19, మార్చి 2011, శనివారం

తెలంగాణకు ఆత్మగౌరవం ఎవరు నేర్పించారు

- బుద్దా మురళి
July 26th, 2010
ఆత్మగౌరవం, పౌరుషం తెలుగువారికే సొంతమా? తెలుగుజాతే కాదు తెలుగువారు అసలు జీవితంలో ఎప్పుడూ వినని జాతుల వారికి సైతం ఆత్మగౌరవం, పౌరుషం ఉంటుంది. పౌరుషం, ఆత్మగౌరవం అనేవి మనుషుల సహజ లక్షణాలు. తెలుగుజాతి, తమిళ జాతి అనే పేర్లు కూడా పుట్టక ముందు ఆదిమానవుల్లో సైతం పౌరుషం, ఆత్మగౌరవం ఉండేవి. కానీ తెలుగుజాతికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతనే ఆత్మగౌరవం వచ్చిందనే చిత్రమైన ప్రచారం జరుగుతుంది. అదే విధంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన తరువాతే తెలంగాణ వారికి స్వేచ్ఛ లభించిందనేది వీరి ప్రచారం. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ లేకుండా బాంచన్ నీ కాల్మోక్త దొర అంటూ జీవించే కాలంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించారట! ఇది బాబు వర్గం ప్రచారం చేయడంతో పాటు తమ పార్టీలోని తెలంగాణ వారితో ఇదే మాట పదే చెప్పిస్తున్నారు.ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చేంత వరకు తెలుగు వారికి ఆత్మగౌరవం లేదనడం ఒక రకంగా ఇది తెలుగువారి కించపరచడమే అవుతుంది. 60 ఏళ్ల వయసులో సినిమా రంగం నుంచి రిటైర్ అయి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ముఖ్యమంత్రిగా ఆయన పాలన అద్భుతంగా ఉందని కొందరు బాగాలేదని కొందరు ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. ఆత్మగౌరవం ఒక కుటుంబం, ఒక వర్గం పేటెంట్ హక్కు అన్నట్టుగా మాట్లాడడం సాటి మనుషులను అగౌరవపరచడమే అవుతుంది.

మా తాతగారు తెలుగువారిలో ఆత్మగౌరవాన్ని తట్టిలేపారు, పౌరుషాన్ని రగిలించారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ తరుచుగా చెబుతున్న మాటలు. అలానే అన్నగారు తెలుగువారిలో రగిల్చిన ఆత్మగౌరవం ఇంకా అలానే ఉంది అంటూ ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ చెబుతున్నారు. తెలుగుజాతికే అవమానం జరిగింది, తెలుగు ఆత్మగౌరవం దెబ్బతింది అంటూ బాబ్లీ అరెస్టుల తరువాత ఎన్టీఆర్ అల్లుడు బాబు ఆవేదన చెందుతున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తెలుగు ఆత్మగౌరవం అనే నినాదం రాజకీయ రంగంలో ఒక ఊపు ఊపింది. అప్పటికే జనం కాంగ్రెస్‌పై విసిగెత్తి ఉన్నారు. సరైన ప్రత్యామ్నాయం లేదు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయం ఉందని చూపించారు. దాంతో 82లో కాంగ్రెస్ ఓట్లు చీలిన దాని కన్నా కాంగ్రెసేతర ఓట్లు ఏకమై టిడిపి అధికారంలోకి వచ్చింది.నిషేధాజ్ఞలు ఉల్లంఘించి బాబ్లీ సందర్శన కోసం చంద్రబాబు బృందం మహారాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు అరెస్టు చేయగానే టిడిపి నాయక బృందం ఒక్కసారిగా మళ్లీ తెలుగు ఆత్మగౌరవం అనే నినాదం అందుకుంది.
82లో ఎన్టీఆర్ నోట ఈ మాట విన్నప్పుడు నిజంగానే తెలుగువారు పులకరించిపోయారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆకాశం నేలకు దిగలేదు, అవినీతేం తగ్గలేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా అంతే. ఇంత కాలం తరువాత మళ్లీ ఈ పాత నినాదాన్ని పట్టుకుని గట్టెక్కుదామని చంద్రబాబు బృందం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఏంటో చంద్రబాబు బృందం గెలిస్తేనే తెలుగువారి ఆత్మగౌరవం నిలబడ్డట్టు లేకపోతే ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు.
రాష్ట్ర రాజకీయాల్లో కులం ప్రధాన పాత్ర వహిస్తోంది. ఒకసారి ఒక కులం విజయం సాధిస్తే మరోసారి వారి ప్రత్యర్థి కులం విజయం సాధిస్తోంది. పాలనలో, అక్రమాల్లో ఒకరికొకరు తక్కువేమీ కాదు. రెండు పార్టీల మధ్య పెద్ద తేడా కూడా ఏమీ లేదని తమ పాలనా కాలంలో రెండు వర్గాలు నిరూపించాయి. ఇలాంటప్పుడు ఆత్మగౌరవం అని నాయకులు గొంతు చించుకుంటే నవ్వోస్తుంది తప్ప ఎన్టీఆర్ హయాంలో లాగా ఒళ్లు పులకరించదు. తొలి భాషా ప్రయుక్త రాష్టం అయినా దేశంలో మరే రాష్ట్రంలో కూడా మాతృభాషకు ఇంత నిరా ద రణ ఉండదు.
తెలుగు ఆత్మగౌరవానికి ఏకైక హక్కుదారుగా భావించే టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బాబుగారు ముఖ్యమంత్రిగా సచివాలయానికి కొత్తద్వారం నిర్మించారు. ఆ ద్వారం వద్ద ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో సైతం బోర్డు ఏర్పాటు చేయాలని 70,80 ఏళ్ల వయసున్న వృద్దులు ధర్నాలు చేయాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రంలో తెలుగు పార్టీ పాలకుని హయాంలో తెలుగు బోర్డు కోసం పండు వృద్ధులు రోడ్డుప పడాల్సి వచ్చిందంటే తెలుగు ఆత్మగౌరవాన్ని వీరెంత గొప్పగా పరిరక్షించారో తెలుస్తూనే ఉంది. వీరి దృష్టిలో తెలుగు ఆత్మగౌరవం అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవహారమా? లేక తెలుగు ప్రజల సంస్కృతి, భాషకు సంబంధించిన అంశమా? అనేది తేలాలి. ఇప్పటి వరకు వీరి దృష్టిలో తెలుగు ఆత్మగౌరవం అంటే వారి కుటుంబానికి సంబంధించిన అంశంగానే కనిపిస్తోంది. మహా అయితే అమెరికా ‘ తానా’ సభ్యుల ఆత్మగౌరవం కావచ్చు. ఆ మధ్య బాబు తొలిసారి ఓడిపోయినప్పుడు తానా సభ్యుడొకరు అమెరికా నుంచి ఇక్కడికొచ్చి టిడిపి ఓటమితో సిగ్గుతో తలదించుకుంటున్నామని, తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని వాపోయారు.
83లో ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ముందు తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం అంతో ఇంతో పని చేసే సంస్థలుండేవి వీరొచ్చాక వాటిని ఎత్తేశారు. దాశరథి ఆస్థాన కవిగా ఉండేవారు వచ్చి రావడంతోనే ఆ పదవి రద్దు చేశారు. సంగీతం, నాటకం, నృత్యం వంటికళలను ప్రోత్సహించే అకాడమీలను రద్దు చేశారు. ఎన్టీఆర్ అధికారంలో ఏడేళ్లు, బాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు తెలుగు భాష, తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం ఏమైనా చేసుంటే ప్రకటించుకుంటే బాగుంటుంది. అంతే తప్ప వాళ్ల కుటుంబాన్ని గెలిపిస్తేనే తెలుగు ఆత్మగౌరవమని లేకుంటే తెలుగు ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే నవ్వుకుంటారు. ఆత్మగౌరవం అంటే మనను మనం గౌరవించుకోవడమే కాదు ఎదుటివారిని సైతం గౌరవించాలి.
నా పేరు చెప్పి గాడిదను నిలబెట్టినా ఎన్నికల్లో గెలుస్తుందని ఎన్టీఆర్ తమ్ముళ్ల ముందు సగర్వంగా ప్రకటించుకున్నారు. మా మోచేతి ఎంగిలి మెతుకులు తిని బతుకుతున్నారిన మిత్రపక్షమైన బిజెపిని ఎన్టీఆర్ విమర్శించారు. కోపం వచ్చి ఒకేసారి మొత్తం మంత్రివర్గం చేత రాజీనామా చేయించారు. ఇలాంటి చర్యలు ఆత్మగౌరవం అనుకుంటే చేసేదేమీ లేదు.
ఇక తెలంగాణకు ఎన్టీఆర్ స్వేచ్ఛ ప్రసాదించడం మరీ విడ్డూరం. తెలంగాణలో జరిగిన సాయుధ సంఘర్షణపై పొరుగు వారికి చిన్నచూపు ఉండొచ్చు, లేదా ఆసక్తి లేకపోవడం వల్ల తెలిసి ఉండక పోవచ్చు. ఎన్టీఆర్ నిమ్మకూరులో ఇంటింటికి తిరిగి పాలు పోస్తున్న కాలంలోనే తెలంగాణలో రైతుల సాయుధ సమరం సాగింది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి సామాన్యులు సాయుధసంగ్రామం జరిపారు. స్ర్తిలు, పిల్లలు, పురుషలు, వృద్ధులు అనే తేడా లేకుండా తుపాకులు, బడిసెలు పట్టి రజాకర్లపై పోరాటం చేశారు. దుర్మార్గాలు చేసిన దొరలను నరికి చంపారు. కారంపొడి కూడా మహిళల చేతిలో ఆయుధం అవుతుందని ప్రపంచానికి చాటి చెప్పారు. ఎన్టీఆర్ నిమ్మకూరులో పాలమ్ముకుంటున్న కాలంలోనే తెలంగాణలో సామాన్యులు ఆయుధాలు చేతపట్టి పోరాటం చేశారు. అప్పటికింకా చంద్రబాబు పుట్టినే లేదు. 1946లోనే ఆయుధాలు చేపట్టి పోరాటం చేసిన వారికి ఆత్మగౌరవం లేదా?పొరుగు రాష్ట్రాల్లో ఉప్పు సత్యాగ్రహం, నిరసన ర్యాలీలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణలో సామాన్యులు సైతం ఆయుధాలు చేపట్టి నిజాం సైన్యం మీద, రజాకార్ల మీద తిరగబడ్డారు. అంతటి ధైర్యవంతులకు అప్పుడు పౌరుషం లేదు, మేం వచ్చాకే ఆత్మవిశ్వాసం పౌరుషం పంచిపెట్టామని ప్రచారం చేయడం సిగ్గుచేటు. ఇంతే కాదు తెలంగాణ వాళ్లు మిట్టమధ్యాహ్నాం వరకు పడుకునే వారట! ఎన్టీఆర్ వచ్చాక వారికి తెల్లవారు జామున లేవడం నేర్పించారట! ఈ మాట స్వయంగా చంద్రబాబునాయుడు అనేక సార్లు చెప్పారు. పొద్దునే లేచి ఎవరిని దోచుకుందామా? అనే ఆలోచన లేకపోవడం వల్లనే ఆలస్యంగానే లేస్తాం లెండి అంటూ బాబు మాటలకు కెసిఆర్ సమాధానం చెప్పారు.
రష్యా వంటి అనేక దేశాల వారు తెలంగాణ సాయుధ సమరాన్ని, ఈ పోరాటంలో సామాన్యులు చూపించిన అసామాన్య ధైర్య సాహసాలపై అధ్యయనం చేశారు. అలాంటి ప్రాంతం వారికి స్వేచ్ఛ లేదని మా కోడి కూయందే తెల్లవారదన్నట్టు మేం వచ్చాక స్వేచ్ఛ ప్రసాదించాం అనే ప్రచారం ఒక ప్రాంతాన్ని అవమానించడమే. ఇలాంటి మాటలు చివరకు ఎక్కడికి దారి తీస్తాయో బాబుకు అనుభవంతో తెలిసుండాలి. ఆత్మగౌరవంపై ఇప్పుడు రోజూ ఉత్తరాలు రాస్తున్న హరికృష్ణది మరీ చిత్రమైన పరిస్థితి. మా నాన్న మరణంపై విచారణ జరిపించాలనే డిమాండ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన మళ్లీ బాబు పార్టీలో చేరి రాజ్యసభకు వెళ్లారు. ఆత్మగౌరవం అంటే ఇదేనా? తండ్రి మరణంపై అనుమానం ఎలా తీరిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా?

1 వ్యాఖ్య:

 1. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అని ఒక పాత పాట ఘోషించింది. అలా రామారావు నటుడిగా ఖ్యాతి గడించాడు గనక ఆయన తెలుగు సంస్కృతిని ఆకాశానికెత్తాడు అని ఇవాళ బొంకులు ప్రచారం చేసుకోవచ్చును. మీరు రామారావు ఏలుబడిలో జరిగిన దుర్నిర్ణయాలని, దుర్నీతినీ కొంత జనసామాన్యానికి గుర్తు చేసినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజులవి. రామారావు ఎన్నో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలనీ, విద్యా వైద్య సంస్థలనీ గాలికొదిలేసి, కిలో రెండు రూపాయల బియ్యం ఒక్కటే రాష్ట్రమన్నట్టుగా పేపర్లలో పూర్తి పేజీ ప్రకటనలిప్పిచ్చేవాడు. ఆయన హయాంలో ప్రభుత్వ గ్రంధాలయాలకి నిధులు రావడం తగ్గించేశాడు. ఎప్పటినుండో వున్న ప్రభుత్వ సంస్థల భూములని (ఉదాహరణకి కాకినాడలో పి.ఆర్. కాలేజీ) ప్రైవేట్ వ్యక్తులకి చవకగా అమ్మేశాడు. అలాగే దేవాలయాల ఆదాయల మీద కన్నేసి వాటికి సంరక్షణ కరువు చేశాడు. తెలుగు గంగ పాజెక్టు ప్రపంచ బాంకు నిధులతో కట్టించాడు. కానీ ఆ కాలవ పొడుగూతా భూములని రామారావూ ఆయన స్వజనమూ అంతకి ముందుగా కొనుగోలు చేశారు. పూర్వమున్న పంచాయితీ/తాలూకా వ్యవస్థని రద్దు చేసిందెందుకట? తన పార్టీ/కులాల వారికి యధేచ్చగా గ్రామస్థాయిలో అధికారం/ అవినీతీ పంచిపెట్టేందుకు. రామారావు సినీజీవి. అంటే లేనిది ఉన్నట్టుగా చూపించే మయాప్రపంచాన్ని సృష్టించి దానికి పబ్లిసిటీ అనే అంజనం వేసి జనానికి చూపెట్టడంలో చెయ్యి తిరిగిన వాడు. [ఇక్కడెవరికైనా మల్లెల బాబ్జీ అనే ఒక యువకుడి ఉదంతం గుర్తుందో లేదో].

  ఇక చంద్రబాబు హయాంలో అవినీతిని అంతర్జాతీయం చేశాడు. వాళ్ళకి కావలసిన చోటల్లా భూములు చవకగా కొనీ ఆక్రమించీ, తరవాత అది IMF, WORLD BANK అప్పులతో అభివృద్ధి చేసి, ఆ భూముల విలువని శతాధికంగా పెంచుకోవడం TDP వాళ్ళాకీ, వాళ్ళ తోకెంట వున్న సినిమా వాళ్ళకీ మప్పబెట్టింది ఆయనేను. ఈ భూదురాక్రమణపర్వంలో అనేకులు TDP, సినిమా పరిశ్రమ ప్రముఖుల పేర్లు వెలిగిపోతూ వుంటాయి. వ్యవసాయాన్ని అన్ని రకాలుగా నిర్లక్స్యం చేసి, కృష్ణా డెల్టాలో రైతులకి కూడా నీళ్ళు లేకుండా చేసిన ఘనత ఆయనది. [ఆలమట్టి డాం దిగువన వున్న కాలవ భూములన్నీ TDP వారు ముందుగా కొనుక్కుని అవి నల్గొండ, కృష్ణా జిల్లల దాకా రనివాలేదు. దానడగవలసిన పని ఆయనకి లేదు].


  YSR, అతని ప్రభుత్వమూ ఈ రకమైన అవినీతిని మరో 100 రెట్లు పెంచి, సామాన్యుల, బీద ప్రజల ఇళ్ళూ, స్థలాలూ, పొలాలూ కైవశం చేసుకోవడం మొదలెట్టారు.

  సంగ్రహహంగా - ప్రతి పార్టీ అధికారంలోకొచ్చాక దాని ముందు ప్రంభుత్వంలో వున్న అవినితి మారగాలన్నిటినీ యథాతథంగా పుణికి పుచ్చుకోవడమే గాకుండా, అందుకు పదింతల కొత్త మర్గాలని సృష్టించుకుంటుంది. సంజీవ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, వెంగళ రావు, చెనారెడ్డి, అంజయ్య, రామారావు, విజయభస్కర రెడ్డి, జనార్దన రెడ్డి, మళ్ళీ రామారావు, చంద్రబాబు, YSR, ....ఎవడైతేనేం, ఒక్కక్కాడూ ఒక్కో అవినీతి చక్రవర్తి, ప్రజాధనాన్ని హరించే ఒక తుచ్చ జీవి. దీనికి ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ భేదాల్లేవు.


  నేను తెలంగాణా వాదానికి వోటు వెయ్యను. కానీ తెలంగాణా వాదానికి కావలసిన సమర్ధన చాల వరకు పైన వివరించినట్లుగా రాష్ట్రం ఏవిధంగా కొన్ని బలవత్తర పార్టీ ప్రజాపీడక వర్గాల వల్ల భ్రష్టు చెయ్యబడిందో గమనిస్తే అర్ధమవుతుంది. ఈ అవినీతి త్రిపురాధీశుల్లో ఇటీవలి వారు ఇప్పుడు "సీమంధ్రా గా పిలవబడుతున్న ప్రాంతాలకి చెందిన నాయకులు. రేపు తెలంగాణా వస్తే KCR అతడి అనుయాయులూ సరి కొత్త తారకాసురులు. ఎక్కడి నించో వచ్చి రామారావూ, నాయుడూ, YSR, వాళ్ళ వాళ్ళ అనుయాయులూ హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని రాష్ట్రాన్ని దోచుకు తింటూ వుంటే, మనమేమిటబ్బా ఇక్కడే వుంటూ ఎప్పటికీ second class politicians గా మిగిలిపోతున్నామని TRS, ఇత్యాది తెలంగాణా నేతలందరీ వినరాని హృదయఘోష. ఇందుకనుకూలంగా ఎంతమంది తెలంగాణా ప్రజలని ఎగదోస్తే అంత మంచిది. నిజానికి ఈ ప్రభుత్వాల వల్ల అన్ని ప్రాంతాల ప్రజలూ ఒకే రకంగా బద్నాం చెయ్యబడ్డారు, బడుతున్నారు, బడతారూ కూడాను. వాళ్ళకోసం మనం కొట్టుకు చావడం వట్టి వేస్టు.

  - తాడేపల్లి హరికృష్ణ

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం