14, జూన్ 2023, బుధవారం

తనను తానే ఓడించుకున్న డీసీ రెడ్డి ... తెలంగాణ ఆత్మ ఆంధ్రభూమి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -50

తనను తానే ఓడించుకున్న డీసీ రెడ్డి తెలంగాణ ఆత్మ ఆంధ్రభూమి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -50 ..... ప్రత్యర్థి పై విజయం సాధిస్తే వీరుడు . తనపై తానే విజయం సాధిస్తే మహావీరుడు . మహావీరుడు కావడం చాలా కష్టం . అందుకే మహావీరుడు దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు . మరి తనను తానే ఓడించుకున్న వారిని ఏమనాలి ? ఉదయమే టివిలో డిసి ప్రమోటర్లను అరెస్ట్ చేసిన ఈడీ అనే వార్త చూడగానే . వెంకట్రామ్ రెడ్డి తనను తానే ఓడించుకున్నవారు అనిపించింది . ఒక్కరికీ జీతాలు ఎగ్గొట్టలేదు . ఎవరినీ కడుపుమీద కొట్టలేదు . మూసేసిన తరువాత కూడా ఇంట్లో కూర్చోబెట్టి ఏడాది జీతాలు ఇచ్చారు . నాకు రావలసింది ఏదో రాలేదు అనే కోపం తో రాయడం కాదు . బాధతో రాయడం . అంతా బాగానే ఉంది కానీ సంస్థను ఎలా నడపాలో అలా నడపకుండా తనను తానే ఓడించుకున్నారు . ఉదయం మిత్రుడు ఫోన్ చేసి టీవీ చూశావా ? అని అడిగాక చూస్తే ఈ వార్త .. ఒక్క సారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి . అంతా మునిగిపోయిన తరువాత కూడా తప్పు ఎక్కడ జరిగింది అని మాట్లాడుకోక పోతే మనకు మనం ద్రోహం చేసుకున్నట్టే ... మరో వ్యక్తి మరో సంస్థ తప్పు జరగకుండా చూసుకోవచ్చు . 2008 లో ఐ పి యల్ ఏర్పాటు డక్కన్ క్రానికల్ కు శనిలా పట్టుకుంది . అయ్యర్ అనే వ్యక్తి శని ప్రతినిధిలా డిసి లో అడుగు పెట్టాడు . ఈ అయ్యర్ ఎక్కడి నుంచి ఊడి పడ్డాడో కానీ సంస్థను దెబ్బ కొట్టాడు . వెంకట్రామ్ రెడ్డి ,అయ్యర్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు . ఈ కేసులో ఎనిమిదేళ్ల సారి అరెస్ట్ చేశారు . అప్పుడు జర్నలిస్ట్ మిత్రుడు రాంలాల్ సింపుల్ గా ఓ మాట చెప్పారు . ఆఫీస్ పక్కన అజంతా టాకీస్ గేటు వద్ద మిర్చి బజ్జి బండి వద్ద నిలబడి మాట్లాడుకుంటూ - ఈ మిర్చి బజ్జిల అతనికి కూడా ఓ ప్లాన్ ఉంటుంది . వర్షం వస్తే ఎంత పిండి కలపాలి , రాకపోతే ఎంత కలపాలి అనే లెక్కలు ఉంటాయి . మేనేజ్ మెంట్ కు ఈ మాత్రం ముందు చూపు లేనట్టుంది అని .. ***** డిసి , ఆంధ్రభూమి మొదటి యాజమాన్యం తమిళులు . మొదట డిసి పత్రిక తెచ్చి , తరువాత ఆంధ్రభూమి తెచ్చారు . తరువాత నెల్లూరుకు చెందిన తిక్కవరపుచంద్రశేఖర్ రెడ్డి తీసుకున్నారు . మొదటి యజమాని , రెండవ యజమాని తెలంగాణ వారు కాదు . గుర్తున్నంత వరకు ఆంధ్రభూమి మొదటి ఎడిటర్ నుంచి మూత పడే సమయంలో ఎడిటర్ గా ఉన్న సదాశివ శర్మ వరకు ఒక్కరు కూడా తెలంగాణ వారు లేరు .. ఎడిటర్ లు సత్య సుబ్రహ్మణ్యం , గోరాశాస్త్రి , గజ్జెల మల్లారెడ్డు , ఎబికె ప్రసాద్ , పతంజలి , సి కనకాంబరరాజు , శాస్త్రి , సదాశివ శర్మ వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ కాదు . కానీ ఆంధ్రభూమి అంటే తెలంగాణ ఆత్మగా భావించేవారు . ఓనర్ నెల్లూరు రెడ్డి , సిఇఓ థామస్ ఆంధ్ర ఐనా భూమి అంటే తెలంగాణ అనే ముద్ర ఉండేది . ఎక్కువ మంది సిబ్బంది , యూనియన్ తెలంగాణ కు చెందిన వారు ఉండేవారు . ఈనాడు పత్రిక రాక ముందు మార్గదర్శి ప్రకటనలు కూడా ఆంధ్రభూమికే ఇచ్చారు . తెలంగాణ లో ఒకప్పుడు ఆంధ్రభూమి లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పత్రిక . 1969 లో తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది . డిసి , భూమి లో పని చేసేవారు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం స్థాయిలో ఉండేవారు . రాష్ట్రంలో రాయలసీమ , విశాఖ , నెల్లూరు , విజయవాడ లలో ఎడిషన్ లు పెట్టినా భూమి పై తెలంగాణ ముద్రపూర్తిగా చెరిగిపోలేదు . ఎంతో కొంత మిగిలే ఉంది . శాస్త్రి సమైక్యాంధ్ర ముద్ర కోసం తీవ్రంగా ప్రయత్నించినా తెలంగాణ ముద్ర పూర్తిగా చెరిగిపోలేదు . ******* ఐ పి యల్ లో డక్కన్ ఛార్జర్స్ ను డిసి వాళ్ళు కొన్న రోజు ఆఫీస్ మొత్తం సంబరంగా ఉంది . ఏదో విజయం సాధించినట్టు ఆనందంగా ఉన్నారు . ఆఫీస్ బయటకు వచ్చి మిత్రులం బృందాలుగా చర్చలు . బాగా గుర్తున్న చర్చ రిపోర్టర్ శైలేంద్ర నేనూ గేటు బయట మాట్లాడుకుంటూ పత్రిక నడపాల్సిన వాళ్ళు దాన్ని మరింత బాగా ఎలా నడపాలి , కొత్త ఎడిషన్ లు ఎలా తేవాలి అని ఆలోచించాలి కానీ ఈ క్రికెట్ ను కొనడం ఏందీ ? మనను ఏం చేయదలుచుకున్న అని ఆందోళన పరస్పరం పంచుకునే వాళ్ళం . ఒక పార్ట్ టైం , ఫుల్ టైం , జర్నలిస్ట్ లు ఏజెంట్లు అంతా కలిసి ఉమ్మడి రాష్ట్రంలో మూడు నాలుగు వేల మంది ఉంటారు . యాజమాన్యం వ్యక్తి కాదు వారు తీసుకునే నిర్ణయం నాలుగువేల మంది జీవితాలపై ప్రభావం చూపుతుంది . తెలిసిన మిత్రుడి వద్ద 30 ఏళ్ళ నుంచి చిట్టీలు వేస్తా . ఓ రోజు అతను అన్నా నేను మందు తాగను , వ్యసనాలు లేవు , ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు . ఏదో వందేళ్లు బతకాలి అని కాదు . అతను వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు . రిటైర్ అయిన వాళ్ళు ఇతని వద్ద వడ్డీ కోసం డబ్బు దాచుకుంటే , ఇంకొంత ఎక్కువ శాతానికి ఇతను వడ్డీకి ఇస్తాడు . వ్యసనాల వల్ల నాకేమన్నా అయితే నన్ను నమ్మి డబ్బు పెట్టిన వృద్దులకు అన్యాయం అవుతుంది . వాళ్లకు కనిపెంచిన పిల్లల మీద కన్నా న మీద ఎక్కువ నమ్మకం ఉంచి డబ్బు పెట్టినందుకు నేనెంత జాగ్రత్తగా ఉండాలి అని ... అందుకే వ్యసనాలకు దూరం అన్నాడు . ఓ పాతిక మంది వృద్ధుల నమ్మకం కోసం అతను అలా ఉంటే నాలుగు వేల మంది జీవితాలు ఆధార పడి ఉండే సంస్థ మరింత జాగ్రత్త గా , బాధ్యతతో ఉండాలి . కొన్ని వందల కంపెనీలకు ఛైర్మెన్ గా ఉన్న టాటా అన్ని కంపెనీలకు కొంత సమయం కేటాయిస్తారు . వీళ్ళేమో భూమిని ఎడిటర్ కు వదిలేసి తమది కాదు అనుకున్నారు . ఏం జరుగుతుందో ఎవరైనా చెబితే తరువాత వాళ్ళు ఉద్యోగంలో ఉండరు . **** ఆందోళన పరిస్థితులపై కాస్త మనసు విప్పి మిత్రులం గార్డెన్ హోటల్ లో మాట్లాడుకునే వాళ్ళం . యూనియన్ లో చోటా నాయకుడు నేనూ శైలేంద్ర మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి ఎండీ సార్ తాగే సిగార్ మూడు వేలకు ఒకటి తెలుసా అని ఏదో చెబుతుంటే .. అంతకు ముందు చాలా సార్లు భరించినా ఆ రోజు భరించలేక .. పది రూపాయలకు గంట చుట్ట ప్యాకెట్ వస్తుంది కదా అన్నాను . రూపాయికి ఒకటి దొరికే గంట చుట్ట ను , మూడు వేలకు ఒకటి ఉండే సిగార్ ను చుట్ట అనే అంటారు అని వివరించా... ఎడిటర్ పేపర్ ను అమ్ముకుంటున్నా పట్టించుకోలేదు . ఐపియల్ కొన్నప్పటి నుంచే ఏదో ఒక అపశకునం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది . అంతర్జాతీయ ప్లేయర్ లకు ఇంట్లో పార్టీ ఇస్తే అగ్ని ప్రమాదం , కాలింది .. కాలిన మచ్చ పోదు . అరెస్ట్ మచ్చ పోదు . వ్యాపారం లో దెబ్బ తీయాలి అని పోటీ దారుడు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు . న్యూస్ టైం , టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి హేమా హేమీలైన సంస్థలు కూడా డిసి రెడ్డిని ఓడించలేక పోయాయి . తన చేతులతో తానే ఓడించుకున్నారు . మంచి మనిషి అయితే సరిపోదు . ఎప్పటి నుంచో ఉన్న సంస్థ భూమి . తరువాత వచ్చిన రామోజీ వందల ఎకరాల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే , తండ్రి నిర్మించి ఇచ్చిన సామ్రాజ్యాన్ని కూడా ప్రశ్నార్ధకంగా మార్చారు . - బుద్దా మురళి

1 కామెంట్‌:

  1. ఎంత పెద్ద సామ్రాజ్యమైన, కూలిపోవాల్సిందే. మొదటి తరం, రెండవ తరం, అంతే మూడవ తరం అంత పనిచేయదు బుర్ర ఆలోచించదు . డెక్కన్ క్రానికల్ క్రికెట్ టీం ఎందుకు కొన్నాదో తెలియదు , అందరు అనుకునేది ఆ టైం లో ఏంటంటే, ఈ ఐపీల్ అనేది బ్లాక్ మనీ వైట్ గా మార్చేది అని . అందుకే కొన్నారు అని .

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం