22, జూన్ 2023, గురువారం

అక్షయ పాత్ర హైదరాబాద్ ... ఈ నగర నిర్మాణ ముహూర్తంలో ఏదో మహత్తు ఉంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -55

అక్షయ పాత్ర హైదరాబాద్ ఈ నగర నిర్మాణ ముహూర్తంలో ఏదో మహత్తు ఉంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -55 ----------------------------------- ముహూర్తాల మీద నమ్మకం ఉన్నా లేకున్నా ... హైదరాబాద్ నగరాన్ని ఐదు వందల ఏళ్ళ క్రితం ఏదో అద్భుతమైన ముహూర్తంలోనే నిర్మాణాన్ని ప్రారంభించి ఉంటారు . లేక పోతే అక్షయ పాత్రలా ఎంతమంది వచ్చినా ఎలా తిండి పెడుతుంది . .. ***** హలో ఎక్కడున్నావ్ ? అని ఉదయం ఓ జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో చిక్కుకున్నా 45 నిముషాలు అయినా ఆఫీస్ కు చేరుకోలేక పోయాను అని చెప్పి .. ఉద్యమ కాలం నాటి విషయాలు కొన్ని గుర్తు చేశారు . తెలంగాణ ఏర్పడి మేం ఆంధ్రకు వెళ్ళిపోతే మీ రోడ్ల మీద మనుషులు కనిపించరు అని భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టు చూపించాడట లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ లో సీనియర్ రిపోర్టర్ ఒకరు . . నిజానికి ఈ పదేళ్లలో హైదరాబాద్ కు బతుకు తెరువు వెతుక్కుంటూ వచ్చిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది . పురాణాల్లో అక్షయ పాత్ర ఎంత మంది తిన్నా వడ్డించేందుకు ఇంకా తిండి ఉండేదట ... అక్షయ పాత్ర నిజమో కాదో తెలియదు కానీ హైదరాబాద్ నిజంగా అక్షయ పాత్రనే .. బతకడానికి ఎంత మంది వచ్చినా వారికి బతుకు తెరువు చూపుతూ కడుపులో పెట్టుకొని దాచుకుంటుంది . ఇంకెంత మంది వచ్చినా అక్కున చేర్చుకుంటూనే ఉంది . ఏ ఆసరా లేకుండా పెద్ద కుటుంబంతో బతుకుతెరువు కోసం హైదరాబాద్ ను ఆశ్రయించిన లక్షల కుటుంబాల్లో మాది ఓ కుటుంబం . మిత్రుడితో మాట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమ కాలం లో చాలా మంది హైదరాబాద్ ఏమవుతుంది అన్న సందేహాలు గుర్తుకు వచ్చాయి . **** తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం కార్యాలయం లో ఉన్నప్పుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు వచ్చారు . తెలంగాణ ఉద్యమం చివరి దశ . విలేకరుల సమావేశాల్లో మాట్లాడే గాలి ముద్దు కృష్ణమ నాయుడు వేరు . మాములుగా ఉన్నప్పుడు మాట్లాడే ముద్దు వేరు . మా వాళ్ల్లు చాలా మంది ఆదిలాబాద్ లో లెక్చరర్లు గా పని చేస్తున్నారు అని ఏదో చెబుతుంటే .. అదేంటీ మీది చిత్తూరు జిల్లా కదా ? మీతో పని చేసిన లెక్చరర్లు చిత్తూరులో ఉంటారు కానీ ఆదిలాబాద్ లో ఏంటీ ? అంటే .. నేను విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా వాళ్ళు చాలా మందిని నేనే లెక్చరర్లుగా నియమించెను అని నవ్వుతూ చెప్పారు . అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది అని వెంటనే బదులిచ్చాను . ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ముద్దు కృష్ణమ నాయుడు విద్యాశాఖ మంత్రి . ఆ కాలంలో నియామకాలకు ఇష్టానుసారంగా చేసే అవకాశం ఉండేది . ముద్దు ఎన్టీఆర్ కు నమ్మిన బంటు . 94లో టీడీపీ విజయం సాధించాక బాబు ను అనుమానంగా చూస్తూ ఒక దశలో స్పీకర్ గా గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఉంటే బాగుంటుంది అని పరిశీలించారు . ఎందుకో సాధ్యం కాలేదు . యనమల స్పీకర్ గా ఉండి ఎన్టీఆర్ కు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెన్నుపోటు విజయవంతం కావడంలో తన వంతు పాత్ర పోషించారు . గాలి స్పీకర్ గా ఉంటే ఎలా ఉండేదో ? **** ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో అసెంబ్లీ లాబీ లో ముద్దు అనేక విషయాలు చెప్పారు . తెలుగుదేశం లో ఉన్న తెలంగాణ నాయకులు ఒకరిద్దరు తప్ప ఎవరూ పార్టీ విడిచి పోరు . నాకు కాంగ్రెస్ , టీడీపీ రెండింటితో అనుబంధం ఉంది . కాంగ్రెస్ లో మన ఖర్చు మనమే భరించాలి , కానీ అదే టీడీపీలో అయితే టికెట్ ఇస్తారు , ఎన్నికల్లో ఖర్చుకు డబ్బు ఇస్తారు . చివరకు పరిశీలకులుగా ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రయాణానికి టికెట్ కూడా పార్టీ నుంచే ఇస్తారు . ఇంత సౌకర్యం వదిలి ఎవరు పోతారు అని గాలి విశ్లేషించారు . ఆ సమయంలో అతని అంచనా నిజమే అని తేలింది . ఐతే హైదరాబాద్ గురించి గాలి అంచనా తలక్రిందులు అయింది . ***** అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పై చర్చ రోజు గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఓ లెక్క చెప్పారు . ఆ రోజుకు హైదరాబాద్ నగరంలో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయో ఓ లెక్క చెప్పి .. ఒక వేళ తెలంగాణ వస్తే ఈ నిర్మాణాలు ఆగిపోతాయి . ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న వారు పెద్ద సంఖ్యలో వెళ్ళిపోతారు . ఒక వైపు నిర్మాణాలు ఆగిపోవడం , మరో వైపు ఖాళీ కావడం ఆలోచించు ఎలా ఉంటుందో అని తన మనసులో ముద్రించుకున్న ఖాళీగా ఉన్న హైదరాబాద్ రూపాన్ని ప్రదర్శించారు . అదే సమయంలో యన్ టివి లో బెంగళూరులో జరిగే భారీ నిర్మాణాల దృశ్యాలు చూపుతూ హైదరాబాద్ ఖాళీ అయింది అంతా బెంగరులు వెళ్లారు అని ఉత్సాహంగా స్టోరీలు వండి వార్చారు . ఇప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా హైదరాబాద్ ను తమ వార్తల ద్వారా ఖాళీ చేయాలనీ చూస్తారు . ఏ వార్త లేక పోతే టివి 9 వాళ్ళు యుగాంతం వార్త , ntv వాళ్ళు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అనే ప్రత్యేక స్టోరీలు చూపుతారు . ఓ సారి సాక్షి వాళ్ళు ఓ అడుగు ముందుకు వేసి కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ పై ఓ చిత్రమైన వార్త వేశారు . కొన్న ధర కన్నా పదింతలు తక్కువకు అమ్ముతాము అన్నా ఎవరూ రావడం లేదు అని రాశారు . పదింతలు అంటే అంటే ఉచితంగా ల్యాండ్ ఇచ్చి డబ్బుకు కూడా ఇవ్వడం అన్నమాట . గతంలో ప్రధాన మంత్రికి మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారువా కూడా తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ఏదో అవుతుంది అనుకున్నాను . కానీ నా భయాలు పటాపంచలు అయ్యాయి . అద్భుత ప్రగతి సాధించింది అన్నారు . ఆ రోజుల్లో మీడియా చూపించిన భయం ఆ స్థాయిలో ఉండేది . బారువా లాంటి వారిని కూడా భయపెట్టేట్టుగా ... సరే ముద్దు కృష్ణమ చెప్పిన లెక్క ఏమైంది ? ఆ భవనాల నిర్మాణం ఆగిపోయిందా ? అంటే అది తెలియదు కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుమార్తె డాక్టర్ హైదరాబాద్ లో ఓ పెద్ద ఆస్పత్రి నిర్మించారు అది తెలుసు . *** నేను కన్నెర్ర చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోతుంది అని సీఎంగా ఉన్నప్పుడు హెచ్చరించిన చంద్రబాబు విజయవాడలో అద్దె భవనంలోనే ఉన్నా , హైదరాబాద్ లో మాత్రం పెద్ద భవనం నిర్మించుకున్నారు . బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం