13, జూన్ 2023, మంగళవారం

ఎడిటర్ లలో మహానుభావులూ ఉంటారు ... కూర్చొని మాట్లాడే అవకాశం కోసం రాజీనామా చేసిన జర్నలిస్ట్ .. జర్నలిస్ట్ జ్జ్ఞాపకాలు -48

ఎడిటర్ లలో మహానుభావులూ ఉంటారు ... కూర్చొని మాట్లాడే అవకాశం కోసం రాజీనామా చేసిన జర్నలిస్ట్ .. జర్నలిస్ట్ జ్జ్ఞాపకాలు -48 ------------------------------------------ ఎడిటర్ లు అందరూ శాడిస్టులేనా ? మంచివాళ్ళు లేరా ? అంటే ఎందుకు లేరు . లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నట్టే ఎడిటర్స్ లోకం లో మంచివాళ్ళూ ఉన్నారు . శాడిస్ట్ లూ ఉన్నారు. . ప్రముఖ కవి , జర్నలిస్ట్ ప్రసేన్ ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు ఎడిటర్ శాస్త్రి ఛాంబర్ కు వెళ్లి రాజీనామా లేఖ ఇచ్చారు . ఎడిటర్ నిర్లక్ష్యంగా చూసి రాజీనామా ఎందుకూ అని అడిగారు . కె. రామచంద్రమూర్తి (అప్పుడు ఆంధ్ర జ్యోతి ) వద్ద కూర్చొని మాట్లాడవచ్చు అందుకే వెళుతున్నాను అని సమాధానం చెప్పారు . శాస్త్రి సంబంధించిన వ్యక్తిగత పని .. మరీ ముఖ్యమైన వ్యక్తిగత పని పై ఎవరినైనా ఛాంబర్ కు పిలిస్తే కుర్చీలో కూర్చోమని చెప్పి మాట్లాడుతాడు . కుర్చొవయా అని ప్రేమగా పలకరించాడు అంటే మనకేదో పెద్ద పని చెబుతున్నాడు అని అర్థం . అద్దాల నుంచి బయట చూసే జర్నలిస్ట్ లు ఏదో కీలక సమావేశం , ఇతనికి ఎడిటర్ ప్రాధాన్యత ఇస్తున్నాడు అనిపిస్తుంది . అది ఎడిటర్సొం త పని మీద చర్చ అని నేను ఊహించింది / అంచనా వేసింది ఎప్పుడూ తప్పలేదు . చివరకు ఈనాడు కూడా పూర్తి స్థాయిలో వెజ్ బోర్డు అమలు చేయలేదు . అంధ్ర భూమి అమలు చేసింది . అలాంటిది మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలి తక్కువ జీతానికి వెళ్లడం అంటే ... ప్రసేన్ తన భార్య పుట్టిన రోజు సందర్బంగా రెండు మూడు సార్లు రాశారు . భార్య (ప్రభుత్వ ఉద్యోగి) ఉందనే ధైర్యం తో మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలి శాస్త్రి కబంధ హస్తాల నుంచి బయటపడ్డాను అని రాశారు . ******** కూచిమంచి (పూర్తి పేరు గుర్తు రావడం లేదు ) వారి గురించి ఆంధ్రభూమి ప్రత్యేక సంచికలో చదివాను . వారిని గోరాశాస్త్రికన్నా ముందు ఎడిటర్ గా ఉండమని కోరితే ఉండలేను అన్నారు . కనీసం ఒక్క సంవత్సరం ఉండమని కోరితే సరే అని ఒప్పుకున్నారు . ఒక రోజు ఆఫీస్ లో సంపాదకీయం రాసి ... ఈ రోజుతో ఒక్క సంవత్సరం పూర్తి అవుతుంది అని వెళ్లిపోయారు . రాజకీయ నాయకుల సిఫారసులతో మేనేజ్ మెంట్ కు చెప్పించుకుని పీఠాధిపతులుగా అధికారం చెలాయించిన వారిని చూసి కూచిమంచి లాంటివారు నిజమేనా ?అనిపిస్తుంది . తొమ్మిది అడుగుల ఛాంబర్ నుంచి ముల్లోకాలను శాసిస్తున్నాం అనుకునే వారు శాడిస్ట్ ఎడిటర్లు . అదే సమయంలో మనిషిని మనిషిగా చూసిన మంచి మనుషులు అయిన ఎడిటర్ లు కూడా ఉన్నారు . 1969 తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రభూమి కేంద్రంగా ఉండేది . ఉద్యమానికి నాయకత్వం వహించిన రఘువీర్ లాంటి పలువురు ఆంధ్రభూమి జర్నలిస్ట్ లే ... ఎడిటర్ గోరాశాస్తి సమైక్యవాది . సమైక్య వాదం తో ఆయన సంపాదకీయాలు రాసేవాళ్ళు . మిగిలిన జర్నలిస్ట్ లు అందరూ తెలంగాణ ఉద్యమాన్ని బలపర్చారు . ఉద్యమానికి నాయకత్వం వహించారు . ఐనా ఎప్పుడూ ఒకరి స్వేచ్ఛను ఒకరు అడ్డుకోలేదు . శాస్త్రి కాలం లో పని చేసిన మా తరం వారికి ఇది కనీసం ఊహకు కూడా అందదు . కథలు , కవిత్వం , వార్తలు , వ్యాసాలు , చివరకు సినిమా సమీక్షలు సైతం ఎడిటర్ కోణంలో రాయాలి . తెలంగాణ ఉద్యమం ఉదృతం అయిన తరువాత రాసుకోవడానికి కొంత స్వేచ్ఛ లభించింది . జ్యోతిలో ఎడిట్ పేజీ వరకు ఈ స్వేచ్ఛ కనిపిస్తుంది . మిగిలిన పేజీలన్నీ బాబు కోసం ఐనా, ఎడిట్ పేజీలో భిన్నాభిప్రాయలకు చోటు ఉంటుంది . వార్త ఎడిటర్ గా టంకశాల అశోక్ సింపుల్ గా ఉండేవారు . పొత్తూరి వెంకటేశ్వరరావుది పెద్ద మనిషి తత్త్వం **** గజ్జెల మల్లారెడ్డి ఎడిటర్ గా ఉన్నప్పుడు జొన్నలగడ్డ రాధాకృష్ణ అని భూమిలో ఉండేవారు . మల్లారెడ్డి ఎడిటోరియల్ , మాటకచేరి , పణ్యభూమి కాలం రాసి వెళ్లేవారు . పేపర్ మొత్తం రాధాకృష్ణ చూసుకునేవారు . ఆంధ్రభూమికి దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివాను . టెన్త్ నుంచే భూమిలో ఏదో ఒకటి రాసేవాడిని . అది ఎవరికి గుర్తుంటుంది లే అనుకున్నాను . ఈ మధ్య ఒక పంక్షన్ లో దేవులపల్లి అమర్ నేనూ భోజనం చేస్తుంటే ... నువ్వు పంపే వ్యాసాలు అప్పుడు భూమిలో నేనే చూసేవాడిని , ఉత్తరాల నుంచి మొదలు పెట్టి ఎడిట్ పేజీ వ్యాసాల వరకు రాసేది . నీ నుంచి కవర్ వచ్చింది అంటే ఎడిట్ కూడా చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు ఉండేది అని గుర్తు చేశారు . విజయవాడ ఎడిషన్ 87 లో పెడుతుంటే రిపోర్టర్ లు , సబ్ ఎడిటర్స్ కావాలి అని ప్రకటన . దరఖాస్తు చేశావా ? అని రాధాకృష్ణ అడిగితే , డిగ్రీ పరీక్షలు రాశాను , ఇంకా ఫలితాలు రాలేదు . రెండు వారాల్లో వస్తాయి అందుకే దరఖాస్తు చేయలేదు అని చెప్పాను .అప్పటికే ఎడిట్ పేజీలో చాలా వ్యాసాలు వచ్చాయి . వాటికి పారితోషకం కూడా ఇచ్చేవారు . ఎన్నో వ్యాసాలు రాశావు , డిగ్రీ ఫలితాలు నీకెందుకులే అని నేను ఎం డి తో మాట్లాడుతాను అని చెప్పి మాట్లాడి విజయవాడలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చారు . వెంటనే సంగారెడ్డి లో మెదక్ జిల్లా రిపోర్టర్ గా నియమించారు . నన్ను , వెల్జాల చంద్ర శేఖర్ , అయూబ్ ఖాన్ ముగ్గురినీ రాధాకృష్ణ నియమించారు . ముగ్గురిలో ఇద్దరం ఇప్పటికీ రాస్తూనే ఉన్నాం . అయూబ్ ఖాన్ చాలా కాలం క్రితమే ఈ రంగం వదిలి వెళ్లారు . రిపోర్టర్ గా నియామకం తరువాత ఓ సారి ఆఫీస్ కు వస్తే జొన్నలగడ్డ రాధాకృష్ణ మీది ఏ కులం అని అడిగారు . ఆ ఆ ప్రశ్న అర్థం కాలేదు అన్నట్టు ముఖం పెడితే , ఏమీ లేదు .. నువ్వు మా కులం అని నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను అని ఆఫీస్ లో గుసగుస లు అందుకే అడిగాను అన్నారు . మీ కులం కాదు అన్నాను . అప్పుడూ ఇప్పుడూ మరో పని లేదు , వ్యసనం లేదు .. రాయడమే వ్యసనం దాంతో అప్పుడు ప్రతి రోజు భూమిలో నా పేరు కనిపించేది . మల్లారెడ్డి పేరు మురళి పేరు పేపర్ లో రోజూ కనిపించాల్సిందే అని రాధాకృష్ణ జోక్ వేసి . కులం గురించి ఉరికే అడిగాను ఎక్కువగా ఆలోచించకు అదిలేయ్ అన్నారు . జిల్లాల్లో రిపోర్టర్ లకు అక్రిడేషన్ ఇస్తారు . ఆ ఫారం మీద ఎండి సంతకం చేశారు . ఎండి కాదు ఎడిటర్ సంతకం చేయాలి అని తిప్పి పంపితే .. అప్పుడు ఆ ఫారం పట్టుకొని మల్లారెడ్డి ఛాంబర్ కు మొదటి సారి వెళ్ళాను . కొద్దిగా పక్కకు ఉండే బిల్డింగ్ లో ఆయన ఛాంబర్ . వెళ్ళగానే ఫారం ఇచ్చి విషయం చెబితే .. ఓహో బుద్దా మురళి అంటే నువ్వేనా అని ప్రసన్నముగా నవ్వి సంతకం చేశారు . ఆయనది ఎంత గొప్ప మనసు , విశాల హృదయం అనేది అప్పుడు అర్థం కాలేదు కానీ అదే శాస్త్రి వద్దకు అలా వెళితే .. ముందు ఉద్యోగం ఊడబెరికే వారు . దాదాపు 15 ఏళ్ళ పాటు భూమిలో పని చేసి రాజీనామా చేసి కొంత కాలానికి తిరిగి వచ్చిన విష్ణు ప్రియా అనే సబ్ ఎడిటర్ ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి నిర్ణయం . ఎడిటర్ ఇంకా ఆఫీస్ కు రాలేదు . ఆమె వచ్చి పని చేసిన ఆఫీస్ కదా అని కంప్యూటర్ పై ఏదో టైప్ చేస్తుంటే అప్పుడే వచ్చిన శాస్త్రి తన అనుమతి లేనిదే కంప్యూటర్ ముట్టుకున్నారని , ఉద్యోగంలో చేర్చుకోవడం లేదు అని చెప్పి పంపించేశారు . తరువాత ఏ బీకే ప్రసాద్ ను ఎడిటర్ గా నియమించారు . వారితో పాటు శ్రీనివాసరావు అని ఒకరు ఉండేవారు . హడావుడి తప్ప పెద్దగా ఏమీ మార్పు కనిపించలేదు . వామపక్షాల వాళ్ళు సాధారణంగా పార్టీ వారిని మీడియాలో కూడా జొప్పిస్తారు . తామే మేధావులం అనే గట్టి మూఢనమ్మకాలు కూడా కొందరు వామపక్షాల వారికి ఎక్కువే . ఆఫీస్ లో ఫర్నిచర్ అటు ఇటు మార్చడం తప్ప పత్రిక అభివృద్ధికి పెద్దగా ప్రభావం చూపినట్టు గుర్తుకు రావడం లేదు . తరువాత పతంజలి ఎడిటర్ గా వచ్చారు . అద్భుతమైన వ్యంగ్యం రాస్తారు . గురజాడ అప్పారావుకన్నా నాకు పతంజలి వ్యంగ్యం నచ్చుతుంది అంటే అలా అనకు పతంజలి కూడా ఈ మాటను ఒప్పుకోరు అని సబ్ ఎడిటర్ రాజేశ్వర ప్రసాద్ అనే వారు . పతంజలి 90-92 ప్రాంతం లో ఆంధ్రభూమిలో అద్దం అని ఒక పేజీ పరిచయం చేశారు . దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పత్రికల్లో వచ్చినవాటిని తెలుగులో అనువాదం చేసి వేసేవారు . అందులో ఆ పత్రిక ఫోటో ఉండేది . ఏ మాత్రం ఇగో చూపకుండా అందరితో కలిసి పోయే వారు . ఆంధ్రభూమిలో పతంజలి చెప్పిన గొప్ప జోక్ ... అప్పుడు ఈనాడు నుంచి న్యూస్ టైం రాబోతుంది దాని ప్రభావం పై సహజంగా డక్కన్ క్రానికల్ లో ఆందోళన ఉంటుంది . ఈనాడు పెద్ద పత్రిక , మంచిమార్కెటింగ్ నెట్ వర్క్ ఉంటుంది . అప్పుడు పతంజలి కూల్ గా డక్కన్ క్రానికల్ ను వెంకట్రామ్ రెడ్డి ( డిసి ఎండి ) కూడా ఏమీ చేయలేడు అన్నారు . అంటే డిసి ఎండీనే ఏమి చేయలేనప్పుడున్యూస్ టైం ఏం చేస్తుంది అని ... అదే నిజమైంది న్యూస్ టైం , టైమ్స్ అఫ్ ఇండియా నే కాదు .. చివరకు డిసి ఎండి వెంకట్రామ్ రెడ్డి కూడా డిసి ని ఏమీ చేయలేక పోయారు . వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ లో ఇరికినా డిసి చెక్కుచెదరలేదు . ఆఫీస్ ముహూర్త బలం తప్ప లేకపోతే మేనేజ్ మెంట్ మెళుకువలు ఏమీ తెలియని వీరి చేతిలో డిసి చెక్కుచెదరకుండా ఉండడం ఏమిటీ అని స్టాఫ్ అనుకునే వారు . మేనేజ్ మెంట్ కు మెళుకువలు నేర్పే ఓ ప్రోగ్రాం లో ఓ మంచిమాట చెప్పారు . ఇతర సంస్థలు రెట్టింపు జీతం ఇస్తామని పిలిచేంతగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి , సంస్థను వదిలిపెట్టి పోవడానికి ఉద్యోగి ఇష్టపడనంతగా ప్రేమించాలి.. భూమిలో ఇతర పత్రికలతో పోలిస్తే రెట్టింపు జీతం . ఐతే పని చేసే వారికి చేయని వారికి ఒకే ట్రీట్ మెంట్ ఉండేది . ఎడిటర్ ఎవరు , ఓనర్ ఎవరు అనేది సంబంధం లేకుండా భూమిని ప్రేమించి తమ ఇంటిలా భావించిన సిబ్బంది ఉండడం భూమి ప్రత్యేకత ... ఎంతో మంది మహానుభావులు పని చేయడం వల్లనే ఆ సంస్కృతి నిలిచిపోయింది . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం