16, జూన్ 2023, శుక్రవారం

మీడియా మాయాజాలం - కల్కి మాయలు రెండింటి థియరీ ఒకటే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -51

మీడియా మాయాజాలం - కల్కి మాయలు రెండింటి థియరీ ఒకటే జర్నలిస్ట్ జ్ఞాపకాలు -51 ----------------------------------------- మోకాలికి , బోడిగుండుకు సంబంధం కలిపినట్టు మీడియాకు , కల్కికి సంబంధం ఏమిటీ అనిపించ వచ్చు. సంబంధం ఉంది . ప్రజల నమ్మకాలతో ఆడుకొనే ఓ స్వామీజీనే ఈ విషయంపై నాకు జ్ఞానోదయం కలిగించారు . 2009 ఎన్నికల సమయంలో పేజీలకు పేజీలు ఈనాడులో అబద్దాలు వండివార్చేవారు . ఇంత అబద్దాలు ఎలా అని ఈనాడులో పని చేసే ఓ మిత్రుడిని అడిగితే , అతను చెప్పిన సమాధానం , కల్కి గురించి అతని శిష్యుడు బయట పెట్టిన విషయం రెండింటి వెనుక ఫార్ములా ఒకటే .. మీడియా మాయాజాలం ,కల్కి మాయలు రెండూ ఒకటే అనిపించింది . **** ఇప్పుడు ఏమయ్యాడో ఎక్కడోన్నాడో తెలియదు. కానీ ఓ పదేళ్ల క్రితం వరకు కల్కి భగవాన్ ఓ వెలుగు వెలిగారు . ఆ మధ్య ఆయన ఆశ్రమం పై ఐటీ దాడులు జరిగాక ఏమయ్యాడో తెలియదు . మీడియా కూడా దృష్టి పెట్టలేదు. అంతకు ముందు ఎక్కడ చూసినా కల్కి పేరు మారుమ్రోగేది . ఒక విషయం లో మాత్రం కల్కిని మెచ్చుకోవాలి . చాలా మంది తాము దేవుడి అవతారం అని చెప్పుకుంటారు . కల్కి మాత్రం తాను దేవుడిని అని చెప్పుకోవడం తో పాటు తన భార్యను దేవతగా చెప్పే వారు . ఆ జంట ఫోటోలను దేవుడు , దేవతగా పూజించేవారు . న్యూస్ టైం లో కల్కి గురించి , ఆశ్రమం లో జరిగే వ్యవహారాల గురించి వరుస కథనాలు వచ్చాయి . మిగిలిన పత్రికల్లోనూ వచ్చాయి . న్యూస్ టైం లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు . ఆ సమాచారం మొత్తం మీడియాకు తానే ఇచ్చాను అని కల్కి శిష్యుడు అజయ్ భగవత్ పాద ఓ సారి కలిసినప్పుడు చెప్పారు . బజనరాహిల్స్ లో అప్పుడు పోలీస్ బాస్ గా ఉన్న భాస్కర్ రావుకు చెందిన భవనం లో అజయ్ భగవత్ పాద ఉండేవారు . వార్తా సేకరణలో భాగం గా కాకుండా ఓ ఫ్రెండ్ కోసం అక్కడికి వెళ్ళాను . ఫ్రెండ్ అజయ్ భగవత్ పాదను పరిచయం చేశారు . చాలా సేపు మాట్లాడాను . అప్పుడు నేనో సందేహం బయట పెట్టాను . నేను మిమ్ములను అవమానించాలి అని అడగడం లేదు . కేవలం నా సందేహం తీర్చుకోవాలి అని అడుగుతున్నాను అని ముందే చెప్పి అడిగాను . నేనే దేవుడిని అనిచెప్పడం , బాబాల్లో శక్తులు అన్నీ బోగస్ ఆ సంగతి నాకు తెలుసు . ఎంతో మంది బాబాలు మహిళలపై అత్యాచారాలు చేశారు . భక్తుల నమ్మకాలను సొమ్ము చేసుకున్నారు . ఈ వార్తలు రోజూ పత్రికల్లో వస్తూనే ఉన్నాయి . ఐనా ఈ స్వాములు రోజూ పుడుతూనే ఉన్నారు . భక్తులు వస్తూనే ఉన్నారు , మోసపోతూనే ఉన్నారు . ఇదెలా సాధ్యం అని నా సందేహం బయటపెట్టాను . ముందుగా భగవత్ పాద గురించి చెప్పాలి . పెద్ద కంపెనీలోనే మార్కెటింగ్ విభాగం లో జనరల్ మేనేజర్ గా చేసేవారు .కల్కికి శిష్యుడుగా మారాడు . చదువుకున్న వ్యక్తి , మార్కెటింగ్ విభాగంలో పని చేసిన అనుభవం వల్ల తక్కువ సమయంలోనే కల్కికి దగ్గరయ్యాడు , కల్కి దందాలు తెలుసుకున్నాడు . క్రైస్తవులు ఒక బాక్స్ లోకి వెళ్లి తమ పాపాలు చెప్పుకొని ఉపశమనం పొందినట్టు కల్కి వరపూజ అని ఒకటి ప్రవేశపెట్టారు . భక్తుల గుంపులో కల్కి మనుషులే కొందరు చేరి కొద్ది సేపటి తరువాత జీవితంలో తాము చేసిన తప్పులు చెప్పి ఏడ్చే వారు . వారిని చూసి మిగిలిన వారు . ఐతే అంతా కళ్ళు మూసుకొని ఉండాలి . ఏడ్చాక తమ తలపై ఎవరో తడితే భగవంతుడే వచ్చి తట్టాడు అనుకుని.. సహజంగా కష్టాలు చెప్పుకున్న ఆతరువాత , ఏడ్చిన తరువాత మనసు తేలిక పడుతుంది . వరపూజలో దేవుడు తమను ఎలా కరుణించాడో కథలు కథలుగా చెప్పేవారు . ఇందులో నుంచి సంపన్న భక్తులు , మహిళా భక్తులు కొందరిని టార్గెట్ చేసేవారు . దీన్ని దగ్గరనుంచి చూసిన అజేయ భగవత్ పాద కల్కి సాగిస్తున్న మొత్తం వ్యవహారాన్ని మీడియాకు తానే చెప్పినట్టు అజయ్ నాకు చెప్పారు . . ఆ సమయం లో న్యూస్ టైం లో రాసిన కథనాలకు భక్తులు కార్యాలయంపై దాడికి వెళ్లారు . కల్కి దగ్గర ఎలా మోసాలు జరుగుతాయో చెప్పేందుకు అజయ్ భగత్ పాద దేవుడి అవతారం ఎత్తారు . ఐతే భక్తులు రావడం , కానుకలు , అంతా బాగానే ఉండడం తో అసలు లక్ష్యం వదిలేసి అజయ్ భగవత్ పాదా కూడా దేవుడిగా పూజలు అందుకో సాగారు . అప్పుడు కలిసి మనసులో సందేహాన్ని బయటపెడితే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు . ***** బాబాల చేతిలో మోసపోయిన వారు అంతా కలిపి ఎంత మంది ఉంటారు అని అడిగితే , సంఖ్య తెలియదు చాలా మందే అన్నాను . వెయ్యి , పది వేలు , పోనీ లక్ష అనుకోండి . రాష్ట్రమంతా , దేశమంతా వదిలేయండి . హైదరాబాద్ కె పరిమితం అవుదాం . కోటి మంది జనాభాలో లక్ష మంది మోసపోయారు అని మీరంటారు . నేను మోసం చేయడానికి ఇంకా 99 లక్షల మందిమిగిలే ఉన్నారు అని నేను అనుకుంటాను . ఇంకా భారీ మార్కెటింగ్ స్కోప్ ఉందని నేను అను కుంటాను అని మార్కెటింగ్ భాషలో వివరించారు . ఈ థీరీని సరిగా అర్థం చేసుకుంటే మీడియా వార్తలు , లాటరీ వచ్చింది అనే ఫోన్ కాల్స్ , రకరకాల ఆన్ లైన్ మోసాలు పెద్దగా ఆశ్చర్యం అని పించవు . ఈ మోసాలకు ఇంకా విస్తృతమైన మార్కెట్ ఉంది అనిపిస్తుంది . **** 2009 సమయంలో టీడీపీ , ఆ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్న వర్గాలు సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి . టీడీపీ విజయాన్ని కోరుకుంటున్న మీడియా టీడీపీని మించి సర్వశక్తులు ఒడ్డి పోరాడింది . వార్తలు చూస్తే భయమేసేది . టీడీపీ గెలవకపోతే యుగాంతం తప్పదేమో అనిపించేవి ఆ వార్తలు . తెల్ల పేపర్ఆ లో నల్లని అక్షరాలు అన్నీ నిజాలే అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదు . మేనేజ్ మెంట్ కోరిక మేరకు వార్తలు ఉంటాయి కానీ ప్రజల అభిప్రాయాలకు వార్తలకు సంబంధం ఉండదు . ఉదాహరణకు అప్పటి వరకు ఆంధ్రజ్యోతిలో పని చేసిన జర్నలిస్ట్ సాక్షిలో చేరగానే ... అప్పటి వరకు అంతా విధ్వంసంగా కనిపించింది , పచ్చగా కాలనిపిస్తుంది . అతని తప్పేమీ లేదు . మేనేజ్ మెంట్ కోరుకున్నది రాయాలి . ఒక పార్టీని ఓడించి , ఒక పార్టీని గెలిపించడానికి తన వంతు కృషి చేయాలి . ఆ సమయంలో ఈనాడులో వచ్చిన ఒక వార్త అలా గుర్తుండి పోయింది . 1995 నుంచి 2014 వరకు ఆంధ్రభూమిలో టీడీపీ బీట్ చూశా . 95లో టీడీపీ కార్యాలయం హిమాయత్ నగర్ లో ఉంటే 96-97 లో బంజారాహిల్స్ కు మారింది . సికిందరాబాద్ నుంచి బంజారాహిల్స్ కు ప్రతి రోజు ఒక్క సారి , ఒక్కో సారి రోజుకు రెండు సార్లు 97 నుంచి 2014 వరకు బైక్ పై వెళ్లిన అనుభవం నాది . ఈ పది కిలో మీటర్ల దూరానికి గంట సమయం పట్టేది . *** 2009 ఎన్నికల సమయంలో ఈ నాడులో వచ్చిన వార్త పంజాగుట్ట ఫ్లై ఓవర్ ఫోటో వేసి దాని నిర్మాణానికి అయిన వ్యయం , సమయం , ప్రాజెక్ట్ పొడవు వంటి వివరాలు అన్ని రాసి ఫలితం వృధా అని రాశారు . టాఫిక్ జామ్ అవుతోంది కాబట్టి అంతా వృధా అయింది అని స్టోరీ . ఇలానే ఐదేళ్ల వై యస్ ఆర్ పాలనలోని అన్ని ప్రాజెక్టుల గురించి ఎన్నికల ముందు స్టోరీలు . మిగిలినవి నాకు తెలియదుకాని 97నుంచి 2014 వరకు తెలిసిన దారి అరగంట పంజాగుట్ట చౌరస్తా వద్ద టాఫిక్ లో చిక్కుకు పోవలసి వచ్చేది ఇప్పుడు సికింద్రాబాద్ లోని మా ఆఫీస్ నుంచి అరగంట లోపే టీడీపీ ఆఫీస్ కు వస్తున్నాను . ఫ్లై ఓవర్ వల్ల ఫలితం అని అలా ఎలా రాసేస్తారు అని ఈనాడులో మిత్రుడిని అడిగితే , ఇదొక్కటే కాదు ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక పథకాల వల్ల పాజిటివ్ ప్రభావం ఉంటుంది అని చెప్పినా , అన్నింటిపై వ్యతిరేకంగా రాయమని ఆదేశాలు అని సమాధానం వినిపించింది . మరి నా పంజాగుట్ట అనుభవం అని అడిగితే అచ్చం అజయ్ భగవత్ పాద చెప్పిన సమాధానమే చెప్పారు . పంజాగుట్ట ప్లై ఓవర్ ను ఉపయోగించే కొన్ని వేల మంది వార్త నిజం కాదు అనుకుంటారు . కానీ మిగిలిన కోట్ల మంది నిజం అనుకుంటారు కదా ? అని సమాధానం అలానే పంజాగుట్ట వార్త అబద్దం అని ఇంతలా వాదిస్తున్న నువ్వు మిగిలిన వార్తలు నిజమే అనుకుంటున్నావు కదా ? అని మిత్రుడు ప్రశ్నించాడు . కల్కి మాయాబజార్ సృష్టికి , మీడియా మాయాజాలానికి తేడా లేదు అనిపించింది . ఐతే కాలం మారింది . ఇప్పుడు మనం చూపింది సమాచారం కాదు . సమాచారం అనేక చోట్ల నుంచి వస్తోంది . మాయాబజార్ లకు కాలం చెల్లింది . బాబాలది , మీడియాది అందరిదీ వ్యాపారమే . బుద్దా మురళి

3 కామెంట్‌లు:

  1. కల్కిమాయలు కావు స్వొమీ కలిమాయలు. కల్కి విష్ణువు రాబోయే అవతారం. కలియుగం ఆయన రాకతో అంతం అవుతుంది. దయచేసి సవరించుకోండి మీవ్యాసాన్ని.

    రిప్లయితొలగించండి
  2. ఓహో మీరు చెప్పేది దొంగ కల్కి గురించా?

    రిప్లయితొలగించండి
  3. కరెక్టే , హైదరాబాద్ లో దుబారా జరుగుతుంది అంటే, వైజాగ్ లో పేపర్ చదివే నేను అది నిజమే అని అనుకుంటాను .
    మెల్లిగా, ప్రభుత్వం మీద వ్యతిరేఖత మొదలవుతుంది . ఇలాంటి పిచ్చి వార్తలు మొదట ఈనాడే మొదలెట్టింది అనుకుంట .

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం