27, మార్చి 2011, ఆదివారం

అదృష్ట జాతకులు

కనులుతెరిస్తే జననం, కనులు మూస్తే మరణం రెప్పపాటే కదా? జీవితం అన్నాడో కవి. అలానే అదృష్ట దురదృష్టాల మధ్య ఉండే కాలమే రాజకీయ జీవితం అనిపిస్తోంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడట! జీవితంలో అనుకున్నది సాధించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ రాజకీయాల్లో మాత్రం అనుకున్నది సాధించాలంటే కష్టపడడం కన్నా కాలం కలిసి రావడం ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతో మంది ఎనె్నన్నో ఎత్తుగడల్లో మునిగిపోతే కనీసం మంత్రి పదవి కూడా చేపట్టని కిరణ్‌కుమార్‌రెడ్డి ఒళ్లో వచ్చి అది వాలిపోవడం అంటే ఆయన్ని మించిన అదృష్ట జాతకుడు ఎవరుంటారు? ఎవరి సమస్యల్లో వారు మునిగిపోయి ప్రజా సమస్యలపై ఆయన్ని ఎవరూ అడిగే పరిస్థితి లేకపోవడం కూడా ఆయన పాలిట అదృష్టమే. ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్షం సైతం కంటికి రెప్పలా కాపాడుతుంటే అంతకు మించిన అదృష్టం ఏ ముఖ్యమంత్రికైనా ఏముంటుంది. కొంపదీసి ప్రభుత్వం పడిపోతుందా? అని ప్రతిపక్ష నేత కంగారు పడుతుంటే, నాకేమీ కాదని కిరణ్‌కుమార్‌రెడ్డి ధీమాగా ఉన్నారంటే ఆయన అదృష్టాన్ని ఏమనాలి.ఎన్టీఆర్‌ను అంతా కారణ జన్ముడంటారు కానీ ఆయన గొప్ప అదృష్టజాతకుడు. తెలుగు వారి కీర్తిపతాకాన్ని ఢిల్లీ వీధుల్లో రెపరెపలాడించిన ఇద్దరు నేతలు ఎన్టీఆర్, పివి నరసింహారావు .ఈ ఇద్దరిని మించిన అదృష్ట జాతకులు రాజకీయాల్లో ఉన్నారా? వీరిద్దరి ముగింపు ఎలా ఉన్నా అధికారం చేపట్టిన కాలం మాత్రం వీరిని మించిన అదృష్టవంతులు లేరనిపించింది. అంతే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిని మించిన అదృష్టవంతులు లేరు. ఇప్పుడున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని చూసినా ఇప్పటి వరకు ఈ పదవిని చేపట్టిన వారందరి జీవితాలను చూసినా వీరినా పదవి వరించడాన్ని మించిన అదృష్టం ఏముంటుందనిపిస్తోంది. అధిష్ఠానం దేవత లాటరీలో ఎవరి పేరు వస్తే వారినే కదా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం వరించేది. ఎన్టీఆర్‌ది అదృష్టం అంటే కాదని గట్టిగా వాదించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఆయన మరణ పరిస్థితి దురదృష్టకరం కావచ్చు కానీ ఆయన జీవితం అదృష్టానికి ప్రత్యక్ష రూపం. దేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలంలో ఎన్టీఆర్ నాటకాల్లో నటిస్తూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించారు. పోనీ ఆ తరువాతైనా ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపారా? అంటే అదీ లేదు. కనీసం పత్రికలు చదివేందుకు సైతం ఇష్టపడలేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత సైతం ఆయన పత్రికలు చదవడానికి ఇష్టపడలేదు. మనం వార్తలు సృష్టించాలి కానీ మనం వార్తలు చదవడం ఏంటి బ్రదర్ అనేవారట! ఆయన సహనటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇదే విషయంలో ఇప్పటికీ ఆశ్చర్యపోతారు. ముఖ్యమంత్రులుగా ఉన్న నాయకులు సైతం ఎన్టీఆర్‌కు తెలియదు ఆయన ఎవరు బ్రదర్ అని నన్ను అడిగే వారు, కాంగ్రెస్‌లో చాలా మంది ప్రముఖులతో నాకు పరిచయం ఉంది బ్రహ్మానందరెడ్డిమొదలుకుని చెన్నారెడ్డి వరకు నాకు సన్నిహితులు .అలాంటిది వస్తే గిస్తే నేను రాజకీయాల్లోకి రావాలి కానీ బ్రదర్ రావడం ఏమిటో అంటూ ఆ మధ్య అక్కినేని గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. సరే మరి ఎన్టీఆర్ రాజకీయం ఇలా ఉంటే అప్పటి నాయకుల పరిస్థితి ఎలా ఉంటేది? కమ్యూనిస్టు యోధునిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన పుచ్చల పల్లి సుందరయ్య లాంటి వారు డైలాగులకే పరిమితం కాకుండా తమ జీవితాన్ని నిజంగానే ప్రజలకు అంకితం చేశారు. పిల్లలను కంటే ప్రజల కోసం ఆలోచించకుండా కుటుంబంపై ప్రేమ పుట్టుకు వస్తుందేమోనని సుందరయ్య పిల్లలనే వద్దనుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉండడమే కాకుండా తన భావాలతో అధిక సంతానం అధిక ప్రయోజనం అనే కథాంశంతో తాతమ్మ కల సినిమా తీశారు. జవసత్వాలు సహకరించినంత వరకు హీరోగా వెలిగిన వారొకరు, జీవితాన్ని ప్రజలకే త్యాగం చేసిన వారొకరు వీరిద్దరు ఎన్నికల గోదాలో దిగినప్పుడు సుందయ్య అడ్రస్ లేకుండా పోయారు, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ఎనిమిది నెలలకే అధికారంలోకి వచ్చారు. మరి ఎన్టీఆర్‌ను అదృష్టజాతకుడనుకుండా మరేమందాం. ఉత్తరాది రాజకీయాల్లో తలపండిన శరద్‌పవార్, అర్జున్‌సింగ్, తివారి లాంటి వారిని వెనక్కి నెట్టి ప్రధానమంత్రి పదవి చేపట్టి, మెజారిటీ లేకున్నా ఐదేళ్ల కాలం పాలించిన పివి దేశ రాజకీయాల్లోనే అదృష్టజాతకుడు కాదంటారా? ఎన్టీఆర్ చివరి ఏడాది కాలం దురదృష్టం ఆయన్ని వెంటాడింది కానీ లేకపోతే రెండో తెలుగు ప్రధాని అయ్యేవారు. ప్రతిపక్షానికి పది శాతం సీట్లు కూడా మిగల్చకుండా అధికారం కైవసం చేసుకున్న ఆయన ఏడాది కూడా అధికారంలో లేకపోవడాన్ని మించిన దురదృష్టం ఏముంటుంది. వెన్నుపోటు పాలు కాకపోయినా, మరణించి ఉండకపోయినా ఆయన్ని ప్రధానమంత్రి పదవి వరించి ఉండేది కదా! రాజకీయాల నుంచి విరమించుకుందామని ఇంటిదారి పట్టిన పివిని ప్రధానమంత్రి పదవి వరించడం ఏమిటి? విజయవంతంగా ఐదేళ్ల కాలం పూర్తి చేసుకోవడం అదృష్టానికి పరాకాష్ఠ . చివరకు టికెట్ దక్కకపోవడం, మరణించిన తరువాత ఢిల్లీలో ఇంత చోటు దక్కక పోవడం అంటే రాజకీయాల్లో దురదృష్టం కాకుండా మరేమిటి? పెద్దగా కష్టపడకపోయినా ముఖ్యమంత్రి పదవి వళ్లో వచ్చి వాలిపోవడం చంద్రబాబు పాలిట అదృష్టం అయితే పదవి నుంచి దిగిపోయాక ఎంత ప్రయత్నించినా జనాన్ని నమ్మించలేకపోవడం ఆయన పాలిట దురదృష్టం. ఎన్టీఆర్ తరువాత రాజకీయాల్లో అంతటి అదృష్టవంతుడిగా నిలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని అదృష్టం వరిస్తుందా? దురదృష్టం వెంటాడుతుందా? అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే! ఏ చెట్టు లేని చోట అవేవో చెట్లే మహావృక్షాలు అయినట్టు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడన్నీ బోన్‌సాయి చేట్లే ఉన్నప్పుడు జగన్ మహావృక్షంగా నిలిస్తే ఆయన్ని మించిన అదృష్టవంతుడు ఎవరుంటారు?

2 వ్యాఖ్యలు:

  1. తమిళ సార్ కు తెలుగు వందనాలు పేరాలుగా మార్చిన అలానే వస్తోంది. తరువాత పోస్ట్ లలో ఈ సమష్య ఉండదనుకుంటున్నాను

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం