24, మార్చి 2011, గురువారం

మనకూ ఉన్నారు మగ రాడియాలు

- నీరా రాడియా బాగున్నావా!

నేనెవరో నీకు తెలియక పోవచ్చు కానీ నీవేమిటో ఈ దేశానికి తెలుసు. గొప్పవాళ్లు అనుకుంటున్న చాలా మంది అసలు రూపం ఏమిటో నీవు చెప్పేంత వరకు తెలియలేదు. నా కళ్లు తెరిపించావు గోపి అంటూ మా తెలుగు సినిమాల్లో డైలాగు వింటే నవ్వోస్తుంది, కానీ నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. వంద కోట్ల మంది జనంలో నీ అంత శక్తిసామర్ధ్యాలున్న వారు ఎంత మందుంటారు?
మనది పవిత్ర భారత దేశమని, ప్రజాస్వామ్యవ్యవస్థ అని , మీడియా నాలుగో స్తంభమని, చదువుకున్న సమాచారం నా బుర్రలో చాలా కాలం నుంచి తిష్ఠవేసుకుంది. ఆ బూజును ఒక్కసారిగా నేను దులిపేశావు. మన టెక్ట్స్ బుక్స్ అన్నింటిని తిరిగి రాయాల్సిన అవసరం ఉందని నీవు ఋజువు చేశావు రాడియా! మంత్రివర్గాన్ని ఖరారు చేసేది రాడియాలు తప్ప ప్రధానమంత్రి కాదని ఎంత చక్కగా చెపావు!
టాటాను తాత అని ముద్దుగా పిలుచుకుంటారు. నైతికతకు ప్రాణం పోస్తే ఇలానే ఉంటాడనించేది ఆయన్ని చూస్తే, నాస్తికులకు సైతం ఆయన నడిచే దైవం. అలాంటి టాటాలోని మరో కోణాన్ని ఈ ప్రపంచానికి చూపించిన నీవు నిజంగా ఒక శాస్తవ్రేత్తవు. మీడియా స్వేచ్ఛపై దాడి అంటూ ప్రతి చిన్నదానికి అరిచిగోల చేసిన వారి జ్ఞాననేత్రాలు తెరుచుకునే విధంగా లాబీయింగ్‌లో మీడియా, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు అంతా ఒకటేనని ఎంత బాగా నిరూపించావు! లుచ్చాలు, లఫంగాలు అంటూ ఏవేవో పేర్లు పెట్టి మనుషులను విడదీశారు. కానీ మనుషులంతా ఒకటే వారికి అప్పగించిన బాధ్యతలు బట్టి వేరువేరు పేర్లతో పిలుస్తారు కానీ ప్రాణమున్న మనుషులంతా ఒకటే అని నిరూపించావు!
బట్టలమ్ముకునేవారిలో సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మహనీయులు ఎవరు ? అనిడిగితే ఎదుటి వాడు అయోమయంలో పడిపోకుండా ఉంటాడా? ముంబై నుంచి తక్కువ ధరకు అరువుగా బట్టలు తెచ్చుకుని అందంగా అలంకరించి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మడానికి మించిన సిద్ధాంతం వారికేముంటుంది. అచ్చం అలానే బిజెపి, కాంగ్రెస్, డిఎంకె ఇంకా చిన్నాచితక పార్టీలో ఏ పార్టీది గొప్ప సిద్ధాంతమో తేల్చుకోలేక మేం కొట్టుకు చస్తుంటే అందరి సిద్ధాంతం ఒకటే అందరి పనులు ఒకటే అని మా కళ్లు తెరిపించావు రాడియా! నీ మీద ఒకవైపు ఎంత అభిమానం ఉన్నా మరోవైపు నీపై కొంత కోపం కూడా ఉంది...
.ఈ దేశాన్ని ఉత్తరాది వాళ్లే పాలించేస్తున్నారు. మా దక్షిణ భారతీయు లప్రతిభా పాటవాలకు గుర్తింపే లేకుండా పోతోంది. నిజానికి మాకూ ఉన్నారు మగ రాడియాలు. నీ అంత కాకపోయినా రాష్ట్ర స్థాయిలో నీలానే సాహసాలు చేసిన వారున్నారు. కానీ దక్షిణాది వాళ్లం అందులో తెలుగు వారం కావడం వల్ల గుర్తింపే లేకుండా పోయింది. మన్‌మోహన్ మంత్రివర్గంలో రాజాను చేర్చి, తద్వారా టెలికాం కంపెనీలకు ప్రయోజనం కలిగించే విధంగాజరిగిన నీ కృషి అమోఘం.
నీవు కేవలం మంత్రివర్గంలో ఒక వ్యక్తిని చేర్చినందుకే ఇంత కీర్తి పొందుతున్నావ్! కానీ మా తెలుగు మగరాడియాలు ఏకంగా ప్రభుత్వానే్న మార్చిపారేశారు.ఎంతో శక్తివంతుడైన ఎన్టీఆర్‌ను ఒక్క బాబే దించేశాడనుకుంటున్నావా? కాదు కాదు ఇప్పుడు నీవు రాజాను మంత్రివర్గంలో చేర్చడానికి లాబీయింగ్ చేసినట్టుగానే మా తెలుగు మగ రాడియాలు ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. విజయం సాధించారు. ఈ మగరాడియాలు నైతిక విలువల గురించి బోధించే స్థాయికి ఎదిగిపోయారు.
నీవంటే సంస్కరణల రెండవ దశలో రాణించావు కాబట్టి నీ పనికి కన్సల్టెన్సీ ఫీజు అని ముద్దు పేరు పెట్టుకుని తెల్లధనమే మెక్కేశావు. మా మగరాడియాలకు అలాంటి అవకాశం లేని కాలం కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా నొక్కేసి ఎక్కడికో ఎదిగిపోయారు. ఒక వేళ నీకు ఆసక్తి ఉంటే ముద్దుకృష్ణమ నాయుడు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు. 95లో వెన్నుపోటులో పాలు పంచుకున్న ‘నాలుగో స్తంభం వారి’ జాతకాలు నా వద్ద ఉన్నాయని అప్పుడాయన రోజూ చెప్పే వారు. ఆ జాబితా సంపాదించడానికి ప్రయత్నించు.
నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడరు ఎందుకంటే నీ కాల్స్ అన్ని ట్యాపింగ్ అవుతున్నాయి కాదా? వారి జాబితా నువ్వు సంపాదిస్తే విజయవంతంగా పనులు ఎలా సాధించవచ్చునో వారు మెలుకువలు నేర్పిస్తారు. ఔను అంతంత పెద్ద ఘన కార్యాలు చేసిన తరువాత కూడా నీవెప్పుడూ టీవిల్లో నైతిక విలువల గురించి ఉపన్యసిస్తూ కనిపించలేదేమిటి? టాటా వంటి ఒకే ఒక కస్టమర్ దగ్గర 60 కోట్లు వసూలు చేశావు, పద్మశ్రీ వంటి అవార్డులు పొందిన జర్నలిస్టులకు సైతం నీ లాబీయింగ్ వ్యవహారాల్లో పాత్ర కల్పించావు. నైతిక విలువల గురించి ఉపన్యసించడానికి నిన్ను మించిన అర్హతలు ఎవరికున్నాయి చెప్పు.
ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఎలాగూ నీకు మీడియాలో సైతం మంచి పరిచయాలున్నాయి. అందమైన ముఖం ఉంది. బోలెడు ఆస్తి ఉంది , నైతిక విలువలపై ఉపన్యసించడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి. వెంటనే కొన్ని చానల్స్‌ను సంప్రదించి సమాజంలో, రాజకీయాల్లో పడిపోతున్న నైతిక విలువల గురించి చక్కగా ఉపన్యసించేయ్! ఒకటిరెండు సార్లు నవ్వుకుంటారేమో తరువాత చచ్చినట్టు వింటారు. అనుమానం ఏమైనా ఉంటే తెలుగు న్యూస్ చానల్స్ చూసి నీ భాషలోకి అనువాదం చేయించుకుని విను. మన మేడిపండు వ్యవస్థల పొట్టవిప్పి చూపిన నీకు వేలవేల దండాలు. నీరా రాడియా! భారత రత్నకు నిజమైన అర్హురాలివి నీవే. ఇక ఉంటాను..- ఇట్లు నీ అభిమాని ...సగటు జీవి!

2 కామెంట్‌లు:

  1. నిజం - మెచ్చుకోవాలి మరి! 'శక్తివంతమైన మహిళ' గా సోనియాకి ఉన్నంత పేరు తెర వెనుక నీరాకు ఉన్నట్టే !

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ అండీ సుజాత గారు .. మీది తెనాలే మదీ తెనాలే అని గొప్పగా చెప్పు కుంటున్నారు తెనాలి వాళ్ళు అలానే సికింద్రాబాద్ గురించి రెండు మూడు రోజుల్లో రాయడం మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చింది. మీ ఫ్రొఫైల్ లో సికింద్రాబాద్ అని చూసాక

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం