20, జూన్ 2023, మంగళవారం

మీరు చూసిన తొలి నటుడు గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న బాబు చుట్టూ తారలే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -54

మీరు చూసిన తొలి నటుడు గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న బాబు చుట్టూ తారలే జర్నలిస్ట్ జ్ఞాపకాలు -54 ------------------------------------ తొలిసారి మీరు చూసిన సినిమా యాక్టర్ ఎవరో గుర్తున్నారా ? పద్మనాభం తీసిన దేవత సినిమాలో ఓ సన్నివేశం కొత్తగా ఉంది . ఎన్టీఆర్ , సావిత్రి నటించిన ఈ సినిమా పద్మనాభం తీశారు . 1965 లో వచ్చిన సినిమా . ఆ కాలం లో సినిమా తారలు అంటే దేవుళ్ళు అనుకునేంత అభిమానం ఉండేది . ఆ సినిమాలో పద్మనాభం మద్రాస్ వెళ్లి పలువురు సినిమా తారలను కలుస్తారు . సినిమా వాళ్ళ ఇంటిని , ఇంటివద్ద నటులు ఎలా ఉంటారో చూపిన ఈ సీన్ చిన్నప్పుడు అలా మనసులో ముద్రించుకుపోయింది . తామే వెళ్లి తారలను కలుస్తున్నట్టు ఎవరికి వారు భావించేట్టుగా ఉందా దృశ్యం . ప్రతివారికి తాము మొదటి సారి చూసిన నటులు అలా గుర్తుండి పోతారు . ఇప్పుడు హుసేన్ సాగర్ అంటే విషపు నీళ్లలా కనిపిస్తాయి కానీ . ఓ 50 ఏళ్ళ క్రితం శుభ్రంగా ఉండేవి . స్థానికులకు సముద్రం లేని లోటు తీర్చేట్టుగా ఉండేది . స్థానికులు హుసేన్ సాగర్ లో స్నానం చేసేవారు . తొమ్మిదేళ్ల వయసులో మా నాన్న , అన్నలతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా ట్యాంక్ బండ్ పై ఓ హిందీ సినిమా షూటింగ్ . భారత్ , పాక్ యుద్ధం తరువాత అక్కడ పాకిస్థాన్ నుజయించి తెచ్చిన ట్యాంక్ ఏర్పాటు చేశాక ట్యాంక్ బండ్ అంటున్నారు కానీ అంతకు ముందు హుసేన్ సాగర్ అనే పిలిచేవారు తారల పేర్లు , సినిమా పేరు తెలియదు . ముందు ఓ కారు , హీరోయిన్ ఆకు కూరలు పట్టు కొని వెళుతుంటే చేతి నుంచి పడిపోతాయి . కొద్దిగా పెద్దయ్యాక రహత్ మహాల్ ( ఇప్పుడు రాజా ) లో మార్నింగ్ షో చూస్తే ఆ సినిమా కోరా కాగజ్ అని . జయబాధురి , విజయ్ ఆనంద్ నటించారని తెలిసింది . 1974 ప్రాంతంలో నేను చూసిన తొలి తారలు వీళ్ళే ... అది సరే ఇది వదిలేస్తే ఎంతమంది తారలను చూశావు అని అడిగితే ? నేను తారలను చూసేందుకు వెళ్ళలేదు . తారలే నేనున్నా చోటికి వచ్చారు . ఒక్కరు ఇద్దరు కాదు గుంపులు గుంపులు . మరీ బడాయి అనుకుంటున్నారా ? నిజం తారలు గుంపులు గుంపులుగా వచ్చింది నిజం . ఐతే వారు వచ్చింది నేను ఉన్న చోటుకు .. అంటే చంద్రబాబు ఉన్న ఎన్టీఆర్ భవన్ లో నేనూ ఉన్నాను . వాళ్లంతా బాబు కోసం ప్రచారం చేయడానికి వచ్చారు . ***** చంద్రబాబు ఎన్టీఆర్ ను దించేసిన తరువాత ఎన్టీఆర్ బాబుకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు . పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి . అప్పుడు బాబు గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది అంటూ ఎన్టీఆర్ జమానా ముగిసిపోయింది , పని మంతుడిని అయిన తననే జనం ఆదరిస్తారు అని చెప్పుకొచ్చారు . బాబు తొలి స్టేట్ మెంట్ గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది అని చెప్పడమే అయినా తన గ్లామర్ మీద నమ్మకం లేకుండా మొదటి నుంచి చంద్రబాబు సినీ గ్లామర్ పైనే ఆధారపడ్డారు . ఇప్పుడు జగన్ తో ఒంటరి పోరాటం సాధ్యం కాదు అని గ్రహించి పవన్ కళ్యాణ్ మద్దతు సాధించారు . ఇప్పుడే కాదు 95 నుంచి ఇప్పటి వరకు బాబు సినీ గ్లామర్ నే నమ్ముకున్నారు . బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం లో ఎన్టీఆర్ శ్రీ రాముడిగా నటిస్తే సీతగా నటించిన గీతాంజలి , అక్కినేని అందాల రాముడితో నటించిన ఆనాటి గ్లామర్ క్వీన్ లత గుర్తు పట్టనంతగా మారిపోయిన తరువాత ఎన్టీఆర్ భవన్ లో దర్శనం ఇచ్చారు . కర్నూల్ జిల్లా రైల్వే కోడూరు టికెట్ కోసం ఆమె ఎన్టీఆర్ భవన్ చుట్టూ బాగానే తిరిగారు . గీతాంజలి మొదలుకొని బాబు కాలం నాటి లయ వరకూ అందరూ ఎన్టీఆర్ భవన్ లో కనిపించేవారు . అప్పటి మా అధ్యక్షుడు , నటుడు మురళీ మోహన్ వీరందరినీ సమన్వయ పరిచేవారు . షూటింగ్ జరిగేప్పుడు ఏ స్టూడియోకు వెళ్లినా ఐదారుగురు నటులకు మించి కనిపించరు . కానీ ఎన్టీఆర్ భవన్ లో మాత్రం ఎన్నికల సీజన్ వచ్చింది అంటే డజన్ల కొద్ది నటీ నటులు కనిపించేవారు . నిర్మాతలు , దర్శకులు , హీరోలు , హీరోయిన్ లు , క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ఒకరేమిటి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాకు కావలసిన వారంతా అక్కడ కనిపించేవారు . సినిమా రంగంలో అప్పటి వరకు నంబర్ వన్ గా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు సహజంగా సినిమా వాళ్ళు అంతా ఆయనకు అండగా నిలిచారు , ప్రచారం చేశారు అనుకుంటారు . సినిమా వాళ్లంతా టీడీపీకి అండగా నిలిచింది ఎన్టీఆర్ హయాంలో కాదు చంద్రబాబు హయాంలో ... ఎన్టీఆర్ హయాంలో రావుగోపాలరావు ఒక్కరే టీడీపీ తరపున ప్రచారం చేశారు . అలా అని మిగిలిన నటులంతా కాంగ్రెస్ అని కాదు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు . తరువాత కాలం లో జయప్రద , మోహన్ బాబు పార్టీకి తమ సేవలు అందించారు . ******* హిమాయత్ నగర్ లో బాబు హయాంలో టీడీపీ కార్యాలయం ఉన్నప్పుడు రాజేంద్రప్రసాద్ హీరోగా బిజీ గానే ఉన్నా , పార్టీ కార్యాలయానికి వచ్చి ఎన్టీఆర్ ఆదేశాలతోనే బాబు ఎన్టీఆర్ ను దించేశారు అని బోలెడు రాజకీయ జ్ఞానాన్ని జర్నలిస్ట్ లకు బోధించేవారు . అతన్ని నిరుత్సాహ పరచడం ఇష్టం లేక నమ్మినట్టు ముఖం పెట్టే వాళ్ళం . ఎన్టీఆర్ ఆదేశాల మేరకే 83లో బాబు కాంగ్రెస్ లో ఉండిపోయారా ? అని అమాయకంగా ప్రశ్నిస్తే అంతే కదా అని సినీ పక్కీలో చెప్పుకొచ్చారు . విజయవాడలో స్థలానికి సంబంధించి ఏదో సమస్య వల్ల రాజేంద్రప్రసాద్ అప్పుడు బాబు సేవలో ఉండక తప్పలేదు అని వినిపించింది . బాబు హయాంలో ఓ సారి ఎంపీగా గెలిచిన కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో అనేక కథలు చెప్పారు . ఆ కథల సారాంశం ఎన్టీఆర్ ను రాజకీయాల్లో నడిపించింది తానే అని .... ఒక్కసారి టికెట్ తోనే సత్యనారాయణ రాజకీయం ముగిసింది . ఆ కాలం నాటి హీరోయిన్ శారద కూడా ఒకేసారి గెలిచి తరువాత దూరం అయ్యారు . నిర్మాత డి రామానాయుడు కూడా అంతే ఒక సారి గెలిచి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు . ఓ సారి రామానాయుడు సినిమా రిపోర్టర్ లు అందరినీ ఎన్టీఆర్ భవన్ కు తీసుకువచ్చి తనకు సంబంధించిన బుక్ ఏదో బాబుతో ఆవిష్కరణ ప్రోగ్రాం . బాబు వెళుతూ వెళుతూ దారిలోనే బుక్ ఆవిష్కరించారు . ఇంతోటి దానికి ఇక్కడి వరకు ఎందుకు మా స్టూడియోలోనే చేసుకునే వారం అని నాయుడు అందరికీ వినిపించేట్టుగానే అసంతృప్తి వ్యక్తం చేశారు . హాస్య నటులు ఏవీయస్ , నటులు దర్శకులు , ఎంపీ శివప్రసాద్ ఇద్దరూ పార్టీ అధికార ప్రతినిధులుగా రోజూ మీడియాను కలిసేవారు . ప్రెస్ మీట్ పెట్టేప్పుడు నేను అధికారులతో చాలా సేపు మాట్లాడి , చాలా అంకెలు తీసుకోని వస్తాను , మీరేంటి నేను ప్రిపేర్ అయి వచ్చిన వాటిలో ఒక్కటీ అడగకుండా ఏదో అడిగేస్తారు అని మొదట్లో నొచ్చుకునేవారు . ఇప్పుడు వెలిగిపోతున్న బండ్ల గణేష్ అప్పుడు చోటా నటుడు . బండ్ల A సినిమాలో హీరోగా నటించాడు , ఏ సినిమానో చెప్పరా బాబూ అని ఏవీఎస్ బండ్లను ఆటపట్టించేవాడు . అలాంటి సినిమా పేరు బయటకు రావద్దు అని బండ్ల సిగ్గుపడేవారు . జయప్రద ఎన్టీఆర్ హయాంలో పార్టీలో చేరి బాబు వైపు ఉంటే , జయసుధ బాబు హయాంలో మహానాడులో చేరారు . ***** ఇక బాబు జమానా మొదలయ్యాక పార్టీకి సేవలు అందించిన తారలు జాబితా కన్నా , సేవలు అందించకుండా దూరంగా ఉన్న తరాల జాబితా చిన్నది , చెప్పడం ఈజీ . కీలక పరిణామాల్లో జయప్రద సేవలు అందించారు . 95లో ఎన్టీఆర్ ను దించేశాక తొలి బహిరంగ సభ నిజాం కాలేజీలో జరిగింది . ఆ సభలో మోహన్ బాబు మాట్లాడుతూ లక్ష్మి పార్వతికి వ్యతిరేకంగా శాసన సభ్యులంతా తన వద్దకు వచ్చి బోరున ఏడ్చారని , ఎన్టీఆర్ ను దించేయాలని వేసుకున్నారని , దాంతో తానూ దించేసినట్టు సినిమా డైలాగుల్ల్లా చెప్పుకొచ్చారు . టీడీపీతో ఇతనికి నూకలు చెల్లాయి అని అప్పుడే అనిపించింది . తరువాత ఏదో కారణం తో క్రమశిక్షణ చర్య అని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు . **** ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడే గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది అని ప్రకటించిన బాబు చివరకు టి డి యల్ పి కార్యాలయంలో న్యూస్ పేపర్ కటింగ్స్ ను అతికించే చిన్న ఉద్యోగి వేణుమాధవ్సి నిమాల్లోకి వెళ్ళాక అతని గ్లామర్ పై కూడా ఆధారపడ్డారు . రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నికలు వస్తే కామెడీ నటుడు వేణుమాధవ్ ప్రచారం చేసి బాబు ఇచ్చిన హామీల అమలు బాధ్యత నాదీ , నన్ను నమ్మండి అని ప్రచారం చేశారు . బాబు మోహన్ తొలుత లక్ష్మీపార్వతి పార్టీలో చేరి అమలాపురం నుంచి పోటీ చేశారు . ఎన్టీఆర్ తనకు కలలో వచ్చి లక్ష్మి పార్వతికి అండగా నిలబడమని చెప్పారని అందుకే లక్ష్మి పార్వతి పార్టీలో చేరినట్టు ప్రకటించారు . తరువాత బాబు పార్టీలో చేరి మంత్రి కూడా అయ్యారు . నోటి దురుసుతో రాజకీయాల్లో రాణించలేక పోయారు . చంద్రబాబు కు తాను అవసరం కానీ తనకు చంద్రబాబు అవసరం లేదు అని బాబు మోహన్ బహిరంగంగా ప్రకటించారు . ఆ మధ్య టివిలో జయసుధ , బాబు మోహన్ క్రైస్తవ ప్రచారం కోసం టివిలో మాట్లాడారు . ఇప్పుడు బాబు మోహన్ బీజేపీలో ఉన్నారు . జూనియర్ ఎన్టీఆర్ , తారక రత్న , బాలకృష్ణ ల సినిమా గ్లామర్ ను బాబు అవసరం ఉన్నప్పుడల్లా వాడుకుంటూనే ఉన్నారు . ***** ఎన్టీఆర్ అక్కినేని , కృష్ణ , చిరంజీవి , విజయనిర్మల , బాలకృష్ణ విజయశాంతి వంటి చాలా మంది నటీ నటులతో రాజకీయాలు మాట్లాడే అవకాశం దొరికింది . కోట శ్రీనివాస్ ను బీజేపీలో చేరినప్పుడు కలిశా . 2014 లో రాష్ట్ర విభజన అమలులోకి రాకుండానే ఉమ్మడి లోనే ఎన్నికలు జరిగాయి . పోలింగ్ తరువాత ఎన్టీఆర్ భవన్ లో మురళీ మోహన్ కనిపించారు . తారలను బృందాలుగా ఎన్నికల ప్రచారానికి పంపింది వారే .. భవన్ లో మీడియాతో మాట్లాడుతూ మేం ప్రచారానికి వెళ్ళినప్పుడు తెలంగాణ లో ప్రజలు తిరగబడలేదు . ఓటు వేయక పోవచ్చు కానీ మా రాకను వ్యతిరేకించలేదు అని ఏదో చెప్పుకొచ్చారు . వ్యతిరేకించడం అంటే ఓటు వేయక పోవడమే నండి . మా ఊరు ఎందుకు వచ్చావు అని కొట్టరు కదా ? అని వివరించాను . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం