5, జూన్ 2023, సోమవారం
సాక్షిలో ఉద్యోగం చేయవద్దన్న బాబు ... గాంధీ భవన్ నుంచి పత్రిక వచ్చినా బాబు కోసమే పని చేస్తుంది .. జర్నలిస్ట్ జ్ఞాపకం- 42
సాక్షిలో ఉద్యోగం చేయవద్దన్న బాబు
గాంధీ భవన్ నుంచి పత్రిక వచ్చినా బాబు కోసమే పని చేస్తుంది ..
జర్నలిస్ట్ జ్ఞాపకం- 42
_______________________________
^^ ఒక వేళ గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఒక పత్రిక నడిపారు అనుకో , దాన్ని కూడా మేనేజ్ చేసే శక్తి మీకుంది . మిగిలిన కాలం అంతా కాంగ్రెస్ గురించి రాసుకోండి , కానీ ఎన్నికల సమయం లో టీడీపీకి అనుకూలంగా రాయండి అని చెప్పి వారిని ఒప్పించేంత శక్తి బాబుకు ఉంది ^^ అని నేను చెప్పగానే ఎన్టీఆర్ భవన్ లో అప్పటి పొలిట్ బ్యూరో సభ్యులు సి రామచంద్రయ్య నవ్వు ఆపుకోలేక పోయారు . నేను నీకేదో చెప్పాలి అనుకుంటే నువ్వే నాకు బ్రెయిన్ వాష్ చేసేట్టుగా ఉన్నావు . బాబు అంత సమర్థుడే అని ఆయన ఒప్పుకున్నారు .
******
అది 2004 ఎన్నికల సమయం సర్వేలో టీడీపీకి ఆరు ఎంపీ సీట్లు వస్తాయని NDTV చెప్పింది . అప్పుడు వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలపై సర్వే ఫలితాలు చెప్పలేదు . పార్లమెంట్ కే పరిమితం అయ్యారు. 42 స్థానాలు ఉంటే అందులో కేవలం ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పడం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోతారు అని చెప్పడమే . ఈ సర్వే ఫలితాలతో టీడీపీ గంగవెర్రులెత్తింది . ప్రతి రోజు ndtv పై ధ్వజ మెత్తుతూ విలేకరుల సమావేశాలు ఎన్టీఆర్ భవన్ లో జరిగేవి .
అప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న యస్. జైపాల్ రెడ్డి దగ్గరి బంధువు ( షడ్డకుడు కావచ్చు ) NDTV లో డైరెక్టెర్ . దీనితో టీడీపీ వాళ్ళు కథలు అల్లారు . జైపాల్ రెడ్డి ద్వారా ndtv ని మేనేజ్ చేసి సర్వే పేరుతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అని టీడీపీ వాదన . ప్రతి రోజు కొంతమంది నాయకులు ఈ విషయం పై ఎన్టీఆర్ భవన్ లో విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు . సి రామచంద్రయ్య సీఏ , సీనియర్ నాయకులు . మీడియా గురించి అవగాహన ఉంది . తెలుగుదేశం పార్టీ తరపున నడిపించే పత్రికకు ఆయనే సంపాదక బాధ్యతలు . ఆ తరువాత ఉదయం దినపత్రిక నడిపే ప్రయత్నం చేశారు . సి రామచంద్రయ్య సంపాదకులుగా ఉదయం నడిపేందుకు సన్నాహాలు చేశారు . అజామాబాద్ లోని ఉదయం కార్యాలయానికి కొన్ని నెలల పాటు అయన రోజూ వచ్చే వారు . కొంతమంది సిబ్బంది నియామకం కూడా జరిగింది .
జైపాల్ రెడ్డి బంధువు ఆ ఛానల్ లో బంధువుగా ఉండడం , మేనేజ్ చేశారు అంటూ యేవో చెప్పుకొచ్చారు . తరువాత ఎన్టీఆర్ భవన్ లో పిచ్చాపాటి మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తూ తానూ చెప్పింది నిజమే అన్నట్టుగా వివరణ ఇచ్చారు . అంత పెద్ద ఛానల్ బంధువు కోసం క్రెడిబులిటీ పోగొట్టు కోదు .. ఒక వేళ అలా మేనేజ్ చేసే అవకాశం ఉంటే మీ పార్టీకి సాధ్యం అవుతుంది కానీ ఎవరికి వారే అన్నట్టుగా ఉండే కాంగ్రెస్ వల్ల కాదు అని , గాంధీ భవన్ నుంచి పత్రిక నుంచి పత్రిక వచ్చినా దాన్ని మేనేజ్ చేసే శక్తి బాబుకు ఉందని చెప్పాను ...
*****
దేవతా వస్త్రాలు ధరించాం , మేం ఎవరికీ కనిపించడం లేదు అని మీడియా మురిసిపోతుంది కానీ .. మీడియాకు పార్టీలకు విడదీయ రాని అనుబంధం . 82లో టీడీపీ పుట్టినప్పుడు ఆ పార్టీ మ్యానిఫెస్టో ముద్రించింది ఈనాడు లో .... ఆ మ్యానిఫెస్టో మైసూరారెడ్డి వద్ద చూశాను . అయన అలా భద్రపర్చుకున్నారు .. పార్టీలకు పత్రికల మద్దతు కామన్ కానీ ఏకంగా మ్యానిఫెస్టో అలా పత్రికలో ముద్రించడం , తమ పత్రికలో ముద్రించామని స్పష్టంగా పేర్కొనడం అదే మొదటి సారి , చివరి సారి .
****
ఒక మీడియా ఒక పార్టీకి కట్టుబడి ఉండాలి అనేమీ లేదు . ఓనర్ పార్టీ మారినప్పుడల్లా మీడియా మారుతుంది .ఓనర్ పార్టీనే మీడియా పార్టీ . వి 6 తెలంగాణ ఉద్యమ కాలం లో తక్కువ పెట్టుబడితో వచ్చి విజయం సాధించింది . తెలంగాణ ఉద్యమానికి కట్టుబడి ఉండేది . ఉద్యమం వల్ల ఛానల్ , ఛానల్ వల్ల ఉద్యమం పరస్పరం ప్రయోజనం పొందాయి . ఛానల్ ఓనర్ తెరాస , కాంగ్రెస్ , బీజేపీ , ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాదన చాలా బలంగా వినిపిస్తుంది .
ఇక టివి 9 ను 2004 ఎన్నికల తరువాత టీడీపీ బహిష్కరించింది . మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 127 మున్సిపాలిటీల్లో టీడీపీకి 27 వస్తాయి అని టివి 9 సర్వే . దాంతో టీడీపీ ఛానల్ ను బహిష్కరించింది . రవి ప్రకాష్ , కరీం ఎన్టీఆర్ భవన్ కు వచ్చి బాబుతో రాయబారాలు నడిపారు . టివి 9 ను కొత్త మేనేజ్ మెంట్ కొనగానే తెరాస స్వరం వినిపిస్తుంది అనుకున్నారు . మేనేజ్మెంట్ బీజేపీకి దగ్గర కావడం తో ఇప్పుడు బీజేపీ స్వరం వినిపిస్తోంది . జగన్ పై ఈగ వాళ్లొద్దు అని ఆదేశాలట ...
****
సాక్షి ఆవిర్భావ సమయం అసెంబ్లీ లాబీ లో అప్పుడు కాంగ్రెస్ శాసన సభ్యునిగా ఉన్న దగ్గుబాటి కనిపిస్తే పార్టీకి మద్దతు వేరు ఏకంగా పార్టీ నే పత్రిక పెట్టడం ఏమిటీ అని కొమ్మినేని శ్రీనివాస్ అడిగారు . ఒకే పార్టీకి మీడియా ఉండడం కన్నా ఇలా అన్ని పార్టీలము మీడియా ఉండడం బెటర్ అని నా అభిప్రాయం చెప్పాను .
సాక్షి టీడీపీకి చిరాకు పెట్టడం మొదలైంది .టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది . అసెంబ్లీ లాబీ లోని తన ఛాంబర్ లో బాబు ఓ రోజు మీడియాతో అక్రమ సంపాదన ,అవినీతి సంపాదనతో పెట్టిన సాక్షిలో ఎలా పని చేస్తారు అని మీడియాను నిలదీశాడు . పలానా పత్రిక చదువ వద్దు , పలానా పార్టీ పత్రిక అని విమర్శించడం విన్నాం కానీ ఏకంగా అందులో ఉద్యోగం చేయవద్దు అని నాయకులు అనడం మొదటి సారి . బాబు వాక్ ప్రవాహం అలా సాగుతూనే ఉంది . సాక్షి అక్రమ సంపాదన తో పెడితే , మరి జ్యోతి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు దాచుకొని పొదుపు చేసి పెట్టిందా ? అని అడిగితే బాబు సమాధానం చెప్పలేదు . సాక్షి చదవ వద్దు, అందులో పని చేయవద్దు సరే మరి ఏ పత్రిక చదవాలి , ఎక్కడ పని చేయాలి అది కూడా చెప్పండి అంటే సమాధానం లేదు . అక్కడే ఉన్న రేవంత్ రెడ్డి బయటకు వస్తూ భుజం తట్టి నిజమే కదా ? ఇప్పటి దాకా ఆ ఆలోచన రాలేదు ఆంధ్రజ్యోతి ఎలా పెట్టారు ? అదేమన్నా సక్రమ సంపాదనా ? అనే ఆలోచనే రాలేదు అన్నారు .
జగన్ అరెస్ట్ అయినప్పుడు సాక్షి మూత పడుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం . సాక్షి మానేయండి ఆంధ్రజ్యోతి వేసుకోండి అని పేపర్ బాయ్స్ ఇంటింటికి వెళ్లి ప్రచారం .ఉద్యోగుల్లో ఆందోళన సహజం . అప్పుడు అజిత , సారధి సాక్షిలో ఉండేవారు . ఏమవుతుంది అని అడిగితే , అస్సలు భయపడకండి ఏమీ కాదు . అవసరం అయితే ప్రపంచంలో ఉన్న రెడ్లు అంతా అండగా నిలుస్తారు . పత్రికను బతికిస్తారు అని చెప్పాను .
ఏ మీడియా పార్టీ రహితంగా లేదు . అలా అని స్వచ్చందంగా పార్టీలకు మద్దతు ఇవ్వడం లేదు . ఎవరి లెక్కలు వారికి ఉంటాయి .
మరి నీ లెక్కలు అని అడుగుతున్నారా ?
ఆంధ్రభూమిలో స్వేచ్ఛ అనుభవించాను . ఎడిటర్ సమైక్యాంధ్ర కోసం చమటలు దారపోస్తుంటే , మేనేజ్ మెంట్ సమైక్యాంధ్ర అని చెప్పి వదిలేసింది అస్సలు జోక్యం చేసుకోలేదు . అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ కోసం రాసే స్వేచ్ఛ అనుభవించాను. కొద్దిపాటి జీతం పెరుగుతుంది అని స్వేచ్ఛను ఎలా వదులు కుంటాను .
**** సరే NDTV సర్వే ఏమైంది ?అని సందేహమా ? నిజం కాలేదు . ఔను నిజం కాలేదు . టీడీపీకి ఆరు పార్లమెంట్ సీట్లు వస్తాయని NDTV చెప్పింది . కానీ ఆరు రాలేదు . ఐదే వచ్చాయి . సర్వే పై బాబు మొదలుకొని పార్టీ నాయకులు అందరూ ధ్వజమెత్తినా , మేం చెప్పినట్టే ఫలితాలు వచ్చాయి అని NDTV ఒక్క సారి కూడా చెప్పకుండా హుందాగా ఉంది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం