13, మార్చి 2011, ఆదివారం

మీడియా విలువలు

!
- బుద్దామురళి
రాష్ట్రంలో ప్రచార మాధ్యమాల- మీడియా-పాత్రపై ఇప్పుడు విస్తృతంగా చర్చ సాగుతోంది. రాజకీయ నాయకులు సైతం మీడియా పక్షపాత దోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా మీడియాలో ఇప్పుడు పక్షపాతం పెరిగిందా? నాయకులు ఆవేదన చెందుతున్నట్టుగా మీడియాలో విలువలు పడిపోయాయా? . అందరి కన్నా ఆశ్చర్యకరమైన ప్రకటన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నుంచి వినిపించింది. మీడియా విలువలు పడిపోతున్నాయని ఆయన విమర్శించారు. విలువలు పడిపోతున్నాయనే వాదనలో కొత్తేమీ లేదు కానీ చివరకు ఆయన సైతం ఆ ఆమాట అనడమే అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైన విషయం.విలువలు పడిపోతున్నాయనడానికి ఆయన చూపిన ఉదాహరణ ఏమిటంటే, తాను రైతుల కోసం యాత్ర జరిపితే చానల్స్‌లో మూడు నిమిషాలు చూపించారట! అదే యువనేత జగన్ వార్తలను గంటల తరబడి చూపారట! వార్తలన్నీ ప్యాకేజీల మయంగా మారాయని విలువలుపడిపోయాయనేది ఆయన ఆరోపణ.
తెలుగు చానల్స్‌లో ఏది వార్తో, ఏది ప్యాకేజీనో గుర్తు పట్టడానికి వీలులేనంతగా కలిసిపోయాయి. కిరణ్ చాణక్యం అంటూ ఒక చానల్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అపర చాణక్యుడని రచ్చబండ ద్వారా జనంలోకి దూసుకెళ్లాడని, రచ్చబండ ద్వారా తెలంగాణ వాదానికి సైతం ఎదురొడ్డి నిలిచారని గంటపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసిందో చానల్. పాపం ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి తరువాత ఏకైక భారీ పాజిటివ్ వార్త ఇది. అయితే ఇది నిజంగా భారీ పాజిటివ్ వార్తనో, భారీ ప్యాకేజీనో తెలియకుండా సాగిందా వార్త.విలువలు పడిపోయాయన్న చంద్రబాబు ఆవేదన విషయానికి వస్తే ఆయన ఉద్దేశంలో విలువలు పడిపోవడం అంటే ఏమిటో ఆలోచించాలి.
ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ఓ మీడియా ఓనరే తెర వెనుక నుంచి పాలిస్తున్నట్టుగా ఉండేది. కొత్త చానళ్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఆహ్వానించారు. తీరా ఈయన అక్కడికి వెళ్లాక ఆ మీడియా బాస్ తమ చానళ్లను తామే ప్రారంభించుకోగా బాబు మాత్రం ప్రేక్షకునిగా ఉండిపోయారు. ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రేక్షకునిగా ఉండిపోయిన చరిత్ర బాబుకు మాత్రమే దక్కింది. బాబు అధికారంలో ఉన్నంత కాలం ఆ మీడియా బాస్‌దే పెత్తనం. మీడియా సహకారం కావాలంటే బాబు జమానాలో అంతగా అణకువను ప్రదర్శించాల్సి వచ్చేది. ఆ మీడియా బాస్ ఎలాంటి పనులు కావాలన్నా చేయాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు చాలా చౌకగా గంటల తరబడి నాయకుల కార్యక్రమాలను చూపించే ప్రత్యేక ప్యాకేజీల కాలం వచ్చింది. జగన్ ఓదార్పు యాత్ర కావచ్చు, బాబు రైతుల కోసం కావచ్చు ప్యాకేజీలను బట్టి చానల్స్‌లో గంటల తరబడి చూపిస్తారు. చాలా స్వల్పమొత్తం చెల్లిస్తే చాలు. అదే బాబు కాలంలో విలువలు చాలా ఖరీదుగా ఉండేది, ప్యాకేజీలు
ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభించాయి. బాబు విలువలు పడిపోయాయన్నది బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకుని కాబోలు.... మీడియా ద్వారానే అధికారంలోకి వచ్చి మీడియా ద్వారానే ప్రపంచ ప్రఖ్యాత నాయకునిగా ప్రచారం పొంది, మీడియానే ఊపిరిగా బతికిన చంద్రబాబు మీడియా విలువలు పడిపోతున్నాయని ఆవేదన చెందడం ఆశ్చర్యకరమైన విషయం.
ప్రొఫెసర్ హరగోపాల్ గతంలో పలు సందర్భాల్లో మీడియాకు సంబంధించి ఒక ఉదాహరణ చెప్పేవారు. 2004లో గుజరాత్‌లో నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఒకేసారి ఎన్నికలను ఎదుర్కొన్నారు. ప్రపంచంలోని మీడియా మొత్తం మోడీని వ్యతిరేకించింది, అదే సమయంలో బాబును పొగడ్తలతో ముంచెత్తింది. కానీ ఎన్నికల్లో బాబును జనం తిరస్కరించగా, మోడీకి పట్టం కట్టారు.రాష్ట్రంలో మీడియాకు గతంలో విలువలు గొప్పగా ఉండేవి ఇప్పుడే విలువలు పడిపోతున్నాయనుకుంటే అమాయకత్వాన్ని నటించడమే అవుతుంది. హఠాత్తుగా విలువలేమీ పడిపోవడం లేదు. గతంలో బలమైన మీడియా టిడిపికి అండగా ఉండేది. టిడిపి ఆవిర్భాంలో మీడియానే కీలక పాత్ర వహిచింది. చివరకు తొలిసారి అభ్యర్థులను ఎంపిక చేసింది సైతం మీడియానే.
ఎన్టీఆర్‌ను తప్పించి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడంలో మీడియా తన వంతు పాత్ర పోషించింది. 1982లో టిడిపి ఆవిర్భావంలో మీడియా కీలక పాత్ర పోషించినా అప్పుడు మీడియా పెద్దగా విమర్శల పాలు కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉండడం, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తుండడం, ఎలాంటి మచ్చలేని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ 1995లో ఎన్టీఆర్‌ను తప్పించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడంలో మీడియా కీలక పాత్ర వహించినప్పటి నుంచి మీడియాపై విమర్శలు పెరిగాయి. ఆ తరువాత మీడియాలో పోటీ పెరిగింది. టిడిపి అనుకూల మీడియానే కాకుండా అంతకన్నా శక్తివంతంగా వ్యతిరేక మీడియా సైతం ఆవిర్భవించింది. చానళ్ల సంఖ్య బాగా పెరిగింది. ఒక్కో చానల్‌కు ఒక్కో పార్టీతో అనుబంధం ఏర్పడింది. రాజకీయ పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు, ఒకరి గోతులు ఒకరు తవ్వుకున్నట్టుగా ఇప్పుడు ఆయా పార్టీల మీడియా తమతమ పార్టీలకు అనుకూలంగా ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారానికి తెరలేపింది.
మరే ప్రాంతీయ భాషలోనూ లేనన్ని వార్తా చానళ్లు తెలుగులో ఉన్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలకే కాదు చివరకు ఉప ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్‌ఎస్, హైదరాబాద్‌లోని పాత నగరానికి మాత్రమే పరిమితం అయిన ఎంఐఎం లాంటి పార్టీలకు సైతం సొంత మీడియా ఏర్పడింది. టిడిపి, జగన్ వంటి వారు తమ సొంత చానళ్లనే కాకుండా తమకు అండగా నిలిచే చానళ్లను సైతం కలిగి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలంటే ఎలక్షన్ కమీషన్‌కు దరఖాస్తు చేయడానికన్నా ముందు సొంత చానల్‌ను ఏర్పాటు చేసుకోకతప్పని పరిస్థితి. అలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల చిరంజీవి రాజకీయాల్లో బోర్లాపడ్డారు. మీడియా విషయంలో చిరంజీవి విఫలమైన చోటే జగన్ విజయం సాధించారు. ఒకవేళ జగన్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకుని ఉండక పోతే టిడిపి మీడియా దెబ్బకు చిరంజీవి కన్నా ఘోరంగా దెబ్బతిని ఉండేవారు. సొంత మీడియా లేకపోవడం వల్లనే తాము ఎన్నికల సమయంలో ఘోరంగా దెబ్బతిన్నామని, తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి సమాధానం చెప్పలేకపోయామని ఆవేదన చెందిన చిరంజీవి ఇప్పుడు సొంత వార్తా చానల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మీడియాలో ఏకస్వామ్యం సాగినప్పుడు దాని నుంచి పూర్తిగా ప్రయోజనం పొందిన టిడిపికి ఇప్పుడు విస్తరించిన మీడియా తలనొప్పిగా మారింది. అనుకూల మీడియా ద్వారా ప్రత్యర్థులను చావుదెబ్బతీసిన చంద్రబాబుకు ఇప్పుడు ప్రత్యర్థులకు సైతం మీడియా బలం సమకూరడం ఇబ్బంది మారింది. అందుకే ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ఇప్పుడు మీడియాలో విలువలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కోరుకునేది నిష్పక్షపాతమైన మీడియా కాదు. తన పక్షం మాత్రమే వహించే మీడియాను.
తెలుగునాట మీడియాకు తమిళనాడులోని మీడియ తేడా ఉంది. ఆ రాష్ట్రంలో ఆయా పార్టీల ఎన్నికల గుర్తు, చానల్ లోగో ఒకటే. జయలలిత జయ చానల్ లోగో రెండాకులు, ఆమె పార్టీ ఎఐఎడిఎంకే గుర్తు సైతం అదే. ఏ చానల్ ఏ పార్టీదో జనం సులభంగానే గ్రహిస్తున్నారు. దీంతో నాయకులు మరింత తెలివిగా వ్యవహరిస్తూ సొంతంగా తామే చానల్‌ను నిర్వహించడంతో పాటు మరి కొన్ని చానల్స్‌లో పెద్ద మొత్తంలో వాటాలు కలిగి ఉండడం ద్వారా ఆ చానల్స్‌ను తామే తెరవెనుక నుంచి నడిపిస్తున్నారు. మీడియా ప్రచారంలో జగన్ ఇలాంటి ఎత్తుగడలతో చంద్రబాబు కన్నా ఒకడుగు ముందేశారు. ఆయన నిర్వహించిన ఓదార్పు యాత్ర సమయంలో ఈ ఎత్తుగడతోనే పలు చానల్స్‌లో గంటల తరబడి ఆయన కార్యక్రమాన్ని చూపించారు. ఒక చానల్‌లో వచ్చేది నమ్మాలంటే కష్టం అదే నాలుగైదు చానల్స్‌లో వస్తే నిజమేనేమో అనిపిస్తుంది. బాబుకు తట్టని ఆలోచన ఇది.48 గంటల తెలంగాణ బంద్‌లో భాగంగా సీమాంధ్ర చానళ్ల ప్రసారాలను రెండురోజుల పాటు నిలిపివేస్తున్నట్టు తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంఘాలు ప్రకటించాయి. ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా, మరో ప్రాంతానికి అనుకూలంగా సీమాంధ్ర చానళ్లు వ్యవహరిస్తున్నాయని అందుకే వీటిని బహిష్కరిస్తున్నట్టు వాళ్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలుగు చానళ్ల సంఘం చేసిన విజ్ఞప్తికి వారు స్పందిస్తూ చానళ్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయా? లేదా?అనే అంశంపై వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో చర్చ ఏర్పాటు చేయాలని కోరారు. మీడియా పక్షపాతవైఖరిని జర్నలిస్టుల సంఘాలు సైతం కాదనలేని పరిస్థితి ఇది. (ఆంధ్రభూమి ఆర్టికల్ )

4 వ్యాఖ్యలు:

 1. ప్రస్తుతం డబ్బున్నవాళ్ళు పెట్టుబడి పెట్టి తమ రాజకీయ లబ్ధి కోసం పేపర్లు, టి వి చానెళ్ళు నడుపుకుంటూ దానిని "మీడియా" అని పిలుచుకుంటూ వ్యాపార ప్రకటనలు, ప్రభుత్వ ప్రకటనలు వేసుకుని డబ్బు దండుకుంటూ, తమ తమ రాజకీయ లబ్ధి కూడా పొందుతున్నారు. ఇప్పుడున్న ప్రింటు/ఎలక్‌ట్రానిక్ మీడియాగా పిలవబడుతున్నవి మీడియానే కాదు.

  జర్నలిస్టులు అందరూ కలిసి (అలా ఎవరన్నా ఇంకా మిగిలి ఉంటే) సహకార పధ్ధతిన వార్తా పత్రికలు, టి వి చానేళ్ళు తీసుకు రాగలిగితే, అందులో సామాన్య ప్రజలు పెట్టుబడి పెట్టి (ఆ పెట్టుబడి ఒక్కో కుటుంబానికి పదివేలు మించకుండా) తేగలిగితే, మళ్ళి మన దేశంలో మీడియా పురుధ్ధానం జరుగుతుందని నా అభిప్రాయం. పెట్టుబడి పెట్టమన్నారు కదా అని బినామీ పేర్లతో ఒక్కడే అన్ని షేర్లూ కొనకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, విధి-విధానాలు ఒక కూలంకష చర్చ జరిగినాక ఏర్పాటు చెయ్యాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివ గారు మంచి ఆలోచన కాని ఈ పోటి ప్రపంచంలో మీ ఆ లోచన విజయవంతం ఐతే సంతోషం. అప్పటి వరకు కనీసం బ్లాగ్స్, లో నైన ప్రత్యామ్నాయ ఆలోచనలకు వేదిక ను చేసుకుందాం

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ బ్లాగ్ పోస్ట్ రాసినందుకు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు? ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కామెంట్ రాయడానికి సాధారణంగా మీరు యెంతప్యాకేజ్ తీసుకుంటారు? దాన్ని బట్టి అంచనా వేయండి

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం