22, మార్చి 2011, మంగళవారం

౩౦ ఏళ్ళ వెనక్కి వెళితే ......

- బుద్దా మురళి

ఓలమ్మీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా? తిక్కరేగి తిమ్మిరెక్కిందా- అంటూ సదానందం ఉషారుగా పాడుతూ భార్య సదాలక్ష్మిని వెనకి నుండి ఒక్కటిచ్చాడు. మీ సరసం మండినట్టే ఉంది ముసలోడికి దసరా వేషం అన్నట్టు షష్టిపూర్తి చేసుకున్నాక ఇదేం పాడు రోగమండి- అంటూ సదాలక్ష్మి గయ్యిమంది. మనవలు మనవరాళ్లు చూస్తే పరువు పోతుంది నోరుమూసుకొని కృష్ణారామా అనుకుంటూ కూర్చోండి - అని కసరుకుంది. అయినా సదానందం ఆమె మాటలు పట్టించుకోకుండా మరింత ఉత్సాహంగా ఆకుచాటు పిందె తడిసే .... అంటూ గొంతెత్తి పాడసాగాడు.
‘‘ మీకేదో ఐనట్టుందండి అన్నగారు అరవై ఏళ్ల వయసులో 16 ఏళ్ల పడుచు హీరోయిన్లతో స్టెప్పులు వేస్తూ, అలాంటి పాటలు పాడారాని మీరు కూడా పాడుతున్నారా? ఏంటి? అయినా, 60 ఏళ్ల వయసులో హీరోగా నటించినా, 73 ఏళ్ళప్పుడు సన్యాసం తీసుకుని 74 ఏళ్లకు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అన్నగారికే చెల్లింది మీరు, నేను ఎంతటి వారం అన్నగారి ముందు అల్పులం ’’ అంటూ సదాలక్ష్మి ముద్దుగానే చెప్పింది.

సదానందం ఊతకర్రను తీసి బయట పారేసి, ‘‘ పదండి వెనక్కి పదండి వెనక్కి తోసుకు పోదాం వెనక్కి వెనక్కి’’ - అంటూ పిడికిలెత్తి పాడాడు.రిటైరైన తరువాత ఇంట్లోనే కూర్చోవడంతో ఏమీ తోచక భర్తకు ఏదో ఐందని అనుమానించిన సదాలక్ష్మి భర్త నుదుటిమీద చేయి పెట్టి చూసింది. మామూలుగానే ఉంది మరేంటి ఇలా మాట్లాడుతున్నాడని కంగారు పడింది. పిచ్చి సదా నాకేమీ కాలేదు. నాకు మళ్లీ పడుచుదం వచ్చేసింది. నా వయసు ఇప్పుడెంతనుకుంటున్నావ్? అని అడిగాడు.
మొన్ననే కదండి 60 ఏళ్లు నిండాయి, మనవలు, మనవరాళ్లు, మన పిల్లలు ఘనంగా షష్టిపూర్తి కూడా చేశారు కదండి అని అమాయకంగా అడిగింది. నిజమేనోయ్ అప్పుడు నాకు 60 ఏళ్లు నిండాయి కానీ ఇప్పుడు నా వయసు అందులో సగం మాత్రమే నువ్వు పేపర్లు సరిగా చదవడం లేదన్నమాట! రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్రం అంటే అందులో ఉన్న మనం కూడా వెనక్కి వెళతాం కదా? అంటే ఇప్పుడు నా వయసు 30 ఏళ్లు అన్నమాట! 30 ఏళ్లు వెనక్కి వెళ్లినప్పుడు ఆకుమాటు పింద తడిసే పాటలు కాకుండా రోబో పాటలు పాడతానా ఏంటి? అని సదానందం గడుసుగా ప్రశ్నించాడు.
ఆయోమయంగా ఉన్న ముఖాన్ని భార్య మార్చకముందే సదానందం తుర్రున బయటకు పరుగు తీశాడు. అంతకు ముందే మిత్ర బృందానికి సందేశం పంపాడు అంతా పార్క్‌లో సమావేశమై పార్టీ చేసుకుందామనిరిటైరైన మిత్ర బృందం పార్కులో కలుసుకోవడం రోజూ జరిగేదే ఐనా ఈరోజు మాత్రం అందరిలో చాలా సంతోషం కనిపిస్తోంది. ముందుగా మనను 30 ఏళ్ల వెనక్కి తీసుకు వెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మనం 30 ఏళ్ల వెనక్కి వెళ్లామనే విషయాన్ని పరిశోధించి వెల్లడించిన తెలుగుదేశం పార్టీకి మా కృతజ్ఞతలు అంటూ మిత్రబృందం తరఫున సదానందం ఉపన్యాసం మొదలు పెట్టాడు. మనకీ విషయం తెలియకపోతే ఎంత నష్టపోయేవాళ్లం, రిటైర్ ఐపోయాం కదా? అని రామకోటి రాసుకుంటూ కూర్చోమని అంతా సలహాలిస్తుంటే బుద్ధిమంతుడిలా ఆచరణలో పెట్టేశాను. మా ఇంట్లో టీవి అంటే కార్టూన్ నెట్ వర్కే కదా? నిన్న ఇంట్లో పిల్లలు లేకపోవడంతో న్యూస్ చానల్ చూసే చాన్స్ దక్కింది. ఆయనెవరో పాపం మాసిపోయిన గడ్డంతో దిగులుగా ఎప్పుడూ కుర్చీ వైపు చూస్తుంటాడు చూడు ఆయన అంటూ సదానందం చెప్పబోతుంటే ఆయన్ని చంద్రబాబు అంటారని కింది నుండి మిత్రుడు అరిచాడు. ఔను తెలుసులే నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రతి రోజు మధ్యాహ్నాం సరిగ్గా పనె్నండు గంటల ఐదు నిమిషాలకు ఆకస్మిక తనిఖీ అంటూ వచ్చేవారు.
ఆయన్ని చూసి మా గడియారాలను సరి చేసుకునే వారం. ఆకస్మిక తనిఖీకి ఆయన అంత ఠంచనుగా వచ్చేవారు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన బొమ్మ లేకుండా టీవి కనిపించేది కాదు. నేను రిటైర్ అయ్యాక టీవి చూడడం లేదనుకోండి. ఆయన ఏదో మీటింగ్‌లో మాట్లాడుతూ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిన అద్భుత విషయాన్ని చక్కగా వివరించాడు.
మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎనే్నళ్లు ముందుకు వెళ్లిందో? అని కింద నుండి ఎవరో అరిచారు. ఆ సంగతి ఎవరూ అడగలేదు,అది మనకు అనవసరం మనకు ఉపయోగపడే విషయానే్న మనం తీసుకోవాలి. అందుకే ముందే 30 ఏళ్లు వెనక్కి పంపిన రోశయ్యకు, ఆ విషయాన్ని మనకు చాటి చెప్పిన బాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి ఇప్పుడు మనం మన రెండో యవ్వనాన్ని అనుభవిద్దాం అంటూ సదానందం తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తుంటే అక్కడి వారంతా 30 ఏళ్లు వెనక్కి వెళ్లి కలల్లో మునిగిపోయి.సార్ నా మాట వినండి సికింద్రబాద్ స్టేషన్ ఎదురుగానే ఉన్న బిల్డింగ్ 40వేలకు అమ్ముతానంటున్నాడు. తీసుకోండి బాగుంటుంది అని బ్రోకర్ నచ్చజెపుతున్నాడు.
అది సరే కానీ మాదాపూర్‌లో ఓ పదెకరాలు కొందామనుకుంటున్నాను ఏ మంటావ్ అని సుబ్బారావు మిత్రున్ని అడిగాడు. గోదావరి జిల్లాలో చక్కగా నాలుగు పంటలు పండే భూమి ఎకరాను అమ్మి ఇక్కడ ఎందుకూ పనికి రాని పదెకరాల భూమి కొనడం అవసరమంటావా? అని మిత్రుడు నిలదీశాడు.
హైదరాబాద్ అభివృద్ధికి నా వంతు కృషి చేసేందుకు మాదాపూర్‌లో లక్షకు పదెకరాలు కొని తీరాలనిపిస్తోంది అని సుబ్బారావు తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. కూకట్‌పల్లిలో రూపాయికి గజం స్థలం ఉందట ఓ వెయ్యి గజాలు కొంటే ఎలా ఉంటుంది? అని అప్పారావు అడిగాడు....గట్టిగా చప్పట్లు వినిపించడంతో అందరికీ నిద్ర వదిలింది.
సుబ్రమణ్యం మైకు అందుకుని ‘‘మీరు మరీ చిత్రంగా ఊహిస్తున్నారు. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటే రాష్ట్రంలో నివసించే మనం వెనక్కి వెళ్లినట్టు కాదు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇప్పటి అధినాయకులు అధికారం కోసం పరితపించారు. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అలానే పరితపించాల్సిన పరిస్థితి వచ్చింది. అదీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిన కథ అంతే తప్ప ఇదేమన్నా రైలింజనా ఇష్టం వచ్చినట్టు ముందుకు వెనక్కి వెళ్లడానికి’’ అని ముగించాడు.
-౧౬.౧౧.2010

1 వ్యాఖ్య:

 1. మీ బ్లాగు బావుంది....మీ స్టెప్పులు అరవై ఏళ్ళ వయస్సులో
  మాకు స్పూర్తిదాయకం అని గుండె దిటవు చేసుకున్నా
  కాని నడుస్తున్నచరిత్ర మీద మీ పదఘట్టం అని తెలిసి...
  కష్టాన్నికూడా నవ్వుతూ ఎన్జోయ్ చెయ్యడం నేర్పుతున్నాయి
  మన ప్రభుత్వాలు...గ్రేట్...(దినవహి..dvhrao.blogspot.com)

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం