30, జూన్ 2023, శుక్రవారం
మీడియా కొన్ని పాత్రలను పుట్టిస్తుంది .. హఠాత్తుగా మాయం అవుతారు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -61
మీడియా కొన్ని పాత్రలను పుట్టిస్తుంది ..
హఠాత్తుగా మాయం అవుతారు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -61
-------------------------------------------------------
సార్ ఐడెంటీ కార్డు చూపించండి అని ఆ కుర్రాడు వినయంగా అడిగే సరికి నవ్వుతూ అతని ముందే భారీ బహిరంగ సభకు హాజరైన వారిని లెక్కించాను . నేనూ , మరో జర్నలిస్ట్ , ఆ కుర్రాడి లాంటి మరో పది మంది వాలంటీర్లు , హాజరైన అశేష ప్రజానీకం అంతా కలిసి 50 మంది దాటడం లేదు . ఆ కుర్ర వాలంటీర్ బహుశా 8 లేక తొమ్మిదో తరగతి చదువుతున్నాడు కావచ్చు . కార్డు చూపిస్తాను కానీ మనందరినీ కలిపినా 50 మందే ఉన్నాం కదా ? ఇలా ఆపి కార్డు చెక్ చేయడం నీకు ఎలా ఉంది అని అడిగాను . ఏమో సార్ నాకీ పని చెప్పారు అంతే అన్నాడు . తన ఉద్యమం ద్వారా దేశాన్ని ఒక ఊపు ఊపి , ఢిల్లీ రాష్ట్రంలో , కేంద్రంలో యుపిఏ ఓడిపోయి బిజెపి అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన అన్నా హజారే సికింద్రాబాద్ ఆనంద్ టాకీస్ ఎదురుగా ఉన్న కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ . రాష్ట్రం లో ఆయన తొలి సభ కాబట్టి భారీగా ఉంటుంది అనుకోని వెళితే పట్టుమని వందమంది రాలేదు . అన్నా హజారే పాత్రను ఎందుకు పుట్టించారు , ఎవరి కోసం ఆకాశానికి ఎత్తారు ? మీడియానే కాదు ప్రజలు కూడా మాస్ హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోయారు . ఇతనే నిజమైన మహాత్మా గాంధీ , భారత రత్న ఇవ్వాలి అని డిమాండ్ చేసిన దేశం తరువాత అతన్ని ఎందుకు పట్టించుకోలేదు ? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు ? ఏమిటీ లీల అని ప్రశ్నించుకుంటే రాజకీయం అర్థం అవుతుంది . మీడియా అవసరాలు , రాజకీయ అవసరాల కోసం కొన్ని పాత్రలు ఇలా రాజకీయ తెరమీద పుట్టుకు వస్తాయి . రాజకీయంలో వారి పాత్ర ముగియగానే స్టోర్ రూమ్ లో పడేస్తారు . ఢిల్లీలోనే కాదు ఇక్కడ కూడా అలాంటి బోలెడు పాత్రలను ఇలా పుట్టించారు ..
****
తెలంగాణ ఉద్యమ కాలంలో పలు తెలుగు ఛానల్స్ ఇలాంటి అరడజను పాత్రలను పుట్టించారు . వాళ్ళు ప్రతి రోజు టీవీల్లో గంటల తరబడి కనిపించే వారు జాతిని ఉద్దేశించి ప్రసంగించేవారు . ముఖ్యమంత్రి , మంత్రులు , ప్రతిపక్ష నాయకుడి కన్నా టీవీల్లో ఈ పాత్రలే ఎక్కువ సమయం కనిపించేవి . ఈ పాత్రల సృష్టి వెనుక ఆ ఛానల్స్ కు నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది . వరదలో కొట్టుకు పోతున్నప్పుడు గడ్డి పోచనైనా పట్టుకొని కాపాడుకోవాలనే ప్రయత్నం మీడియా ఈ పాత్రలను సృష్టించడం లో కనిపిస్తుంది . నేను తెలంగాణ వాడినే కానీ తెలంగాణ వద్దు , తెలంగాణ ఏర్పడితే తెలంగాణకు చాలా నష్టం అని నల్లమోతు చిరంజీవి కావచ్చు ( తక్షణ అవసరం కోసం సృష్టించిన పాత్ర కాబట్టి పేరు గుర్తుండడం కష్టమే ) టీవీల్లో తెగ వాదించేవారు . టివి 9 లాంటి నంబర్ వన్ ఛానల్ లో అంతేసి సమయం కేటాయిస్తే ప్రముఖ నాయకుడు అన్నట్టే కదా ? తెలంగాణ ఏర్పడిన తరువాత మళ్ళీ అతన్ని ఒక్క నిమిషం అయినా ఎందుకు చూపలేదు . ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకోవడం లేదు అనే అభిప్రాయం ఏర్పడేట్టు చేసేందుకు పుట్టించిన పాత్ర అది . తెలంగాణ ఏర్పడిన తరువాత ఇక ఆ పాత్ర అవసరం ఏముంది ? నర్రా విజయ లక్ష్మి అని ఒక మహిళా నాయకురాలు ఉండేవారు . బతుకమ్మ తెలంగాణ పండుగ కాదు విజయవాడలో కూడా జరుపుకుంటారు అని ఓ వాదన . లగడపాటి రాజ్ గోపాల్ పిలుపు మేరకు నర్రా విజయలక్ష్మి విజయవాడ వెళ్లి లగడపాటి అన్నయ్య పిలిచాడు అని ఆమె విజయవాడలో బతుకమ్మ ఆడేవారు . హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి బతుకమ్మ ఆడడం వరకు ప్రముఖ ఛానల్స్ లైవ్ చూపేవారు . ఇక విభజన తరువాత టివి 9 పుట్టించిన పెద్ద పాత్ర శివాజీ ... దేశంలో అన్నా హజారే పాత్రకు ఎంత ప్రాముఖ్యత లభించిందో రాష్ట్రం లో టివి 9 ఆవిష్కరించిన శివాజీ పాత్రకు రాష్ట్ర స్థాయిలో అంత పాపులారిటీ లభించింది . సినిమా అవకాశాలు లేని శివాజీ అనే ఒక నటుడిని టివి 9 స్టూడియోలో కూర్చుండబెట్టి రోజుల తరబడి , కొన్ని గంటల పాటు ఆపరేషన్ గరుడ పేరుతో డ్రామా ఆడించారు . బాబు కూడా జనం తనను దించేయడానికి సిద్ధం అవుతున్నారు అనేది గ్రహించకుండా ఆపరేషన్బా గరుడ నిజమే అంటూ నమ్మించేందుకు ప్రయత్నించారు . బా బు ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ గరుడ ప్రాజెక్ట్ చేపట్టిందని తనకు ఎవరో దానయ్య చెప్పాడు అంటూ శివాజీ టివిలో గంటల తరబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు . ఆ ఆతరువాత హఠాత్తుగా శివాజీ కోన్ కిస్కా అయిపోయాడు . బీజేపీ కోసం తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి బ్రోకర్లు వచ్చి రెడ్ హాండెడ్ గా పట్టుపడినా అంత లావుగా ఉన్న సన్యాసులు బ్రోకర్లుగా వచ్చారు అంటే మేం నమ్మం అని చెప్పిన మీడియా దారిన పోయే వాడు ఎవడో చెప్పాడు అంటే ఆపరేషన్ గరుడ అని రోజుల తరబడి టివిలో చూపారు .
ఉద్యమ కాలం లో కెసిఆర్ పుట్టించిన పాత్ర జేఏసీ కోదండరాం . తెలంగాణ ఉద్యమం లో తెరాస దే కీలక పాత్ర , పెద్దన్న పాత్ర అన్ని పార్టీలను కలిపి ఉద్యమం చేయాలని అప్పటికప్పుడు తయారు చేసిన పాత్ర కోదండరాం . తెలంగాణ సాకారం కాగానే తన పాత్ర ముగిసింది అని గ్రహించకుండా అన్ని పార్టీలకు తానే నాయకుడిని అనే భ్రమల్లో ఉండి కోదండరాం దెబ్బ తిన్నారు . సొంత పార్టీ పెట్టారు . కాంగ్రెస్ , టీడీపీలతో చేతులు కలిపారు కాలం కలిసి రాలేదు . టెన్త్ మొదటి సారే పాసై ఇంటర్ లో డుమ్కి కొట్టిన కొందరు కోదండరాం ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చింది తెలుసా అని వాదిస్తుంటే , పిల్లలతో ఏం వాదిస్తాం లే అని మౌనంగా ఉండిపోతా .
*****
జన్ లోక్ పాల్ అంటూ దేశవ్యాప్త ఉద్యమం చేసిన అన్నా హజారే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అంటే . యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమించడానికి హజారే అవసరం అయ్యారు . ఆ పాత్ర అవసరం తీరిపోయింది . రాజకీయ పక్షాలు , వాటి అనుబంధ సంఘాలు , మీడియా అప్పటి అవసరం కోసం ఆయన్ని ఆకాశానికి ఎత్తింది . ఇప్పుడు వీరికి ఆయన అవసరం లేదు . వీరి ప్రత్యర్థి గ్రూప్ అంత బలమైనది కాదు , వారికి మీడియా లేదు . ఒక పాత్రను ఒకే సారి ప్రయోగిస్తారు . రెండో సారి అది పని చేయదు .
****
టివి 9 లో అన్వేషణ అని పాత కాలం నటీనటులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని చూపిస్తారు . ఓ సారి ఈ పాత్రలను కూడా అన్వేషించవచ్చు కదా ?
ఏదో సందర్భంలో కెసిఆర్ ఓ విషయం చెప్పారు . పిల్లాడిని తండ్రి తన భుజం పై ఎక్కించుకుంటే తాను తండ్రి కన్నా ఎత్తులో ఉన్నాను అనుకుంటాడు . భుజం నుంచి దించేశాక అసలు ఎత్తు తెలుస్తుంది అని ... టివి ఛానల్స్ అంతే ఆయా కాలాల్లోని అవసరాల మేరకు భుజం పై ఎక్కించుకొని స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు .. అది తాత్కాలికం అని గ్రహించకుండా నిజం అనుకుంటే రాంగోపాల్ వర్మ సినిమాలా జీవితం అట్టర్ ప్లాప్ అవుతుంది .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం