27, జూన్ 2023, మంగళవారం

జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? పత్రికల వార్తలపై కేటీ ఆర్ కు కెసిఆర్ పరీక్ష మనం వార్తలు సృష్టించాలి కానీ చదవడమా ? అన్న ఎన్టీఆర్ ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -59 ____________________

జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? పత్రికల వార్తలపై కేటీ ఆర్ కు కెసిఆర్ పరీక్ష మనం వార్తలు సృష్టించాలి కానీ చదవడమా ? అన్న ఎన్టీఆర్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు -59 _______________________ జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? అంటే ఇదేం ప్రశ్న ? వారే చదవక పోతే ఇంకెవరు చదువుతారు , చదవక పోతే జర్నలిస్ట్ గా ఉద్యోగం ఎలా చేస్తారు అనిపిస్తుంది . నిజమే చదువుతారేమో కానీ ఎలా చదువుతారు ? ఏం చదువుతారు ? ఎన్ని పత్రికలు చదువుతారు అనేది కూడా వృత్తిలో సత్తా చాటడంలో కీలకమే . మనం వార్తలు సృష్టించాలి కానీ మనం వార్తలు చదవడం ఏమిటీ బ్రదర్ అని సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ అనే వారట .. ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు ఈ అంశం గురించి చెప్పారు . నిజానికి రాజకీయాల పట్ల ఎన్టీఆర్ కన్నా తనకే ఎక్కువ ఆసక్తి అని , మర్రి చెన్నారెడ్డి , జలగం వెంగళరావు వంటివారితో తనకు స్నేహం ఉండేదని, కానీ రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం తనకు ఆశ్చర్యం కలిగించింది అని అక్కినేని చెప్పుకొచ్చారు . బ్రహ్మానందరెడ్డి కాలం లో ఓ సారి షూటింగ్ విరామం లో రాజకీయాల గురించి సీరియస్ గామాట్లాడుకుంటుంటే ఎన్టీఆర్ వచ్చి ఎందుకు బ్రదర్ మనకు ఎలాంటి ఉపయోగం లేని రాజకీయాల గురించి చర్చ ఎందుకు అన్నారని అక్కినేని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు . ఉదయం లేవగానే ఇంటలిజెన్స్ వాళ్ళు , సమాచార శాఖ వారు సీఎం సమాచారం ఇస్తారు . కానీ అంతకు మించి కళ్ళు ఉండాలి లేక పోతే ఏమవుతుందో ఎన్టీఆర్ రాజకీయమే ఉదాహరణ ... ***** మీరు రోజుకు ఎన్ని పత్రికలు చదువుతారు ? తెలంగాణ ఏర్పడిన తరువాత మొదట సంవత్సరం హరిత ప్లాజా లో జరిగిన ప్రగతి నివేదిక మీడియా సమావేశం సందర్భంగా ఇష్టాగోష్టిగా మాట్లాడుతుంటే కె . తారక రామారావు అడిగిన ప్రశ్న . యూ ట్యూబ్ , సామాజిక మాధ్యమాలకు అలవాటు కానీ రోజులు . రోజుకు రెండు మూడు పత్రికలు చదువుతాను అని చెప్పాను . నేను పన్నెండు పత్రికలు చదువుతాను , ఐనా అప్పుడప్పుడు మా నాన్న పత్రికల్లో వచ్చిన వార్తలపై పరీక్ష పెడతారు అని ఓ ఆసక్తి కరమైన ఉదంతం చెప్పారు . ***** కెసిఆర్ ఓ రోజు కేటీఆర్ ను ఈ రోజు ఆంధ్రభూమి చదివావా ? అని అడిగారట చదివాను అని చెబితే ఆసక్తి కలిగించే విషయం ఏముంది అని ప్రశ్నిస్తే చదివిన వార్తలు అన్నీ చెబితే , అది కాదు నీకేమి ప్రత్యేకం అని పించలేదా ? అంటే మరోసారి పేజీలు తిరగేశారు . దేని గురించో అర్థం కాలేదు . ఎడిట్ పేజీలో పాఠకులు రాసే ఉత్తరాల శీర్షిక చదవమంటే కెసిఆర్ చదివారు . ఐనా ఏముంది వీటిలో ప్రత్యేకం అనుకుంటే కెసిఆర్ ఓ పాఠకుడి ఉత్తరం చూపించారు . కాంగ్రెస్ నాయకులు ఎలాగూ చేయరని తెలిసి పోయింది , మీరైనా చేయవచ్చు కదా ? అంటూ పాఠకుడు రాసిన ఉత్తరం . అంటే జనం ప్రజలు కాంగ్రెస్ పై ఆశలు వదిలేసుకున్నారు అంటూ ఆ పాఠకుడి అభిప్రాయం గురించి వివరించారు . రోజుకు 12 పత్రికలు చదివినా కెసిఆర్ ఏదో విషయం అడుగుతూనే ఉంటారని , దాని వల్ల ప్రతి విష్యం తెలుసు కోవడానికి అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదువుతాను అన్నారు . టివి 9 బిగ్ డిబేట్ లో మీ ఇంట్లో అందరూ బాగా మాట్లాడుతారు అని రజనీ కాంత్ అంటే మాట్లాడడం కాదు సబ్జెక్ట్ ఉండాలి అని కేటీఆర్ బదులిచ్చారు . అన్ని పత్రికలు ఏదో ఓ పార్టీకి అనుకూలంగా మారాయి ఐనా రాజకీయాల్లో ఉన్నా , జర్నలిజంలో ఉన్నా ప్రతి రోజు పత్రికలు చదవక పోతే పోటీ ప్రపంచంలో దెబ్బ తింటారు . కెసిఆర్ అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదువుతారు . చివరకు సాహిత్యాన్ని కూడా చదువుతారు . చదివినప్పుడే విషయ పరిజ్ఞానం ఉంటుంది . ఎప్పుడు, ఎక్కడ , ఏ అంశం పైనైనా మాట్లాడగలరు . **** 95లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొత్తలోనే ప్రజల వద్దకు పాలన అని మీడియాతో పాటు బస్సులో జిల్లాలకు వెళ్లేవారు . ప్రధాన పత్రికలతో పాటు, జర్నలిస్టులు కూడా పెద్దగా పట్టించుకోని చిన్న పత్రికలు సైతం బస్సులోనే చంద్రబాబు చూసేవారు . ఉదయమే ఆ పత్రికలు చూస్తే మూడ్ ఆఫ్ అవుతుంది కాబట్టి నేను చూడను అని వై యస్ రాజశేఖర్ రెడ్డి శాసన సభలోనే ప్రకటించారు . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక కాబట్టి ఈనాడు చదువుతాను అని మరో సందర్భంలో అన్నారు . వై యస్ జగన్మోహన్ రెడ్డికి సొంతంగా పత్రికనే ఉంది . ఆయన పత్రికలు చదవడం గురించి తెలియదు , పత్రికలు చదివే అలవాటు గురించి సభలో కానీ , బహిరంగంగా కానీ చెప్పక పోవడం వల్ల దాని గురించి తెలియదు . జవహర్ లాల్ నెహ్రూ తనను తానే విమర్శించుకుంటూ కలం పేరుతో కాలం రాసేవారు . వాజపేయి చదవడమే కాదు కవిత్వం రాసేవారు కూడా . ప్రధాని మోడీ ఒక్క సారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదు . చదవడం గురించి తెలియదు . బాగా చదివే అలవాటు ఉన్న వారే బాగా మాట్లాడగలరు . జిల్లా అనుబంధాలు వచ్చాక కొంతమంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు చూసి పేపర్ పక్కన పడేసేవారు . మరికొందరు తాము రాసిన వార్త చూడడమే పత్రిక చదివినట్టు భావించేవారు . ఎడిట్ పేజీ చదివే అలవాటు తక్కువ మందికి ఉంటుంది . జర్నలిజంలో ఉండాలి అనుకుంటే వీలైనన్ని పత్రికలు , వీలైనంత చదవాలి . రిపోర్టర్ తిరక్క చెడితే , సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోతారు అని మీడియా సర్కిల్ లో ఓ జోక్ . తిరిగినా , తిరగక పోయినా చదివే అలవాటు లేకపోతే రాణించడం కష్టం . - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం