ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్య సన్నని గీతమాత్రమే ఉంటుందట! ఆ గీత చెరిగిపోతే రెండూ ఒకటే అనిపిస్తుంది. ఒక్కోసారి అహంకారం ఆత్మవిశ్వాసం అనిపిస్తే, ఆత్మగౌరవం అహంకారం అనిపించొచ్చు.
అచ్చంగా ఇలానే స్వేచ్ఛకు బంధనానికి మధ్య సన్నిని గీత మాత్రమే ఉంటుంది. మనం స్వేచ్ఛ అనుకునేది బంధనం కావచ్చు, బంధనం అనుకున్నది స్వేచ్ఛ కావచ్చు. బంధనాలను తెంపుకుని స్వేచ్ఛా వాయువుల కోసం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారు దేశభక్తికి బందీ అయినవారే కదా!
మనిషి అత్యంత ఇష్టంగా ప్రేమించేది స్వేచ్ఛను. సంపద కన్నా స్వేచ్ఛనే మానవులు ఎక్కువగా ప్రేమిస్తామంటారు. అది నిజం కాదేమో కాస్త తరిచి ఆలోచించి చూస్తే మనిషి స్వేచ్ఛ కన్నా బందీ కావడానే్న ఎక్కువగా ప్రేమిస్తాడేమో!
తల్లిగర్భంలో బందీగా సంతోషాన్ని అనుభవించే శిశువు అందుకే తల్లిపేగు తెంచుకుని భూమిపై పడగానే తన స్వేచ్ఛను కోల్పోయానని కేర్‌మని ఏడుస్తాడు. కొందరు ప్రకృతి సిద్ధంగా తల్లి కడుపు నుంచి బయటకు వచ్చేస్తే, మరి కొందరు ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా డాక్టర్ల పుణ్యమా అని ఆపరేషన్ల ద్వారా బయటకు వచ్చేస్తారు.
మా మనుషులందరం భూమిపై ఎవరో ఒకరికి బందీ అయిపోయి జీవిస్తుంటే తల్లికడుపులో నువ్వోక్కడివి స్వేచ్ఛగా సంతోషంగా బందీ అవుతావా? చూస్తూ మేమెలా ఊరుకుంటాం అన్నట్టు శిశువును బయటకు తీసుకు వస్తారు. రాజకీయాలకు స్వేచ్ఛకు అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటిని విడదీసి చూడలేం. రాజకీయాలు మొదలైందే స్వేచ్ఛ కోసమే కదా! బ్రిటిష్ పాలనా కాలంలో బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలని దేశ మాత దాస్యశృంఖలాలు చేధించాలని స్వేచ్ఛ కోసం పోరాడిన నాయకులు భారత మాతకు బందీ అయిపోయారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఆ తరువాత తరం వాళ్లు రాజకీయాలకు బందీ అయ్యారు.
అధికార పక్షం రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఉద్యమిస్తాం, రండి కదలిరండి అంటూ నాయకులు పిలుపును ఇస్తారు. పిలుపులో ఉత్తేజం బాగానే ఉంటుంది కానీ వీరి పిలుపులోని అసలు ఉద్దేశం ప్రజలను విముక్తి చేసి స్వేచ్ఛను కల్పించడం కాదు, అధికారానికి బందీ కావడం కోసమే నాయకులు విముక్తి పోరాటలు జరుపుతుంటారు. మనిషి సంఘజీవి, స్వేచ్ఛ మనిషి సహజ లక్షణం అంటారు, కానీ ఏదో అది తప్పేమోనపిస్తుంది.
ఏదో ఒక దానికి బందీ కాకుండా ఉన్నవారిని ఒక్కరినైనా చూపండి చూద్దాం. మీలో పాపం చేయని వారు ఎవరూ చూపండి అని రాళ్లు విసిరేవారిని ఏసుక్రీస్తు అడిగితే అంతా వౌనంగా ఉన్నట్టుగానే నేటి జీవిని మీలో స్వేచ్ఛగా ఉన్నదెవరూ చూపండి అంటే అంతా గోళ్లు గిల్లుకోవలసిందే! మనిషి రక్తంలోనే స్వేచ్ఛా భావన ఉంటుందనేది తప్పేమో! సహజ సిద్ధంగానే మనిషి ఏదో ఒక దానికి బందీ అయి ఉంటారు.
సామాన్యులు కుటుంబానికో, భార్యా పిల్లల అనుబంధానికో బందీ అయి ఉంటారు. కొంత మంది మందుకు బందీ అయితే మరి కొంత మంది మగువకు బందీ అవుతారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అలానే ఎవరి బందీ జీవితం వారికి ఆనందం. కౌగిలిలోనే కైలాస ముండగ శివశివ అననేలా అని ఒక జవ్వని పూజారిని ప్రశ్నిస్తుందో సినిమాలో. అందమైన యువతి కౌగిలిలో బందీ కావడానికి ఇష్టపడనిదెవరు?
ఎనిమిది పదుల ముదుసలి వయసులో రాజభవనంలో అమ్మాయిల కౌగిలిలో బందీగా ఉండి కెమెరాలకు చిక్కిన మాజీ గవర్నర్ తివారీని వారి రాష్ట్రంలో ఇదే విషయం అడిగితే వయసులో ఉండగా నిరంతరం బందీగానే ఉండేవాన్ని అది నా ఇష్టం అన్నారని అక్కడ పత్రికల బోగట్టా! ఆయనిలా ఎంత మందికి బందీ అయ్యారో, ఆయన్ని ఎంత మంది బందించారో ఆయనకే తెలియాలి.
దేవదాసు పార్వతిని ఎక్కువ ప్రేమించారా? మందును ఎక్కువ ప్రేమించారా? దేవదాసు పార్వతి ప్రేమకు బందీ అయి ఉంటే ఆమె లేనిదే బతకలేకపోయేవాడేమో కానీ ఆమె లేకపోయినా చివరకు మందు లేందే బతకలేని దశకు చేరుకున్నాడు కాబట్టి పార్వతి కన్నా మందుకే ఆయన ఎక్కువగా బందీ అయ్యాడేమోననిపిస్తోంది.
చాలా మంది కుటుంబ బంధానికన్నా మందు బందం ధృడమైందని భావిస్తారు. వాళ్లను కుటుంబ ప్రేమ కట్టిపడేయలేదు కానీ బార్లు మాత్రం గట్టి తాళ్లతో కట్టిపడేస్తాయి.్భక్త రామదాసును తానీషా బందీ చేశాడంటారు కానీ ఆయన అంత కన్నా ఎక్కువగా శ్రీరామునికి బందీ అయ్యాడనేది వాస్తవం.
లేకపోతే ఖజానా డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తే తానీషా చెరసాలలో బందీ కాకతప్పదని తెలిసినా నిండా రామభక్తిలో బందీ అయిపోవడం వల్ల తానీషా గురించి పట్టించుకోలేదు.
సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకము అంటూ చెరసాలో రామదాసు చెప్పిన లెక్కలను ఇప్పుడు మరోసారి తిరగతోడుతున్నారు. భద్రాచలం మాదే అని సీమాంధ్ర నాయకులు వాదిస్తుంటే మీదెలా అవుతుంది కట్టించింది మా రామదాసు ! మీదెలా అవుతుందని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.
మాదే అవుతుందని ఆలయంలో గంట కొట్టి మరీ చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు కొందరు సీమాంధ్రకు, మరి కొందరు తెలంగాణకు బందీ అయ్యారు. నాయకులంటే గోడమీది పిల్లిలా అటూ ఇటూ కాకుండా తప్పించుకుంటారు దేవుళ్లు అలా చేయలేరు కదా! దేవుళ్లకు భక్తులు బందీ అవుతారా?
భక్తులకు దేవుళ్లు బందీ అవుతారా? అంటే పరస్పరం బందీలుగా ఉండడానికే ఇద్దరూ ఇష్టపడతారేమోననిపిస్తోంది.
దేవుళ్ల కోసం అన్నీ త్యజించిన భక్తుల కథలకు మనకు కొదవ లేదు. అలానే భక్తుల కోసం ఆఘమేఘాలమదీ పరుగులు తీసిన దేవుళ్లు ఎంత మంది లేరు. అందరు దేవుళ్ల కన్నా భక్తుల భక్తికి బందీ అయిన దేవుడిగా శివునికి గుర్తింపు ఎక్కువ. ఒకడు భక్తితో పార్వతిని అడిగినా ఇచ్చేశాడాయన, ఒకడు తలపై చేయిపెడితే ఎంతటి వాడైనా బూడిద అవుతాడని వరం ఇచ్చేసి ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాడు కదా!
దేవుళ్లే బందీ కాక తప్పనప్పుడు మనం ఏదో ఒక దానికి బందీ కావడంలో వింతేముంది. **
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం