన్ చేసి బాబు ఫోటో మొదటి పేజీలో పెట్టండి లేక పోతే వా..... ..... తాడు అంటూ ఆదేశం . దగ్గుబాటి ముందే దగ్గుబాటి వ్యతిరేకి ఫోటో పెట్టాలని, లేక పోతే .... ఆదేశించడం అక్కడున్న జర్నలిస్ట్ నవ్వుకున్నారు . ప్రభ పాత యాజమాన్యం కాలం లో ఎడిటర్ మైసూరు స్వామి భక్తుడు . ఆ స్వామి ఎడిటర్ కూతురుకు మెడిసిన్ లో సీటు ఇప్పించాడు . మైసూరు వెళ్ళడానికి బెంగళూరు అఫీసియల్ టూర్ పెట్టుకునే వారు ఆఫీస్ ఖర్చుతో స్వామి దర్శనం , కూతురు చదువు తెలుసుకోవచ్చు అని . బెంగళూరు వచ్చేప్పుడు లాడ్జ్ లో రూమ్ ఎలా ఉంది ? బాత్రూం ఎలా ఉందో ఒక రోజు ముందే వెళ్లి చూసి వచ్చే బాధ్యత అక్కడి తెలుగు రిపోర్టర్ ది . అది తెలిసిన తమిళ మేనేజర్ ఒకరు మీరు వెళ్లి బాత్రూం ఎలా ఉందో చూసి వస్తే నేను ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళతాను. మీరు రిపోర్టర్ మీరు అలా చేయకూడదు అని వార్నింగ్ ఇచ్చారు . వెళితే మేనేజర్ తో సమస్య , వెళ్లక పోతే ఎడిటర్ తో సమస్య నరకం అనుభవించాను అని ఆ కాలం బాధలను ఓ జర్నలిస్ట్ గుర్తు చేసుకున్నారు . కాలం అందరికీ పాఠం చెబుతుంది అన్నట్టు వీరిలో కొందరు దయనీయ స్థితిలో మరణించారు . కొందరు క్యూలో ఉన్నారు . ఇలాంటి పద్ధతీ , పాడు లేని మేనేజ్ మెంట్ విధానాల వల్ల అటు ప్రభ యాజమాన్యం , ఇటు భూమి యాజమాన్యం తగిన మూల్యం చెల్లించింది . ప్రభ అమ్ముకున్నారు . భూమి మూతపడింది . జ్యోతి మూతపడి , యాజమాన్యం మారింది . ******* ఏం చెప్పదలచుకున్నారు అంటే ? కాలం మారింది . ఐనా అంత గొప్పగా ఏమీ లేదు . ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకొంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అంటాను .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం