3, నవంబర్ 2011, గురువారం

బినామీ బతుకులు


స్వర్గంలో దేవతలంతా సీరియస్‌గా వాదించుకుంటున్నారు. ఎటూ తేలడం లేదు. అంటే కాంగ్రెస్ కోర్‌కమిటీ చర్చలాంటిదన్నమాట! సినిమాల పుణ్యమా అని నరకం అంటే సలసల కాగే నూనెలో మనుషులను వేయడం, కాల్చడం వంటివి ఉంటాయని నరకం గురించి మనకు కొంత స్పష్టత ఉంది. రంభ, ఊర్వశి, మేనకల గ్రూప్ డ్యాన్స్‌లు తప్ప స్వర్గంలో ఏం చేస్తారు అనే దానిపై పెద్దగా స్పష్టత లేదు. స్వర్గంలో దేవుళ్లు, రుషుల మధ్య విశ్వంలో అందగత్తె ఎవరు? అనే ప్రశ్న ఉదయించింది.

 ఇక్కడంటే సౌందర్యసాధనాల కంపెనీల వారు అలాంటి సందేహం తలెత్తకుండా మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అంటూ పోటీలు పెట్టి తేల్చేస్తారు. స్వర్గంలో బహుళ జాతి కంపెనీలకు ప్రవేశం లేదు కాబట్టి అందగత్తె ఎవరు? అనేది తేలడం లేదు. ఎక్కడెక్కడి ముసలి రుషులు, దేవతలు అక్కడ వాలిపోయి తమ తమ అభిమాన అందగత్తెల పేర్లు చెప్పుకొచ్చారు. వరుణుడు ఊర్వశిని ఓరచూపు చూస్తూ, విశ్వంలో ఈమెను మించిన అందగత్తె లేదన్నాడు.
 ఇంద్రుడు వంతపాడుతూ ఔనవును..నా ఓటూ నీకే అన్నాడు. ప్రాంతీయ పార్టీ అయితే అధినాయకుడు ఏం చెబితే అదే ఫైనల్. ఇంద్రుడు దేవతలకు రాజు అయినా పాపం ఆయన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఒక రకంగా ఆయన పరిస్థితి జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడి లాంటిది. హై కమాండ్ వద్ద పలుకుబడి ఉంటే పరవాలేదు, కానీ ఇంద్రుడికి అలాంటి పలుకుబడి ఉన్నట్టు దాఖలా లేదు. దాంతో ఆయన మాటను.. ఆయన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కుబేరుడి కుమారుడు నలకుబేరుడు అడ్డం వచ్చి రంభవైపు ఆవురావురు మంటూ చూస్తూ రంభను మించిన అందగెత్తి లేదన్నాడు. అప్పటి వరకు పెద్ద మనుషుల్లా వౌనంగా ఉన్న రుషులు ఒక్కసారిగా తమతమ అందగత్తెల పేర్లు చెప్పి వీరిని మించిన అందగత్తెలు లేరన్నారు.

 హై కమాండ్ వద్దనే తేల్చుకుందామన్నట్టు అంతా కలిసి సృష్టికర్త బ్రహ్మ వద్దకు వెళ్లి ఎవరు అందగెత్తెనో తేల్చమన్నారు. బ్రహ్మ అందరి వైపు ఒకసారి చూసి, మీరు చెప్పిన అందగత్తెలందరిలో ఏదో ఒక లోపం ఉంది , ఏ లోపం లేని అందగత్తెను సృష్టిస్తానని చెప్పి అహల్యను సృష్టించాడు. అప్పటి వరకు తాము మనసు పడ్డ వారే అందరి కంటే అందగత్తెలు అని పోటీ పడిన వారంతా అహల్యను చూడగానే ఆసలు విషయం మరిచిపోయి, అహల్య కోసం పోటీ పడ్డారు. ఆమెను పెళ్లాడే అర్హత తమకే ఉందంటూ తమతమ అర్హతలు వివరించడంలో పోటీ పడ్డారు. ఇంద్రుడు అహల్యపై మనసు పారేసుకున్నాడు. అహల్య సైతం ఇంద్రుడిని క్రీగంట చూసింది. అయితే బ్రహ్మ మాత్రం ఈమెకు తగిన వాడు మీలో ఎవరూ లేరు అని ఆమెకు గౌతముడు తగిన భర్త అని వారిద్దరికి పెళ్లి చేశాడు. అధికారం మీద కనే్నసిన నాయకుడు అవకాశం కోసం ఎదురు చూసినట్టే ఆహల్యపై మనసు పారేసుకున్న ఇంద్రుడు అదనుకోసం ఎదురు చూస్తూ గౌతముడు ఉదయమే స్నానానికి బయటకు వెళ్లగా, ఇంద్రుడు గౌతముడి రూపం దాల్చి అహల్యతో గడుపుతాడు. దేవతల పాలకుడు దేవేంద్రుడంతటి వాడు మనసుపడ్డ చిన్నదానితో గడిపేందుకు బినామీ అవతారం దాల్చక తప్పనప్పుడు, సామాన్య మానవుడు కుర్చీ పొందడానికి, వచ్చిన కుర్చీని నిలబెట్టుకోవడానికి బినామీ బతుకు బతకక తప్పుతుందా? అలా బతికితే అది తప్పా?
***
ఈ మధ్య ఒక నాయకుడు మరో నాయకుడిని వసూల్ రాజా అంటే ఆయనకు చిర్రెత్తుకొచ్చి అసలు నీ బతుకే బినామీ బతుకు అని తిట్టిపోశారు. దేవతలు, మనుషులు వారూ వీరని కాదు బినామీ బతుకు బతకందెవరు?
అప్పలమ్మ నుండి ఐశ్వర్యారాయ్ వరకు, మిస్ దొండపాలెం నుండి మిస్ యూనివర్స్ వరకు ఎవరికీ తమ రూపంపై తమకు పూర్తి సంతృప్తి ఉండదట! ముక్కు ఒక్కటి ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేదనో ఏదో ఒకదాంట్లో అసంతృప్తి ఉంటుందట! అదేం సృష్టి విచిత్రమో కానీ వారూ వీరూ అనే కాదు ఎవరికి వారు తమ జీవితం కన్నా ఇతర జీవితానే్న ఎక్కువ ఇష్టపడతారు. ఇదో రకం బినామీ జీవితం. జీవితంలో విజయం సాధించాలంటే నీ రూపం నీకు అచ్చిరాదు బినామీ జీవితమే ముద్దు అనేది కొందరి విజయ సిద్ధాంతం.
ఈ మధ్య రాజధాని నగరంలో హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి విస్తుపోయారు. వారు హిజ్రాలు కాదు. మేం బుడగ జంగాలం స్ర్తి, పురుష వేషం మేమే ధరించి కథలు చెబుతూ అడుక్కోవడం మా కులవృత్తి, కుల వృత్తికి ఆదరణ లేదు అందుకే హిజ్రాల్లా నటించేస్తున్నామని చెప్పుకొచ్చారు. చివరకు హిజ్రాల్లోనూ బినామీలేనా? అని పోలీసులు తలపట్టుకున్నారు. మహావీరులైన పంచపాండవులు అజ్ఞాత వాసంలో బినామీ జీవితమే కదా గడిపింది. వీరాధివీరుడైన అర్జునుడు సైతం బృహన్నలగా బినామీ జీవితం గడపక తప్పలేదు. ఏడాది పాటు బినామీ జీవితం గడిపితే కానీ రాజ్యం దక్కదు. నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అనే సందేహం లాంటిదన్నమాట. ఏడాది బినామీ జీవితం కష్టమా? జీవితమంతా అధికారం లేకుండా గడపడం కష్టమా అని లెక్కలేసుకుని బినామీ జీవితమే ముద్దు అని నిర్ణయించుకున్నారు.
సీత అందాన్ని చూసి ముగ్ధుడైన రావణుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏమయ్యేది శపించి బూడిద చేసేదేమో! ఆ విషయం తెలిసే రావణుడు బినామీ రూపంతో ఆమె ముందు వాలిపోయి భవతీ బిక్షాందేహి అన్నాడు. రావణుడు సీతను లంకకు ఎత్తుకెళ్లిన తరువాత అక్కడ కూడా అనేక బినామీ రూపాలతో ఆమె ముందు ప్రత్యక్షమైనా, సీత నమ్మలేదు. చివరకు హనుమంతుడు వస్తే అతను కూడా రావణుడి బినామీ రూపమేమో అనుకుని మొదట సందేహించింది. మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చినా నమ్మిన సీత, లక్ష్మణుడు గీతగీసినా వినకుండా బినామీ రూపాన్ని నమ్మిన సీత హనుమంతుడిని సైతం ఎందుకలా అనుమానించింది? బినామీ రూపంపై ఒక్కసారి అనుమానం వస్తే అంతే సంగతులు..! ఇక ఏ రూపంలో వచ్చినా నమ్మరు గాక నమ్మరు. సీతమ్మ విషయంలో జరిగిందదే. ఇక రాజకీయాల్లోకి వచ్చాక నాయకుల జీవితం బినామీ మయం అవుతుంది. వారి అసలు రూపాన్ని వారే మరిచిపోయి ఉంటారు. ఇక మనకేం తెలుస్తుంది?

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయానికి స్వాగతం