4, జూన్ 2023, ఆదివారం
ఆంధ్ర , తెలంగాణ కు మీడియా చేసిన ద్రోహం బాబునూ వదల లేదు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -41
ఆంధ్ర , తెలంగాణ కు మీడియా చేసిన ద్రోహం
బాబునూ వదల లేదు ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -41
ఉమ్మడి రాష్ట్రం లో అధికారంలో ఉన్నప్పుడు మీడియా డార్లింగ్ అని చంద్రబాబు కు ముద్దు పేరు . అలాంటి బాబు సైతం ఒక దశలో మీడియాకు వణికిపోయారు . తెలంగాణ ఉద్యమ చివరి దశ .. తెలంగాణ సాకారం అవుతున్న సమయం . తెలంగాణ ఏర్పాటు ఖాయం అని తెలంగాణ నాయకులకే కాదు ఆంధ్ర నాయకులకు అందరికీ తెలిసిన సమయం . కనీసం ఆ చివరి దశలోనైనా విభజన సరే, ఆంధ్రకు ఏమిస్తారు అని కొద్ది మంది నాయకులు ప్రశ్నిస్తే వారి మీద మీడియా పడిపోయిన సందర్భం అది . తమ మీడియా ద్వారా తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటాం అని మీడియా పిచ్చి కలలు కన్న సమయం అది . ఆ దశలో ఒకరిద్దరు ధైర్యం చేసి ఆంధ్రకు ఏమిస్తారు అని ప్రశ్నిస్తే , మీడియా వారిపై దాడి చేసి నోళ్లు మూయించింది . మీడియాకు బాబు సైతం బయపడి మాట మార్చారు .
విభజన సమయంలో ఆంధ్ర ప్రాంతానికి మీడియా చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదు . ఆంధ్ర ప్రాంతానికి ద్రోహం చేశారు , తెలంగాణ వారు ఆత్మ హత్య చేసుకోవడానికి కారణం అయ్యారు .
*****
తెలుగు నాట స్వతంత్ర పోరాటం లో కీలక పాత్ర వహించింది తెలుగు మీడియా . హేమా హేమీలైన స్వాతంత్య్ర సమర యోధులు ఎంతో మంది అప్పుడు పత్రికలు నడిపారు . చివరకు ఆంధ్ర రాష్ట్రం , హైదరాబాద్ స్టేట్ విలీన సమయంలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది అప్పటి మీడియా పెద్దాయన కాశీనాధుని నాగేశ్వర రావు ఇంట్లో . అలాంటి మీడియా తెలంగాణ ఉద్యమ సమయంలో అనాలోచిత చర్యలతో తెలంగాణను అడ్డుకుందాం అనుకోని ఆంధ్రకు తీరని అన్యాయం చేసింది ...
******
ఎప్పుడూ చర్చలోకి రాలేదు , ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ .. విభజన జరిగితే ఆంధ్ర కు కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్లు కావాలి అని అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు కోరారు . అంతే మీడియా ఒక్క సారిగా ఆయన మీద పడిపోయింది . ఐదు లక్షల కోట్లు కావాలి అని అడుగుతున్నారు అంటే మీరు విభజనకు ఒప్పుకుంటున్నట్టే కదా ? అని దాడి మొదలు పెట్టారు . కంగారు పడ్డ బాబు నా ఉద్దేశం అది కాదు .. కొత్త రాజధాని కట్టడానికి ఐదు లక్షల కోట్లు అవుతాయి అని చెబుతున్నాను . విభజన కోరడం లేదు అని మరుసటి రోజు మాట మార్చేశారు .
అప్పుడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ , ఒక జర్నలిస్ట్ సమక్షంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 లో మనం తెలంగాణ ఆపగలిగాం . ( కేవలం నాలుగైదు సీట్ల మెజారిటీ మాత్రమే ) 2014 నాటికి అధిష్టాన వర్గం నిర్ణయాన్ని వ్యతిరేకించేంత బలం ఉండదు . ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, ఇతర అంశాలు మీ ప్రాంతానికి ఏం కావాలో వాటిపై దృష్టి పెట్టండి అని సూచించారు . ఆ మీటింగ్ లో వైయస్ ఇంకో మాట కూడా అన్నారు . తెలంగాణ వారికి మీరు బంగారం తో ఇల్లు కట్టించి ఇచ్చినా మళ్ళీ తెలంగాణ కావాలనే అంటాడు అని చెప్పుకొచ్చారు . కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక తరువాత వైస్సార్ ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు . బొత్స తోనే కాకుండా ఇతర మంత్రులతో కూడా ఇలా చెప్పి ఉండవచ్చు .కానీ బొత్సతో చెప్పినప్పుడు అక్కడున్న జర్నలిస్ట్ చెప్పిన సమాచారం ఇది .
దీనితో కొందరు మంత్రులు ఈ అంశం పై దృష్టి పెట్టారు . బొత్స బహిరంగంగానే ఆంధ్రకు ఏం కావాలో అడగాలి అని చెబితే మీడియాకు టార్గెట్ అయ్యారు . కెసిఆర్ తో కుమ్మక్కు అయి బొత్స విభజన కుట్ర చేస్తున్నారు అని మీడియాలో వార్తలు
****
చివరి దశలో అసెంబ్లీ సమావేశం . అప్పటి వరకు మిత్రులుగా ఉన్న ఆంద్ర తెలంగాణ శాసన సభ్యులు జోక్ వేసినా సీరియస్ గా తీసుకుంటున్న సమయం . అలాంటి పరిస్థితి అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు . అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి రాయలసీమకు చెందిన ఓ శాసన సభ్యునితో బాచుపల్లి వద్ద చెక్ పోస్ట్ పెడతాం అని జోక్ చేస్తే అతను సీరియస్ అయి చూద్దాం అంటూ ఏదో అన్నారు . పరిస్థితి అర్థం చేసుకొని శాసన సభ్యులు , మీడియా సైతం తమ తమ పరిధిలో ఉండి పోయారు . టీడీపీ శాసన మండలి సభ్యులు యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ నేనూ ఏదో మాట్లాడుకుంటూ లాబీ లో వీళుతుంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సీరియస్ గా వచ్చి , మీరు రాజీనామా చేస్తున్నారా ? లేదా ? రాజీనామా చేయనివారిపై దాడులే అని లాక్కెళ్లారు .
అదే రోజు లాబీ లో కావూరి సాంబశివరావు కూడా ఉన్నారు . విభజన అనివార్యం , ఆంధ్రకు ఏం కావాలో ఇవ్వండి అని చెబుదాం అంటే మీరు విభజనకు అనుకూలమా ? అని మీడియా మా పై దాడి చేస్తుంది . ఆంధ్రకు మీరెంత ద్రోహం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు అని ఆయన వాపోయారు . అదే రోజు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా అసెంబ్లీ కి వచ్చారు . ఏమవుతుంది అని మీడియా అడిగితే సుదీర్ఘంగా వివరించారు . సంక్షిప్తంగా అయన చెప్పిన దానిలో తెలంగాణ అనివార్యం అని ఆయన చెప్పినట్టు నాకు అర్ధమైంది .
****
ఇటీవల టివి 9 ఛానల్ ఇంటర్వ్యూ లో లగడపాటి రాజ్ గోపాల్ మేం కాంగ్రెస్ కు ద్రోహం చేశామని పశ్చాత్తాపం ప్రకటించారు . ఒక్క కాంగ్రెస్ కే కాదు లగడపాటి మొత్తం ఆంధ్రకు అన్యాయం చేశారు . ఆ సమయం లో అసెంబ్లీ కమిటీ హాలులో మీటింగ్ కు కాంగ్రెస్ నాయకులనే కాదు టీడీపీ శాసన సభ్యులను కూడా ఉద్దేశించి లగడపాటి సందేశం ఇచ్చే వారు . మీడియా లగడపాటిని ఆకాశానికి ఎత్తడం తో తెలంగాణను ఆపడానికి వచ్చిన సూపర్ మాన్ అన్నట్టు చూసే వారు . ఆంధ్ర భగత్ సింగ్ అంటూ మీడియా లగడపాటిని ఆకాశానికి ఎత్తింది . లగడపాటి , ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు ప్రాక్టికల్ గా ఆలోచించి ఉంటే ఆంధ్రకు ఏం కావాలో అడిగి సాధించుకునే వారు . వాళ్ళ రాజకీయ జీవితం ముగిసేది కాదు ఆంధ్రకు అన్యాయం జరిగేది కాదు .
ఆ సమయం లో ntv ఒక్కొక్కరిని వెంటాడింది . పనబాక లక్షి పై చేసిన ప్రత్యేక స్టోరీ గుర్తుంది పోయింది . ఎందుకు రాజీనామా చేయడం లేదు అని తిట్ల దండకం మొదలు పెట్టారు .
బాబు ఐదు లక్షలు కావాలి అంటే ధ్వజమెత్తిన ఆంధ్ర మీడియా , విభజన తరువాత ఐదు లక్షల కోట్ల మాట దేవుడెరుగు మోడీ వచ్చి చెంబె డు, నీళ్లు తట్టెడు మట్టి ఇచ్చినా ఆంధ్ర మీడియా అదే మహద్భాగ్యం అనుకుంది . లగడపాటి లాంటి వ్యాపార నాయకుడు పశ్చాత్తాపం ప్రకటించారు కానీ ఆంద్ర మీడియా మాత్రం తాము ఆంధ్రకు చేసిన ద్రోహం పై పశ్చాత్తాపం ప్రకటించలేదు . సమీక్ష చేసుకోలేదు .
****
ఓట్ల లెక్కింపు ప్రారంభ అయి ఫలితాలు వస్తున్న సమయం లో కూడా తమకు నచ్చిన పార్టీని గెలిపించే ప్రయత్నాలు వదులుకొని మీడియా ఆంధ్రజ్యోతి. తెలంగాణ ఏర్పాటు సమయం లోనూ అదే వైఖరి . పార్లమెంట్ లో బిల్లు ఆమోదం ప్రక్రియ అయిపొయింది . రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి . వేసవి విడిదిగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బొల్లారం రాష్ట్రపతి భవన్ లో విడిది చేశారు . ఎవరైనా వెళ్లి వినతి పత్రాలు ఇవ్వవచ్చు . అంతా అయిపోయాక విభజన విషయంలోనూ కొందరు వినతి పత్రాలు ఇచ్చారు . రాష్ట్రపతి మాట్లాడేదేమి ఉండదు . కానీ వినతి పత్రాలు తీసుకుంటారు . చాలా పనులు ఉన్నాయి విభజన బిల్లుపై ఇప్పుడు సంతకం చేయను అని రాష్ట్రపతి చెప్పినట్ట్టు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త . అంత పెద్ద వార్త రాసినా , ఎందుకో కానీ అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు .
అసెంబ్లీ తీర్మానం కన్నా ముందు ఓ రోజు ఆఫీస్ వెళితే డీసీ ఆఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు . లోపలి వెళ్లి సి హెచ్ వి ఎం కృష్ణారావు ను ఏం జరిగింది ? అంతమంది పోలీసులు ఉన్నారు అని అడిగితే , డీసీ లో తెలంగాణకు వ్యతిరేకంగా కెసిఆర్ పై ఏదో రాశారు , తెరాస వాళ్ళు దాడి చేస్తారేమో అని ముందు జాగ్రత్త అని చెప్పారు . నేను నవ్వి గుడ్డి కన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అన్నట్టు తెలంగాణ రాకుండా అడ్డుకోవడంలో మీడియా పాత్ర అయిపొయింది . ఇన్విటేషన్ ఇచ్చి దాడి చేయండి ప్లీజ్ అని పిలిచినా కెసిఆర్ దాడి చేయరు . జలదృశ్యం నుంచి తెరాస కార్యాలయాన్ని బాబు ప్రభుత్వం రోడ్డు మీద పడేసినా ఏమీ అనలేదు . తెలంగాణ సాధించే వ్యూహం కెసిఆర్ కు తెలుసు అన్నాను . తెలంగాణ ఉద్యమాన్ని వార్తలు గానే చూసినంత వరకు మీడియా ప్రాధాన్యత ఇచ్చింది . వార్తల స్థాయి దాటి వాస్తవం అవుతున్న స్థితిలో తెలంగాణను ఆపడానికి విశ్వ రూపం చూపింది . తమ అనాలోచితం తో తమ ప్రాంతానికి అన్యాయం చేసింది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం