21, జూన్ 2023, బుధవారం

దాన వీర కర్ణ ముహూర్తం సూపర్ హిట్ ఎన్టీఆర్ , బాబు ముహూర్తం అట్టర్ ప్లాప్ .. ఫలించని జోస్యం జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 54 ---------------------

దాన వీర కర్ణ ముహూర్తం సూపర్ హిట్ ఎన్టీఆర్ , బాబు ముహూర్తం అట్టర్ ప్లాప్ .. ఫలించని జోస్యం జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 54 ------------------------------------------ ^^ ఎన్టీఆర్ గారు నేను చెబుతున్నాను నా మాట వినండి . మీరు సినిమాను సంక్రాంతికి విడుదల చేయండి . సూపర్ హిట్ అవుతుంది ^^ అని అతను చెప్పగానే భలే వారే ఇంకా పదిహేను రోజులు కూడా లేదు . ఎలా సాధ్యం అని ఎన్టీఆర్ అనుమానం వ్యక్తం చేస్తే , నేను చెబుతున్నాను ఏమీ కాదు సంక్రాంతికి నేను ముహూర్తం ఖరారు చేశాను. తరువాత నన్ను అనొద్దు మీ ఇష్టం . ఆ మాటతో ఎన్టీఆర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేశారు . ఆ సినిమా ఓ చరిత్ర సృష్టించింది . ఆ సినిమా దాన వీర శూర కర్ణ . అదే సమయంలో సాంకేతిక విలువలతో కృష్ణ కురుక్షేత్రం సినిమా తీశారు . దాన వీర శూర కర్ణ సాంకేతిక అంశాల్లో కురుక్షేత్రం ముందు పేలవంగా ఉన్నా , ఎన్టీఆర్ నటన , డైలాగులు , పాటలతో ఒక చరిత్ర సృష్టించింది . ఆ సినిమాకు ముహూర్తం పెట్టింది బివి మోహన్ రెడ్డి . అంతకు ముందే ఎన్టీఆర్ కు బివి మోహన్ రెడ్డి మాట మీద , ముహూర్తం మీద గురి . దాన వీర శూర కర్ణ విజయం తో మోహన్ రెడ్డి మాట మీద మరింత గురి కుదిరియింది . అడవి రాముడు షూటింగ్ నుంచి ఎన్టీఆర్ కర్నూల్ లో ఉన్న బివి మోహన్ రెడ్డికి ఫోన్ ముందు నేను భయపడ్డాను కానీ మీ మాట మీద నమ్మకం తో సంక్రాంతికి విడుదల చేశా , మన సినిమా చరిత్ర సృష్టిస్తోంది అని మెచ్చుకున్నారు . అదొక్కటే కాదు మిత్రులతో సరదాగా మాట్లాడుతూ నామినేట్ పోస్ట్ తీసుకోవలసిన కర్మ నాకేందుకు పోటీ చేస్తాను మంత్రిని అవుతాను అని ఐదేళ్ల ముందే మీడియా మిత్రుల ముందు తన గురించి తాను చెప్పుకున్న జోస్యం కూడా నిజమైనది . జోతిష్యం లో అతనికి తిరుగులేదు అని పేరుంది . . అతని మాటకు తిరుగులేకుండా పోయింది . ఎన్టీఆర్ పక్కన ఆయనకు చోటు పర్మనెంట్ అయిపొయింది . 95లో ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేశాక , ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు . మరి అయ్యారా ? లేదు ఏకంగా పైకే పోయారు . ఎవరు ? ఎన్టీఆర్ .. ***** ^^ బివి మోహన్ రెడ్డి కర్నూల్ లో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నా ప్రముఖ రాజకీయ నాయకులకు సన్నిహితులు . జలగం వెంగళరావు , మర్రి చెన్నారెడ్డి సీఎం లుగా ఉన్నప్పుడు సన్నిహితులు . 1978 లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కర్నూల్ జిల్లా రాజకీయాల్లో శేషాద్రి అనే జర్నలిస్ట్ ప్రముఖులు . వారి ఇంట్లోనే రాజకీయ నాయకులు సమావేశం అయి చర్చించుకునేవారు . మర్రి చెన్నారెడ్డి శాసన మండలి సభ్యులను ఖరారు చేశారు . సంతోషమ్మ అనే మహిళను మండలి సభ్యురాలిగా నియమించారు . అప్పుడు సమితి ప్రెసిడెంట్ గా తరువాత కోట్ల హయాంలో మండలి సభ్యులుగా పని చేసిన యస్ . రఘురామిరెడ్డి బివి మోహన్ రెడ్డితో సరదాగా మాట్లాడుతూ మీ మిత్రుడు మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నారు , సంతోషమ్మను కూడా మండలి సభ్యురాలిని చేశారు , మరి నువ్వెప్పుడూ mlc అవుతున్నావు అంటే , మండలి ద్వారా నాకేం కర్మ .. నేరుగా పోటీ చేస్తా , మంత్రిని అవుతాను అని 78లో చెప్పారు , 83లో నిజంగానే పోటీ చేశారు , మంత్రి అయ్యారు . .78లో మోహన్ రెడ్డి ఆ మాట చెప్పినప్పుడు అందరూ తేలిగ్గా తీసుకున్నారు . ఐదేళ్ల తరువాత నిజం అయ్యాక అయన చెప్పే జ్యోతిష్యం మీద , ముహూర్తాల మీద గురి కుదిరింది . . . బివి మోహన్ రెడ్డి కర్నూల్ జిల్లాలో ఇంజనీర్ గా పని చేస్తున్నప్పుడు చెప్పిన జోస్యం నీకు ఎలా తెలుసు అని సందేహం కదా ? మోహన్ రెడ్డి ఇంజనీర్ గా కర్నూల్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు హిందూ రిపోర్టర్ గా అక్కడ దాసు కేశవరావు ఉండేవారు . తరువాత హైదరాబాద్ లో హిందూ బ్యూరో చీఫ్ గా టీడీపీ చూసేవారు .తరువాత రెసిడెంట్ ఎడిటర్ అయ్యారు . మాటల సందర్భం లో మోహన్ రెడ్డి జోస్యం గురించి చెప్పారు . మోహన్ రెడ్డి కూడా నేను చెప్పిన జోస్యం నిజమైంది కావాలంటే కేశవరావును అడగండి అనే వారు . ఎన్టీఆర్ కు దైవం మీద నమ్మకం ఉండేది కాదు, కానీ మోహన్ రెడ్డి జ్యోతిష్యం మీద అపారమైన నమ్మకం ఉండేది . ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందో కానీ ఎన్టీఆర్ సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచే మోహన్ రెడ్డి జోస్యం మీద మంచి గురి . ఏ కార్యం అయినా మోహన్ రెడ్డి ముహూర్తం పెట్టాల్సిందే ... ****** 1995 ఆగస్టు లో ఎన్టీఆర్ ను దించేసిన తరువాత కూడా దాదాపు 30 మంది శాసన సభ్యులు ఎన్టీఆర్ శిబిరంలోనే ఉండేవారు . వారిలో బివి మోహన్ రెడ్డి ఒకరు . మీడియా పెద్దగా ప్రచారం కల్పించేది కాదు కానీ ఈ 30 మంది రోజూ ఏదో ఒక నీరసన కార్యక్రమం చేపట్టే వారు . ఓ రోజు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం . మీడియా ముందు జ్యోస్యం చెబుతున్నాను అని మోహన్ రెడ్డి ప్రకటన . అంతా గుమిగూడిన తరువాత ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు . నేను జోస్యం చెబుతున్నాను , నిజం అయి తీరుతుంది అన్నారు . బాబు వద్ద ఉన్న శాసన సభ్యులు అందరూ వచ్చేస్తారు , మళ్ళీ ఎన్టీఆర్ సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు . ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అయ్యే మాట దేవుడెరుగు చనిపోయారు . శాసన సభ్యులు అందరూ ఎన్టీఆర్ వద్దకు వచ్చేస్తారు అని జోస్యం చెప్పిన మోహన్ రెడ్డి ఎన్టీఆర్ మరణించాక మిగిలిన వారితో కలిసి తానే బాబు శిబిరం లో చేరిపోయారు . మరోసారి మీడియా బలవంతం వల్ల 2004 ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్ భవన్ లో జోస్యం చెప్పారు . టీడీపీకి అప్పుడు రెండువందల పైగానే సీట్లు వస్తాయని ఏదో అంకె చెప్పారు . టీడీపీ గెలుస్తుంది అని ... కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది టీడీపీ చరిత్రలోనే తక్కువ సీట్లు సాధించింది . అంతకు ముందు ఓడిపోయిన చరిత్ర ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో 2004లోనే టీడీపీకి తక్కువ సీట్ల రికార్డ్ . **** 2004 ఎన్నికలకు రోజులు దగ్గర పడ్డాయి . అసెంబ్లీలో హడావుడి . లాబీ లో వెళుతుంటే మోహన్ రెడ్డి ఛాంబర్ . చీఫ్ రిపోర్టర్ చారి నేనూ కలిసి వెళుతున్నాం . మోహన్ రెడ్డి కనిపించ గానే చారి బాబాయ్ ఈ సారి ఎన్నికలు ఎలా ఉంటాయి అని మోహన్ రెడ్డిని అడిగారు . బ్రహ్మాండంగా గెలుస్తాం అని మోహన్ రెడ్డి ధీమాగా చెప్పారు . చీఫ్ రిపోర్టర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎందుకులే అని వింటూ ఉండిపోయా . కొద్ది సేపు మాట్లాడి ఇద్దరం వెళుతుంటే .. మోహన్ రెడ్డి చేయి పట్టి ఛాంబర్ లోకి లాగాడు . ఎన్నికలు ఎలా ఉంటాయని అనుకుంటున్నావు అని మోహన్ రెడ్డి నన్ను అడిగితే ఒకింత సంతోషం వేసింది . ఇంతకు ముందు అతనే జోస్యం చెప్పి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు అనుకోని , బహుశా ఎవరు ఏమనుకున్నా పరవాలేదు అని నిర్మొహమాటంగా చెబుతాను అనే ఉద్దేశం తో అడుగుతున్నారు అనుకోని 1999 లోనే తృటిలో గెలిచారు , ఈ సారి ఓడిపోతారు అని చెప్పాను . ఎన్టీఆర్ అంటే ఓ నమ్మకం ఉండేది .. నేను బాబు వర్గంలో చేరినప్పటి నుంచి మంత్రి పదవి ఇచ్చారు , ఇప్పటికీ మంత్రినే కానీ టికెట్ ఇస్తారా ? ఇవ్వరా ? అనే అనుమానం అంటూ ఎన్టీఆర్ కు బాబుకు తేడా చెప్పుకొచ్చారు . 1978లోనే అంత ధీమాగా జోస్యం చెప్పిన మోహన్ రెడ్డి 2004 నాటికి తనకు టికెట్ వస్తుందో రాదో తనకే తెలియని స్థితికి వచ్చారు . అంతా కాల మహిమ అనిపించింది . బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం