30, మార్చి 2011, బుధవారం

సమరోత్సాహం

చరిత్ర అంటే రాజులు, రాణుల శృంగారం కాదని చరిత్రను తవ్విచూసిన మహాకవులు ఎప్పుడో చెప్పారు. పూర్వం రాజుల చరిత్ర అంటే వారి సమరోత్సాహాన్ని ప్రదర్శించేదే కదా! ఏ రాజు వీరోచిత కథను చూసినా రాజుగారి వీరోచిత కార్యానికి పొరుగు రాజు మురిసిపోయి తన కూతురును ఇచ్చి పెళ్లి చేశాడు అనే వాఖ్యతో రాజుగారి వీరోచిత అంకం ముగిసేది.

ఆ రాజుగారి కథ ఎన్ని అంకాల్లో ఉంటే ఆయనగారికి అన్ని పెళ్లిళ్లు జరిగేవి. అంతెందుకు చివరకు శ్రీకృష్ణడి నీలాపనిందల కథలో జాంబవంతుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించి ఆయన కూతురును పెళ్లి చేసుకోవడంతోనే ముగుస్తుంది కదా! అనగనగా ఒక రాజు కథ ముగింపు ఎప్పుడూ రాజుగారి కొత్త పెళ్లితోనే ముగుస్తుంది. పాపం అనే్నసి పెళ్లిళ్లతో ఆ రాజుగారి కుటుంబ పాలన ఎలా ఉండేదో కానీ కథలో మాత్రం ప్రజలను కన్నబిడ్డల్లా పాలించారని ఉంటుంది. ఆ కాలంలో ముసలి రాజు కూడా అంత ఉత్సాహంగా ఉండడానికి కారణం బహుశా ప్రతి విజయంతో ఒక కొత్త పెళ్లి కూతురు లభించడమే కావచ్చు.

రాజుగారికి అనే్నసి పెళ్లిళ్లు మంచి సంప్రదాయమా? కాదా? అంటే చరిత్రలో దీనిపై చర్చ జరిగినట్టు ఎక్కడా కనిపించదు. యుద్ధలు చేయడం వీరోచిత కార్యమని కొందరు, బౌద్ధం వ్యాపించిన తరువాత యుద్ధాలు తప్పు అనే బలమైన వాదన వినిపించింది కానీ విజయం సాధించినప్పుడల్లా రాజుగారు పెళ్లి చేసుకోవడంతో యుద్ధానికి శుభం కార్డు పడే సంప్రదాయం గురించి చర్చ కనిపించదు. పట్టపురాణి కుమారుడిని యువరాజుగా ప్రకటించాలా? లేక కోరిపెళ్లి చేసుకున్న చిన్నరాణి కుమారున్ని యువరాజుగా ప్రకటించాలా? అనే చర్చ చరిత్రలో, ఇతిహాసాల్లో కనిపిస్తుంది కానీ ఒకటికి మించిన పెళ్లిళ్లు అవసరమా? తప్పా కాదా? అనే చర్చ మాత్రం కనిపించదు.

రాముడు వనవాసానికి వెళ్లడం మొత్తం రామాయణమంతా ఎవరి బిడ్డను యువరాజుగా ప్రకటించాలనే వివాదంపైనే కదా! చివరకు మహాభారత యుద్ధమంతా అదే కదా! వారసత్వం కోసం అంతగా పట్టుపట్టిన వాళ్లు ఒకరికి మించి సంబంధాలు వద్దనేదానిపై ఎందుకు మాట్లాడలేదో? లేక మాట్లాడినా చరిత్ర కెక్కలేదా? మన రాజులు అంతటి వృద్ధాప్యంలో సైతం యుద్ధాలు చేసేందుకు అంత ఉత్సాహంగా ఉండడానికి కారణం ఏమిటో? బహుశా యుద్ధంలో విజయం సాధిస్తే అమ్మాయితో పెళ్లి కానుక వారిలో ఆ ఉత్సాహానికి కారణమేమో!
శృంగారం కలిగించినంత ఉత్సాహం మరేదీ కలిగించదని అందుకే కొందరు రాజులు యుద్ధాన్ని, శృంగారాన్ని రెండు కళ్లలా భావించారని చరిత్ర చెబుతోంది. వృద్ధాప్యంలో ఉత్సాహానికి శృంగారం కీలక పాత్ర వహించింది. పూర్వమంటే రాజులు యుద్ధాలు చేసి రాజ్యాన్ని, రాజకన్యను బహుమతిగా పొంది మరింత ఉత్సాహంతో మరో యుద్ధానికి సన్నద్ధం అయ్యేవారు. యుద్ధంలో గెలిస్తేనే రాజ్యం లభిస్తుంది, శృంగారంలో మాత్రం గెలిచినా, ఓడినా సంతోషం లభిస్తుంది అందుకే విజయం తరువాత లభించే శృంగారానికి రాజులు పెద్ద పీట వేసేవారట! మరిప్పుడు రాజ్యాలు లేవు, విజయం సాధించగానే కొత్త పెళ్లితో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం లేదు. అయినా వయసు మీరినా ఉత్సాహం తొణికిసలాడాలంటే? ఏం చేయాలి. సినీతారల చర్మ సౌందర్య రహస్యం లక్స్ అని అందరికీ తెలిసిపోయింది. కానీ వృద్ధ నాయకుల ఉత్సాహా రసహ్యం ఏమిటి? అందరికీ ఒకటే కారణం కానవసరం లేదు. తివారీకి ఉత్సాహం కలిగించిన అంశం మరోనేతకు కలిగించకపోవచ్చు. 86 ఏళ్ల వయసులో తనకంటూ సొంత శృంగార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని రారాజులా వెలిగిపోయిన తివారీకి పెద్ద వయసులో రావలసిన కష్టం కాదిది. రాజరికపు జిత్తులతో రణరంగపుటెత్తులతో సతమతవౌ మా మదిలో మదనుడు సందడి చేయుట చిత్రం భళారే విచిత్రం అని ఎన్టీఆర్ గారి దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధనుడు తన భార్య భానుమతితో నృత్యం చేస్తూ శృంగారంలో మునిగిపోయి తనకు తానే ఆశ్చర్యపోయినట్టుగానే ఎన్‌డి తివారీ సైతం తన వీరత్వానికి తానే ముచ్చటపడ్డారు. తెలంగాణ, సమైక్య ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడికి పోతుంటే 86 ఏళ్ల వయసులో తాను శృంగారంలో రగిలిపోవడం ఏమిటని తివారీ బోలెడు ఆశ్చర్యపోయారు.

ఇంత లేటు వయసులో అంత ఘాటు శృంగారం నడిపినందుకు అభినందించాల్సింది పోయి ఈ వయసులో నన్ను ఇబ్బంది పెడతారా? అని తివారి బోలెడు అసంతృప్తి చెందుతున్నారు. ఇటీవల హిందీ చానల్స్‌లో తివారి శృంగార నృత్యాలను ప్రసారం చేస్తున్నారు. ఉత్తరఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తివారీ శృంగార వ్యవహారాలను ఆధారం చేసుకుని రూపకాలను హిందీ చానల్స్‌లో ప్రసారం చేస్తున్నారు.

తివారీ వేణువు వాయిస్తుంటే గోపికలు చుట్టూ చేరి నృత్యం చేస్తున్న అల్బమ్‌లు ఉత్తరాదిలో ఊపేస్తున్నాయి. హిందీ చానల్స్ అన్నింటిలో వీటిని ప్రసారం చేస్తున్నారు. వాటిని చూస్తూ తివారీ ముసిముసి నవ్వులు నవ్వుకోవడం మినహా ఏమీ కోపగించుకోవడం లేదనేది ఉత్తరఖండ్ పత్రికల కథనం. వయసులో ఉండగానే నేను చాలా అందగాన్ని, నా గురించి మాట్లాడేప్పుడు ఆ విషయం గుర్తు పెట్టుకోండి అని చెప్పారు. తాను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని, తానింకా క్రియాశీలక రాజకీయాల్లోనే ఉంటానన్నారు. తమతమ రంగాల్లో నిరంతరం విశేషంగా కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారికి హఠాత్తుగా మధ్యవయసులో ఇలాంటి చిలిపి పనులు చేయాలనిపిస్తుందట!

మన రాష్ట్రంలో సైతం కొంత మంది తమ తమ రంగాల్లో సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్న వారు రిటైర్‌మెంట్ వయసులో పాతికేళ్ల అమ్మాయిలను పెళ్లి చేసుకున్న సందర్భాలుఉన్నాయి. 60 ఏళ్ల వయసులో సినిమా రంగంలో రిటైర్ అయి రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి పదవి చేపట్టి, 73ఏళ్ల వయసులో ఎన్‌టి రామారావు మళ్లీ పెళ్లి చేసుకున్నారు కదా! సమరోత్సాహానికి నాయకులకు ఇది తప్పదేమో!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం