20, మార్చి 2011, ఆదివారం

ముగ్గురు మరుగుజ్జులు

- బుద్దా మురళి
అటు చూస్తే సచిన్ బ్యాటింగ్, ఇటు చూస్తే మంత్రులు ఫైటింగ్.... వీటి మధ్య ఏ చానల్ చూడాలో ఇంటి పెద్దాయన తేల్చుకోలేక పోతున్నారు. వీరి ఫైట్ కన్నా కార్టూన్ నెట్‌వర్క్‌లో మిక్కీవౌస్ ఫైటింగ్ కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పే ధైర్యం చేయలేని పిల్లలు.... వీరి బాధను గమనించిన నాయనమ్మ వారిని పిలిచి మీకు వాటికన్నా ఆసక్తికరమైన కథ చెబుతాను వినండి అనగానే పిల్లలంతా ఉత్సాహంగా ముందుకు వచ్చారు.

త్రిలింగ దేశం యువరాణి రాజ్యలక్ష్మి యుక్త వయసులో అడుగు పెట్టబోతోంది. మరో మూడేళ్లలో ఆమెకు పెళ్లి చేసి తీరాల్సిందే. ముగ్గురు యువరాజులను ఎంపిక చేసి వారి చిత్రపటాలను యువరాణికి చూపించారు. రాజులు ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకుంటారు, ఎంత వయసు వచ్చినా ఆశ చావకుండా రాజ్యలక్ష్మిని చేపట్టేందుకు ఎదురు చూస్తుంటారు.
ఎంత వయసులోనైనా స్వయం వరంలో తమ ప్రతిభ ప్రదర్శించే అవకాశం వారికి ఉండడం వల్ల వారి వయసుతో నిమిత్తం లేకుండా స్వయం వరంలో ఉన్నవారందరినీ యువరాజులుగానే భావించాలి. నెరిసిపోయిన గడ్డంతో వయసు మీరిన యువరాజు ఒకరు, ఎలాంటి చరిత్ర లేకుండా ఉన్న యువరాజు ఒకరు, ఇంకా సరైన వయసు రాని యువరాజు ఒకరు వీరి ముగ్గురిని స్వయం వరానికి ఆహ్వానించారు.
ఆ ముగ్గురూ మరుగుజ్జులే.సుసంపన్నమైన దేశానికి అందమైన యువరాణికి పెళ్లి అంటే వీరులు శూరులు, అందగాళ్లు ఎంతో మంది క్యూలో నిల్చుంటారు కదా? మరి మరుగుజ్జులనే స్వయం వరానికి ఎందుకు ఆహ్వానించాలి అనే సందేహం వస్తుంది.
కానీ, త్రిలింగ దేశానికున్న వాస్తు దోషం, రాజ్యలక్ష్మి గ్రహ స్థితిగతులు, జాతక ఫలం రీత్యా ఆమె ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని చేపట్టాలి. దేశ ప్రజలకు, రాజ్యలక్ష్మికి ఇష్టం ఉన్నా లేకున్నా, నచ్చినా నచ్చక పోయినా తప్పదు. ముగ్గురు మరుగుజ్జుల చరిత్ర తక్కువేమీ కాదు.. ముగ్గురూ స్వయం ప్రకాశం లేని వారే.

పెద్దరాజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంచం నుండి తోసేసి కుర్చీని సంపాదించుకున్న చరిత్ర ఒకరిది. రాజమాత అనుగ్రహంతో కుర్చీ పొందిన వారొకరు. తండ్రి పేరుచెప్పి కుర్చీ కోసం ఆశపడుతున్న వారొకరు. స్వయం వరంలో ముగ్గురు యువరాజులను చూడగానే యువరాణి రాజ్యలక్ష్మి ఫక్కున నవ్వింది.
కానీ చిత్రంగా ఆ ముగ్గురు చాలా ఎత్తుగా కనిపిస్తున్నారు. రాజసభలో కూర్చున్న వారే కాదు మొత్తం రాజ్యంలోని అందరి కన్నా వారు ఎత్తులో కనిపిస్తున్నారు. వారు అంత ఎత్తులో కనిపించడానికి కారణం తెలిసిన తరువాత యువరాణి మరింత నవ్వుకుంది. వారు మరుగుజ్జులే అయినా చాలా ఎత్తుగా కనిపించేందుకు అవసరమైన మంత్ర తంత్రాలు వారికి తెలుసు....
ఇలా నాయనమ్మ కథ చెబుతుంటే పొట్టిగా ఉన్నవాళ్లు పొడుగ్గా ఎలా కనిపిస్తారు? బూస్ట్ తాగారా? అని ఓ గడుగ్గాయి సందేహం వ్యక్తం చేసింది. మాయాబజార్ సినిమా చూశారా? అని నాయనమ్మ అడిగింది. చూశామని పిల్లలు చెప్పగానే అందులో ఘటోత్కచుడి నోట్లోకి లడ్డూలు వచ్చి పడ్డ దృశ్యం గుర్తుంది కదా? నిజానికి లడ్డూలు అలా పైకి రావు అదంతా ఫోటోగ్రఫీ మహిమ అన్నమాట! అలానే వయసు మీరిన తెల్లగడ్డం యువరాజు కెమెరాల ట్రిక్ వల్ల కొంత కాలం హిమాలయాలంత ఎత్తులో ఉన్నట్టు కనిపించారు.

మయాబజార్ సినిమాలో సినిమాటోగ్రాఫర్ ఒక్కరే అంత అద్భుతాన్ని సృష్టించినప్పుడు త్రిలింగ దేశంలో బోలెడు మంది ఫోటోగ్రాఫర్లు తలుచుకుంటే ఎంత అద్భుతాన్ని సృష్టించగలరో ఊహించుకోండి. తన చుట్టూ పత్రికలను కప్పుకుని అతను చాలా అద్భుతమైన వానిగా కనిపించే వారు. కొంత కాలానికి అసలు వర్షాలే లేక ఎండలు విపరీతంగా రావడంతో ఆ పత్రికలు ఎండకు పలచబడి యువరాజు అసలు రూపం ప్రజలకు తెలిసిపోయింది.
హిమాలయాలంత ఎత్తున కనిపించిన వ్యక్తి కాస్తా మళ్లీ మరుగుజ్జగానే కనిపించసాగారు.ఇక రెండో ఆయన సైజు ఆయనకూ తెలుసు, దేశ ప్రజలకూ తెలుసు. కానీ ఆ దేశాన్ని ఏలే రాజమాత అతనికి మహాశక్తిసంపన్నమైన ఒక కుర్చీని బహూకరించింది. ఈ కుర్చీపై ఎలాంటి వారు కూర్చున్న చాలా ఎత్తుగా కనిపిస్తారు. ఆ ఎత్తు కుర్చీ మహిమ తప్ప వ్యక్తిలోని శక్తి కాదు.
ఇక మూడవ వ్యక్తి నూనూగు మీసాలతో ఇంకా సరైన వయసు రాకుండానే స్వయం వరంలో హడావుడి పడుతున్నాడు. అతనెప్పుడూ తన తండ్రి కీర్తిని జేబులో పెట్టుకుని వస్తారు. దాంతో అతనూ వయసుకు మించిన కీర్తి, అసలు ఎత్తుకు మించిన ఎత్తుతో కనిపిస్తారు. పైకి ఎలా కనిపించినా వీరి ఎత్తుల్లోని అసలు రహస్యం రాజ్యలక్ష్మికి తెలుసు.కానీ ఈముగ్గురిలోనే తాను ఒకరిని ఎంపిక చేసుకోవాలి తప్ప మరో మార్గం లేదు. త్రిలింగ దేశ ప్రజలు మాత్రం ఆవేదనతోనే ఉన్నారు. ఎలాంటి దేశానికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయని బాధపడసాగారు. ముగ్గురు మరుగుజ్జులను చాలా సేపు చూసి వారి గుణగణాలను పరిశీలించిన రాజ్యలక్ష్మి తన నిర్ణయం ప్రకటించడానికి లేచి నిలబడింది.
‘‘ ఎంతో ఎత్తుగా కనిపిస్తున్న మీ ముగ్గురు మరుగుజ్జులనే విషయం నాకు తెలుసు, మీలో ఒకరినే నేను ఎంపిక చేసుకోవాలనే విషయం కూడా అంత కన్నా బాగా తెలుసు. అయితే నా నిర్ణయాన్ని ప్రకటించేందుకు మూడేళ్ల వ్యవధి ఉన్నందున మీకో పరీక్ష. ఈ మూడేళ్ల కాలంలో మీలో కొద్దిగానైనా ఎవరు ఎత్తుగా పెరిగితే వారినే పెళ్లి చేసుకుంటాను ’’ అని రాజ్యలక్ష్మి ప్రకించింది. దాంతో ముగ్గురు ఆ క్షణంలోనే ఎత్తుపెరిగే కసరత్తుల కోసం పరుగులు తీశారు. లేపనాలు తింటున్నారు.కనిపించిన వారికల్లా మొక్కుతున్నారు.... అంటూ నాయనమ్మ చెబుతుంటే ‘‘సస్పెన్స్‌ను తట్టుకోలేక పోతున్నాం, రాజ్యలక్ష్మి ఎవరిని వరించింది’’ అని పిల్లలు అడిగారు. ‘’ ఏమో నాకేం తెలుసు ఆ విషయం తెలియాలంటే ఇంకా మూడేళ్లు ఆగాలని రాజ్యలక్ష్మే చెప్పింది కదా? ఈ లోపు వారి ఎత్తు పెరిగేందుకు ఏమైనా ఐడియాలు ఉంటే మీరూ చెప్పండి’’, అంటూ నాయనమ్మ ముగించింది.

1 వ్యాఖ్య:

  1. :))బావుంది. ప్రస్తుతానికి నూనూగు మీసాల మరుగుజ్జు ఎత్తుపెరగడానికి సరైన మార్గం కనిపెట్టినట్టు కనిపిస్తుంది. చూద్దాం..

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం