13, జూన్ 2023, మంగళవారం

20ఏళ్లయినా జాడ లేని బడుగు ^ సీత ^ ... మీడియా రాజకీయాలకు అతి తెలివితో బలి ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -49 ---------------------------------

మీడియా రాజకీయాలకు అతి తెలివితో బలి ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -49 ---------------------------------- ఒకటి కాదు రెండు కాదు .. దాదాపు 20 ఏళ్ళ నుంచి ఓ బడుగు^ సీత ^ జాడ తెలియడం లేదు . ఎక్కడున్నారో , ఏమయ్యారో ? ఎక్కడ అజ్ఞాత జీవితం గడుపుతున్నారో ? నా జర్నలిస్ట్ జీవితం లో ఇదో ఆసక్తికర సంఘటన కావడం తో గుర్తుకు వచ్చింది . నా జీవితంలోనే కాకుండా ఆంధ్రభూమి సంస్థ లోనూ ఓ ఆసక్తికరమైన అనేక మలుపులు తిరిగిన సినిమా కథలాంటి కథ . బాస్ ల రాజకీయాలకు బలైన ఓ అమాయక , బడుగు ^ సీత^ ఉదంతమిది . సంగారెడ్డిలో 87 లో పని చేసేప్పుడు సీతా మాణిక్యం అనే కుర్రాడు పరిచయం. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు . ఆ తరువాత నేను అనేక జిల్లాలు తిరిగి హైదరాబాద్ వచ్చాక వీరి విషయం మరిచిపోయాను . ఓ రోజు సీతా మాణిక్యం ఆంధ్రభూమి ఆఫీస్ కు వచ్చి సినిమా రంగం పై ఓ బుక్ రాసినట్టు చెప్పాడు . అటెండర్ గా పని చేసే తండ్రి రిటైర్ అయితే వచ్చిన డబ్బుతో సినిమా రంగం పై బుక్ .. ఆ బుక్ లో ఏముందో ఊహించగలరా ? అప్పడు సినిమా రంగం లో వెలిగిపోతున్న దర్శకేంద్రులు , దర్శక రత్నలు , దర్శక బ్రాహ్మలు , దాసరి నారాయణరావు , రాఘవేంద్రరావు లాంటి ఇంకా చాలా మంది హేమా హేమీలు సినిమాల్లో ఏం తప్పు చేస్తున్నారు , సినిమా ఎలా తీయాలో వారికి సూచనలు చేస్తూ పుస్తకం రాశాడు . కొడుకు సినిమా రంగాన్ని ఏలేస్తాడు అనుకున్నాడో ఏమో కానీ రిటైర్ మెంట్ డబ్బులు ఇస్తే బుక్ వేశారు . అమాయకత్వం అంతటితో ముగియలేదు. ఆ పుస్తకాన్ని తీసుకోని రాఘవేంద్రరావు , దాసరి తో పాటు అప్పటి దర్శకులు అందరినీ కలిసి ఈ బుక్ చదివి సినిమా ఎలా తీయాలో తెలుసుకోండి అన్నట్టు ఇచ్చి వచ్చాడు . ఆ సమయంలో ఆ దర్శకుల ముఖ కవళికలు ఉహించుకోవాల్సిందే ... సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సీతా మాణిక్యం ఈ పుస్తకం ద్వారా ప్రముఖ దర్శకుల దృష్టిలో పడతాను అనుకున్నాడు . వారి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తుంటే ఎంతకూ పిలుపు రాలేదు . అటునుంచి నరుక్కు వద్దాం అనుకొని ప్లాన్ మార్చాడు ***** చాలా మంది సినిమా జర్నలిజం ద్వారా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తారు . చాలా మంది విజయం సాధించారు కూడా . అదే మార్గంలో వెళ్ళాలి అని ఆంధ్రభూమిలో పార్టీ టైం విలేకరి ( స్ట్రింగర్ ) గా చేరాడు . మెల్లగా సినిమా పై ఆసక్తి ఉందని ఎడిటర్ కు చెబితే ఒకే అని పంపారు . ఓ రోజు ఏదో రహస్యం అన్నట్టు ఆఫీస్ దగ్గర ఉన్న ఇరానీ హోటల్ కు తీసుకువెళ్లి , రహస్యంగా దాచిన పేపర్ లు చేతిలో పెట్టారు . అంతా చదివి నేను ఆశ్చర్యంతో చూస్తాను అనుకున్నాడు . ఆ పేపర్లు చదివి అతని చేతిలో పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు ఎడిటర్ ఇష్టపడరు . మడిచి ఇంట్లో పెట్టుకో అన్నాను . సినిమా జర్నలిస్ట్ లు అందరూ కవర్లు తీసుకోని సినిమా వార్తలు రాస్తారు అనేది ప్రధాన అంశం . పోనీ ఈ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాడా ? అంటే అది కాదు , మీరే డబ్బులు తీసుకుంటారా ? నాలాంటి కొత్త వారికి ఇప్పించరా ? అని అడుగుతున్నట్టుగా ఉంది . నీ బాధ నీకు డబ్బులు ఇవ్వకపోవడం అయితే అదే అడుక్కో ఇంత పెద్ద వ్యాసం ఎందుకు అని చెప్పాను .. ****** నేను ఊహించని విధంగా మరుసటి వారం ఆంధ్రభూమి సినిమా సంచిక వెన్నెలలో పెద్దగా వచ్చింది . రివ్యూలు నిష్పక్ష పాతం గా రాస్తారని భూమి సినిమా స్పెషల్ వెన్నెలకు సినిమా రంగం లో మంచి పేరుంది . సినిమా జర్నలిస్ట్ లు , సినిమా వాళ్ళు చూపే వివక్ష , కవర్ల సంస్కృతి పై మాణిక్యం వ్యాసం సంచలనం సృష్టించింది . సినీ రిపోర్టర్ ల కుటుంబం సమావేశమై మాణిక్యం ను బహిష్కరించాలని నిర్ణయించారు . బయటి నుంచి బయటే పంపించారు . అతను ఎడిటర్ కు చెప్పడం తో ఎడిటర్ శాస్త్రి ఫోన్ చేసి మన సినిమా రిపోర్టర్ ను బహిష్కరించారు . వెళ్లి సినిమా వాళ్లందరితో మాట్లాడి ఓ స్టోరీ రాయి అని ఆదేశం ... రాజకీయ నాయకులనంటే ఆడుకోవచ్చు కానీ మనుష రూపం లో ఉన్న దేవతలం అనుకునే సినిమా వాళ్ళ దగ్గరకు పోవడమా ? తప్పదు అని మిత్రుడు చక్రధర్ కు ఫోన్ చేస్తే వస్తా అంటే ఇద్దరం వెళ్ళాం . హీరో వెంకటేష్ ను కలిసి విషయం చెబితే .. మీకు తెలుసు కదా వివాదాల్లో నేను జోక్యం చేసుకోను అన్నారు . నాకేం తెలుసండి .. మిమ్ములను మొదటి సారి కలుస్తున్నాను అన్నాను . అక్కినేని నాగేశ్వర రావు సుదీర్ఘంగా మాట్లాడారు . స్టూడియో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కడతారు . ఇది అందరి సొత్తు అందరూ రావచ్చు . ... బహిష్కరించడం తప్పు ఇలా సాగింది ఆక్కినేని ఉపన్యాసం . అందుబాటులో ఉన్న వారితో మాట్లాడి పెద్ద స్టోరీ రాసి ఎడిటర్ కు ఇచ్చాను .పార్టీ కార్యాలయాల్లో ఎంత పెద్ద నాయకుడైన జోకులేస్తూ మాట్లాడే రిపోర్టర్ కు బంజారాహిల్స్ లో అడ్రెస్ లు వెతుక్కొని , నటులను పట్టుకొని మాట్లాడడం చాలా కష్టమే . ***** సాయంత్రం ఏం జరిగిందో , ఎవరు రాయబారం నడిపారో తెలియదు . నేను రాసిన వార్త ను పక్కన పెట్టి ఎడిటర్ తేలిగ్గా వద్దులే అన్నారు . వద్దులే అనే వాడు నన్ను అంత ఇబ్బంది పెట్టి ఉదయం అంత ఆవేశంగా మాట్లాడడం ఎందుకు అనిపించింది . ఎడిటర్ ఆవేశానికి తగ్గట్టు రోడ్డున పడి తిరిగాను . ఇలా ఎందుకు జరుగుతుంది అనేది , వయసు , అనుభవం పెరిగాక అర్థం అవుతుంది . సాధారణంగా ఇలాంటి తెలివి తేటలు గల్లీ లీడర్లు చూపిస్తారు . ఇద్దరి మధ్య పంచాయితి పెట్టి పెద్ద మనిషిలా వాటిని పరిష్కరిస్తారు . తనతో వార్త రాయించి , తనను బహిష్కరించిన తరువాత తనను అటు సినిమా వాళ్ళు , ఇటు భూమి పట్టించుకోక పోవడం తో సీతా మాణిక్యం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం . అదీ సినిమా ఫక్కీలోనే ... ఆంధ్రభూమి ఆఫీస్ గేటుకు అనుకొనే కార్పొరేట్ ఆస్పత్రి ఉంటుంది . ఆంధ్రభూమి గేటు వద్ద పడిపోతే కాళ్ళు కార్పొరేట్ ఆస్పత్రి వద్ద ఉంటాయి . నిద్రమాత్రలు మింగి పడిపోగానే అంతా పరిగెత్తి ఆస్పత్రిలో చేర్పించాం . సాయంత్రం గుడిపూడి శ్రీ హరి రాయబారానికి వచ్చారు . మీరూ , ఎడిటర్ , సినిమా వాళ్ళు అంతా బాగానే ఉంటారు . పాపం ఆ పిచ్చోడే అని ఏదో అంటే ఆయన అంతా సర్దుబాటు చేస్తాను అన్నారు . తరువాత పోలీసులు వస్తే జరిగింది పూసగుచ్చినట్టు వివరించా .. తరువాత నాకు చుట్టుకుంటుంది అని తెలియక .. తెలిస్తే ఎడిటర్ ను కలవండి వారికి అంతా తెలుసు అనేవాడిని .అప్పుడు ప్రముఖ సినిమా జర్నలిస్ట్ లు అంతా ఈ కేసులో కోర్ట్ చుట్టూ తిరిగారు . తన ఆత్మహత్యకు ఎవరెవరు కారణమో మాణిక్యం ఓ లేఖ రాసిపెట్టడం తో అందులో పేర్లు ఉన్నసినిమా రిపోర్టర్ లు అందరూ కోర్ట్ చుట్టూ తిరగాల్సి వచ్చింది . సీతా మాణిక్యం ఒక రకంగా సినిమా రిపోర్టర్ లకు సినిమా చూపించాడు . ***** పనికిరాని వ్యాసం వేయడం ఎడిటర్ తప్పు . ఎడిటర్ అంటే దేవుడు . దేవుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయవచ్చు అనుకోని ఆవేశంతో ఊగి పోవడం రిపోర్టర్ తప్పు .. రాయించేప్పుడు భరోసా ఇచ్చి , సమస్య వచ్చినప్పుడు తన్ని పంపిస్తారు అనేది రిపోర్టర్ కు సగం జీవితం సంకనాకి పోయాక తెలుస్తుంది . ***** తరువాత మాణిక్యం ఏమయ్యాడో అంతా మరిచిపోయాక ఆఫీస్ లో కలకలం .ఎడిటర్ గ్రంథసాంగుడు , కళాకారుడు అంటూ పెద్ద కరపత్రం అన్ని పత్రికా కార్యాలయాల్లో హాట్ టాపిక్ గా మారింది . చివరకు దీన్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఎడిటర్ ప్లాన్ . అసమర్ధత తో రైలు ప్రమాదం జరిగితే దేశ ద్రోహుల కుట్ర నాకే ఓటు వేయండి అని ప్రచారం చేసినట్టు . నక్సల్స్ కింద బాంబు పెడితే ముందస్తుకు వెళ్లి నాకే ఓటు వేయమన్నట్టు .. తన కళారూపాలపై వచ్చిన కరపత్రాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారు . చూడ్డమే కాదు కరపత్రాన్ని అడ్డుపెట్టుకొని ఆఫీస్ లో భయానక వాతావరణాన్ని సృష్టించి అందరూ తన గుప్పిటలో ఉండేట్టు చేసుకున్నారు . ఆఫీస్ లో ఎవరికి ఎవరు పడక పోతే కరపత్రం వాడే వేసి ఉంటాడు అని అనుమానం . చివరకు బయటి నుంచి రాసే పాత్రికేయ అనే సినిమా ఫ్రీ లాన్సర్ , అప్పుడు రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న సుగం బాబు అనే సబ్ ఎడిటర్ ను పట్టుకొని కరపత్రం నువ్వే వేశావు కదా ? అని బెదిరింపు . అతను వణికిపోయాడు . భూమిలో యూనియన్ చాలా స్ట్రాంగ్ . పాత్రికేయను పట్టుకొని ఏరా మా స్టాఫ్ ను బెదిరించేంత మొనగాడివా ? ఇంకోసారి ఆఫీస్ కాంపౌండ్ లో కనిపించవద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపారు . యూనియన్ అనేది లేకపోతే పర్మనెంట్ ఉద్యోగి అనే వాడిని ఒక్కడిని ఉంచకుండా పంపించి ... భయంతో వణికిపోయే.. తన కనుసన్నల్లో ఉండే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఎడిటర్ఆ ఫీస్ నింపేసేవారు .. కరపత్రం ఎడిటర్ మీద వస్తే ఎడిటర్ సంతోషంగానే ఉన్నారు కానీ ఆఫీసులో ఒక్కొక్కరు వణికిపోతున్నారు . తప్పు చేయనప్పుడు వణికిపోవడం ఎందుకు? అని డైలాగులు చెప్పవచ్చు . ఆ రోజుల్లో పత్రికల్లో ఉద్యోగం అంటే అంతే .. ముళ్ళు వచ్చి ఆకుమీద పడ్డా? ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా .. ఉడేది కాంట్రాక్ట్ ఉద్యోగి ఉద్యోగం .. పర్మనెంట్ ఉద్యోగి అయితే బదిలీ . సీతా మాణిక్యం తప్ప ఇంకెవరికీ మీ మీద కరపత్రం వేయాల్సిన అవసరం లేదు . అతనే అని శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పాను . రాత్రి 11. 40 వరకు అత్యవసర సమావేశాలు . నేను చేసిన శాస్త్రీయ విశ్లేషణ కు తల ఉపినట్టు అనిపించింది . హమ్మయ్య అనుకున్నాను . అందరినీ రక్షించాను అని నన్ను నేను మనసులోనే అభినందించుకొని .. ఇంటికి వెళ్ళాను . సికింద్రాబాద్ నుంచి వారాసిగూడ మా ఇంటికి వెళ్ళడానికి దాదాపు పదిహేను నిమిషాల సమయం పడుతుంది . బైక్ పార్కు చేసి ఇంట్లో అడుగుపెడుతున్నాను . ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అయింది . అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేశారా ? అని చూస్తే ఫోన్ ఎత్తగానే ఎడిటర్ ... ఆ కరపత్రాలు పంచడం అయిపోయిందా ? అని అడిగాడు . అలా అడిగితే ఉద్యోగికి గుండె ఆగినంత పని అవుతుంది . సైకాలేజి పై అభిమానం , అయన తీరు గురించి ఎంతో కొంత అవగాహన ఉండడం వల్ల .. భయపడకుండా .. కరపత్రాలు పంచడం కాదు .. మురళి ఆ కరపత్రం చదువుతుండగా నేను చూశాను అని ఎవరైనా చెప్పినా ఆధారాలు అవసరం లేదు .. రాజీనామా చేస్తాను అన్నాను . ఇది పొలిసు కానిస్టేబుల్ తరహా విచారణ . ఒక వేళ నిజంగానే కరపత్రాలు పంచితే భయపడి పోయి చూశాడేమో అనుకోని నిజం చెబుతారు . చదివాను అంటే రాజీనామా చేస్తాను అనేసరికి ... ఒక్కసారిగా తగ్గిపోయి అదేంటీ నువ్వు చదవలేదా అని అడిగారు . చదవలేదు . చదవను అన్నాను . అందులో నీ గురించి కూడా ఉంది . చదవకపోవడం ఏమిటీ అంటే , నేనెంటో నాకు తెలుసు , వాడెవడో కరపత్రం లో చెప్పాలా ? అందుకే చదవలేదు అన్నాను . అంతకు ముందే ఆంధ్రప్రభ మిత్రుడు చెన్నూరు గణేష్ కరపత్రం పంపుతాను అంటే వద్దు అన్నాను . నువ్వు మొదట్లో మంచివాడివి అని , ఇప్పుడు ఎడిటర్ కు చెంచా గా మారా వు అని కరపత్రం లో రాశాడు అని మిత్రుడు చెబితే మేనేజ్ మెంటే ఎడిటర్ కు చెంచా గా మారిపోయింది .. ఉద్యోగులు ఒక లెక్కనా అని జోకేసి . కరపత్రం చదివే ఆసక్తి లేదు అని చెప్పాను . ******* అంతా మరిచిపోయాక ఓ రోజు నాకు కోర్ట్ నుంచి వారెంట్ ... సీతా మాణిక్యం కేసులో సాక్షిగా హాజరు కమ్మని . ఎడిటర్ ను కలిసి వారెంట్ చూపితే కోర్టు కు వెళ్లాల్సిన అవసరం లేదు అన్నాడు .. నిజానికి నేను ఇదంతా రాసింది. జర్నలిజం లోకి కొత్తగా వచ్చే వారికి ఈ విషయం చెప్పడానికే . ఎడిటర్, మేనేజ్ మెంట్ అంటే కనిపించే దైవం అన్నంత భ్రమలు ఉంటాయి మనకు కొత్తలో ... ఎడిటర్, మేనేజ్ మెంట్ చెప్పాక , పోలీస్ స్టేషన్ , కోర్ట్ , చట్టాలు అన్నీ పిపీలికల్లా కనిపిస్తాయి . మేనేజ్ మెంట్ , ఎడిటర్ అనే వారు పని కోసం భుజం తడతారు . కేసు అయితే పక్కకు తప్పుకుంటారు . కోర్టుల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వారు కూడా వారంట్ ను పట్టించుకోవలసిన అవసరం లేదు కోర్ట్ కు వెళ్ళ వద్దు అని చెప్పరు . ఎడిటర్ మాట విని వెళ్లక పోతే అరెస్ట్ వారంట్ వస్తుంది . అప్పుడు ఇదే ఎడిటర్ ఉద్యోగం నుంచి తీసేయమని రికమండ్ చేస్తారు . దీన్ని గ్రహించి నిర్ణయం తీసుకోవాలి న్యాయవాది అయిన ఫ్రెండ్ ను అడిగితే వెళ్ళాలి .... భయపడకు అని ... సినీ దర్శకుడు జంధ్యాల ఓ కేసులో కోర్ట్ కు వస్తే చమటలు పట్టాయి వణికిపోయారు అని న్యాయవాద మిత్రులు చెప్పారు . నువ్వు యల్ యల్ బి అయ్యాక కోర్ట్ చూసి ఉంటావ్ .. నేను టెన్త్ లోనే చూశాను . టెన్త్ హాలిడేస్ లో పోతుకూచి సాంబశివరావు అని న్యాయవాది వద్ద జాబ్ చేసేవాడిని . అప్పటి వరకు కోర్ట్ అంటే జస్టిస్ చౌదరి సినిమా తరహాలో వాదించుకుంటారు అనుకున్నా . ఎలా ఉంటుందో తెలుసు అన్నాను . ఎడిటర్ కు చెప్పకుండా కోర్ట్ విచారణకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నా ... సినిమా షూటింగ్స్ లో దర్జాగా కనిపించే సినిమా జర్నలిస్ట్ లంతా కోర్ట్ లో కనిపించారు . వాయిదా పడ్డ ప్రతిసారి ఇలా వస్తున్నాం అన్నారు . బాధితుడు సీతా మాణిక్యం తప్ప అంతా ఉన్నారు . బోనులో నిల్చున్నాక జడ్జీ సీతా మాణిక్యం ఏడీ అని అడిగారు . నాకేం తెలుసు ... ఔను సీతా మాణిక్యం ఏడీ అని నేనూ అడిగాను . సరే మీరు వెళ్ళండి అని పంపించారు . తరువాత నన్ను ఎప్పుడూ పిలవలేదు . కేసు ఏమైందో పట్టించుకోలేదు . ఐతే దాదాపు రెండు దశాబ్దాల నుంచి సీతా మాణిక్యం కోసం చూస్తూనే ఉన్నా ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఏమయ్యాడో తెలియదు .. ఆ రోజు ఎడిటర్ పనికిరాని ఆ వ్యాసం వేయకపోయి ఉంటే జర్నలిస్ట్ గా ఎక్కడో పని చేస్తూ ఉండేవాడు . మాణిక్యం లా కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి .. ప్రాక్టికల్ గా ఉండాలి . చట్టం కన్నా ఎడిటర్/ మేనేజ్ మెంట్ గొప్పవాడు కాదు .. - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం