26, జూన్ 2023, సోమవారం
ఎడిటర్ కు , ఓనర్ కు కోపం వస్తే .... రికార్డ్ సృష్టించి న పీసిసి అధ్యక్షుడు, గవర్నర్ .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -57
ఎడిటర్ కు , ఓనర్ కు కోపం వస్తే ....
రికార్డ్ సృష్టించి న పీసిసి అధ్యక్షుడు, గవర్నర్
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -57
------------------------
ఎడిటర్ కోపంగా ఉన్నాడు . పత్రికా కార్యాలయం లో డెస్క్ వారితో , రిపోర్టర్ లతో సమావేశం . అందరినీ ఒకసారి చూసి మీ కెవ్వఁరికీ సమాజం పట్ల బాధ్యత లేదు . ప్రజల సమస్యలు పట్టవు . జర్నలిజం అంటే ఇదేనా ? మీ రాజకీయ వార్తలే తప్ప జనం గోడు పట్టదా ? అని ఎడిటర్ అందరి మీద కోపం తో ఊగిపోతున్నాడు . . వార్తలు అంటే రాజకీయం , క్రైం మాత్రమేనా ? జనానికి సంబంధించిన కష్టాలు తెలియవా ? జనం లోకి వెళ్ళండి వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు రాయండి .. ఉదాహరణకు గ్యాస్ సిలండర్ బుక్ చేస్తే వారం అయినా రాదు . దీనిపై ఓ మంచి స్టోరీ రాయవచ్చు . రాయండి అంటూ పురమాయిస్తుంటే ఇంతలోనే ఫోన్ మోగింది . ఎడిటర్ ఉపన్యాసం ఇస్తున్నందున అటెండర్ ఫోన్ ఎత్తి ... ఎడిటర్ తో చెబుతాడు ... సార్ మేడం ఫోన్ చేశారు . ఏజెన్సీ వాడు సిలండర్ పంపించాడట . గ్యాస్ సిలండర్ వచ్చింది కాబట్టి ఇక న్యూస్ రాయాల్సిన అవసరం లేదు అని మేడం మీకు చెప్పామన్నారు అంటాడు . ఈ దృశ్యం 1989 ప్రాంతంలో జస్పాల్ భట్టి టివి షో ఫ్లాప్ షో లోనిది . మిగిలిన వారి కన్నా మీడియా వాళ్ళు ఈ సీన్ కు బాగా కనెక్ట్ అవుతారు . భట్టికి ఈ సీన్ ను ఎవరైనా మీడియా వాళ్ళే చెప్పి ఉంటారు . అచ్చం మా ఆఫీస్ లో జరిగిన సీన్ లానే ఉంది అని అన్ని మీడియాల వారికి అనిపించి తీరుతుంది . 1989 ప్రాంతంలోనే వ్యవస్థలో , ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవహారాలపై దూరదర్శన్ లో ప్రసారం కావడం , భట్టి వాటిని నిర్మించడం పాత వాటిని యూ ట్యూబ్ లో ఇప్పుడు చూసినా ఆశ్చర్యం వేస్తుంది . ఇప్పుడు ప్రైవేట్ ఛానల్స్ లెక్క లేనన్ని వచ్చినా తమ తమ పార్టీల అనుకూల , ప్రత్యర్థి పార్టీల వ్యతిరేక విధానాలతో కార్యక్రమాలు తప్ప .. భట్టి స్థాయిలో వ్యంగ్య దాడి ఊహించలేం ...
ఒక చోట పేరు ఎడిటర్ అని ఉంటుంది , ఇంకో చోట ఓనర్ , మేనేజర్ పేరు ఏదైనా కావచ్చు వారికి కోపం వచ్చింది అంటే అది ప్రపంచ సమస్య అన్నట్టే . కోపం తెప్పించిన వారిని తల తీసేయడానికి తమ మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తారు .
*****
ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు ఎం . సత్యనారాయణ రావు , గవర్నర్ నరసింహన్ ఇద్దరికీ ఓ సంబంధం ఉంది . ఆ సంబంధం ఏమిటో చెప్పే ముందు . ఇద్దరు పత్రికాధిపతులకు ఎందుకో ఈ ఇద్దరి మీద కోపం వచ్చింది . లోకల్ స్ట్రింగర్ కే కోపం వస్తే ఆ ఏరియాలో భూకంపం తప్పదు అనుకునే రోజులు అవి . ఇక ఏకంగా ఓనర్ కే కోపం వస్తే తమ మీడియాలో వారికి ఉరి శిక్ష అమలు చేయాల్సిందే .
ఆంధ్ర జ్యోతిలో అప్పటి గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ పై వారానికి ఓ సారి అన్నట్టు గవర్నర్ మార్పు అనే వార్తలు వచ్చేవి . 2009 లో అయన గవర్నర్ అయ్యారు . 2019 వరకు గవర్నర్ గా కొనసాగారు . జ్యోతిలో మాత్రం రాజీ లేకుండా గవర్నర్ మార్పు అని వార్తలు వచ్చేవి . గవర్నర్ కు సంబంధించి ఆ తరువాత వార్త మోత్కుపల్లి నర్సింహులు గురించి . త్వరలో మోత్కుపల్లికి గవర్నర్ అని వార్తలు వచ్చేవి . అప్పుడప్పుడు ఈనాడులో కూడా వచ్చేవి . ఆ వార్తలు ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చేవి . ఎందుకు వచ్చేవో తెలుసు . టీడీపీ నుంచి జారిపోకుండా అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు రహస్యంగా లీక్ చేసేవారు . ఇవి లీకేజి వార్తలు అని అందరికీ తెలుసు . సాక్షిలో లీకేజి వార్త అని రాసి కొద్ది రోజుల తరువాత గవర్నర్ రేస్ లో ఇనగాల పెద్దిరెడ్డి అని రాశారు . టీడీపీ లీకేజి పవర్ అలాంటిది . నరసింహన్ ను తొలగిస్తారు అనే వార్త చివరకు ఒక జోక్ గా మారింది . ఉమ్మడి రాష్ట్రంలో , తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు అత్యధిక కాలం గవర్నర్ గా చేసిన రికార్డ్ నరసింహన్ దే . తొలుత ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా ఉండి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అదనపు బాధ్యతలు 2009 లో చేపట్టారు . ఉమ్మడి గవర్నర్ , రాష్ట్రపతి పాలన , తిరిగి రెండు రాష్ట్రాల గవర్నర్ , చివరలో తెలంగాణ గవర్నర్ గా 2019 వరకు బాధ్యతలు నిర్వహించారు . ఇంత సుదీర్ఘ కాలం తో పాటు ఇంత వైవిధ్యంగా బాధ్యతలు చేపట్టే అవకాశం భవిష్యత్తులో కూడా ఎవరికీ రాదు . తొలి గవర్నర్ చందూలాల్ మాధవ లాల్ త్రివేది నుంచి ఇప్పటి గవర్నర్లు తమిళ సై , సయ్యద్ అబ్దుల్ నజీర్ వరకు పాతిక మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం నరసింహన్ లో సగం కాలం కూడా గవర్నర్ గా ఉండలేదు . కానీ మూడు రోజుల్లో గవర్నర్ మార్పు అని వారానికి ఓ సారి రాసేవారు . కోపం ఎందుకో తెలియదు .
*****
ఓ రోజు ఆంధ్రభూమి ఆఫీస్ కు వెళ్ళగానే న్యూస్ ఎడిటర్ అమర్ నాథ్ ఈ రోజు వార్తలు ఏమున్నాయి అని అడిగారు . ఆదివారం రోజు వార్తల కరువు ఉంటుంది . స్టోరీలతో నెట్టుకు రావాలి . వార్తలు ఏమున్నాయి అని అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా మొదటి పేజీ కోసం పిసిసి అధ్యక్షుడి మార్పు అని ఢిల్లీ నుంచి పావు పేజీ వార్త ఎలాగూ వస్తుంది కదా ? అన్నాను . గవర్నర్ మార్పు వార్త జ్యోతిలో జోక్ గా మారితే పిసిసి అధ్యక్షుని మార్పు వార్త ఆంధ్రభూమిలో జోక్ గా మారింది . రాజ్యసభ అభ్యర్థిగా తనను నిర్ణయించక పోవడం తో భూమి ఓనర్ కు సత్యనారాయణ పై కోపంగా ఉండేది . ఆంధ్రభూమికి కాంగ్రెస్ పత్రిక అని ముద్ర , ఓనర్ కేమో బాబుతో మంచి పరిచయం . అలా అని బాబు కు వ్యతిరేకంగా రాయవద్దు అని ఒక్క సారి కూడా ఆంక్షలు విధించలేదు . పూర్తి స్వేచ్ఛ ఉండేది . ఐతే రాజ్యసభ కోపం తో పిసిసి అధ్యక్షుని పైన రెగ్యులర్ గా, ysr పై అప్పుడప్పుడు రాయించేవారు . ఓ సారి వైయస్ ఆర్ కోపంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజ్యసభ టికెట్ దక్కక పోవడంతో తనపై కోపం తో రాయిస్తున్నారని చెడా మాడా తిట్టేసారు . ఆఫీస్ లో స్టాఫ్ తో వ్యవహరించినట్టు రాజకీయాల్లో నాయకులతో వ్యవహరిస్తే ఎలా అని మిత్రులం మాలో మేం అనుకునేవాళ్లం .
గవర్నర్ లలో నరసింహన్ ది రికార్డ్ అయితే ఉమ్మడి రాష్ట్రం లో పిసిసి అధ్యక్షుల్లో ఎం . సత్యనారాయణ రావుది రికార్డ్ . తొలి పిసిసి అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి కాలం నుంచి రాష్ట్ర విభజన వరకు ఎక్కువ కాలం పిసిసి అధ్యక్షునిగా ఉన్నది సత్యనారాయణ . 2000 నుంచి 2004 వరకు సత్యనారాయణ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు . రెండు పత్రికల ఓనర్ లు ఇద్దరి మీద కట్టి కడితే ఇద్దరు తమ తమ పదవుల్లో అత్యధిక కాలం ఉన్న రికార్డ్ సృష్టించడం విశేషం .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం