24, నవంబర్ 2011, గురువారం

నానాజాతి సమితి .... ఆరుబయలు జైలులో గాలి... కనిమొళి.. రాజ .. బాబు...జగన్ ,అమర్ సింగ్ ... జయప్రద


గాలి ఓ కొండను పరీక్షగా చూస్తూ, కొండలను తవ్వేశామనే జైలుకు పంపారు, జైలులో కొండలను తవ్వనిస్తారా? అని కొంత నిరాశ చెందాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కాలం మారుతుంది ప్రభుత్వం మారుతుంది. కొండ ఎక్కడికీ పొదు అనుకుని చేతిలోని గరుడ పురాణం చదవడంలో లీనమయ్యాడు. జగన్ ఎవరి కోసమో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.‘‘ ఏంటి జగన్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్, ఇంటికి పై కప్పు దేంతో వేద్దామని ఆలోచిస్తున్నావా?’’ అని పక్కనున్న వారు జోకేశారు.

 ‘‘ఎవరో ఒకరిని ఓదార్చకపోతే చేతులు వణుకుతున్నాయి. డాక్టర్‌ను కలిస్తే చాలా కాలం నుండి ఓదార్చడం అలవాటైంది కాబట్టి ఓదార్పు లేకపోతే కష్టమే అన్నారు. రోజుకో డజను మందినైనా చంపలు నిమిరి తలపై చేయి వేసి ఓదార్చకపోతే నిద్ర రాదు అంటూ జగన్ మాట్లాడుతుండగానే, ఓదార్చడానికి రెండు చేతులు వాటంతట అవే ముందుకు వచ్చాయి. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుండి వేగంగా పరుగు తీశాడు.


మరో వైపు బాబు సూర్య నమస్కారాలు చేస్తూ దేవుడా ఓ మంచి దేవుడా! మా రాష్ట్రంలో తొమ్మిది శాతం గ్రోత్‌రేట్ వచ్చేట్టు చూడు. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేట్టు చూడు. రైతులకు గిట్టుబాటు ధర లభించేట్టు, వ్యవసాయం లాభసాటిగా అయేట్టు, ఎస్సీ, బిసి, మైనారిటీ, + 98 కులాలకు మేలు జరిగేట్టు చూడు అంటూ అందరికీ వినబడేట్టు గట్టిగా మొక్కాడు. మనసులో మాత్రం మెల్లగా ఓ మంచి దేవుడా నన్ను మళ్లీ అధికారంలో కూర్చోబెట్టు అధికార విరహాన్ని తట్టుకోలేక పోతున్నాను. ఇప్పటికే అధికార రహితంగా ఏడేళ్ల జీవితాన్ని గడిపాను. జీవితంలో నిన్ను ఇంకేమీ కోరను మళ్లీ ఒక్కసారి ముఖ్యమంత్రిని చేయి అని మొక్కుకున్నాడు. మా తమిళులను ఓవర్ యాక్షన్ అని తిట్టుకుంటారు కానీ మీ తెలుగువారిలో ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువండి అంటూ అప్పటి వరకు దూరంగా ఉండి అందరినీ గమనిస్తున్న రాజా వీరి దగ్గరకు వచ్చాడు.
 చెప్పేవి శ్రీరంగనీతులు... దూరేవి... ఏవో అన్నట్టు నానా గడ్డితిని మనం ఇక్కడ జైలుకు వచ్చాం. ఇక్కడైనా సహజంగా ఉండొచ్చు కదా? ఇక్కడెందుకు ఓవర్ యాక్షన్ అని రాజా చిరాకుపడ్డాడు. బాబుగారూ మీది మరీ మితిమీరిన ఓవర్ యాక్షనండి ఇదేమన్నా ఎన్నికల బహిరంగ సభనా? ఇక్కడున్నవారంతా నీలాంటి వారే కదా? ఓటర్ల ముందు చెప్పే మాటలు ఇక్కడ ఎందుకు? అని రాజా అసహనంగా పలికాడు. తమిళనాడు పక్కనే కదా, మీ తమిళుల ఓవర్ యాక్షన్ చిత్తూరు వారికి బాగానే అంటినట్టుంది అని బాబు, గాలి.. వైపు చూస్తూ జగన్ నవ్వాడు. తమరేదో బుద్ధిమంతులైనట్టు అంటూ కనిమొళి జగన్‌ను చూస్తూ ముందుకు వచ్చి వారితో మాటలు కలిపింది.
 ఓవర్ యాక్షన్‌లో తమిళ, తెలుగు ప్రాంతీయ బేధాలు ఎందుకు? అని ఒక గొంతు వినబడింది. మాసిన గడ్డంతో శాలువా కప్పుకున్న కొత్త వ్యక్తి ఎవరో కనిపించారు. అప్పటి వరకు అక్కడున్న వారంతా ఆ కొత్త శాల్తీని చిరాగ్గా చూశారు. హలో మిస్టర్ ఇది విఐపిల ఆరుబయలు జైలు. ఎక్కడికెళ్లాల్సిన వారో ఇక్కడికొచ్చినట్టుంది అని చిరాకు పడ్డారు. ఎల్‌ఐసిలో కోట్ల రూపాయల పాలసీలు చేయించే ఏజెంట్లకు ప్రత్యేకంగా మిలియనీర్స్ క్లబ్ లా రాజకీయాల్లో వందల కోట్లు,వేల కోట్లరూపాయల కుంభకోణాలకు పాల్పడిన వారికి ఆరుబయలు జైలులో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అక్కడికి సాధారణ వ్యక్తి రావడంతో తమ హోదాను తగ్గించి అవమాన పరిచినట్టుగా వారు భావించి, ఎవరు మీరు? అని కోపంగా అడిగారు. అతను సమాధానం చెప్పకముందే జయప్రద పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండాగండి ఎవరనుకుంటున్నారు? 
అని పూర్తి చేయకముందే, జయప్రదను చూడగానే ఆయన అమర్‌సింగ్ అని గుర్తు పట్టారు. ఎలాంటి వారు ఎలా ఐపోయారని అంతా సానుభూతి చూపారు. జగన్ పరిగెత్తుకొచ్చి అమర్‌సింగ్ చెంపలను రెండు చేతులతో నిమిరి ఓదార్చి సంతృప్తి చెందాడు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన అమర్‌సింగ్ మాసిన గడ్డంతో యుద్ధంలో చిత్తుగా ఓడిపోయి శత్రు సైనికుల చేతికి చిక్కిన సిపాయిగా కనిపిస్తున్నారు. ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఆవేదన చెందారు. ఆయనెవరో విజయమాల్యా రోజూ ముద్దుగుమ్మలతో గడుపుతూ వ్యాపారంలో నిండా మునిగి సహాయం కోసం ప్రభుత్వ తలుపు తట్టారు. మరి మనం చేసింది కూడా వ్యాపారమే కదా? రాజకీయ వ్యాపారంలో కోట్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి తిరిగి రాబట్టుకోవడానికి నానా గడ్డి కరవాల్సి వస్తుంది. పట్టుపడితే అవినీతి పరులు అని ముద్ర వేసి జైలుకు పంపుతున్నారు. 
పెట్టుబడి పెట్టేది మనం, నష్టపోయేది మనం, వ్యాపారంలో రిస్క్ ఎంత ఎక్కువ ఉంటే లాభం అంత ఉంటుంది. నష్టపోయిన వ్యాపారులను జైలుకు పంపనప్పుడు మనల్ని పంపడం ధర్మమా?అని ఎవరో గట్టిగా నిలదీశారు. మనలో ఐక్యత లేకపోవడం వల్లనే ఇలా జరుగుంది. అన్ని వ్యాపారాల వారికి సంఘాలున్నప్పుడు రాజకీయ వ్యాపారులకు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్ని వినిపించింది. పొలిటికల్ లీడర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తుమ్ సంఘర్ష కరో హమ్ తుమర్హా సాత్ హై అంటూ మాయావతి వారికి మద్దతు పలికింది. ఆ వెంటనే పురుచ్చితలైవి జిందాబాద్ అనే నినాదాలు వినిపించాయి. తరువాత ఒక పెద్ద మేఘం అక్కడ వాలినట్టుగా జయలలిత వాలిపోయారు. ఇప్పటికైనా మనలో ఐక్యత రావాలి డిఎంకె వాళ్లు తప్ప ఈ ఫెడరేషన్‌లో ఎవరున్నా మాకు అభ్యంతరం లేదు అని జయ పలికింది. ఎన్‌డిఏ, యుపిఏ యేతర పక్షాలతో మూడో ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని బాబు ఆలోచిస్తున్నాడు.
***
ములాఖత్ సమయంలో బంగారు లక్ష్మణ్ వచ్చి వారందరినీ చూసి వావ్ అంటు భోరున విలపించాడు. ఏమైంది అంటూ అంతా కంగారు పడ్డారు. దేశాన్ని ఏలే పార్టీకి అధ్యక్షుడిగా ఉండి నేను లక్ష రూపాయలకే పట్టుబడి శిక్ష అనుభవించాను, మీ అవినీతి చరిత్ర చూశాక నామీద నాకు జాలి కలిగింది... జాలి దుఃఖంగా మారింది... దుఃఖం నుండి నిర్వేదంలోకి.. ఈ జీవితం వృధా అనిపిస్తోంది అంటూ బంగారు లక్ష్మణ్ తన తలను గేటు తలుపులకు తలను దన్... దన్ ... మని కొట్టుకుంటున్నాడు.
***
అబ్బా అప్పుడే తెల్లవారిందా?బంగారం లాంటి కల.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం