31, మార్చి 2011, గురువారం

మాస్క్ లీడర్స్..


ఏ మండోయ్- అని శ్రీమతి ఎంత గట్టిగా పిలిచినా వినిపించుకోకుండా నాయక భర్త కారెక్కి వెళ్లిపోయారు. భార్యతో మాట్లాడేందుకు ఒక మాస్క్, ప్రియురాలితో మాట్లాడేప్పుడో మాస్క్, ప్రజలతో మాట్లాడేప్పుడు ఇంకో మాస్క్, పార్టీ వారి కోసం మరొక మాస్క్, మీడియా ముందుకు ఒక మాస్క్.... సందర్భాన్ని బట్టి మాస్క్‌లను వెంట వెంటనే మార్చేసేందుకు ఎప్పుడూ కనీసం అరడజను మాస్క్‌లు లేందే అడుగు బయటపెట్టని భర్త ఈ రోజు ఒక్క మాస్క్ కూడా లేకుండా సొంత ముఖంతోనే వెళ్లాడు.

బట్టలే లేకుండా బయట తిరగొచ్చు కానీ మాస్క్‌లు లేకుండా ఈ కాలంలో బయటే కాదు ఇంట్లో కూడా ఉండలేరు అలాంటిది ఈయనేంటి అలా వెళ్లాడని ఆమె తనలో తానే మదనపడసాగింది. కర్ణుడికి కవచకుండలాలు శరీరంలో భాగంగా అయినట్టే ఈ కాలంలో మాస్క్‌లు శరీరంలో అంతర్భాగం.
చక్రం లేని కృష్ణున్ని గద లేని భీమున్ని, నిండుగా గుడ్డలు తొడుక్కున్న హీరోయిన్‌ను ఊహించలేనట్టే మాస్క్‌లు లేని రాజకీయ నాయకున్ని ఊహించలేలేకపోతున్నానని శ్రీమతి బాధ పడింది.

శ్రీమతి పిలుపును అస్సలు పట్టించుకోకుండా పరుగుపెట్టాడు. శ్రీమతి తొలుత కంగారు పడ్డా తరువాత, సిరికింజెప్పడు; శంఖ చక్ర యుముంజేదోయి అని శ్రీమహాలక్ష్మి అనుకున్నట్టుగా తానూ అనుకుంది.
భార్యకు కూడా చెప్పకుండా శంఖ, చక్రాలను తీసుకెళ్లకుండా ఆ శ్రీమహావిష్ణువు ఎలా పరుగులు తీశాడో, అచ్చం మా ఆయనా అలానే వెళుతున్నాడు అని నవ్వుకుంది. మా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి కచ్చితంగా ఆయనలోనూ శ్రీమహావిష్ణువు అంశ ఉంది అందుకే అలా మాస్క్‌లను ఇంట్లోనే పెట్టి పరుగులు తీశాడని తృప్తి పడింది.
**********

హేమాహేమీలైన నాయకులంతా మాస్క్‌లు లేకుండా తమ అసలు స్వరూపంతో సమావేశానికి వచ్చారు. మాస్క్‌లు ధరించక పోవడం వల్ల ఒక్కో నాయకుడి మనస్ఫూర్తిగా తాను ఏ మనుకుంటున్నాడో అదే మాట్లాడాడు. తొలుత చంద్రబాబు ఉపన్యాసం మొదలు పెట్టారు.‘‘ వైఎస్ ఆర్ లాంటి బలమైన నాయకున్ని ఓడించాలని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాను. ఎన్ని హామీలివ్వం ఎవరు పట్టించుకుంటారని అనుకున్నాను.
ఇప్పుడదే నా కొంపు కూలుస్తుందనుకోలేదు. నా నరనరాన సమైక్యాంధ్ర ఉంది. ఉండక చస్తుందా? సమైక్యాంధ్ర ఉంటేనే కదా! మళ్లీ ఏదో ఒక నాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చుననే ఆశ ఉంటుంది. పుట్టింది సీమలో ఆర్థిక బలం కోస్తాలో, పార్టీ బలం తెలంగాణలో, నా కష్టాలు పగవాడికి కూడా వద్దు. మూడు ప్రాంతాలు కలిసుంటేనే నాకు మళ్లీ ముఖ్యమంత్రి లభించే చాన్స్ ఉంటుంది.
ఇటు తెలంగాణ వారితో తెలంగాణ పోరాటం, సీమాంధ్రవారితో సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నాను, వ్యవహారం ఎక్కువ రోజులు సాగేట్టుగా లేదు. 2020 వరకు పాలించి, ఆ తరువాత మా అబ్బాయికి పట్ట్భాషేకం చేయాలని ఎన్ని కలలు కన్నాను. నగదు బదిలీ పథకం మా వాడే కనిపెట్టాడని చెప్పి మా అబ్బాయికి మెల్లగా అధికార బదిలీ చేయాలనుకుంటే ఊహించని విధంగా కష్టకాలం వచ్చిపడింది ’’ అంటూ చంద్రబాబు గద్గద స్వరంతో పలికాడు.

చిరంజీవి ఏదో చెప్పేందుకు ఉబలాటపడుతున్నట్టున్నారు. ఆయన్ని చెప్పనివ్వండి అంటూ సిపిఐ నారాయణ సూచించగానే చిరంజీవి మైకందుకున్నాడు. ‘‘ బాబుగారూ తొమ్మిదేళ్లు పదవి అనుభవించిన వారు మీరే అలా ఏడిస్తే మరి నేనెలా ఏడవాలి. తెలంగాణ ఏర్పాటు ఖాయం అనుకుని సీమాంధ్రను దునే్నద్దామనుకుని సమైక్యాంధ్ర అంటూ యాత్ర మొదలు పెట్టారు. దీంతో తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్‌లో విలీనం అయి కేంద్రంలో మంత్రి పదవి చేపడదామనుకుంటే దుష్టశక్తులు అడ్డుకున్నాయి. ఇప్పుడు చూస్తే తెలంగాణ వచ్చేట్టు కనిపించడం లేదు. అలా అయితే సీమాంధ్రలో నన్ను పట్టించుకునేదెవరు? అటు సినిమాల్లోకి వెళ్లి నటించలేను. ఇటు రాజకీయాల్లో నా నటనను ఎవరూ నమ్మడం లేదు.
నా బతుకు రెంటికి చెడ్డ రేవడిలా అయింది. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి నా రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఏర్పాటుకు మీరంతా సహకరించండి. అప్పుడు సీమాంధ్రలో అధికారం నాదే అవుతుంది. ఇనే్నళ్లు మీరూ మీరూ అధికారం పంచుకున్నారు, మాకు ఇప్పటికైనా అధికారం ఇవ్వరా? ’’ అంటూ చిరంజీవి తన కుర్చీలో కూలబడ్డారు.

‘‘ ఎక్కడున్నా ఓవర్ యాక్షన్ చేయడం మా పార్టీలో మాకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ వచ్చేస్తుందేమో అనుకుని వీరోచితంగా ఉపన్యాసాలు ఇచ్చేశాను, అవన్నీ నిజమే అని బాబు గారికి కూడా అనుమానం వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాకపోతే నా పరిస్థితేం కావాలి? ’’ అని నాగం జనార్దన్‌రెడ్డి దీనంగా అడిగాడు. ‘‘నోరు తెరవగానే పాండిత్యం బయటపడిపోయినట్టు గుమ్మనంగా ఉన్నంత కాలం నా అంతటి వీరుడు లేడని అంతా అనుకున్నారు.

పార్లమెంటులో టిడిపి జెండాలను పట్టుకుని వీరోచితంగా ఊగినప్పుడే నా తెలివితేటలు బయటపడిపోయాయి. ఇప్పుడు నన్ను తెలంగాణ వాళ్లు నమ్మేట్టుగా లేరు, సీమాంధ్ర వాళ్లు ఓస్ ఇంతేనా అని పెదవి విరుస్తున్నారు. నన్ను జనం నమ్మడం లేదు. అధిష్ఢానం నమ్మేట్టుగా లేదు. అందరి కన్నా ఎక్కువగా నష్టపోయింది నేనే’’ అని జగన్ వాపోయారు. మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు అందరి కన్నా ఎక్కువ లాభపడ్డది కూడా మీరే కదా! అని నాగం వెనక నుంచి చురక అంటించారు. తరువాత మాటా మాటా పెరిగింది.
*******

పరిస్థితిని ముందుగానే ఊహించిన శ్రీమతులు మాస్క్‌లను వెంటపెట్టుకుని హాలులోకి వచ్చి తమతమ భర్తలకు ఆ మాస్క్‌లు అందించారు. ఒళ్ళు విదిల్చి నాయకులంతా మళ్లీ మాస్క్‌లు ధరించి, తాము అప్పటి వరకు మాట్లాడింది అక్కడే వదిలేసి బయటకు అడుగు పెట్టారు. అమ్మో మాస్క్‌లు లేకుండా ఒక్క గంట కూడా రాజకీయాల్లో జీవించలేం అని నాయకులంతా కోరస్‌గా అనుకున్నారు. మాస్ లీడర్స్ అంతా మాస్క్ లీడర్లే అని తమకు తామే కితాబు ఇచ్చుకున్నారు. ******

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం