23, మార్చి 2011, బుధవారం
వీకీలిక్స్ లో తెలంగాణా
గౌరవనీయులు వికీలిక్స్ ప్రధాన సంపాదకుడు జూలియన్ అసాన్జ్‌కు ....
బాగున్నారా? ఏదో మర్యాద కోసం అడుగుతున్నాను కానీ మీరు కచ్చితంగా బాగుండే ఉంటారు. మీరు బాగుండక పోతే ఇన్ని దేశాలను ఎలా వణికిస్తారు. మీకు తెలుగు వస్తుందా? అనే సందేహం నాకేమాత్రం లేదు. మీకు తెలియని విషయం లేదు, మీకు రాని భాష లేదు. కాబట్టి ఈ ఉత్తరాన్ని మీరు పూర్తిగా చదువుతారని నాకు గట్టినమ్మకం.
ప్రపంచంలో వందల దేశాలున్నాయి, వాటికి వేలాది భాషలున్నాయి. వేలాది భాషల్లో కోట్లాది ఫైళ్లు ఉన్నాయి. ఆ ఫైళ్లలో కోట్ల కోట్ల కాగితాలు, వాటిలో లెక్కలేనని రహస్యాలున్నాయి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మా దేశంలో మంత్రివర్గంలో ఎవరుండాలో అమెరికా నిర్ణయిస్తుందని మీరు రహస్యాన్ని బయటపెట్టడం మాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది.
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది పచ్చి వాస్తవం. ఐతే అందరికీ తెలిసిన ఈ చిన్న విషయాన్ని అదేదో పెద్ద రహస్యం అన్నట్టుగా చెబితే నవ్వులాటగా ఉంటుంది అలానే మా దేశ మంత్రివర్గాన్ని అమెరికా నిర్ణయిస్తుందన్న విషయం మీకు కొత్తగా ఉందేమో కానీ మాకు ఎప్పుడో తెలుసు.మరి మా వాళ్లు ఈ వార్తపై మా వాళ్లు అంతగా ఆశ్చర్యపోయారెందుకనుకుంటున్నావా? మా కందరికీ ఎప్పుడో తెలిసిన విషయం వీకీలిక్స్‌కు ఇప్పుడు తెలిసిందా? అని ఆశ్చర్యపోయారు. సరే రహస్యం అనేది అంటు రోగం లాంటిది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అందుకే మాకు అన్ని దేశాల నుంచి రహస్య సమాచారం అందుతుందని మీరు చెప్పారు.
మీ మాటను మన్నించి మా దేశం గురించి నీకో రహస్యం చెప్పాలనిపించింది. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం అన్నట్టు మీ నుంచి కొన్ని రహస్యాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకో రహస్యం చెప్పడం ధర్మం అనుకున్నాను. ఆర్థిక మంత్రిగా ఎవరుండాలో, మన్‌మోహన్ తరువాత ప్రధానిగా ఎవరుండాలో అమెరికా నిర్ణయించడం మీకు ఆశ్చర్యం కలిగించింది కదూ! మా అందరికీ తెలిసింది మీకు బోలెడు ఆశ్చర్యం కలిగించేది మరో విషయం చెప్పనా?
మా మంత్రివర్గాన్ని అమెరికా ఖరారు చేయడం కాదు ఏకంగా మా దేశాన్ని అమెరికా పాలిస్తానని ముందుకు వస్తే దేశంలో మెజారిటీ జనం ఎగిరి గంతేస్తారు.ఒక్క మా ఆంధ్ర రాష్ట్రం సంగతే చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలా? వద్దా అంటే ఏర్పాటు చేయాల్సిందే అని రాష్ట్రం సగం మంది అరిస్తే, ఏర్పాటు చేస్తే సహించేది లేదని మరో సగం మంది అరుస్తారు. తెలంగాణ, సీమాంధ్ర పేరుతో ఏ విషయంపైనైనా సగం మంది అటు సగం మంది ఇటు ఉంటారు. మరి అమెరికా పాలనకు ఒప్పుకుంటారా? అంటే రెండు వైపులా జనం ఒప్పుకుంటారు, జనం ఒప్పుకోరు....మీకో రహస్యం చెప్పాను కదా! మరిక మాక్కావలసిన రహస్యం మీరు చెప్పాలి.
మా దేశంలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు మీకు మాత్రం కచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. దాని కోసమే మీకీ ఉత్తరం రాస్తున్నాను.
ఇంతకూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారా? లేదా? జూన్‌లో తెలంగాణ వస్తుందా? అని ఇదే ప్రశ్న కెసిఆర్‌ను అడిగితే మేలో వస్తే నీకేమైనా అభ్యంతరమా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సరే ఇక బాబు కళ్లలో సూటిగా చూస్తూ మీకు ఢిల్లీలో చక్రం తిప్పిన అనుభవం ఉంది కదా! ఇంతకూ తెలంగాణ వస్తుందంటారా? లేదా? అని అడుగుదామంటే ప్రశ్న తరువాత ముందు ఆయన కళ్లు ఒకటి ఒకవైపు మరోటి మరోవైపు చూస్తోంది. రెండు కళ్లు ఒకవైపు చూస్తే అడుగుదామనుకుంటే దానికాయన ససేమిరా అంటున్నారు.
ఫెస్ రీడింగ్‌ను బట్టి తెలుసుకుందామనుకుని ఆయన ముఖాన్ని పరీక్షగా చూస్తే తెలంగాణ వస్తుందేమోననే భయం కనిపిస్తోంది, రావద్దనే కోరిక కనిపిస్తోంది, ఏమవుతుందో? అనే ఆందోళన నాట్యమాడుతోంది. సరే వీరంతా ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు వీళ్లకేం అర్ధమవుతుంది అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి తెలుస్తుందిలే అనుకుంటే నేనెరుగ నేనెరుగ మా అమ్మనడుగు అంటూ ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న పాట పాడుతున్నాడు.
తెలంగాణ సంగతి తరువాత ముందు నన్ను ప్రజలు హైదరాబాదీ అనుకుంటున్నారా? సీమ వాసి అనుకుంటున్నారా? అని ఎదురు ప్రశ్నించారు. జనం సంగతి తరువాత ముందు మిమ్ములను మీరు సిఎంను అనుకుంటున్నారా? స్పీకర్‌ను అనుకుంటున్నారా? తేల్చుకోండి అని ప్రశ్నకు ప్రశ్నను సమాధానంగా చెప్పి బయటపడ్డాం.
బాబు ముఖకవళికలు చదవడం కష్టం కానీ చిదంబరం మాటలను అర్ధం చేసుకోవడం అంత కన్నా కష్టం. ఆయన్ని దూరం నుంచి చూస్తే తెలంగాణ ఏర్పాటు కోసం చక చకా ఏర్పాట్లు చేస్తున్నట్టు కనిపిస్తారు. దగ్గరి నుంచి చూస్తే సమైక్యాంధ్ర పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక ప్రణబ్ ముఖర్జీ బెంగాలీ యాస మీ అమెరికా వారికే అర్ధం కాకపోతే మాకే మర్ధమవుతుంది. తెలంగాణ గురించి సోనియాగాంధీ ఏమనుకుంటున్నారో కోర్ కమిటీ సభ్యులకు సైతం తెలియదనే విషయం మాకు బాగా తెలుసు.
సోనియాగాంధీ తెలంగాణపై ఏ మనుకుంటున్నారో? అమెరికా అభిప్రాయం ఏమిటో కాస్త మీరే బయటపెట్టండి.వికీలిక్స్‌లోని సమాచారం వాస్తవమైంది కాదని నమ్మవద్దని మా ప్రధాని చెప్పడం మీకు బాధకలిగించినట్టుగా ఉంది, మా ప్రధాని చెప్పినదంతా అబద్ధమనే పూర్తి నమ్మకం మాకుంది. మా దేశంలో అసలేం జరుగుతుందో మీరే చెప్పి మా కళ్లు తెరిపించండి. మా ప్రధాని సోనియా చేతిలో రిమోట్ అని అంతా అనుకున్నారు. మన్‌మోహన్ సోనియా కు రిమోట్ అయితే మొత్తం దేశాన్ని అమెరికా తన రిమోట్‌తో నడిపిస్తుందని ప్రపంచ కళ్లు తెరిపించారు. ఔను ఇప్పుడు మేం విశ్వమానవులం!అభినందనలతో ......
మీ అభిమాని..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం