రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తే సమాధానం దొరకదు సరికదా ఎదుటివారి ముఖం ప్రశ్నార్ధకంగా మారుతుంది. మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు సరిగ్గా టిడిపి పరిస్థితి సైతం అలానే ఉంది. టిడిపి ఆవిర్భవించి ఇరవై తొమ్మదేళ్లు అయంది. ఈ మూడు దశాబ్దుల కాలంలో ఆ పార్టీ గతంలో ఎప్పుడూ ఎదుర్కొనంతటి సంక్షోభ స్థితిని ఇప్పుడు ఎదుర్కొంటోంది.
దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని మహాత్మాగాంధీ సూచించారు. అలానే టిడిపి నాతోనే పుట్టింది నాతోనే పోతుంది అని ఎన్టీరామారావు ప్రకటించారు. ఈ రెండూ జరగలేదు. దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టిడిపి రద్దు కాలేదు. దేశానికి స్వాతంత్య్రం లభించిన 64 ఏళ్లయిన తరువాత కూడా దేశాన్ని కాంగ్రెస్ పార్టీనే పాలిస్తోంది. ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఎన్టీఆర్ మరణించిన 15 ఏళ్ల తరువాత కూడా టిడిపి అలానే ఉంది.
సిద్ధాంతాల పరంగా వామపక్షాలు, బిజెపి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. కానీ చిత్రంగా చంద్రబాబు హయాంలో టిడిపి అటు బిజెపితో, ఇటు వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. 89లో ఎన్టీఆర్ హయాంలో ఏకంగా ఒకేసారి బిజెపి, వామపక్షాలతోకలిసి పోటీ చేసిన చరిత్ర టిడిపిది.
కేవలం సినిమా గ్లామర్‌తోనే ఏర్పాటైన టిడిపి ఎన్టీఆర్ మరణం తరువాత కూడా తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉండడం విశేషమే. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన బలమైన పునాదులు కావచ్చు, రాష్ట్రంలో ఏర్పడిన రెండు పార్టీల వ్యవస్థ కావచ్చు టిడిపి ఎన్టీఆర్ తరువాత కూడా బలంగానే ఉంది. అయితే ఇప్పుడా పార్టీ మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్టీఆర్ హయంలో టిడిపి రాష్ట్రంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని బలమైన ముద్రవేసింది.
వార్తా పత్రికలు చదివే అలవాటు లేని ఎన్టీఆర్ ఏకంగా ఒక రాజకీయ పార్టీనే ఏర్పాటు చేశారు. ఆయనకు రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేకపోవచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో బలంగా తనదైన ముద్ర వేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి జనాకర్షక పథకం కావచ్చు, పరిపాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లే మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేయడం కావచ్చు.
రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ తన ప్రభావాన్ని చూపించారు. కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసేందకు కృషి చేశారు. ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ సైతం ఎన్టీఆర్ ప్రజాకర్షణ శక్తిని అంగీకరించి, ‘నాదెండ్ల- రాంలాల్ ఎపిసోడ్’ తరువాత ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేయక తప్పలేదు. దశాబ్దాల పాటు సినిమాల్లో రారాజుగా వెలిగిపోయి ఎదురులేని వ్యక్తిగా నిలిచిన ఎన్టీఆర్ రాజకీయాల్లో సైతం అదేధోరణి చూపారు. అదే చివరకు ఆయన కొంప ముంచింది.
తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏడాది లోగానే నాదెండ్ల భాస్కర్‌రావు దించేశారు. తిరిగి అధికారంలోకి వచ్చి అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి ఐదేళ్లపాటు ఉన్నారు. ఆ తరువాత 1994లో అధికారంలోకి వచ్చినప్పుడు పట్టుమని ఎనిమిది నెలలు కూడా అధికారంలో ఉండలేకపోయారు. పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నా, టిడిపికి బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసినా ఆయనకు రాజకీయాల్లో అనుభవం లేదు అని చెప్పే విధంగా రెండుసార్లు కూడా ఆయన వెన్నుపోటు బారిన పడ్డారు.
కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా సైతం దక్కకుండా చేసి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఎనిమిది నెలలు కూడా అధికారంలో ఉండలేకపోయారు. జనాకర్షణ వేరు రాజకీయాలు వేరు అని ఎన్టీఆర్ చంద్రబాబు ఉదాంతాలు నిరూపిస్తున్నాయి. చంద్రబాబుకు జనాకర్షణ తక్కువే కానీ తెర వెనుక వ్యవహారాల్లో దిట్ట. తెర వెనుక రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1999లో బిజెపి హవాలో రెండవ సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత రెండేళ్లకే టిఆర్‌ఎస్ ఆవిర్భవించింది. టిఆర్‌ఎస్ పుట్టుక టిడిపికి చావుదెబ్బగా మారింది. టిడిపికి 2001 నుంచి పతనం మొదలైంది. అప్పటి నుంచి ఇంకా కోలుకోలేదు.
2009లో టిఆర్‌ఎస్‌తో జత కట్టినా టిడిపికి అధికారం దక్కలేదు. టిడిపి ఆవిర్భావం తరువాత తొలిసారిగా కాంగ్రెస్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మరోసారి అధికారంలోకి వస్తామనే నమ్మకం కాంగ్రెస్ పెద్దల్లో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో రేపు అధికారం మాదే అనే ధీమా టిడిపిలో కనిపించాలి.
కానీ అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రం ఏమవుతుందో, తెలంగాణ సంగతి ఏం చేస్తారో అనే గందరగోళంతో పాటు ఏం జరిగితే పార్టీ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు టిడిపిని వెంటాడుతున్నాయి. మూడు దశాబ్దాల టిడిపిలో సగ భాగం ఎన్టీఆర్ జమానా కాగా, మిగిలిన సగం చంద్రబాబుది. చంద్రబాబు జమానాను రెండుగా విభజిస్తే తొలి భాగం అధికారంలో ఉన్నప్పుడు ఐటి, కంప్యూటర్ జమానా కాగా, రెండో భాగం ప్రతిపక్ష పాత్ర. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ఆయన వెనక భారీ పోస్టర్ ఒకటి కనిపించేది.
ప్రభుత్వ ప్రకటనల్లోనైనా, సిఎమ్‌గా , పార్టీ అధ్యక్షునిగా విలేకరుల సమావేశాలు జరిగే హాలులోనైనా ఈ పోస్టర్ తప్పని సరిగా కనిపించేది. కంప్యూటర్ వౌస్ పట్టుకుని కంప్యూటర్ వైపు చూస్తున్న బాబు, వెనక హైటెక్ సిటీ. బాబు అధికారంలో ఉన్నప్పటి కాలానికి అద్దం పట్టే విధంగా ఉండేదీ పోస్టర్. బాబు ఓడిపోగానే హఠాత్తుగా పోస్టర్లను మార్చేశారు. ఇప్పుడాయన వెనక పచ్చని పొలాలు, ఆ పొలాల్లో పని చేస్తున్న రైతు కూలీలు, రైతులు, ఒక వైపు రైతును తలపించే విధంగా పాగాతో ఎన్టీఆర్ మరోవైపు నాగలి చేతపట్టిన చంద్రబాబు -ఇలా కనిపిస్తోంది. టిడిపి నాయకత్వం శక్తివంచన లేకుండా కొత్త పోస్టర్‌ను ప్రచారంలో పెట్టినా అధికారంలో ఉన్నప్పటికీ హైటెక్ పోస్టర్ ప్రజలపై బలమైన ముద్ర వేయడంతో కొత్త పోస్టర్ జనం హృదయాల్లోకి వెళ్లలేకపోతోంది.
ఈ విషయం స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ కేంద్రంలో రైతుల సమావేశాలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు, అలానే చంద్రబాబు మాట్లాడుతూ 2జి స్పెక్ట్రమ్‌గురించి రైతులకు సుదీర్ఘంగా చెబుతుంటే అవన్నీ మాకెందుకండి రైతుల సంగతి చెప్పండి అంటూ రైతులు గట్టిగా అరిచారు. దానికి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ నాకు మీకన్నా ఎక్కువ ఆవేశం ఉంది, మీ కోసం నేను వారం పాటు నిరాహార దీక్ష చేస్తే మీరు రాలేదు, స్పందించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజమే అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ బాబుగా పడిన ముద్రను తొలగించుకుని రైతు బాబు ముద్ర కోసం దీక్ష సాగించారు. ఆ దీక్ష ఎంత వరకు విజయవంతం అయిందో ఆయన మాటల్లోనే తేలిపోయింది. రైతులు, ఉద్యోగులు, కార్మికులకు వ్యతిరేకి అనే బలమైన ముద్రలు చంద్రబాబుపై ఉన్నాయి. ప్రతిపక్షంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా తనపై పడిన ముద్రలను చెరిపేసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది, అధికార పక్షాన్ని ముచ్చమటలు పోయించాల్సిన పరిస్థితి రావడం లేదు.
ఎన్టీఆర్ హయాంలో తెర వెనుక మంత్రాంగానికి చంద్రబాబు తెలివి తేటలు బాగా ఉపయోగపడ్డాయి. తరువాత నేరుగా చంద్రబాబే నాయకత్వం వహించడంతో ఆయనకు కుడిభుజం ఎడమ భుజం అంటూ ఎవరూ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రతన్ టాటాను ఒకసారి విలేఖరుల సమావేశంలో మీ విజయరహస్యం ఏమిటని ప్రశ్నించారు. సమర్థత, నిజాయితీ, నిబద్ధత కలిగిన బృందం వల్ల నేనీ విజయాలు సాధించాను. ఎవరి సామర్ధ్యం ఏమిటో గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించిన తరువాత అనవసర జోక్యం చేసుకోను అదే నా విజయ రహస్యం అని చెప్పారట! వ్యాపార సామ్రాజ్యంలోనే కాదు రాజకీయాల్లోనైనా చివరకు కుటుంబంలోనైనా అంతే.
ఎన్టీఆర్ హయాంలో తెర వెనుక మంత్రాంగానికి చంద్రబాబు తెలివి తేటలు బాగా ఉపయోగపడ్డాయి. తరువాత నేరుగా చంద్రబాబే నాయకత్వం వహించడంతో ఆయనకు కుడిభుజం ఎడమ భుజం అంటూ ఎవరూ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రతన్ టాటాను ఒకసారి విలేఖరుల సమావేశంలో మీ విజయరహస్యం ఏమిటని ప్రశ్నించారు. సమర్థత, నిజాయితీ, నిబద్ధత కలిగిన బృందం వల్ల నేనీ విజయాలు సాధించాను. ఎవరి సామర్ధ్యం ఏమిటో గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించిన తరువాత అనవసర జోక్యం చేసుకోను అదే నా విజయ రహస్యం అని చెప్పారట! వ్యాపార సామ్రాజ్యంలోనే కాదు రాజకీయాల్లోనైనా చివరకు కుటుంబంలోనైనా అంతే.
విజేతకు సమర్ధవంతమైన బృందం ఉండాలి. అన్ని పనులు నేనే చేస్తాను అనుకునే వారు చివరకు ఏ పనీ చేయలేరు. ఒక మంచి బృందాన్ని ఎంపిక చేసుకోవడంలోనే వైఎస్‌ఆర్ విజయం దాగుంది. చిత్రంగా వైఎస్‌ఆర్, చంద్రబాబు ఒకప్పుడు మంచి మిత్రులు. నమ్మకమైన బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం, బాధ్యతలు అప్పగించడం అనే దానిలో ఇద్దరు పరస్పర విరుద్ధ మనస్తత్వంతో ఉంటారు. వైఎస్‌ఆర్ నమ్మారంటే బాధ్యతను అప్పగించి విజయం సాధించినా విఫలమైనా సమానంగా తీసుకుంటారు. చంద్రబాబు అలా ఎవరినీ నమ్మరు, పూర్తి బాధ్యతలు అప్పగించరు, విజయం సాధిస్తే తన ఘనత అంటారు, వైఫల్యం చెందితే అది ఇతరులపైకి నెడతారు. సీమాంధ్రలో జగన్, తెలంగాణలో తెలంగాణ అంశం టిడిపి నాయకత్వాన్ని కలవరపెడుతోంది. ఈ రెండు విషయాల్లో టిడిపి నాయకత్వం చేయగలిగింది ఏమీ లేదు. అయతే విస్తృతమైన ప్రచారం ద్వారానే ఏమైనా సాధించవచ్చును అనే భావన టిడిపిలో ఇంకా బలంగానే ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం