28, మార్చి 2011, సోమవారం

చవట హీరోలు

అదేదోపాత సినిమాలో వాణిశ్రీ తనను ప్రేమించడంలో పోటీపడుతున్నవారితో ఎవరెక్కువ చవటలైతే వారినే ప్రేమిస్తానని పోటీ పెడుతుంది. చవటాయను నేను నీకంటె చవటాయను నేను అంటూ ఇద్దరూ పోటీ పడతారు. వీరులెవరనే విషయంలోనే కాదు ఈ ప్రపంచంలో చవటలెవరనే విషయంలో సైతం పోటీ ఉంటుంది. వారు నిజంగా చవటలా? కాదా? అనే విషయం ఎలా ఉన్నా వాణిశ్రీని దక్కించుకోవాలంటే చవటల పోటీల్లో నెగ్గాల్సిందే మరి? వాణిశ్రీని దక్కించుకోవడానికి చవటాయల పోటీనే అంత తీవ్రంగా ఉంటే ఇక రాజ్యలక్ష్మిని దక్కించుకోవాలంటే హీరోయిజంలో ఎంత పోటీ ఉంటుందో ఆలోచించండి. మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉంటే దాని కోసం పోటీ ఎక్కువగా ఉండడడం సహజమే! హీరోయిజానికి గ్లామర్ ఉంటే తనను మించిన హీరో లేరంటారు. అదే విలనిజానికి క్రేజి ఉంటే తనను మించిన విలన్ లేనే లేరని మీసాలు మెలేస్తారు. మార్కెట్‌లో తన విశ్వసనీయత గ్రాఫ్ నేలపై పడిపోయిందని సొంత వాళ్లు సైతం గుసగుసలాడుకోవడంతో చిర్రెత్తుకొచ్చిన బాబు దేశ రాజకీయాల్లో నా అంత విశ్వసనీయత గలవారెవరున్నారని సవాల్ విసిరారు. ఇది సవాల్ విసరడం కాదు అత్మవిశ్వాసం అంత కన్నా కాదు దేశంలోని రాజకీయ నాయకులందరినీ అవమానించడమేనని బాబు విశ్వసనీయత గురించి బాగా తెలిసిన వారు చెప్పుకొచ్చారు. నేనెప్పుడూ విశ్వసనీయత ట్రేడ్‌మార్క్ షర్ట్స్‌నే వాడతాను అంటూ జగన్ కాలరెగరేసి మరీ చెబుతున్నారు. తానెంత చెప్పినా కనీసం ఇంట్లో వాళ్లకైనా విశ్వాసం కలిగించలేకపోతున్నానని గ్రహించినట్టున్నారు ఇప్పుడా విషయం పక్కన పెట్టి అసలు హీరో ఎవరు అనే చర్చ లేవదీశారు. లక్షల కోట్లు దోచిన వారు హీరోనా నేను హీరోనా మీరే తేల్చుకోండి అంటూ ప్రజలపైకి ప్రశ్న వదిలారు. తమ కుటుంబంలోనే డజన్ల కొద్ది హీరోలుండగా, తాను కాకుంటే మరెవరు హీరో అనేది ఆయన బాధ. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారక రత్న, కళ్యామ్‌రామ్‌ల వంటి హీరోలు తనకు కుడి ఎఢమ భుజాలుగా, ముందు వైపు వెనకవైపు నిలిచి ఏ క్షణంలో అంటే ఆ క్షణంలో తన కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తాను కాకుంటే ఇంకెవరు హీరో అనేది ఆయన బాధ. పోనీ వీళ్లు సరిపోరు అనుకుంటే తమ్ముడి కొడుకూ హీరోనేనాయె. వాళ్లంతా వేషాలేసుకునే హీరోలు. వారి హీరోయిజం తెరకే పరిమితం. ఒంటి చేత్తో ఈ హీరోలందరినీ మట్టికరిపించి రాజగురువుకు సైతం చుక్కలు చూపించిన రియల్ హీరో వైఎస్‌ఆర్ కుమారుడిగా తానే అసలైన హీరోను అనేది జగన్ వాదననట . హీరోల సంతానం నటహీరోలైనప్పుడు రాజకీయ హీరోలో వారసులు రాజకీయ హీరోలు కావలసిందే కదా? అని గడుసుగా ప్రశ్నిస్తున్నారు. మీరే హీరోలైతే సినిమా రంగంలో ఎలాంటి గాడ్‌ఫాదర్స్ లేకుండా సినిమా రంగానికి వచ్చి కులం కాని చోట మూడు దశాబ్దాలు మెగాస్టార్‌గా వెలిగిపోయిన తననెవరూ రియల్ హీరోగా చూడడం లేదేమిటనేది చిరంజీవి బాధ. ఎన్టీఆర్‌కు 60 ఏళ్ల వయసులో తనను ఆదరించిన ప్రజల కోసం ఏదో చేయాలనే తపనతో సినిమా జీవితాన్ని త్యాగం చేస్తే తాను అంత కన్నా ఐదేళ్ల ముందే సినిమా జీవితాన్ని త్యాగం చేసినా రాజకీయాల్లో తనకు లభించాల్సిన గుర్తింపు లభించలేదనేది ఈ రీలు హీరో బాధ. వీరెవరూ కాదు అసలు అధికారం ఎవరి చేతిలో ఉంటే వాడే నిజమైన హీరో అని కిరణ్‌కుమార్‌రెడ్డి డైలాగ్ కింగ్ డబ్బింగ్ సాయికుమార్ రేంజ్‌లో గొంతు చించుకుని చెప్పినా ఎవరూ వినడం లేదు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో చంద్రబాబు విలన్‌గా కనిపిస్తే, చంద్రబాబు ఆత్మకథలో బాబే హీరో కావడం సహజం. ఒకరికి హీరోగా కనిపించిన వారు అందరికీ హీరోగా కనిపించాల్సిన అవసరం లేదు. ఎవరి చూపు వారిది. తెలంగాణ వ్యవహారంలో ఎవరేం చెప్పినా కెసిఆర్ హీరో, అదే సీమాంధ్రుల దృష్టిలో ఆయనో విలన్ . ఎన్టీఆర్ రాముడిగా నటిస్తే కదిలి వచ్చిన దైవం అని మొక్కారు. రావణుడిగా నటిస్తే తెరపైకి రావణుడు నడిచొచ్చాడేమోనని మైమరిచి పోవడమే కాకుండా అసలు రావణుడే హీరోనేమో అనుకున్నారు. ఎన్టీఆర్ రాముడిగా, రావణుడిగా నటించి మెప్పించారు. రెండు పాత్రల్లో ఎవరు హీరో అంటే ఏం చెబుతాం? కులాలకు, ప్రాంతాలకు ఆత్మగౌరవ నినాదం వ్యాపించినప్పుడు చరిత్రను తవ్వితీసి ఎవరి హీరోలను వారు వెలుగులోకి తీసుకు రావడాన్ని తప్పు పట్టలేం. ఒకప్పటి ప్రపంచ బ్యాంకు చైర్మన్ ఉల్ఫెన్‌సన్, నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్, మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్‌లనే ప్రపంచ హీరోలుగా తెలుగునాట అప్పటి పాలకులు చూపించేవారు. అధికారం పోయాక ఎప్పుడూ లేని విధంగా మహాత్మాజ్యోతి ఫూలేనే నిజమైన జాతీయ హీరో అంటూ వేనోళ్లుగా పొగిడారు. కాలం మారుతున్నప్పుడు ఎప్పుడూ ఒక్కరే హీరోగా నిలిచిపోరు. పూలే మరణించిన చాలా దశాబ్దాల తరువాత హీరోగా గుర్తింపు పొందారు. అలానే ఇప్పుడు హీరోలుగా వెలుగొందుతున్నవారు కొంత కాలం తరువాత కనుమరుగు కావచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులే కాదు శాశ్వత హీరోలు సైతం ఉండరు. అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది మొన్నటి మాట ఇప్పుడు వద్దన్నా నాలుగు రాళ్లు వెనక పడతాయి. అధికారంలో ఉన్నప్పుడే నాలుగు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదనేది నేటి మాట! రష్యాలో ఒకప్పుడు హీరోలుగా వెలిగిపోయిన వారిని ఆతరవాత విలన్లుగా భావించి విగ్రహాలు తొలగించేస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికి కల్వకుర్తి కామన్‌మాన్ ఓటమి అంటే ఏమిటో చూపించి హీరోగా నిలిచాడు. వాజ్‌పాయి లాంటి ప్రతిపక్ష నాయకునితో కూడా దుర్గాదేవిగా అభినందనలు అందుకున్న ఇందిరాగాంధీకి సైతం ఓటమంటే ఏంటో చూపించి సామాన్యుడే హీరో అని నిరూపించారువోటర్లు. నిజానికి కాలాన్ని మించిన హీరో ఎవరుంటారు? కాలమే విలన్‌ను హీరోగా, హీరోను విలన్‌గా మార్చేస్తుంది .

4 కామెంట్‌లు:

  1. Very nice. As Mr.Rao said fragment the article. It will be easy on eyes and to read.

    రిప్లయితొలగించండి
  2. I second CVRao. It would be easier to read if you divide the article into paragraphs and the font is a little bit bigger and make it right hand justified.

    రిప్లయితొలగించండి
  3. సి వి రావు గారు, రెడ్డి గారు , శివ గారికి అభిప్రాయలు చెప్పినందుకు థాంక్స్ . సాంకేతిక మైన సమష్య వల్ల ఎన్ని సార్లు పేరాలుగా విభజించిన అలానే వస్తోంది . సమశ్యను అధిగమిస్తాను .

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం