26, మార్చి 2011, శనివారం

త్యాగమే రాజకీయం

జీవితంలో విలువలను త్యాగం చేస్తే కానీ విలువలపై ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి చేరుకోలేమని విలువలపై బోధనలు సాగించే కొందరి జీవితాలు చెప్పకనే చెబుతాయి. సాధారణంగా రాజకీయ నాయకులు తమ త్యాగాల గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు కానీ నిజానికి మనిషి జీవితమే త్యాగమయం కదా? చదువుకునే వయసులో ఎన్నో ఆశయాలుంటాయి.
కాలేజీ నుంచి విశాలమైన వాస్తవిక జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత బతుకుపోరుసాగించాలంటే అప్పటి వరకు అనుకున్న ఆశయాలను త్యాగం చేయాల్సిందే కదా? ఉద్యోగంలో చేరాక అప్పటి వరకు అవినీతికి దూరంగా ఉండాలనే లక్ష్యాన్ని త్యాగం చేయకపోతే బతుకు తారా? మీరు చాలా అందంగా ఉన్నారండీ అంటూ తొలిసారి కామెంట్ వినిపించినప్పడు బుగ్గలు సొట్టలు పడి ఆ అమ్మాయి మరింత అందంగా మారుతుంది. తన అందానికి ఇంట్లోని చిన్న అద్దం సరిపోదని పెద్ద తెరపై కనిపించి అందరిని ఆనందంలో ముంచెత్తాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటుంది. లక్స్ సబ్బును నిజంగానే సినీతారలు వాడతారని, తానూ వాడితే సినీ తార అంత అందంగా కనిపిస్తానని గట్టిగా నమ్మి ఫిల్మ్‌నగర్ బాట పడుతుంది.
ఛీ లక్ష్మీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నీవు లేనిదే నా ఊపిరి లేదనుకున్నాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను . నువ్వు అనుమానించిన తరువాత ఈ బతుకు వృధా ట్యాంక్‌బండ్‌లోనూ, కిందో పడి చచ్చిపోతాను నా బతుక్కు అర్ధం లేదు అని నాగ్ చెప్పగానే కరిగిపోయిన లక్ష్మి ....నీమీద అనుమానం కాదు నాగ్ ఈ సమాజం అంటే భయం. నలుగురు ఏమంటారో అనే భయం తప్ప నీమీద నాకెప్పుడూ అనుమానం లేదు. నిన్ను అనుమానించడం అంటే నన్నునేను అనుమానించుకున్నట్టే అని టీవి సీరియళ్లను ఎక్కువగా ఫాలో అయ్యే లక్ష్మీ అంతే హృద్యంగా పలికింది.
నిజంగా నేనంటే నీకంత అభిమానమా లక్ష్మీ అంటూ భుజం మీద చేయి వేసి నాగ్ తన కౌగిలిలో బంధించాడు. కరిగిపోయిన లక్ష్మీ ఇంత కాలం తాను ప్రాణం కన్నా మిన్నగా అనుకున్నవన్నీ త్యాగం చేశానని గ్రహించే లోపు ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయింది. ఆ తరువాత నాగ్ ఏమయ్యాడో చెప్పడం అవసరమా? పెళ్లికి ముందు మనిద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు, పెళ్లి చేసుకున్నా ఎక్కువ కాలం కలిసుంటామనిపించడం లేదు అందుకే నీకు నచ్చిన వాన్ని నువ్వు చేసుకో నాకు తగిన అమ్మాయిని నేను చేసుకుంటాను, మనిద్దరం ఒకరికొకరు అస్సలు తగిన వారం కాదని నాగ్ లక్ష్మికి తేల్చి చెప్పాడు. మరి నా త్యాగం అని ఏడుపు ముఖం పెడితే పిచ్చి లక్ష్మి త్యాగం ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు అంటూ ఈటీవిలో అర్ధరాత్రి చూసిన పాత సినిమాలో హరనాథ్ డైలాగును అప్పచెప్పి, వెనక్కి చూడకుండా ముందడుగు వేశాడు. నేను డబ్బును, సమయాన్ని త్యాగం చేశాను, నువ్వు సర్వం త్యాగం చేశావు అని కొత్త సినిమాలో డైలాగు చెప్పాలని ముందు అనుకున్నా పాత సినిమా డైలాగు నచ్చి అదే చెప్పాడు.జీవితమంతా త్యాగాల మయమే. త్యాగాలు లేకపోతే జీవితమే లేదు.
పేరులోనే త్యాగాన్ని చేర్చుకున్న త్యాగయ్య తన జీవితాన్ని ఆ దేవునికే త్యాగం చేశారు. చాలా మంది నాయకులు రౌడీ జీవితాన్ని త్యాగం చేసి ప్రజా జీవితంలో అడుగుపెడడారు. అధికార వికేంద్రీకరణకు రౌడీలను మించిన ఉదాహరణ ఏముంటుంది. ఒక్కో వీధిని ఒక్కో రౌడీ పంచుకుని ప్రజల సమస్యలు పరిష్కరిస్తుంటారు. నిజమైన అధికారాన్ని అనుభవించే ఆ జీవితాన్ని త్యాగం చేసి ఐదేళ్లకోసారి ఓటు కోసం జనం కాళ్లావేళ్లా పడడం చూస్తుంటే వారి త్యాగాలకు సరైన గుర్తింపు లేదేమోననిపిస్తోంది. రాష్ట్రంలో పేరుమోసిన ఫ్యాక్షన్ నాయకునిపై ఒక చానల్ మహోన్నత మానవతావాది అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. సిగ్గు అనేపదాన్ని త్యాగం చేస్తే తప్ప ఇంత గొప్ప కార్యక్రమాన్ని రూపొందించలేరు. సిగ్గు, బిడియం అనేవి మనిషి ఎదుగుదలను అడ్డుకుంటాయని మనస్తత్వ నిపుణలు చెబుతూనే ఉంటారు. ఇది అక్షర సత్యం సిగ్గు, లజ్జవంటివాటిని త్యాగం చేయలేకనే చాలా మంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు తమ జీవితాలు గడుపుతుంటారు. వీటిని త్యాగం చేసిన వారు చక్కని విజన్‌తో జీవితంలో ఎంతో ముందుకు వెళతారు. బంధుప్రేమను త్యాగం చేయలేక ఎన్టీఆర్ దెబ్బతింటే బంధుప్రేమను త్యాగం చేయడం ద్వారానే బాబుకు అధికారం దక్కింది. ఎన్టీఆర్ ఆత్మాభిమానం వదిలేస్తే మరింత కాలం ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు ప్రధానమంత్రి పదవి సైతం చేపట్టేవారు. అధికారం నుంచి దించిన బంధుగణం , రెండోపెళ్లిని తప్పు పట్టింది. సరే మీరు చెప్పినట్టే నడుచుకుంటాను అని ఆయన అని ఉంటే రాష్ట్ర రాజకీయ చరిత్ర మరో విధంగా ఉండేది. కానీ ఆయన మాత్రం ఎందుకో కానీ పదవీ త్యాగానికి సిద్ధపడ్డారు కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టలేదు. పురాణాల్లో దుర్యోధునుడు సైతం చివరి వరకు ఆత్మాభిమానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడలేదు.కాశీకి వెళ్లిన వారు తమకు ఇష్టమైనదేదో ఒకటి వదిలిపెట్టాలంటారు.
కానీ చిత్రంగా మన నాయకులు కాశీకి వెళ్లకపోయినా , ఇచ్చిన మాటలను త్యాగం చేసేస్తుంటారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను అమలు చేయకపోవడం అనే మాటకు నాయకులంతా కట్టుబడి ఉంటారు.
వాగ్దానాలను త్యాగం చేయడంలో మన నేతలను మించిన వారు లేరు.
తెలంగాణపై రాజకీయ పార్టీలన్నీ తమ హామీలను త్యాగం చేసి దేశంలోనే రాష్ట్రం పరువు తీశారని అంతా తిడుతున్నారు కానీ మాటకు కట్టుబడి ఉండకపోవడం అనే విధానానికి కట్టుబడి ఉన్నారని ఎందుకు అభినందించరు. నాయకుల త్యాగాలకు సరైన గుర్తింపు లేకుండాపోతోంది పాపం.....
25.1.2011

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం