- బుద్దా మురళి
November 30th, 2010
పత్రికల్లో కుంభకోణాల వార్తలు చదివినప్పుడు ఎవరికైనా కడుపు రగిలిపోకుండా ఉంటుందా? ఏం మేం మాత్రం మనుషులం కాదా? మాకూ చీమూనెత్తురు లేదా? మీలో ప్రవహించే రక్తం రంగు ఎరుపే మాలోని రక్తం రంగూ ఎరుపే మరి కుంభకోణాలు మీకు మాత్రమే పరిమితం కావడం ఏం ధర్మం. ఈ అన్యాయాన్ని ఇంకెంత కాలం భరించాలి.
పెద్ద మనుషుల ఒప్పందం అంటూ 40 శాతం ఉద్యోగాల కోసం తెలంగాణ వాదులు రోడ్డున పడ్డారు. సంతోషం మాకేం అభ్యంతరం లేదు. మరి కుంభకోణాల్లో మా వాటా కోసం ప్రశ్నించేదెవరు? ఎప్పుడూ చీకటి రోజులే ఉండవు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మన కోసం గొంతెత్తేవారు తప్పకుండా ఉంటారు. మనమంతా ఈ కుంభకోణాలను వౌనంగా భరిస్తూనే కాలం గడిపాం.
కానీ జస్పాల్ భట్టి అలా అందరిలా వౌనంగా ఉండిపోలేదు. ఈ అంశంపై రోడ్డున పడ్డారు. కుంభకోణాలు చేయడం కేవలం మంత్రుల హక్కు మాత్రమే కాదు అది ప్రతి ఒక్కరి హక్కు కావాలనే డిమాండ్‌తో జస్పాల్ భట్టి చండీ గఢ్‌లో నానె్సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొనే అదృష్టం మనకు దక్కక పోయినా మనసులోనే మనం మద్దతు తెలుపుదాం.
అధికారంలో ఉన్న మీరే అంతా దోచుకుంటే మేం అధికారంలోకి వచ్చాక ఏం చేయాలనే ఆవేదన ప్రతిపక్షంలో కనిపిస్తే, అధికారం లోకి రావడానికి మేం ఎంత ఖర్చు చేశాం, మళ్లీ అధికారంలోకి రావడానికి ఈ మాత్రం కుంభకోణాలు చేయకపోతే ఎలా అనే ఆవేదన అధికార పక్షంలో కనిపిస్తోంది. అవినీతి అంటే అధికార, ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమేమా? మరి మనలాంటి ఔత్సాహికులేం కావాలి? లక్ష కోట్ల బడ్జెట్లో ఏదీ మా వాటా? అని ప్రశ్నించినట్టుగానే లక్షా 76వేల కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏదీ మా వాటా? అనే ప్రశ్న మనం వేస్తే తప్పా? అన్నింటిలోనూ సంస్కరణలు తెచ్చారు, మరి కుంభకోణాల్లో సంస్కరణలు అవసరం లేదా? వీటిలో ప్రజల భాగస్వామ్యం అవసరం లేదా?
ప్రజాస్వామ్యానికి అర్థం ఇదేనా? మనసుంటే మార్గం ఉంటుంది.లక్షా 76వేల కోట్ల రూపాయల కుంభకోణం, 70వేల కోట్ల రూపాయల కామనె్వల్త్ కుంభకోణాల్లో సామాన్యులను భాగస్వామ్యం చేయడం ఎలా సాధ్యం? అని పాలకులు తప్పించుకోవాలని ప్రయత్నించవద్దు. భారీ పెట్టుబడులు అవసరం అయినప్పుడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వెళ్లి నిధులు సమీకరిస్తున్నాయి కదా? అదే విధంగా భారీ కుంభకోణాలకు సైతం ముందుగా కొంత పెట్టుబడి అవసరం అవుతుంది. దాని కోసం పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలి. అప్పుడు కుంభకోణం ఫలాలు సామాన్యులకు సైతం అందుతాయి. కుంభకోణాలను నివారించలేరు కాబట్టి వాటిని చట్టబద్ధం చేసి పబ్లిక్ ఇష్యూకు వెళ్లే అవకాశం కల్పించాలి.
అత్యంత లాభసాటి వృత్తి అయిన కుంభకోణాలను పరిశ్రమగా గుర్తించక పోవడం అన్యాయం. ముడుపులు, లంచాలు అనే పదాలను తీసేసి కన్సల్టెన్సీ ఫీజు అనే పేరు పెట్టి చట్టబద్ధం చేసిన వారు, ఆ పనిని ఒక పరిశ్రమగా గుర్తించి పబ్లిక్ ఇష్యూకు వెళ్లడానికి అవకాశం కల్పించాలి. కుంభకోణాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఇంత కన్నా మంచి అవకాశం లేదు. ఈనేల, గాలి, నీరు, ప్రకృతి అందరిదైనప్పుడు కుంభకోణాలు మాత్రం కొందరికే ఎందుకు పరిమితం కావాలి? ప్రజలే పాపం చేశారని కుంభకోణాలకు దూరంగా ఉండాలి? ఏం పుణ్యం చేసుకున్నారని కొందరికే కుంభకోణాలు పరిమితం కావాలి.
దేవున్ని దర్శించుకోవడానికి అందరికీ హక్కున్నప్పుడు కుంభకోణాలు చేసే హక్కు మాత్రం కొందరికే ఎందుకు? పరిమితం చేయాలి. కుంభకోణాలు ప్రజల ప్రాథమిక హక్కుగా మారాలి. గాలి పీల్చుకునే స్వేచ్ఛ ప్రతివారికీ ఉన్నట్టుగానే కుంభకోణాల హక్కు ఉండాలి.ఈనెల పెన్షన్ రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో? మరీ నెలకు 30 రోజులుండడం అవసరమా? అనుకుంటూ మాజీ ఎంపిగారు క్యాలండర్పైకి దృష్టి పెట్టారు.
అప్పుడే అక్కడికొచ్చిన శ్రీమతి మాజీ ఎంపి గారు , టీవిలో ప్రముఖ రాజకీయ నాయకుడితో ప్రముఖ జర్నలిస్టు మనసులోని మాట వినసాగారు.‘‘రాజకీయాల్లో నైతిక విలువలు పెంచడానికి తాను చేస్తున్న కృషిని అన్నయ్య ఎంత బాగా వివరిస్తున్నారో? మీరు కూడా నైతిక విలువల గురించి ఉపన్యసించే స్థాయి రాజకీయాల్లో సంపాదిస్తారని ఎంత ఆశపడ్డాను. కానీ.. ’’’ అంటూ శ్రీమతి మాజీ ఎంపి గారు కళ్లు తుడుచుకున్నారు. అప్పుడే అక్కడికొచ్చిన అసంతృప్తి రావు, ‘‘ ఏ మాట కామాటే చెప్పుకోవాలి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో విలువలపై బాగా మాట్లాడతారు.
‘మీ అల్లుడికి అదేదో కార్ల ఏజెన్సీ ఇప్పించారట!’ అని జర్నలిస్టు అడిగితే ‘ఆ కార్ల కోసం ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ల వ్యాపారంతో నాకు సంబంధం లేదని చెబుతాను ’ అని ఆ ప్రముఖుడు సమాధానం చెబుతున్నారు.ఏజెన్సీ ఇప్పించడంలోతన పాత్ర పోషిస్తారు కానీ, కార్ల అమ్మకాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు? ఎంపిలకు ప్లాటు ఇస్తే నేను తీసుకోలేదు - అని ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు చెబుతుంటే, ఔను రెండువేల కోట్ల పవర్ ప్రాజెక్టు అయితే ఓకే తప్ప అందరితో పాటు ముష్టి ఐదువందల గజాలు ఇస్తే ఎందుకు తీసుకుంటారు- అని అసంతృప్తి రావు మనసులోనే అనుకున్నారు.
అటు రాజకీయఅన్నయ్య ఇటు జర్నలిస్టు అన్నయ్య ఇద్దరూ తమ తమ రంగాల్లో నైతిక విలువలపై ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి చేరుకున్న ‘ఆదర్శ్’ మూర్తులు.ఆయా రంగాల్లో ఉన్న ప్రతి వ్యక్తి తానూ ఏదో ఒక రోజు ఆ విధంగా నైతిక విలువల గురించి ఉపన్యసించే స్థితికి చేరుకోవాలని కోరుకుంటారు. అది సాధ్యం కావాలంటే కుంభకోణాలు అందరి ప్రాథమిక హక్కు కావాలి.నీతి: నైతిక విలువలపై ఉపన్యసించే స్థితికి చేరుకునేవారు మహానుభావులు......
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం