25, మార్చి 2011, శుక్రవారం

రైతు నవ్వాడు


స్ర్తీపాత్ర లేని పంచ వార్షిక కర్షక నాటకాల పోటీల ప్రారంభ సూచికగా గంట కొట్టారు. వేదికపై అంతా గందర గోళంగా ఉంది. విశాలమైన వేదికపై నట నేతలు నాటకాలను ప్రదర్శించడం, వీటికి న్యాయనిర్ణేత ఒక రైతు కావడం ఈ నాటకోత్సవాల ప్రత్యేకత. గతంలో ఎప్పుడూ లేనంత గట్టి పోటీ ఈసారి నాటకాల్లో కనిపిస్తోంది. నటుల సంఖ్య కూడా పెరిగింది.తెరపైకెత్తగానే ధవళవస్త్రాలతో అలంకరించిన పరుపుపైన పసుపు వస్త్రాలు ధరించిన నేత బాబు పడుకుని ఉన్నారు.
ఆయనకు తలవైపున ఎర్ర నారాయణ, కింద వైపున ఎర్ర రాఘవ ఉన్నారు. అరే అచ్చం మహాభారత యుద్ధానికి ముందు సహాయం కోరడానికి శ్రీకృష్ణుని వద్దకు అర్జునుడు, దుర్యోధనుడు వచ్చిన సీన్‌లానే ఉందే అని నాటకాన్ని తిలకిస్తున్న ముసలాయన అనుకున్నాడు. అప్పటి వరకు తెల్లని దుప్పటి కప్పుకున్నాయన కెమెరా వెలుతురు పడగానే తలను దుప్పటి నుండి పైకి పంపాడు. ఆయన్ని చూడగానే ముసలాయన ఈయన్ని ఎక్కడో చూశాను బాగా గుర్తున్న ముఖం అని అనుకున్నాడు.
వెనక పెద్ద భవంతి, పక్కన ఒక ల్యాప్ టాప్‌తో నిత్యం కనిపించేవాడాయన. ఈ నటుడు ఎవరబ్బా అని ముసలాయన ఆలోచిస్తుంటే పక్కన పోస్టర్‌లో చూసి ఔను ఆయనే కానీ పోస్టర్ మారింది భవంతి, ల్యాప్‌టాప్ ఉండాల్సిన చోట పొలం దున్నుతున్న రైతు బొమ్మ ఉంది అనుకున్నాడు.
శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా , రావణాసురుడిగా నటించినా ఎన్టోడిని గుర్తుపట్టకుండా పోతామా? ఏంటీ అనుమానం లేదు ఈయన కచ్చితంగా నాగలి చేత పట్టిన ఆ కంప్యూటర్ బాబే అని ముసలాయన నిర్ధారించుకున్నాడు. మహా బలసంపన్నుడైన భీముడంతటి వాడు అజ్ఞాతవాసంలో వంటవాడిగా, అతిలోక సౌందర్యవతి ద్రౌపది సైరంధ్రిగా మారినట్టు కష్టకాలంలో ఈయన ల్యాప్‌టాప్ వదిలి నాగలి చేతపట్టుకున్నాడు పాపం ఆయనకు ఏం కష్టం వచ్చిందో అని పెద్దాయన బాధపడ్డాడు. పక్కనున్న మనవడు అదేం కాదు తాతయ్య ఇది నాటకంలో వేషం అంతే దానికంత బాధపడితే ఎలా? సీజన్‌ను బట్టి సారు పాత్రలు మార్చేస్తుంటాడు అని నచ్చజెప్పాడు.
బాబు దుప్పటిని సర్దుకుంటూ మీరు నన్ను ఎన్ని బాధలైన పెట్టండి భరిస్తాను నా రైతు సోదరులను మాత్రం బాధపెట్టకండి అంటూ కళ్లు తుడుచుకున్నాడు. విద్యుత్ చార్జీలు తగ్గించమని ఉద్యమం చేసిన రైతులను తూటాలకు బలి చేసిన సీన్ ఎర్రన్నల కళ్ల ముందు మెదిలి సిగ్గనిపించింది.
రక్తకన్నీరు నాగభూషణంకే కన్నీళ్లు తెప్పించేంత అద్భుతంగా ఉంది సార్ అంటూ ల్యాప్‌టాప్ బాబు డైలాగులు విని సొంత వాళ్లు చెప్పారు. ఒకవైపు ఈ నాటకం సాగుడుండగానే మరోవైపు నుండి యువనేత ఆవేశంగా రైతుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం ఇదే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం. షేర్ హోల్డర్లకు కచ్చితమైన లాభాలు సమకూర్చిపెట్టడంలో మార్కెట్‌లో మాకున్న విశ్వసనీయత మీకందరికీ తెలుసు. వినియోగదారుల్లో టాటా బ్రాండ్‌కున్నంత విలువ పొలిటికల్ మార్కెట్‌లో మా కుటుంబ బ్రాండ్‌కుందనే విషయం మీకు మేం చెప్పాల్సిన అవసరం లేదు. రైతుల ద్వారానే మా బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని అలాంటి రైతుల కోసం మేం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అని యువనేత ప్రకటించగానే చప్పట్లు మారుమ్రోగాయి.
ఇంతలో వేదికపై కలకలం చెలరేగింది. రెండు వైపుల నుండి పెద్ద సంఖ్యలో ఆందోళన కారులు దూసుకు వచ్చారు. వేదికపైన 42 శాతం వాటా మాకు కేటాయించి , మిగిలిన చోటులో మీ ఇష్టం వచ్చిన నాటకాలు వేసుకోండి అని గులాబీ దళమాయన హెచ్చరించారు. మా వాటా ఎంతో తేల్చాకే మీ నాటకాలు ఆడనిస్తాం లేదంటే ఇక్కడే కూర్చోని గట్టిగా అరుస్తూ మీ డైలాగులు ఎవరికీ వినిపించకుండా చేస్తాం అని కృష్ణపక్షం దళం వాళ్లు హెచ్చరించారు. అప్పటి వరకు నాటకాలాడుతున్నవారు ఏకమైన ఈ రెండు దళాలను వేదికపై నుంచి కిందకు తోసేశారు.
దశాబ్దాల పాటు నటించి బోరేసింది ఇప్పుడు మళ్లీ నటించక తప్పదా? అంటూ చిరుజీవి నిస్సారంగా వేదికపైకి వచ్చారు. నటించే కాలంలో మేరు పర్వతమంత ఎత్తులో ఉండే ఆయన్ని అంతా మెగాజీవి అని పూజించే వాళ్లు. రాజకీయాల్లోకి వచ్చాక సైజు మరీ తగ్గిపోయి చిరుజీవి అయ్యారు. పంచ కట్టుకుని పోలంలోకి వెళ్లి రైతు లారా మీ కన్నీళ్లను తుడిచేందుకు వస్తున్నాను. చమటోడ్చి ఆరుగాలం కష్టపడి పండించిన మీకు గిట్టుబాటు ధర... అంటూ ఒక్కక్షణం ఆగి చేతిలోని మైకును డైలాగు స్కిృప్ట్‌ను నేలకేసి కొట్టాడు.
‘‘ఎవడ్రా ఈ డైలాగులు రాసింది. ఇందులో పంచ్ ఏమైనా ఉందా? ఇంత చచ్చు డైలాగులు నా జీవితంలో ఎప్పుడూ చెప్పలేదు. హీరోయిన్ నడుం మీద చేయి వేసి డైలాగు చెప్పానంటే జనం ఊగిపోవాలి, ఫ్యాన్స్ రెచ్చిపోవాలి
కానీ ముసలి ముతక రైతులను పట్టుకుని ఓదారుస్తూ ఏవేవో డైలాగులు చెప్పమంటున్నారు. బావా అల్లు ఏం చేస్తున్నావ్ ఈ సినిమా నడుస్తుందని నాకైతే అనిపించడం లేదు అని చిరుజీవి అనగానే అల్లు పరిగెత్తుకొచ్చి ఇది మీరు నటిస్తున్న కొత్త పాత్ర అని చెవిలో ఏదో చెప్పగానే చిరుజీవి లుంగీ మడిచి పొలంలో అడుగు పెట్టి తన పాత్రలో జీవం పోశారు.... స్థూలకాయం చేత నడవడం కష్టంగా ఉన్నప్పటికీ మూడు రంగుల పార్టీ శ్రీనివాసుడు పోలంలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టడమే పొలం పనాసారూ అని రైతు ఆశ్చర్యపోయాడు.
బక్కోడా నీకేంట్రా నా లావు చూసి మాట్లాడు అని శ్రీనివాసుడు కసురుకున్నాడు. వెనక నుంచి ఎవరో చేతితో బలంగా తోయడంతో యువకిరణుడు వేదికపై వచ్చి పడ్డాడు. ఇంగ్లీష్‌లో ఆయనేదో చెప్పాడు. రైతులకు మాత్రం అర్థం కాలేదు.నేతలాడుతున్న రైతు నాటకాన్ని చూసి రైతు కడుపుబ్బా నవ్వుకున్నాడు. ఆ నవ్వులో తాను పుట్టెడు బాధల్లో ఉన్న విషయం కూడా ఆ రైతుకు గుర్తుకు రాలేదు. న్యాయనిర్ణేతగా ఎవరో ఒకరిని ఉత్తమ నటుడని చెప్పడం మిగిలిన వారిని అవమానించడమే అవుతుంది, నా వల్ల కాదు అంటూ రైతు నవ్వుతూనే ఉండిపోయాడు. 1౪-౧౨-2010

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం