16, మార్చి 2011, బుధవారం

అర్థాలే వేరు

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే - అంటూ వాళ్లను తప్పు పడతారు కానీ ఆడవాళ్లు, మగవాళ్లే కాదు ఎవరి మాటలకైనా అర్థాలు వేరుగానే ఉంటాయి. మాటలకే కాదు చేతలకు సైతం కనిపించే అర్థం ఒకటి తెర వెనుక అర్థం ఒకటి. మగాడి జుట్టు నల్లగా నిగనిగలాడుతోందంటే వయసు మీరిన విషయం బయటపడకుండా తెల్లజుట్టును నల్లగా మార్చేసుకున్నాడని అర్ధం.దీపం ఆరిపోయే ముందు వెలుగులు ఎక్కువగా విరిజిమ్మినట్టుగానే మగాళ్లకు వయసు మీరిపోతున్నప్పుడు కోరికలకు ఎక్కువగా ఉంటాయట! జుట్టు నల్లరంగుతో నిగలాడుతుంటుంది. ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు కనిపిస్తే తొలుత వాటిని కంగారుగా కలుపు మొక్కలను పీకి పారేసినట్టుగా పారేయక తప్పదు. రోజు రోజుకు పెరిగిపోతున్న తెల్ల వాటి మధ్య ఒకటి రెండు నల్లవెంట్రుకలు దర్శనం ఇచ్చే పరిస్థితి వచ్చేస్తుందని భయపడి, నల్లరంగును ఆశ్రయిస్తారు. జుట్టుకు నల్లరంగు వేయడం మొదలు పెట్టిన తరువాత చిత్రంగా ఎవరి జుట్టుపై వారికి సరైన అవగాహన లేకుండా పోతుంది.ప్రపంచ పరిణామాలన్నింటిపై టక టకా చెప్పేసే మేధావులు సైతం నిగనిగలాడే తమ జుట్టులో నల్ల వెంట్రులు, తెల్లవెంట్రుకల నిష్పత్తి ఎంత? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తెల్లముఖం వేస్తారు. కోన్‌కిస్కా సగటు మగాడే తెల్లబారుతున్న జుట్టును కనిపించకుండా నల్లవని నమ్మించేందుకు ప్రయత్నిస్తే ఇక మహా మహానియంతలు అధికారం పోతున్న సమయంలో సైతం గంభీరత నటించకుండా ఉంటారా? అందుకే ఈజిప్ట్‌లో ముబారక్ కావచ్చు, లిబియాలో గఢాఫీ కావచ్చు చివరి రోజుల్లో పవర్‌పుల్ డైలాగులు చెబుతారు. ఇండియాతో పాకిస్తాన్ నాలుగు సార్లు యుద్ధంలో ఓడిపోయింది. 1971 నాటి యుద్ధానికి ముందు భారత్‌తో వెయ్యేళ్ల యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు పాక్ ప్రకటించింది. కానీ చివరకు వెయ్యేళ్ల మాట అటుంచి వారంలోనే పాక్ రెండు ముక్కలు కాక తప్పలేదు. వెయ్యేళ్ల యుద్ధం అనే మాట పాకిస్తానీయులకు తప్పకుండా ఉత్సాహం కలిగించే ఉంటుంది. మొన్న ముబారక్, గఢాపీ సైతం ఇలానే మాట్లాడారు. ప్రజలు తమను విపరీతంగా ప్రేమిస్తున్నారని, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షించుకుంటారని ఈ నియంతలు సగర్వంగా ప్రకటించుకున్నారు. వీరి ప్రకటనలు వెలువడుతున్న సమయంలో లక్షలాది మంది జనం రాజధాని నగరంలో చేరి నియంతలు తప్పుకోవాలని నినాదాలు చేయసాగారు. చివరకు ముబారక్ తప్పుకున్నాడు, నేడో రేపో గఢాపీ వంతు. మొన్నటి హిట్లర్ నుంచి నేడి గఢాపీ వరకు అంతా చివరి రోజుల్లో గెలుపు తమదేనంటూ సగర్వంగా ప్రకటించుకున్నవారే. హిట్లర్ నుంచి వెంకాయపాలెం వార్డ్ మెంబర్‌గా పోటీ చేసే అప్పలయ్య వరకు యుద్ధరంగానికి వెళ్లే ముందు అంతా తమదే గెలుపు అని చెప్పుకోవడం సాధారణ లక్షణం. హిట్లర్ మనం ప్రపంచాన్ని జయించేశాం అని సహచరులకు ధైర్యవచనాలు చెప్పి లోనికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. భారత సైన్యం నిజాం రాజ్యం లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎర్రకోటపై నిజాం జెండాను రెపరెపలాడిస్తానని కాశీం రజ్వీ ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం రజాకార్లను ఉర్రూతలూగించిందట! ఆ స్వరాన్ని విన్నవారు ఏదో జరిగిపోతుందని భయపడ్డారట కూడా. కానీ కొద్ది గంటల్లోనే, ఆ స్వరం ప్రతి యుద్ధంలో ఓటమి ముందు వినిపించేదే అనే తేలిపోయింది. ఎర్రకోటమీద జెండా ఎగురవేస్తామన్న వారు ఏ మాత్రం ప్రతిఘటించకుండానే దాసోహం అనక తప్పలేదు. నాటి యుద్ధాలే కాదు నేటి రాజకీయాల్లో సైతం గెలిచే వారి కన్నా ఓడిపోయే వారి స్వరం మరింత గట్టిగా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న బీహార్‌లో యువరాజు రాహుల్‌గాంధీ, లాలూ హడావుడి చూసిన వారికి వారి డైలాగులు విన్నవారికి చమటలు పట్టాయి. యువరాజా వారు ఏదో అద్భుతం చేసేయనున్నారనుకున్నారు. రబ్రీదేవి వాళ్లయన డైలాగులకు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. తీరా చూస్తే రాహుల్‌గాంధీ అధికారం మాదే అని సొంతంగా పోటీ చేసినా చివరకు రెండు సీట్లతో సరిపెట్టకోవలసి వచ్చింది. సమోసాలో ఆలూ ఉన్నంత వరకు బీహార్‌లో లాలూ ఉంటాడని చెప్పిన లాలూను పక్కన పారేసి , హడావుడి చేయని నితీష్‌కు జనం పట్టం కట్టారు.అక్కడే కాదు ఇక్కడ మనకు చిరంజీవి విషయంలోనూ అలానే జరిగింది. పంచెలూడదీసి పంపిస్తామని ప్రచారం చేసిన అన్నాదమ్ముల్లను జనం పట్టించుకోలేదు. 2004 ఎన్నికల సమయంలో చంద్రబాబు డైలాగులు చిత్రంగా ఉండేవి. ఈ ఎన్నికల తరువాత కాంగ్రెస్ కనిపించదు అని ప్రతి సభలోనూ చెప్పేవారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యం కాబట్టి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది కానీ నా గెలుపు ముందే తేలిపోయింది అని చెప్పుకున్న ఆయనకు ఫలితాలు దిమ్మతిరిగిపోయేట్టు చేశాయి. 2009లో అంత కన్నా ఒక అడుగు ముందుకేసి, 1983 నాటి కన్నా ప్రజల్లో ఎక్కువ స్పందన కనిపిస్తోంది - అని చెప్పారు. 1983 లో ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది. ఆ సమయంలోబాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. అప్పటి కాంగ్రెస్ లాగానే 2009లో తమ పార్టీ ఉందని ఆయన మాటలకు అర్ధం కావచ్చు.ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు ఏదో అన్నట్టు , మూడేళ్లు ఆగండి మూడు దశాబ్దల పాటు అద్భుతమైన పాలన అందిస్తానని జగన్ చెబుతున్నారు. ఆ మూడేళ్లేదో మీరే నిరీక్షించి ఉంటే ఇలా సొంత కుంపటి పెట్టుకోవలసి వచ్చేది కాదు కదా!అనేది కొందరి సలహా. మూడేళ్లు కష్టాలు తప్పవు ఆ తరువాత అంతా సుఖమే అని ఆయనంటే మూడేళ్లు కష్టాలు పడితే ఆ తరువాత వాటికి అలవాటు పడిపోతారు అని ఆయనంటే గిట్టని వారంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇక కాపాడలేను అంటున్నారు, అంటే పడగొడతారనుకోవద్దు ఆయనకంత బలమే కనుక ఉంటే పడగొట్టకుండా ఎలా ఉంటాడు? నాయకులు మాట్లాడిన మాటలకు డిక్షనరీలో అర్ధాలు వెతికితే అసలు విషయం అస్సలు బోధపడదు. వారి మాటలకు సరిగ్గా వ్యతిరేకమైన అర్ధం తీసుకుంటే కొంతలో కొంత అర్ధమయ్యే అవకాశం ఉంది.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం