6, జూన్ 2023, మంగళవారం

మోడీని అందలమెక్కించి .. బాబును వెంటాడుతున్న గోద్రా :బీజేపీ తో పొత్తుపై నిర్ణయించడానికి బీజేపీ ఎవరన్నాను ... నా మాటే నిజమైంది ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -43

బీజేపీ తో పొత్తుపై నిర్ణయించడానికి బీజేపీ ఎవరన్నాను ... నా మాటే నిజమైంది ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -43 20 ఏళ్ళ క్రితం నాటి మాట .. 2002 ఎన్టీఆర్ భవన్ మెట్లెక్కి పైకి పోతుంటే అప్పుడే చంద్రబాబు వచ్చారు .ఇంగ్లీష్ ఛానల్ స్టార్ న్యూస్ రిపోర్టర్ బాబును పలకరించి గోద్రా అల్లర్ల గురించి అడిగారు . ఆ సమయంలో ఎన్టీఆర్ భవన్ లో ఇద్దరు ముగ్గురు విలేకరులు తప్ప ఎవరూ లేరు . ఆ సమయంలో ఉద్భవించిన వార్త రెండు దశాబ్దాలు అవుతున్నా బాబును వెంటాడుతూనే ఉంది . గోద్రా అల్లర్లకు బాధ్యత వహించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి అని బాబు డిమాండ్ చేశారు . ఆ డిమాండ్ పుణ్యమా అని సీఎంగా మోడీ తన పదవిని పదిలం చేసుకోవడమే కాకుండా , ప్రధాన మంత్రి పదవి వరకు ఎదిగారు . బాబుకేమో మోడీ దర్శనం లభించడం లేదు . ***** మీడియాను చూస్తే మాట్లాడకుండా ఉండలేరు .అది బాబు బలహీనత , బలం రెండూ . పదేళ్ల ఉమ్మడి రాష్ట్ర సీఎం , ఐదేళ్ల ఆంధ్ర సీఎంగా జర్నలిస్ట్ లందరి సంక్షేమం వంటివి పెద్దగా పట్టించుకోలేదు కానీ కడుపు నిండా , కడుపు నిండానే కాదు ఒక్కోసారి అజీర్తి లేసేంతగా వార్తలు వడ్డించారు . ఆయన ఉన్నప్పుడు నాలుగైదేళ్ళ వర్షాలు లేక పంటలకు కరువు వచ్చిందేమో కానీ ఆ బీట్ రిపోర్టర్ల వార్తల కరువు అనే మాటే ఎరుగరు . పత్రికల్లో సింహా భాగం టీడీపీ రిపోర్టర్లే ఆక్రమించే వారు . బాబు ఎన్టీఆర్ భవన్ కు వచ్చేప్పుడు , వెళ్లేప్పుడు మీడియాతో మాట్లాడేవారు . అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ భవన్ తో పాటు సచివాలయానికి వచ్చేప్పుడు , వెళ్లేప్పుడు మాట్లాడేవారు . వై యస్ ఆర్ సీఎం కాగానే మీడియా అలానే మాట్లాడేందుకు ప్రయత్నిస్తే , ఏమైనా మాట్లాడేది ఉంటే నేనే పిలుస్తాను అని వచ్చేప్పుడు , వెళ్లేప్పుడు మాట్లాడే సంప్రదాయానికి స్వస్తి పలికారు . 2004 లో టీడీపీ ఓడిపోయాక అసెంబ్లీ లో బాబు ఛాంబర్ లో ఇలానే మాట్లాడేవారు . ఓ రోజు బాబు సభలో ఉండగా ఛాంబర్ లో ఉన్న టీడీపీ నేత అమర్ నాథ్ తో బాబు ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు మీడియాతో మాట్లాడితే ఏం బాగుంటుంది . ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే మాట్లాడాలి అని ఉచిత సలహా ఇచ్చాను . సభ తరువాత కొద్ది సేపటికి బాబుతో ఛాంబర్ లో ఏదో రాజకీయ అంశాన్ని ప్రస్తావిస్తే చాలా సేపు మాట్లాడారు . తరువాత అమర్ నాథ్ నా దగ్గరకు వచ్చి ఎక్కువగా మాట్లాడవద్దు అని మీరే సలహా ఇస్తారు . మీ సలహా గురించి నేనేమో బాబుకు చెప్పాను .. మళ్ళీ మీరే మాట్లాడేట్టు చేస్తారు ఇదేంటి అని నిష్టురంగా అడిగారు . ఎక్కువగా మాట్లాడవద్దు అని మిత్రుడిగా సలహా ఇచ్చాను . రిపోర్టర్ గా వార్త కోసం మాట్లాడేట్టు చేశాను . ఆఫీస్ కు వెళ్లి సలహా ఇచ్చి వచ్చాను అంటే కుదరదు కదా ? వార్త రాయాలి కదా ? ఎక్కువగా మాట్లాడాలా ? వద్దా అని బాబు నిర్ణయించుకోవాలి అన్నాను . వద్దు అని సలహా ఇచ్చినా మీడియా కనిపిస్తే బాబు ఒకప్పుడు మాట్లాడకుండా ఉండలేక పోయేవారు .. **** అలాంటి అలవాటుతోనే ఓ సారి కొంప మునిగింది . స్టార్ న్యూస్ రిపోర్టర్ పకలరించి గోద్రా గురించి అడగ్గానే మోడీని సీఎం పదవి నుంచి దించేయాలి అని డిమాండ్ చేశారు . ఐతే ఈ డిమాండ్ వెనుక బాబు కు ఓ సమాచారం ఉంది . పాలకుడు రాజధర్మం పాటించాలి ,అందరినీ సమానంగా చూడాలి అని ప్రధానిగా ఉన్న వాజపేయి గుజరాత్ పరిణామాలపై స్పందించారు . మతం , కులం , ప్రాంతం అనే ఏ వివక్ష చూపకుండా అందరినీ సమానంగా చూడడమే రాజధర్మం అని వాజపేయి చెప్పారు . దీనితో మోడీకి ఉద్వాసన ఖాయం అనుకున్నారు . ఓ దశలో అది ఖరారు అయింది కూడా . మోడీని ఉంచాలా ? తొలగించాలా ? అనేది పార్టీ అంతర్గత వ్యవహారం . దీనిలో ఇతర పార్టీల జోక్యం ఏమిటీ అనే వాదన మొదలైంది . అద్వానీ మోడీకి అండగా నిలిచారు . వాజపేయి రాజధర్మం బోధించడం అప్పుడు పత్రికల్లో చదవడమే తప్ప చూడలేదు . యూ ట్యూబ్ పుణ్యమా అని అది ఇప్పుడు చూశాను . వాజపేయి రాజధర్మం గురించి చెబుతుంటే పక్కనే ఉన్న మోడీ నవ్వుతూ మధ్యలోనే జోక్యం చేసుకుంటూ రాజధర్మం పాటిస్తున్నాను అన్నారు . నన్నెవరూ తొలగించలేరు అనే ఆత్మ విశ్వాసం ఆ నవ్వులో కనిపిస్తుంది . ఎలాగూ మోడీని తొలగిస్తున్నారు , అదేదో మన ఖాతాలో వేసుకుందాం అనుకున్న బాబు ఇరకాటంలో పడిపోయారు . హైదరాబాద్ లో మోడీని అడుగు పెట్టనివ్వం , అరెస్ట్ చేస్తాం అని ప్రకటించారు . మోడీనే కొనసాగుతారు అని తేలాక ఈనాడులో పెద్ద వార్త రాయించారు . ప్రస్తుతానికి మోడీని కొనసాగించినా , అంతా సద్దుమణిగాక మోడీని తొలగిస్తామని బీజేపీ అధిష్టానం బాబుకు హామీ ఇచ్చింది అని ఈనాడులో పెద్ద వార్త . ఆ తరువాత బాబు కొద్ది రోజులు మీడియాకు దూరంగా ఉన్నారు . ఎన్టీఆర్ భవన్ లో కొద్ది రోజులు మీడియాను తన వద్దకు రానివ్వలేదు . తరువాత షరా మాములే . గుజరాత్ లో తాత్కాలిక సర్దుబాటుగా సీఎం అయిన మోడీ గోద్రా అల్లర్లతో సీఎంగా స్థిరపడడమే కాకుండా , ప్రధానమంత్రి వరకు వచ్చారు . రెండు దశాబ్దాలు గడిచినా గోద్రా అల్లర్లతో మోడీ రాజీనామా చేయాలనే బాబు డిమాండ్ ఇప్పటికీ బాబును వెంటాడుతూనే ఉంది . 2014లో అదే మోడీని బాబు మహాత్మగాంధీ తో పోల్చి అభిమానం సంపాదించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు . మళ్ళీ విడిపోయి ఇప్పుడు మళ్ళీ మోడీ ని ప్రసన్నం చేసుకోవడానికి గత నాలుగేళ్ళ నుంచి బాబు చేయని ప్రయత్నం లేదు . చివరకు తెలంగాణ నుంచి నరుక్కు రావడానికి ప్రయత్నిస్తున్నారు . ****** 1998 లో సొంతంగా ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి 4 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి . వాజపేయి ఇమేజ్ గ్రహించిన బాబు 99 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ముందుకు వచ్చారు . బీజేపీకి అప్పుడు రాష్ట్రంలో పార్టీ ఎటుపోతేనేం కేంద్రంలో అధికారం కావాలి . అప్పుడు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు . దాదాపు 18 జిల్లాల బీజేపీ కమిటీలు టీడీపీతో పొత్తు వద్దు అని తీర్మానాలు చేశాయి . కొందరు తరువాత రాజీనామా చేశారు . నేను ఆంధ్రభూమిలో టీడీపీ వార్తలు రాస్తే అప్పుడు బీజేపీ వార్తలు ఈశ్వర్ రెడ్డి అనే జర్నలిస్ట్ రాసేవాడు . పొత్తు ఉంటుంది అని నేను రాస్తుంటే అతను పొత్తు ఉండదు , నేను కిషన్ రెడ్డితో ఇప్పుడే మాట్లాడాను అని చెబుతుంటే ... కిషన్ రెడ్డి ఎవరు ? పొత్తు గురించి ఆయనకేం సంబంధం అని తేలిగ్గా తీసుకున్నాను . అదేంటి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఆయనకేం సంబంధం అంటావేమిటి అని అంటే , కావచ్చు పొత్తు ఉండాలా ? వద్దా ? అనేది బాబు నిర్ణయిస్తారు , ఉండదు అని చెప్పడానికి రాష్ట్ర బీజేపీ ఎవరు అని ధీమాగా చెప్పాను . అప్పుడు బాబు పలుకుబడి అలాంటిది . నేను చెప్పినట్టే అప్పుడు బీజేపీతో పొత్తు ఉంది . 18 జిల్లాల తీర్మానాలు , రాష్ట్ర అధ్యక్షుని మాటలు పట్టించుకోలేదు . సీట్లే కాకుండా బాబు బీజేపీకి అప్పుడు కొందరు అభ్యర్థులను కూడా ఇవ్వాల్సి వచ్చింది . మీ వాళ్ళు అభ్యర్థులు బలమైన వాళ్ళు కాదు బలమైన అభ్యర్థులను నేనే ఇస్తాను అంటే మహా ప్రభు అని తీసుకున్నారు . **** బీజేపీతో తెలంగాణలో పొత్తు ఉండదు అంటే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన చూశాక అవన్నీ గుర్తుకు వచ్చాయి . బండి మాటకు పార్టీలో ఎంత విలువ ఉంటుందో తెరాస శాసన సభ్యులను కొనడానికి వచ్చిన బ్రోకర్లు స్పష్టంగా చెప్పారు . బండి తో పాటు లోకల్ లీడర్లది ఏమీ ఉండదు అధిష్టానం చూసుకుంటుంది అని ... అంటే ఇప్పుడు కూడా బాబు పొత్తును ఖరారు చేస్తారా ? బాబుకు ఇప్పుడు అంత సీన్ లేదు ... మోడీ ఆత్మ అమిత్ షా ఖరారు చేస్తారు . ప్రధాన మంత్రులను నిర్ణయించాను .. వరుసగా ఇంటర్వ్యూలు చేసి ప్రధానిని ఖరారు చేసి చక్రం తిప్పాను అని చెప్పుకొన్న బాబుకు నాలుగేళ్లయినా మోడీ అపాయింట్ మెంట్ దక్కక పోవడం , అమిత్ షా , నడ్డా ల దర్శనమే మహద్భాగ్యం అనుకుంటున్నారు అంటే మరీనా పరిస్థితి తెలియడం లేదా ? గాలికి పోతున్న పిండిని కృష్ణార్పణం అన్నట్టు అసలు ఉనికి లేని తెలంగాణ లో టీడీపీని బీజేపీ కోసం త్యాగం చేసి ,ఆంధ్రాలో బీజేపీ మనసు దోచేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు . ఏమవుతుందో చూడాలి బాబు లోకల్ వ్యాపారి అయితే మోడీ గుజరాతీ వ్యాపారి . ఏక్ సే బడ్ కర్ ఏక్ .. సబ్ సే బడ్ కర్ గుజరాతి .... - బుద్దా మురళి

2 కామెంట్‌లు:

  1. 1998 లో బిజెపి కి ఆరు కాదండి, నాలుగే వచ్చాయి. కాకినాడ, రాజమండ్రి, సికింద్రాబాద్, కరీంనగర్.

    రిప్లయితొలగించండి
  2. చాలా మందికి గుర్తు ఉండని విషయం ఏమిటంటే, కేంద్రంలో బిజెపికి మొదటి సారిగా అధికారం దక్కటానికి కారణం తెలుగు వాళ్ళు, తెలుగు దేశం పార్టీ. 1998 ఎన్నికలలో NDA కూటమి మెజారిటీ కి కొద్ది దూరంలో ఆగిపోయినప్పుడు, 12మంది ఎంపీలతో బయట నుంచి మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చింది తెలుగు దేశం పార్టీ. అప్పుడు తెలుగు దేశం పార్టీ తరపున ఢిల్లీలో రేణుకా చౌదరి మాట్లాడే వారు.
    అప్పటి వరకు చాలా మందికి అంటరాని పార్టీగా ఉన్న బిజెపితో కలిసి పని చేసిన తెలుగు దేశంతో 1999లో పొత్తు పెట్టుకోవడం లో ఆశ్చర్యం ఏమీ లేదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం