February 2nd, 2011
పై లోకంలో గ్రేట్ విలన్స్ క్లబ్ సమావేశం జరుగుతోంది ఎవరిలోనూ ఉత్సాహం కనిపించడం లేదు. ఏంటీ అంతా దిగులుగా ఉన్నారని హిట్లర్ గాడ్సేను పలకరించాడు. ‘‘ఇక్కడ జీవితం మరీ బోర్‌గా అనిపిస్తోంది. మా దేశంలో అభివృద్ధి చూస్తే ముచ్చటేస్తొంది. ఈ సమయంలో నేనక్కడ లేకపోతిని కదా? అని ఆలోచిస్తే బాధకలుగుతోంది ’’ ఆనిగాడ్సే బాధగా హిట్లర్ వైపు చూశాడు.
ఆ మాటలకు హిట్లర్ నొచ్చుకున్నాడు. అభివృద్ధిలో తన హయాం నాటి రికార్డును ఏ దేశం అధిగమించలేదు.‘‘నాగరికత మొదలయ్యాక 1933 నుంచి 1939 వరకు జర్మనీలో అభివృద్ధి నా హయాంలో జరిగినంత వేగంగా ప్రపంచంలో ఏ దేశంలో ఎప్పుడూ జరగలేదనేది వాస్తవం అభివృద్ధి గురించి నాకు చెబుతారా? ’’ అని హిట్లర్ కోపంగా అన్నాడు.
హిట్లర్ ఇంకా ఏదో చెబుతుంటే ,‘‘ ఔను నిజమే ఆరేళ్లలో మీ హయాంలో జర్మనీలో ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా అభివృద్ధి జరిగింది, తరువాత 39 నుంచి 45 వరకు ఆరేళ్లలో రెండో ప్రపంచ యుద్ధంలో అంతకన్నా వేగంగా జర్మనీ సర్వనాశనం అయింది కదా?’’, అని గాడ్సే నవ్వాడు. తమ బాస్‌ను అలా అనే సరికి గోబెల్స్ చిన్నబుచ్చుకున్నాడు. ఆ యుద్ధంలో నేను గెలిచి ఉంటే ప్రపంచం ఇప్పటి కన్నా ఎంతో వేగంగా అభివృద్ధి సాధించి ఉండేది అని హిట్లర్ చెబితే, సరే అభివృద్ధి సంగతి ఇప్పుడెందుకు కానీ అంతా కలిసి భారత్ వెళ్లొద్దాం ఏమంటారని ఇడీ అమీన్ ప్రతిపాదించాడు.
నేను రెడీ . భారత్‌లో ఆంధ్రప్రదేశ్ అని ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది అక్కడికి వెళదాం-అని గోబెల్స్ ఉత్సాహంగా చేయి పైకెత్తాడు. ‘‘పుట్టింటికి వెళ్లడానికి ఉత్సాహ పడిన కొత్త పెళ్లికూతురులా నీకా ఉత్సాహం ఏమిటి? ఆందులోనూ ఆంధ్రప్రదేశ్‌కా ఏముందక్కడ?’’ అని హిట్లర్ చిరాగ్గా అడిగాడు.‘‘నా పేరును జర్మనీలో జనం ఎప్పుడో మరిచిపోయారు కానీ తెలుగునాట ప్రతి నేత నోట నా నిరంతరం నా నామస్మరణే. పైకి చెప్పకపోయినా, ఒప్పుకోకపోయినా నా విధానాలను తూచా తప్పకుండా అనుసరించే తెలుగునేతలు కదలాడు నేల కన్నా నా దృష్టిలో పవిత్రమైనది, చూడదగినది ప్రపంచంలో మరోటి లేదు’’ అని గోబెల్స్ తన్మయంతో పలికాడు.
సంపన్నులు బిలియనీర్స్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నట్టుగానే గ్రేట్ విలన్స్ అంతా పై లోకంలో ఒక జట్టుగా ఏర్పడ్డారు. వీరందరూ హిట్లర్‌ను తమ కుల పెద్దగా ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకోకపోతే గ్యాస్ చాంబర్లో పెట్టి మళ్లీ చంపేస్తాడేమోనని భయపడి ఎంపిక చేసుకున్నారని గిట్టని వారంటే మా బాస్ వాగ్దాటి వల్ల ఈ పదవి దక్కిందని గోబెల్స్ పై లోకంలో ప్రచారంలో పెట్టాడు.
అంతా కలిసి తెలుగునాడు సందర్శనకు వెళదాం అని నిర్ణయించకున్నారు. ఉద్యోగులకు రెండెళ్లకోసారి ఎల్‌టిసి సౌకర్యం ఉన్నట్టుగానే గ్రేట్ విలన్స్ క్లబ్ సభ్యులు అదృశ్య వేషాల్లో తమకు నచ్చిన ప్రాంతానికి వెళ్లే సౌకర్యం దశాబ్దానికోసారి కల్పిస్తారు. పైలోకాధీశుని అనుమతితో గ్రేట్ విలన్స్ క్లబ్ సభ్యులంతా తెలుగునాడుపై అడుగు పెట్టారు.ముందు గాంధీ విగ్రహానికి దండం పెట్టుకుని చేసిన పాపాన్ని క్షమించమని అడుగుతాను అని గాడ్సేచెప్పడంతో అంతా సరేనని అటువైపు అడుగులు వేశారు.
అక్కడంతా కోలాహాలంగా ఉంది. అవినీతిని అంతమొందిస్తాం అంటూ పుష్కర కాలం పదవి అనుభవించి అవినీతిలో కొత్త పుంతలు తొక్కిన తెలుగునేత అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు లంచం తీసుకోవడం జన్మహక్కు, తక్కువ లంచాన్ని ఆమోదించేది లేదు అంటూ లంచం విలువ పెంచిన కొందరు తెగ హడావుడి చేస్తున్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు తమతమ శాఖల్లో శక్తికొద్ది వెనకేసుకువచ్చిన వారంతా ఒక జట్టుగా ఉన్నారు. వీరందరినీ చూడగానే క్లబ్ సభ్యులు మురిసిపోయారు.
ఔరా! ఔరా! మనం ఈ నేలపై అడుగుపెట్టగానే వీరిలో ఎంత మార్పు! మొన్నటి వరకు అందిన కాడికి దండుకున్న వీరు ఇప్పుడు మారిపోయారు అంటూ హిట్లర్ సంబరపడ్డారు. గోబెల్స్ పరిగెత్తుకొచ్చి తొందరపడి సంతోషపడకండి ఇప్పుడే సమాచారం తెలుసుకోని వచ్చాను, ఇంతకు మించిన వింతలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. మనం నేలమీద అడుగుపెట్టినందుకు మారిపోవడం కాదు... జనం కోసం అంతా తలా ఒక వేషం వేసుకున్నారట! ఇప్పుడు అవినీతి వ్యతిరేక సీజన్ నడుస్తోంది. అంతా అవినీతిపై ఉద్యమం ప్రకటించారు అంతే అని అసలు విషయం చెప్పారు.
వీరంతా అటు నుంచి ముందుకు కదిలితే, ‘‘ నా జీవితం ప్రజలకే అంకితం, గాంధీ, నెహ్రూ, నేను పుట్టిన ఈ దేశంలో పేదల సమస్యలు నన్ను కదిల్చివేశాను. మా నాన్న చనిపోయిన తరువాత తెలుగునాట ప్రజల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. నేనెక్కువగా బెంగళూరులో ఉన్నందున తెలుగువారి కష్టాలు తెలియలేదు. పెద్ద పదవి ఇవ్వండి మీ కష్టాలు తీరుస్తాను ’’, అంటూ యువనేత చెప్పుకుపోతున్నాడు. అటు నుంచి ముందుకు వెళ్లారు. కొత్తబిక్షగాడు పొద్దెరగడన్నట్టు, నవ మేధావి ఒకరు చదువు, ‘‘కెరీర్ ఉద్యోగం ఇదేనా మీ జీవిత లక్ష్యం, సమాజం ఎటుపోతుందో చూడండి .
మా అభిమాన నాయకున్ని మీ అభిమాన నాయకుడిగా గౌరవించండి అధికారం అప్పగించండి .. కదలండి’’ అంటూ విద్యార్థుల ముందు ఆవేశంగా ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆరువేల జీతం నుంచి వంద కోట్లకు ఎదిగే రహస్యం మాకూ చెబితే మేమూ కదులుతాం సార్ అంటూ కొంటెవిద్యార్థి ఒకడు గట్టిగా అరిచాడు.అదృశ్య శక్తితో తెరపై చూసిన గ్రేట్ విలన్స్‌కు దిమ్మతిరిగిపోయింది. మాది పెద్దాపురం కంపెనీ అండి ... భార్యాభర్తల పవిత్ర బంధంపై ఉపన్యాసం ఇవ్వడానికి వెళుతున్నాను అంటూ వయ్యారంగా చెబుతోంది ఒకావిడ. ఇవన్నీ చూశాక హిట్లర్ తెలుగునేలకు తల కొట్టుకుని పునర్మరణం పొందాడు. మిగిలిన గ్రేట్ విలన్స్ స్పృహ తప్పి పడిపోయారు. మనవి గట్టిగుండెలు కాబట్టి మనం మాత్రం మన నేతల హారర్ లైవ్ మూవీని చూసి తట్టుకుంటున్నాం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం