30, మార్చి 2011, బుధవారం

గాంధీభవన్‌లో బాబు.. ఎన్టీఆర్ భవన్‌లో జగన్! @2014మండలి ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరిగితే మూడు పార్టీలకు మూడేసి సీట్లు వచ్చాయి. 2014లో సాధారణ ఎన్నికల్లో సైతం ఫలితాలు ఇలానే ఉండొచ్చనిపిస్తోంది. ఇలానే ఉంటే మూఢు పార్టీలో ఏవో రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరితే తప్ప ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. అప్పుడుచంద్ర బాబు జగన్‌తో చేతులు కలుపుతారా? లేక కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారా? లేక జగన్‌ను కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటుందా? ఒక్కసారి ఫ్యూచర్‌లోకి వెళ్లి ఆలోచిస్తే....


సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎవరికీ మెజారిటీ రాలేదు.... ఎన్టీఆర్ భవన్‌కు జగన్ రాగానే ఒక్కసారిగా అతనిపై పూలవర్షం కురిసింది. అచ్చం వైఎస్‌ఆర్‌లానే జగన్‌మోహన్‌రెడ్డి చేతులు జోడించి అక్కడి వారికి నమస్కారం చేశారు. సార్ నేను మీ నాన్నకు వీరాభిమానిని అని తళతళలాడే పచ్చచొక్కా వేసుకున్న తెలుగు నాయకుడొకరు జగన్‌తో కరచాలం చేశాడు.
మీ నాన్న ఫోటో నా గుండెలపై ఉంది చూడండి సార్ అంటూ ఒకనేత చొక్కా విప్పి చూపించారు. అంతకు ముందు ఈయన ఎన్టీఆర్ ఫోటో కూడా గుండెలపై ఇలానే పొడిపించుకున్నాడు అది చెరిపేసి మీ నాన్న బొమ్మను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. నేను అలా కాదు నా కుడిచేయి మీద మీ నాన్న పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నాను చూడండి సార్. అని మరో నేత మల్లేశ్వర్ కుడి చేయి ముందుకు చాపాడు. కుడిచేయి సంగతి సరే కానీ వారి ఎడమ చేతిని చూపమనండి సార్ ఎవరి పేరుందో తెలుస్తుంది అని మహిళా నేత మాణిక్యమ్మ దూసుకొచ్చింది.

మీ పార్టీ ఆఫీసులో మిమ్ములను అభిమానించే వారెవరూ కనిపించడం లేదు అంతా మా నాన్న అభిమానులే ఉన్నారుఅని బాబును చూస్తూ, జగన్ నవ్వాడు. ఆ మాటలు విననట్టుగానే బాబు జగన్‌ను తన చాంబర్‌కు తీసుకువెళ్లాడు. అంతా చెబితే ఏదో అనుకున్నాను మీ పార్టీ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్‌ను తలదనే్న విధంగా ఉంది అని జగన్ అభినందించి, ఇక చర్చలు ప్రారంభిద్దాం మీ పార్టీ సీనియర్లను పిలవండి అని జగన్ కోరాడు. మీరేదో రాజకీయాల్లో తెలివైనవారనుకున్నాను, ఇంత కాలం అయినా నా సంగతి తెలియలేదా? నా రూటే సెపరేటు, ముందు నిర్ణయం తీసుకున్న తరువాత సీనియర్లతో చర్చించడం నా పద్దతి అని బాబు నవ్వాడు.

మనం ఇద్దరం కలిస్తే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, ఇద్దరి విధానాలు అమలు చేద్దాం, ఇద్దరం అధికారాన్ని పంచుకుందాం అని ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. చర్చలు ముగించి ఇద్దరూ విలేఖరుల సమావేశానికి వచ్చారు. ‘‘కాంగ్రెస్ వ్యతిరేకతే ఊపిరిగా జీవించే నేను, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాను.

మా ఇద్దరి ఉమ్మడి లక్ష్యం కాంగ్రెస్ వ్యతిరేకత అందుకే ఇద్దరం కలిశాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళతాం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం సాగిస్తాం. సోనియాగాంధీని నేను వ్యతిరేకిస్తున్నాను, జగన్ వ్యతిరేకిస్తున్నారు. దాంతో మా ఇద్దరి సిద్ధాంతాలు కలిశాయి. ఇద్దరం కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ’’ అని చంద్రబాబు ప్రకటించారు. ‘‘ తాను విద్యార్థిగా ఉండేప్పుడే చంద్రబాబు విధానాల పట్ల ఆకర్షితుడ్ని అయ్యాను’’ అని జగన్ ప్రకటించారు.

‘‘యువకులుగా ఉన్నప్పుడే మా నాన్న, బాబు మంచి మిత్రులు, ఏనాటికైనా బాబుతో కలిసి పని చేయాలని కలలు కన్నాను. ఇన్నాళ్లకు నా కలలు ఫలించాయి’’ అని జగన్ సంతోషంగా ప్రకటించారు. ఇద్దరూ చేతులు పైకెత్తి మీడియాకు ఫోజులిచ్చారు

.*****
గాంధీభవన్‌లో గంగాభవానీ తీన్‌మార్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. బాబు కారు నుంచి కాలు కింద పెట్టి గాంధీభవన్ భూమిని చేతితో తాకి ముద్దాడాడు. తల్లి నుంచి తప్పిపోయిన పిల్లాడు ఎక్కడెక్కడో తిరిగి చాలా కాలం తరువాత తిరిగి తల్లిఒడికి చేరినట్టుగా ఉంది నా పరిస్థితి అని బాబు భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డకు తల్లిమీద కోపం ఉంటుందేమో కానీ తల్లికి తన పిల్లల మీద ఎప్పుడూ కోపం ఉండదు ఎంత కాలానికి తిరిగి వచ్చినా ఆదిరిస్తుంది అనిచెప్పి రోశయ్య బాబును లోనికి తీసుకు వెళ్లారు.

పిసిసి అధ్యక్షుని చాంబర్‌లో కూర్చోని చర్చలు మొదలు పెట్టారు. మీరు బయటి నుంచి మద్దతు ఇవ్వాలి అంటూ చంద్రబాబు ఏదో చెప్పబోతుంటే చాల్లేవయ్యా ఇంకా బయటి నుంచి మద్దతు లోపలి నుంచి మద్దతు డైలాగులు వద్దు కానీ నేరుగా పాయింట్‌లోకి రా అని కిరణ్‌కుమార్‌రెడ్డి సలహా ఇచ్చారు. ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం కుదిరింది.
బాబు విలేఖరుల ముందుకు వచ్చి నా పుట్టింటికి నేను తిరిగి వచ్చినట్టుగా ఉంది. నేను ఎప్పుడూ అధికారాన్ని ఆశించలేదు. పదవి కోసం కాదు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాం. వైఎస్‌ఆర్ ఈ రాష్ట్రాన్ని దోచేశారు. అతని కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని మింగేస్తాడని కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాను.

నా నిర్ణయంలో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాలో ఇంకా 30 శాతం కాంగ్రెస్ రక్తం ఉందని చెప్పాను. అది 50 శాతానికి చేరిందని చెప్పడానికి గర్విస్తున్నాను’’ అని ముగించారు.

*******
పిసిసి అధ్యక్షుడు జగన్ ఇంటికి వచ్చి బెల్ కొట్టారు. మా సంగతి నీకు తెలియనట్టుగా ఉంది తలుపు తీయకపోతే గోడ దూకి వస్తాం అని నాయకులు బిరబిరమంటూ లోనికి దూసుకొచ్చారు. మనం మనం ఒకటి మన రెండు పార్టీల్లోనూ కాంగ్రెస్ ఉంది అంటూ నాయకులు జగన్‌ను బుజ్జగించారు...

2014లోనే కాదు మరో 50 ఏళ్లయినా రాజకీయాలు ఇలానే ఉంటాయి.

1 వ్యాఖ్య:

 1. నిజం...పరిస్థితులు మారవు...ఇంకా దిగజారుతూనే వుంటాయి.
  అందరూ ఒకటే...ఇది "కురుక్షేత్రం" నాటకం... కౌరవులు
  పాండవులు...స్టేజీ దిగితే అందరూ ఒకటే...ఈ నిజం తెలుసుకోగలిగినవాడు
  ఙ్ఞాని...సాక్షీభూతంగా చూడగలడు.......పేపర్లకు విషయం...మనకు కాలక్షేపం...
  చక్కగా వ్రాసారు...కంగ్రాట్స్...

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం