19, జూన్ 2023, సోమవారం

ఎంఐఎం అసదుద్దున్ ను హడలెత్తించిన కొండయ్య ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు 53

ఉమ్మడి రాష్ట్రంలో , ఇప్పుడు తెలంగాణ లో నైనా ఫలితాలు ఎలా ఉండవచ్చు అని రకరకాలుగా చెబుతారు కానీ పాత నగరంలోని నియోజక వర్గాల ఫలితాల విషయంలో అందరిలో ఏకాభిప్రాయం ఉంటుంది . పాతనగరం సీట్లను యం ఐ యం పార్టీకి వదిలేసి లెక్కలు చెబుతారు . అలాంటిది యంఐయం నేత అసదుద్దీన్ ఒవైసి సైతం హడలి పోయేట్టు చేశారు ఒకరు . ఎవరు అమానుల్లా ఖాన్ నా ? అంటే.. . అమానుల్లా ఖాన్ పార్టీ ఎంబీటీ కి మూడు అసెంబ్లీ సీట్లు వస్తే ఎంఐఎం కు ఒకటే స్థానం వచ్చిన సందర్భం ఉంది . అమానుల్లా ఖాన్ శాసన సభ్యుడిగా ఉండి ఒవైసి పై ఎంపీగా పోటీ చేసి దెబ్బ తిన్నారు.. కానీ లేకపోతే పాతనగరం ఒవైసి చేతి నుంచి అమానుల్లా ఖాన్ చేతికి వచ్చేది . ఖాన్ కాదు మరెవరూ అంటే ? కొండయ్య .. ఔను నిజం కొండయ్య .. ఈ కొండయ్య ఎవరో అసదుద్దీన్ ఒవైసీకి తెలియక పోవచ్చు , కొండయ్యకు ఒవైసి తెలిసి ఉండక పోవచ్చు కానీ కొండయ్య వల్ల ఎంఐఎం హడలి పోయిన విషయం నిజం .. ****** ఛానల్స్ తిరగేస్తుంటే NTV లో కేఏ పాల్ కనిపించగానే అలానే వింటూ ఉండిపోయాను . నేనే కాదు హాస్యాన్ని ఇష్టపడే ఎవరైనా పాల్ ను వింటూ ఉండిపోవలసిందే . 350 మంది ఎంపీలు తనకు పాదపూజ చేశారని , ప్రధాని కూడా పాదపూజ చేశారని చెప్పుకుపోతున్నాడు . ఈ సారి అధికారంలోకి వచ్చేది తానే అని జగన్ కన్నా ధీమాగా చెబుతున్నారు . కరోనా కష్టకాలంలో అందరి ముఖాల్లో కాసేపైనా నవ్వులు పూయించింది కేఏ పాల్ . ఆయన చెబుతున్నవి నిజం అని కనీసం ఆయన కూడా అనుకోరు అందరూ వింటూ ఎంజాయ్ చేస్తారు . ఒకప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడిని కలిసింది నిజమే . అనేక మంది దేశాధినేతలతో సమావేశం అయింది నిజమే . సొంత విమానం నిజమే . ఇవన్నీ గతం ఇప్పుడు ఎక్కడా నోటాకు వచ్సినన్ని ఓట్లు కూడా ఆయనకు రావు కానీ ఆంధ్ర , తెలంగాణ నే కాదు మొత్తం దేశంలో తన పార్టీనే అధికారం లోకి వస్తుంది అని ధీమాగా చెబుతాడు . పక్కన ఉన్న జ్యోతి తో సాక్ష్యం చెప్పిస్తారు . సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు శత్రువులా గుర్రున చూస్తారు . కానీ పాల్ కనిపించారు అంటే ఏ పార్టీ వారైనా నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటారు . అంతా నిజమే అనుకొని ఆయన చెప్పే మాటలు వింటుంటే తేడా మనకా ? ఆయనకా ? అర్థం కాదు . ఇదో చిత్రమైన మానసిక స్థితి బాగానే మాట్లాడుతారు , బాగానే ఉంటారు . ఒక్కో సారి తెలివిగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది కానీ ఏదో తేడా ఉంటుంది ... **** ముందు కొండయ్య గురించి చెప్పండి మధ్యలో కేఏ పాల్ కథ ఏమిటీ అంటే ? అక్కడికే వస్తున్నాను . ఇంతకూ కొండయ్య ఎవరు ? అప్పటి నగర పోలీసు కమిషనరా ? ఎన్నికల అధికారా ? రా అధికారా ? అంటే ఇవేవీ కాదు . మానసికంగా కొంత తేడా ఉన్న వ్యక్తి . బాగా మాట్లాడేవాడు . సమాజానికి ఏదో మేలు చేయాలి అనుకునే వాడు . ఒక్క మాటలో చెప్పాలి అంటే కేఏ పాల్ ను కొత్తవారు చూస్తే ఎవరికైన అనుమానం వస్తుందా ? కొత్తవారికే కాదు పాల్ పాత పలుకుబడి చూసి ఇప్పటికీ విమర్శించాలి అంటే కొంత కష్టమే . ఐడీపీయల్ లో శాస్త్రవేత్తగా చేశాను అని చెప్పేవారు . ఎన్నికల విధానంలో మార్పు రావాలి అంటూ ప్రచారం చేసేవారు . గ్యాప్ ఉద్యమం అంటూ ఒక సారి పోటీ చేసిన వారు రెండవ సారి పోటీ చేయవద్దు అని ఇలా ఉండేవి అతను సూచించే మార్పులు . **** ఎన్నికల సంస్కరణలపై ఓ సారి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ నౌబత్ పహాడ్ వద్ద ఉన్న తమ పార్టీ కార్యాలయంలో చర్చ . మీడియా కూడా ఉంది . ఇంతలో కలకలం . కొండయ్య వచ్చి మీరు నిజంగా ఎన్నికల సంస్కరణలు కోరుకుంటే నేను చెప్పిన సంస్కరణలపై ఎందుకు చర్చించడం లేదు అని వాదన . కొందరు కార్యకర్తలు కొండయ్యను ఎత్తుకెళ్ళి బయట పారేసి వచ్చారు . మీరు కంగారు పడకండి మా మీటింగ్ ఎప్పుడు జరిగినా ఇది కామన్ అని జయప్రకాశ్కూ నారాయణ అందరినీ కు ర్చోబెట్టారు . **** 2002 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు . గార్గ్ అని ఐఏఎస్ రాష్ట్ర ఎన్నికల అధికారి . వారిని ఎలా ఒప్పించారో కానీ కొండయ్య ఎన్నికల సంస్కరణలకు ఒప్పించారు . హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరు వేలి ముద్ర వేయాలి . వేలి ముద్రలు రికార్డ్ చేస్తారు . దీనివల్ల బోగస్ ఓట్లు వేయడం ఉండదు అని కొండయ్య ఒప్పించారు . ఆ ఎన్నికల్లో తొలిసారి వేలిముద్రలను రికార్డ్ చేశారు . హైదరాబాద్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 30 శాతం లోపే పోలింగ్ జరిగింది . ఓల్డ్ సిటీలో బోగస్ ఓట్ల మాట దేవుడెరుగు తమ ఓటు తాము వేయడానికే భయపడ్డారు . వేలి ముద్రలు రికార్డ్ కావడం వల్ల ఉద్యోగానికి గల్ఫ్ దేశాలకు వెళితే అడ్డంకి కావచ్చు అని భయపడ్డారు . పోలింగ్ జరుగుతుండగానే అసదుద్దీన్ వేలిముద్రల నిబంధన పార్టీకి కొంప ముంచెట్టు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు . కొండయ్య పుణ్యమా ? అని అతి తక్కువ శాతం పోలింగ్ రికార్డ్ నమోదు అయింది . తాను చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఐతే ఆ రోజు క్రికెట్ వల్ల పోలింగ్ శాతం తక్కువగా ఉందని అప్పుడు సీఎంగా ఉన్న బాబు చెప్పారు . తీగల కృష్ణారెడ్డి మేయర్ అయ్యారు . ఎన్నికల సంస్కరణలు తెచ్చిన కొండయ్యకు పాల్ తో పోలికా అంటే ? .... **** కొండయ్య రెగ్యులర్ గా ఆంధ్రభూమి ఆఫీస్ కు నా కోసం వచ్చే వారు . అతను కనిపించగానే మిగిలిన వారు మీ ఫ్రెండ్ అంటూ జోకులేసేవారు . చిత్రమైన ఉద్యమాలు చేసేవారు . కర్నూల్ వెళ్లి అర్ధరాత్రి ఓ.. ఓ .. అని అరుపులు .. ఎందుకీ అరుపులు అని అడిగితే అరుపులకు జనం లేచి ఏమైంది అనిఅడిగితే ఎన్నికల సంస్కరణల అవసరం గురించి వారికి వివరిస్తారు . ఒక సారి గుండు కొట్టించుకునే ఉద్యమం . కొండయ్య , అయన భార్య మాత్రమే గుండుకొట్టించుకున్నారు . ఏదో తేడా ఉందని మాట్లాడడం తగ్గించాను . ఎన్నికల సంస్కరణలపై పిచ్చి పిచ్చి రాతలతో కరపత్రాలు ముద్రించేవారు . చదవడానికి కూడా తీసుకోకుండా పంపిస్తే ... ఆ తరువాత ఎన్నికల సంస్కరణలు రాకుండా రామోజీ రావుకు నేను అమ్ముడు పోయాను అని ఓ కరపత్రం లో నా గురించి రాసి నాకే ఇచ్చాడు . రామోజీకి అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నాను . మీరే బేరం ఆడండి , చేరి సగం తీసుకుందాం అని చెప్పి పంపాను . తరువాత ఏమయ్యాడో పట్టించుకోలేదు . చాలా నెలల తరువాత వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి ఆఫీస్ లో కింద ఉన్నాను అంటే వెళ్ళాను . బ్యాంకు లో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కలకత్తా వెళ్లమంటున్నారు . నన్ను సిబిఐ వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటూ ఏవేవో చెబుతుంటే పాపం ఇంటిల్లి పాది తేడానే అనుకోని పని ఉందని ఆఫీస్ లోకి వెళ్ళిపోయా . **** నాలుగు దశాబ్దాల క్రితం సినిమా తీసిన మూడు పాతికల వయస్సున్న ఒకాయన తన ఫోన్ లను పదేళ్ల నుంచి ట్యాపింగ్ చేస్తున్నారు అని ఆరోపించారు . పదేళ్ల నుంచి తాను ఎవరితో మాట్లాడడం లేదని , తనతో ఎవరూ మాట్లాడడం లేదని .. మాట్లాడకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాని ఆరోపణ . అసలు ఏం జరిగిందో తెలియదుకాని ఎవరేం మాట్లాడుకుంటున్నారో రహస్యంగా వినడం ఫోన్ ట్యాపింగ్ అవుతుంది కానీ .. ఫోన్ లో మాట్లాడకుండా చేయడం ట్యాపింగ్ ఎలా అవుతుందో ? మాట్లాడుకుంటే రహస్యాలు వినొచ్చుకాని , మాట్లాడకుండా చేస్తే ఏం తెలుస్తుంది . ఫోన్ బాగా లేదా ? సిగ్నల్స్ లేవా ? ఏమో కొందరి మాటలు అస్సలు అర్థం కావు ...

2 కామెంట్‌లు:

  1. అవి చాలా పెద్ద రోగం సర్ , స్క్రీజోఫీనియా అని అంటారు అనుకుంట, తెలియదు కరెక్ట్ గా . నా ఎరుక లో ముగ్గురు చనిపోయారు ఆత్మహత్య చేసుకుని .
    ఎవరో నా ఫోన్ హాక్ చేసేసారు , అంటే అతనకి కొత్త ఫోన్ కొనిచ్చారు . అయినా అదే గొడవ .
    నా మాటలు అన్ని ఎవరో వింటున్నారు , వాడికి అన్ని తెలిసిపోతున్నాయి .
    నన్ను ఫాలో చేస్తున్నారు

    చెవిలో మాటలు వినిపించడం ..

    నిజంగా నరకం

    రిప్లయితొలగించండి
  2. స్పందించినందుకు ధన్యవాదాలు ఇలాంటి వారు మన చుట్టుపక్కల ఉంటే చాలా మంది నవ్వుతుంటారు . సరైన చికిత్స అవసరం . ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించి చికిత్స చేయిస్తే  బాగుపడే అవకాశం ఉంది 

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం