30, ఏప్రిల్ 2011, శనివారం

రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం ఇష్టమే, వాల్మికి రామాయణం ఇష్టమే

బాబా పై బ్లాగ్స్ లో రకరకాల  కామెంట్స్ వస్తున్నాయి. వీటిలో కొన్ని బాబా ను  దేవునిగా కీర్తిస్తూ, వస్తుంటే కొన్ని తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నాయి.  ఎవరి అభిప్రాయాలూ వారివి . బాబా బ్రమున్నారు. కుటుంబం కోసం భక్తుల డబ్బు ఉపయోగించుకోలేదు. బాబాను నమ్మి విరాళాలు ఇస్తే, వాటిని పేదలకు ఉచిత వైద్యం , నీరుఅందించేందుకు కర్చు చేశారు. దేశాన్ని దోచేస్తున్న నాయకులు వదిలేసి  మంచి చేసిన వారిని తిట్టడం ఎందుకు. మేధావులు బాబా ను తిడుతున్నా సామాన్యులు మాత్రం ఆయన చేసిన మంచినే గుర్తు చేసుకుంటున్నారు.  బాబా ను సమీప బందువులు చూసి వచ్చిన వార్తను టివి లో చూశాక ఒకరు దేవునుకి సమీప బందువులు ఉంటారా అని ఒకరు బ్లాగ్లో రాశారు. ఓ మిత్రుడు  నిజామే కదా దేవుడికి బందువులు ఉంటారా అని నవ్వాడు.  రాక్షస బందువులు బ్లాగ్స్  నిర్వహిస్తూ, కామెంట్స్ చేస్తున్నప్పుడు దేవుడికి సమీప బందువులు ఎందుకు ఉండరు అని అని నవ్వుతు చెబితే అతనుకూడా నవ్వాడు.  దేవుడు అంటే ఎవరు అని నిర్వచించుకుంటే సమాదానం దొరుకుతుంది. పన్నెండు చేతులు, ఆరు కాళ్ళు ఉంటేనే దేవుడు అనుకుంటే బాబా లో దేవుడు కనిపించరు . పేదలకు నిరు, వైద్యం అందించిన వారు దేవుడు అనుకుంటే బాబా లో దైవం కనిపిస్తారు. నేను నాస్తికత్వాన్ని ఇష్టపడతాను , దైవత్వాన్ని ఇష్టపడతాను. రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం ఇష్టమే,  వాల్మికి రామాయణం ఇష్టమే .   మానవత్వాన్ని అంతకన్నా ఎక్కువగా ఇష్టపడతాను. సహాయం చేసే అవకాశం లేక్కపోయిన మంచి కనిపించినప్పుడు అభినందిద్దాం 

సంతాన సాఫల్య కేంద్రాలు.......రాజకీయ సాఫల్య కేంద్రాలు

గంపెడు పిల్లాపాపలతో నూరేళ్లు సంతోషంగా జీవించు అని పూర్వం ఆశీర్వదించేవారు.  తరువాత ఇద్దరు లేక ముగ్గురు చాలు అన్నారు. అదీ మారి మేమిద్దరం మాకిద్దరుతో సరిపుచ్చుకున్నారు. ఆ తరువాత మేమిద్దరం, మేమే విడివిడిగా ఉంటాం ఇక మరొకరు మాకెందుకు అనుకుంటున్నారు. ప్రకృతి కూడా అదే దారిలో పయనించడంతో ఇప్పుడు లబోదిబో మంటూ మాకు పిల్లలు కావాలంటూ సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. డిమాండ్‌ను బట్టే వ్యాపారం ఉంటుంది. ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలకున్నంత డిమాండ్ మరోదానికి లేదు. భార్యాభర్తలు అస్సలు కష్టపడాల్సిన అవసరం లేకుండా కోరిన సమయంలో కోరిన ముఖ కవళికలతో పిల్లలను సప్లై చేస్తామనే కేంద్రాలు త్వరలోనే వచ్చినా రావచ్చు.
సంతానం లేని వారికి సంతాన సాఫల్య కేంద్రాలు వచ్చినట్టుగానే అన్నింటికి సాఫల్య కేంద్రాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మధ్య టిఎన్ శేషన్ గారు రాజకీయాల్లో శిక్షణ ఇస్తానంటూ రాజకీయ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఎన్నికల ప్రధాన కమీషనర్‌గా ఉన్నప్పుడు ఆయన ఆయన పేరు వింటేనే జకీయ నాయకులు హడలి పోయారు. ఇప్పుడు మన ఇంటి గోడలకు సున్నం వేస్తే ఏడాది తరువాత కూడా తెల్లగా ఉండసడానికి కారణం శేషన్ కారణం. గోడల మీద నాయకులు రాతలు రాస్తే రంగుపడుద్ది అని ఆయన హెచ్చరించడంతో గోడలు వేసిన రంగులోనే ఉన్నాయి.



 ఆయనకు ఎన్నికలకు సంబంధించిన చట్టాలు బాగానే తెలిసినా రాజకీయనాయకుల తత్వం ఏ మాత్రం ఒంటబట్టలేదు. అందుకే ఆయన రాజకీయ కళాశాల మొదటి ఏడాదిలోనే దివాళా తీసింది. చిన్నపాటి మార్పుతో ఆయనే కాదు ఎవరైనా రాజకీయ వ్యాపారం బ్రహ్మాండంగా సాగించవచ్చు. విలువలతో కూడిన రాజకీయాల్లో శిక్షణ ఇస్తామంటే ఆయన వైపు చూసేదెవరు? అలా కాకుండా సంతానం లేని వారికి సంతాన సాఫల్య కేంద్రం వారు అనుసరించిన టెక్నిక్‌నే అనుసరిస్తే కాసుల వర్షం కురిసేది. రాజకీయాల్లో పదవులు కోరుకుంటూ అవి రాకుండా జీవిత కాలమంతా ఉసూరుమంటూ జీవితం చాలించాల్సిన అవసరం లేదు. మా రాజకీయ సాఫల్య కేంద్రంలో చేరండి, పదవులు పొందే మార్గం నేర్పిస్తాం అని ప్రకటించి ఉంటే శేషన్ మార్గంలో వీధికో సాఫల్య కేంద్రం ఏర్పాటై ఉండేది.
రాజకీయ సాఫల్య కేంద్రంలో వచ్చిన వారందరి వద్ద ఫీజులు వసూలు చేయవచ్చు. కొందరికీ పదవులు వస్తే ముందుగానే పర్సంటేజీ సైతం మాట్లాడుకోవచ్చు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠాలు చెప్పేవారినే రాజకీయ సాఫల్య కేంద్రంలో శిక్షణకు ఉపయోగించుకోవచ్చు. 



నటులు దర్జాగా నటశిక్షణాలయాలకు వెళ్లి ఏడాది కాలంలో నేర్చుకునే పాఠాలను నాయకులు మాత్రం రాజకీయాల్లో రెండు మూడు దశాబ్దాలైనా వంట బట్టించుకోవడం లేదు. కొందరు పుట్టుకతో నటులయితే, కొందరు శిక్షణ కేంద్రాల ద్వారా నటులవుతారు. అలానే కొందరు పుట్టుకతోనే రాజకీయాల్లో నటించడం నేర్చుకుంటే చాలా మంది మాత్రం రెండుమూడు దశాబ్దాల పాటు అనేక డక్కా మొక్కీలు తిని నటించడం నేర్చుకుంటున్నారు. అలా కాకుండా రాజకీయ సాఫల్య కేంద్రాల ద్వారా నటనలో మెళుకువలు నేర్చుకోవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పార్టీ ఆధ్వర్యంలోనే రాజకీయ శిక్షణాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే అంతా అన్నగారి అభిమానులే కావడంతో భగవత్ స్వరూపులు మీ ముందు మేము నటించడమా? అంటూ నటన నేర్చుకోకుండా అభిమానానికే పరిమితం కావడంతో అభిమానులుగానే మిగిలిపోయారు. ఎన్టీఆర్ తన రాజకీయ వారసునిగా బాలకృష్ణ ఉండాలని కోరుకున్నారు. కానీ చిత్రంగా ఎన్టీఆర్ రాజకీయ వారసుని హోదా చంద్రబాబుకు దక్కింది. పదవి లాక్కోవడంలో, నిలబెట్టుకోవడంలో బాబు చూపిన నటనా కౌశలం చివరకు ఎన్టీఆర్‌ను సైతం అబ్బురపరిచింది. నా కన్నా మా అల్లుడు గొప్ప నటుడు అని బహిరంగంగా ఆయన ఒప్పుకోక తప్పలేదు. 


ఆ మధ్య తమిళనాడులో దొంగ చాటుగా దొంగల శిక్షణా లయాన్ని నిర్వహిస్తున్న విషయం బయటపడింది. అందరికీ శిక్షణాలయాలు ఉన్నప్పుడు రాష్ట్రంలో నటన, రాజకీయం కలగలిసిపోయిన సమయంలో నట రాజకీయ శిక్షణాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో టిడిపి, కాంగ్రెస్ వాళ్లు ఒకరంటే ఒకరు మండిపడేవారు. ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమాల పుణ్యమా అని పార్టీలకు అతీతంగా ప్రాంతాల వారిగా నాయకులు జెఎసిల పేరుతో ఏకమవుతున్నారు. అదే స్ఫూర్తితో రాజకీయ నటనాలయంలో అన్ని పార్టీల వారు కలిసి జెఎసిగా ఏర్పాటై శిక్షణ ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. చంద్రబాబు క్లాస్ ముగియగానే ఉపన్యాస కళలో కెసిఆర్ ఉపన్యాసం, ఆ వెంటనే జనాన్ని ఆకట్టుకునే విన్యాసాలపై జగన్మోహన్‌రెడ్డి నటన క్లాస్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు వెంకయ్యనాయుడు ప్రాసలతో ఎదుటి వాడి తల పగలగొట్టడంపై ఉపన్యాసాల్లో మెళుకువలు నేర్పితే, మరోవైపు అర్ధం పర్థం లేకుండా ఎదుటి వాడి బుర్ర వేడెక్కే విధంగా ఎలా మాట్లాడాలో తెలుగు పార్టీ నేతలతో పాఠాలు చెప్పించాలి. మాటలెక్కువ, పని తక్కువ, ఫలితం శూన్యం అంటే ఏమిటో రాఘవులు, నారాయణలను ప్రత్యక్షంగా చూపించి నేర్పించవచ్చు
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యనాయకులైన రోశయ్య, బాబు, కెసిఆర్, వెంకయ్య, రాఘవులు, నారాయణ అంతా రిటైర్‌మెంట్ వయసు దాటిపోయిన వారే వీరంతా రాజకీయ జెఎసిగా ఏర్పడి నట శిక్షణాలయంలో మెరికల్లాంటి నాయకులను తయారు చేయవచ్చు. రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ను ఏ నాయకుడూ అంగీకరించడు. వీరు సైతం అంతే. అందుకే రాజకీయాల్లో ఉన్నట్టూ ఉంటుంది, ఇటు తమ అనుభవాన్ని శిక్షణ రూపంలో కొత్త వారికి అందించడానికీ అవకాశం ఉంటుంది. వీరికో వ్యాపకం దొరుకుతుంది, ప్రజలకు శాంతి లభించి రాష్ట్రానికి మేలు జరుగుతుంది.

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

కసిగా చదవండి ... ఎకలవ్యుడిగా చదవండి. మీ సత్తా చాటండి

కసిగా  చదవండి ... ఎకలవ్యుడిగా చదవండి. మీ సత్తా చాటండి
ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజిల్లో చదివి మంచి మార్కులు సాదించిన విద్యార్థులకు అభినందనలు . మూడు నాలుగేళ్ల క్రితం పనిమనుషుల పిల్లలు మాత్రమే ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్నారని వార్తలు రాసి నిరుత్సాహ పరిచిన మీడియా చెంప చెల్లు మనిపించేలా , పలితాలు సాదించిన మీకు అభినందనలు . ప్రభుత్వ స్కూల్స్లో మనషి పలితాలు సాదించిన విద్యార్తులకు ప్రైవేటు కాలేజిలు గాలం వేస్తున్నారని ఓ కార్టున్ వచ్చింది. ప్రైవేటు కలేజిలను కుడా ఎప్పుడో చంపేశారు కదా. ఇప్పుడు ఉన్నవి కర్పోరాటే కాలేజిలే. మంచిమార్కులు వస్తే ఇంటి తలుపు తట్టి గళం వేసేది వారే. కానీ కార్పోరేట్ కాలేజి అని విమర్శిస్తే ప్రకటనలు రావు , అందుకే ఆ పేరు ఎత్తడానికి భయం. సరే కార్పోరేట్ కాలేజిల గాలానికి చిక్కినా మీకు చదువులో బలమైన పునాదులు వేసిన ప్రభుత్వ స్కూల్స్ ను మరవకండి. ఈ పిల్లలకు చదువు చెప్పిన పంతుల్లకు, ప్రోత్సహిస్తున్న విద్య శక కార్యదేషి లవ్ అగర్వాల కు అభినందనలు ...

తెలంగాణ అజెండాయే ఊపిరి - టిఆర్‌ఎస్‌కుపదేళ్లు



కెసిఆర్.. ఈ పేరు వింటే సీమాంధ్రలో ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుందో, తెలంగాణలో అంత అభిమానం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ ప్రతీకగా మారారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమం గ్రామ గ్రామానికి పాకింది. అయితే అదే సమయంలో ఒక ఉద్యమ పార్టీగా పదేళ్లు అయినా టిఆర్‌ఎస్‌కు సరైన స్వరూపాన్ని కెసిఆర్ కల్పించలేకపోయారు.
 తెలంగాణ ప్రజల్లోని బలమైన తెలంగాణ కాంక్ష టిఆర్‌ఎస్‌ను బతికిస్తోంది కానీ రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌కు కెసిఆర్ బలమైన పునాదులు కల్పించలేదు. తెలంగాణ ఉద్యమం ఎన్నాళ్లుంటుంది? టిఆర్‌ఎస్ పుట్టినప్పుడు అందరి నోట వినిపించిన మాట ఇది. తెలంగాణ వస్తుందా? ఇది సీమాంధ్ర, తెలంగాణలో ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఈ రెండు మాటల వెనుక పదేళ్ల చరిత్ర దాగి ఉంది.

 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టిఆర్‌ఎస్ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం మహబూబ్‌నగర్‌లో జరుగుతున్నాయి. టిఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ రాజకీయ పక్షం కూడా తెలంగాణ అంశాన్ని విస్మరించలేదు. పార్టీ ఆవిర్భవించినప్పుడు కెసిఆర్ ఏం సాధిస్తారు అని ప్రశ్నించిన ప్రత్యర్థులు సైతం ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది కెసిఆరేని బహిరంగంగానే ప్రకటిస్తారు.
‘నన్ను కనీసం లక్ష తిట్లుతిట్టి ఉంటారు. నేను పట్టించుకోలేదు. మనం ఏదైనా పట్టుకుంటే మొండిగా వెళ్లాలి’ టిఆర్‌ఎస్ సభలో కెసిఆర్ స్వయంగా తన గురించి తాను చెప్పుకున్న విషయం. ఒక రాజకీయ నాయకుడి గురించి బహుశా ఇంత విస్తృతమైన వ్యతిరేక ప్రచారం మరెవరి విషయంలో జరిగి ఉండదు. కానీ ఇలాంటి తిట్లను ఏ మాత్రం ఖాతరు చేయకపోవడం ఒక్క కెసిఆర్‌కే సాధ్యమైంది. బహుశా ఆయన ఈ తిట్లను కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఉంది. అందుకే మొండిగా ముందుకు వెళ్లి ప్రత్యర్థుల చేత కూడా ప్రశంసలు పొందే విధంగా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకువెళ్లారు. మీడియా చేతిలో లేకపోతే మెగాస్టార్లు కూడా రాష్ట్ర రాజకీయాల్లో చతికిల పడాల్సిందే. కానీ తన మాటలనే ప్రచారాస్త్రంగా వాడుకుని ప్రత్యర్థులను చావుదెబ్బతీశారు.
అది నూతన శతాబ్ది ప్రారంభం. అప్పటికి చంద్రబాబు ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి ఏడాది గడుస్తోంది. మొదటి సారి ఎన్టీఆర్ ఇచ్చిన అధికారం అయితే, రెండోసారి తాను సొంతంగా అధికారంలోకి వచ్చారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభ రోజురోజుకు క్షీణిస్తున్న కాలమది. కానీ రెండవ సారి విజయం సాధించిన చంద్రబాబు ఎవరి మాటా వినే పరిస్థితిలో లేరు. వాస్తవానికి ఆయన పునాదులు కదిలిపోతున్నాయి కానీ మీడియాలో మాత్రం అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా ప్రచారం పొందుతున్నారు. మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా తన ఇమేజ్‌ను తానే అద్భుతంగా బూస్టప్ చేసుకుని, అది నిజమేనని చంద్రబాబు కలల ప్రపంచంలో విహరిస్తున్న కాలమది.
 పునాదులు కదులుతున్నప్పుడు అప్రమత్తంగా ఉన్నవారే విజేతలు. సరిగ్గా అలాంటి సమయంలోనే చంద్రశేఖర్‌రావులోని చురుకైన రాజకీయ నాయకుడు మేల్కొన్నాడు. అటు చూస్తే చంద్రబాబు ప్రభావం కొడిగట్టి పోతోంది. పైగా తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నవారే రంగంలో నిలుస్తారు. ఇదే సరైన సమయం అని భావించిన కెసిఆర్ తెలంగాణ ఉద్యమంపై దృష్టిసారించారు. ఒకవైపు వర్షాలు లేక వరుసగా ఐదేళ్ల నుంచి కరవు.
 ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. గ్రామాల్లో పనులు లేవు. నిజంగానే ‘పల్లే కన్నీరు పెట్టింది..’ అన్నట్టుగానే ఉంది గ్రామాల పరిస్థితి. వర్షాలు పడి పొలం బాగా తడిచినప్పుడు విత్తనాలు నాటితేనే పంట పండుతుంది. జనం ఆగ్రహంతో ఉన్నప్పుడు రంగంలోకి దిగితేనే రాజకీయం పండుతుంది. ఇదే సమయంలో చంద్రబాబు వ్యవసాయానికి విద్యుత్ చార్జీలను పెంచారు. తెలంగాణ మొత్తం బోరుబావులపైనే వ్యవసాయం జరుగుతుందని, వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల తెలంగాణ రైతు చావుదెబ్బ తింటాడని అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
 ఈ లేఖ వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి ముందుమాట లాంటిది. దమ్ముంటే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి అనే మాట టిడిపి వారి నుంచి అనిపించుకుని, మీరు ఒక రాజీనామా అడిగితే నేను మూడు ఇస్తున్నాను అంటూ డిప్యూటీస్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా లేఖలు టిడిపి ఆవిర్భావ సభలోనే ప్రకటించారు. ఈ రాజీనామాలే కెసిఆర్‌కు తెలంగాణ ప్రజల్లో క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ ఎన్నికలంటే ఉత్సాహ పడేవారు. ఆయన తరువాత ఇలా ఎన్నికలకు ఉత్సాహాన్ని చూపించింది కెసిఆర్.
రాజకీయాల్లో దశాబ్దకాలం తక్కువే కావచ్చు. కానీ ఒక ఉద్యమం దశాబ్ద కాలం పాటు నడిపించడం సామాన్య విషయమేమీ కాదు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్‌తోనే ప్రారంభం కాలేదు. ఆయన కన్నా ముందు చాలా మంది ఉద్యమాన్ని సాగించారు. ఎక్కువ రోజులు నడపలేకపోయారు. వైఎస్‌ఆర్ పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడే 41 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఆయన అనుమతితో తెలంగాణ సాధన కోసం సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు. కొన్ని సదస్సులు నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు. మేం సీరియస్‌గా ఉద్యమిస్తుంటే కెసిఆర్ సందట్లో సడేమియా అంటూ వచ్చారని టిఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ సదస్సులో విమర్శించారు. 

ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కెసిఆర్ ఆధ్వర్యంలో సాగుతుంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి సందట్లో సడేమియా అన్నట్టుగా మారింది. కెసిఆర్ కన్నా ముందు కాంగ్రెస్, బిజెపితో పాటు ఇంద్రారెడ్డి తెలంగాణ కోసం ఉద్యమాలు సాగించినా అవి పార్ట్‌టైం రాజకీయాల తరహాలోనే సాగాయి. చెన్నారెడ్డి చేయలేనిది కెసిఆర్ చేస్తారా? అని విమర్శించిన వారికి అర్ధం కాని విధంగా పదేళ్ల నుంచి టిఆర్‌ఎస్ ఉద్యమాన్ని సాగిస్తూనే ఉంది. 1969లో విద్యార్థులు ప్రారంభించిన తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి ఏడాదికి మించి నడిపించలేకపోయారు.
 తెలంగాణ కోసం పుట్టిన పార్టీని చెన్నారెడ్డి కాంగ్రెస్‌లో కలిపేశారు. చిత్రంగా ఇప్పుడు తెలంగాణ కోసం పుట్టిన టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరిస్తే, టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధం అని కెసిఆర్ ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి పార్లమెంటులో ప్రకటించే స్థాయి వరకు ఉద్యమాన్ని తీసుకువెళ్లిన క్రెడిట్ కెసిఆర్‌కే దక్కుతుంది. అలా అని ఆయన చేసే వాటన్నింటిని సమర్ధించలేం. అయన వైఖరి ఎలా ఉన్నా, ఆయన చేస్తున్న తప్పులు ఎన్నున్నా కేవలం తెలంగాణ అజెండానే ఆయన్ని కాపాడుతోంది. రాష్ట్రంలోని మరే రాజకీయ పక్షమైనా తన నిర్ణయాన్ని వెంటనే మార్చేసుకుంటుంది. ప్లేటు ఫిరాయించడానికి ఏ మాత్రం సంకోచించదు.

 కానీ టిఆర్‌ఎస్ పుట్టింది తెలంగాణ కోసం, ఆ పార్టీ ఉనికి తెలంగాణలో మాత్రమే ఉంది. అందుకే కెసిఆర్ ఏం చేసినా వాటిని పక్కన పెట్టి తెలంగాణ కోరుకునే వారంతా కెసిఆర్ తప్ప మరో మార్గం లేదనుకుంటున్నారు. కెసిఆర్‌కు గద్దర్‌ను పోటీగా తీసుకురావాలనే ప్రయత్నం జోరుగానే సాగింది. గద్దర్‌ను హైలెట్ చేసిన వారే స్వయంగా సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర వ్యాపారులు తెలంగాణ ఉద్యమం కెసిఆర్ ఆధ్వర్యంలో కాకుండా గద్దర్ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నారు అని ప్రకటించారు. కెసిఆర్‌ను పక్కకు తప్పిస్తే తెలంగాణ ఉద్యమం చల్లబడిపోతుందనేది చాలా మంది నమ్మకం. ఈ నమ్మకంతో చాలా మంది చేసిన ప్రయత్నాలు కెసిఆర్‌ను మరింత బలపడేందుకు దోహదం చేశాయి. గద్దర్‌ను తెరపైకి తీసుకురావాలని తీవ్రంగా సాగించిన ప్రయత్నాలు కెసిఆర్‌ను మరింత బలపరిచాయి. కెసిఆర్ ఏం మాట్లాడినా సంచలనమే. ఏమీ మాట్లాడకపోయినా సంచలనమే!

 ఆయన మాటలను ఎవరూ నమ్మరనేవారే ఎక్కువగా ఉంటారు. అదే సమయంలో ఆయన మాట్లాడినా, మాట్లాడకపోయినా ఏదో చేస్తున్నారని ఆందోళన చెందేవారు అంత కన్నా ఎక్కువ మంది ఉంటారు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్ చేతిలో ఉండొచ్చు కానీ తెలంగాణ వస్తుందా? లేదా? అనే ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం సోనియాగాంధీ చేతిలోనే ఉంది. 

28, ఏప్రిల్ 2011, గురువారం

ఔను కనులు మాటలాడును

నిన్ను చూశాక  కనులు మాటలడునని ఒప్పుకొని తీరాల్సిందే .మీరేమంటారు

27, ఏప్రిల్ 2011, బుధవారం

‘అవినీతి అమర్ రహే...

జబ్‌తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్‌తక్ భ్రష్టాచార్ రహేగా - సూర్యచంద్రులున్నంత వరకూ అవినీతి అమరమై ఉంటుంది- అంటూ బయట గట్టిగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ దేశానికి ఏదో చేయాలని దీర్ఘంగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న జర్నలిస్టు జమదగ్ని ఉలిక్కిపడి లేచాడు. ముందు నీ పని నువ్వు సరిగా చేయ్యడం నేర్చుకో..దేశానికి ఏం చేయాలో తర్వాత అని అతన్ని బాస్ నిరుత్సాహ పరుస్తుంటాడు. మేధావిని అర్ధం చేసుకోవాలంటే కొంత మేధావితనం అవసరం అంటూ సిద్ధాంతం గురించి బాస్‌కు బోధించాలనుకున్నా, అభిప్రాయాల కన్నా ఉద్యోగం ముఖ్యం అనే విషయం జమదగ్నికి గుర్తుకొచ్చింది.
 తన లాంటి వాడు జర్నలిస్టు కావడం ఈ పత్రికా ప్రపంచం చేసుకున్న అదృష్టం అని అతని గట్టి నమ్మకం. అవినీతే అభివృద్ధికి మూలం అంటూ అతనో సిద్ధాంత గ్రంథం రాశారు. గైడ్ అవినీతితో మొదలుపెట్టి యూనివర్సిటీనిర్వహణలో సాగుతున్న అవినీతి వరకు, అవినీతి ద్వారా ఎలా అభివృద్ధి సాధించవచ్చునో చక్కగా రాశాడు. అతని తెలివి తేటలకు బెదిరిపోయి నువ్వు మా యూనివర్సిటీ స్థాయి మించి పోయావు అని చెప్పి పంపించేశారు. ఓ డాక్టర్ అవినీతి వల్ల ఓ నర్సింగ్ హోం పుడుతుంది. ఓ నేత అవినీతి వల్ల కార్పొరేట్ కంపెనీ పుడుతుంది. ఓ జర్నలిస్టు అవినీతి వల్ల ఒక మీడియా సంస్థ పుడుతుంది అనేది అతని సిద్ధాంతం. ఆధారాలతో నిరూపిస్తూ సిద్ధాంత గ్రంథం రాశాడు.
ఈ మధ్య దేశంలో అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరు జమదగ్నికి కంటికి కునుకు లేకుండా చేసింది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. జమదగ్ని అవినీతి బయటపడుతుందనే భయంతో నిద్ర లేని రాత్రులు గడిపాడనుకోకండి. అతని జీవితంలో హాయిగా నిద్రపోయిన రాత్రుల కన్నా, ఉద్యోగం పోతుందనే భయంతో గడిపిన నిద్రలేని రాత్రులే ఎక్కువ. జమదగ్నికి అవినీతిలో స్వీయానుభవం ఉంటే సిద్ధాంత గ్రంథం రాసేంత సమయం ఎక్కడుంటుంది?
నంబర్‌వన్ కావడం ఎలా అనే పుస్తకాన్ని అద్భుతంగా రాసేవాడు ఏనాటికీ నంబర్‌వన్ కాడు. ఎలా నటించాలో నేర్పించేవాడు నటుడు కాలేడు. మీరూ నాయకులు కావచ్చు అని చక్కని పుస్తకం రాయగలిగిన వాడు కనీసం తమ కుటుంబ సభ్యులకు కూడా నాయకత్వం వహించలేడు. మరి జమదగ్ని నిద్ర లేని రాత్రులకు కారణం? ఏమిటా? అనే కదా సందేహం.... అవినీతిపై దేశ వ్యాప్తంగా ఉధృతంగా సాగిన ఆందోళన అతన్ని అయోమయంలో పడేసింది. దేశంలో నోరున్నవారు నోటితో, మూగవారు రాతలతో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించేస్తున్నారు. దీంతో అవినీతి నిలిచిపోతే ఈ దేశ అభివృద్ధి ఏం కావాలి? అనే భయం జమదగ్నిని వెంటాడుతోంది. దేశ ప్రజలంతా అవినీతిని వ్యతిరేకిస్తుంటే మరి ఈ దేశంలో లంచాలు ఇస్తున్నది, తీసుకుంటున్నది పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లా? అనే భయం మరోవైపు అతన్ని పీడించడంతో తనికి నిద్రే కరువైంది. 

మన నాయకులకు ప్రత్యర్థి పార్టీ నాయకుల అవినీతి కలవరం కలిగిస్తే జమదగ్నికి అవినీతి కనిపించకుండా పోతుందేమోననే భయం పట్టుకుంది. అన్నా హజారే చుట్టూ చీమల దండులా చేరిన జన ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుంటే జమదగ్ని బిపి అదే స్థాయిలో పెరగసాగింది. ఎంతో జీవితానుభవనం ఉన్న జమదగ్ని తాత - అరే జమా! నువ్వు అనవసరంగా భయపడుతున్నావురా! ఏమీ కాదు నా మాట నమ్ము- అని అనునయించాడు. ‘‘ఇప్పుడు అన్నాహజారేకు జయ్ కొడుతున్న వీళ్లే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని పడితే ముందు లంచం ఇచ్చి తరువాత తమ పనేంటో చెబుతారు. 


మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో పదివేలకు పైసా తగ్గేది లేదని డిమాండ్ చేశాడు చూడు బట్టతల పొట్టోడు వాడు హజారే దీక్ష మద్దతు శిబిరంలో ముందు వరుసలో కూర్చోని టీవిల ముందు అవినీతికి వ్యతిరేకంగా ఎంత చక్కగా మాట్లాడాడు. వాడి నటనకు ముచ్చటేసింది. ఆ పొట్టోడు అవినీతి నిర్మూలన జరగాలని కోరుకుంటున్నాడంటే నువ్వు నమ్ముతావా? అవినీతి అంతమై పోతుందేమో దాంతో అభివృద్ధి నిలిచిపోతుందేమోనని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. దుస్తుల ఫ్యాషన్‌కు ఫ్యారిస్ కేంద్రమైతే సిద్ధాంతాల ఫ్యాషన్‌కు మన దేశం పుట్టిల్లు. ఒకప్పుడు ఖద్దరు ఫ్యాషన్, యువత కొంత కాలం ఎర్ర పార్టీల ఫ్యాషన్‌లో తడిసి ముద్దయ్యారు. . తరువాత అన్నల ఫ్యాషనొచ్చింది. మొన్న భక్తి ఫ్యాషన్ దేశాన్ని ఊపేసింది. ఇప్పుడు అవినీతి వ్యతిరేకత అనేదో ఫ్యాషన్. లంచం ఇచ్చేవారు, పుచ్చుకునే వారు ఇద్దరూ పోటీ పడి ఈ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉద్యమం ఎంత ఉధృతంగా వచ్చిందో అంతే వేగంగా చల్లబడిపోతుంది నా మాట నమ్ము’’, అని జమదగ్నితాత నచ్చచెప్పాడు.


 జన్‌లోక్‌పాల్ డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు శాంతిభూషణ్ వ్యవహారాలపై తొలుత టేపులు బయటపడ్డాయి. తరువాత భూమి వ్యవహారం బయటపడింది. చివరకు ఉద్యమ కర్త అన్నాహజారే తన పుట్టిన రోజు వేడుకలకు ట్రస్ట్ డబ్బులు రెండు లక్షలు ఖర్చు చేశాడనే కేసులో కోర్టుకు హాజరయ్యారు. శాంతిభూషన్ టేపుల వ్యవహారంతో కమిటీ నుంచి తాను తప్పుకుంటున్నట్టు కర్నాటక లోకాయుక్త హెగ్డే ప్రకటించారు. హెగ్డే చరిత్ర కూడా తక్కువేమీ కాదని మరొకాయన ఆరోపించాడు. ఇవన్నీ వరుసగా ఒకదాని తరువాత ఒకటి జరగడం చూశాక జమదగ్నిలో ధైర్యం పెరిగింది. వందకోట్ల  మంది భారతీయుల్లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడానికి ఒక్క భారతీయుడు లేడా? అని గతంలో ఆవేదన చెందేవారు.
 ఒలంపిక్ గోల్డ్‌మెడల్ సంగతి పక్కన పెట్టి జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం 120 కోట్ల మంది భారతీయుల్లో అవినీతి చరిత్రలేని ఐదుగురు దొరకరా? అని ఇప్పుడు అనుకోవలసొస్తోంది. మొత్తం పది మంది సభ్యుల్లో ఐదుగురు మంత్రుల అవినీతిపై ఎవరికీ సందేహం లేదు. పౌర సమాజం నుంచి ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తే ఇప్పటి వరకు వారిలో ముగ్గురిపై  ‘అవినీతి అమర్ రహే...ఆరోపణలు వచ్చాయనే విషయం తెలిశాక జమదగ్ని హాయిగా నిద్రపోయాడు. జబ్‌తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్‌తక్ భ్రష్టాచార్ రహేగా’ అని జమదగ్ని కూడా గట్టిగా నినాదాలు చేశాడు.
అక్షరసత్యం: మానవ జాతి ఉన్నంతవరకు అవినీతి ఉంటుంది. అవినీతి శాశ్వతం, ఉద్యమాలు అశాశ్వతం!

25, ఏప్రిల్ 2011, సోమవారం

‘మా కులం వారికి అధికారం అప్పగించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా?’

ఛీ చీ... టీవి చూడాలన్నా ,పేపర్ చదవాలన్నా చిరాకేస్తుంది సమాజం ఎటుపోతుందో, రాజకీయాలు ఎంత అధ్వాన్నంగా మారాయో తలుచుకుంటేనే ఒళ్లు మండిపోతోంది - అంటూ రచ్చబండ వద్ద తాను చదువుతున్న పత్రిక నుంచి తలను పైకెత్తి నారాయణ తనలో తానే తిట్టుకున్నాడు. ‘‘ నేను చదువుతున్న పత్రికలోని వార్తలూ చిర్రెస్తున్నాయి ’’ అని విశ్వనాథం గొంతు కలిపాడు.
‘‘నువ్వెన్నయినా చెప్పు విశ్వనాథం మనుషుల్లో స్వార్థం, కులతత్వం మరీ పెరిగింది.



 ప్రజలు కులమతాలకు అతీతంగా ఆలోచించి మా కులం వారికి అధికారం అప్పగించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? కులరహిత సమాజ నిర్మాణ సంఘం అధ్యక్ష పదవి మొదలుకుని రాష్ట్ర పాలన వరకు మా కులం వారు పని చేసినంత సమర్ధవంతంగా మరెవరైనా పని చేశారా? నువ్వే చెప్పు . త్యాగాలకు, అభ్యుదయ భావాలకు, కుల రహిత సమాజం ఏర్పాటుకు మా కులం వాళ్లు చేసినంత త్యాగం దేశంలో మరే కులం వాళ్లు చేయలేదని మా కుల సమావేశంలో సైతం నేను చాలెంజ్ చేస్తే ఒక్కరూ నోరుమెదపలేదు’’ అని నారాయణ ఆవేదనగా పలికాడు.
‘‘మా కులం వాళ్లు సర్వం త్యాగం చేసి స్వాతంత్య్రం కోసం పోరాడారు. మా వాళ్లు పోరాడక పోతే దేశం ఇప్పటికీ బానిసత్వంలోనే ఉండిపోయేది. ఐనా ఈ ప్రజలకు ఇంత కూడా కృతజ్ఞత లేదు. ఎవరెవరో అధికారం అనుభవించారు మమ్ముల్ని గుర్తు చేసుకోవడం లేదు’’ అని పక్కనున్న సుబ్బారావు వీరి చర్చలోకి వచ్చాడు.

 ‘‘ ఇప్పుడు మనుషుల్లో కులతత్వం బాగా పెరిగిపోయింది. సమాజం ఇంత అధ్వాన్నంగా మారిపోయినా మా కులం వాళ్లలో మాత్రం అభ్యుదయ భావం వెల్లివిరుస్తోంది. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్ల మా కులంలో పుట్టాను’’ అని సుబ్బారావు తనకు తాను కితాబు ఇచ్చుకున్నాడు. అప్పటి వరకు వీరి సంభాషణలు వింటున్న ప్రకాశ్‌కు చిర్రెత్తుకొచ్చింది.


 ఆ గ్రామంలో ఇంగ్లీష్ పేపర్ చదివేది ఆయనొక్కరే. గ్రామంలో ఆయన మాట ఎవరూ వినరు, ఆయన ఎవరి మాట వినడు. అదే పనిగా మాట్లాడుతూ పోవడం ఆయన హాబీ. ఈయనతో నష్టం లేదు, లాభం లేదని ఎవరూ ఆయన్ని పట్టించుకోరు. ఆయన , ‘‘డిఫరెంట్‌గా థింక్ చేయాలి ఎప్పుడూ ఒకే మూసలో ఆలోచిస్తారేమిటి?’’ అని అందరినీ నిలదీస్తుంటాడు. బతుకమ్మ పండుగ రోజున టపాకాయలు కాల్చడం, కృష్ణాష్టమికి రంగులు చల్లుకోవడం, దీపావళికి పాలు పొంగించడం భలేగా ఉంటుంది కదూ! ఓ సినిమాలో డిఫరెంట్‌గా థింక్ చేయాలంటూ ఓ పాత్ర ఇలానే చేస్తుంటుంది. సరిగ్గా ఈ పాత్రలానే ప్రకాశ్ ఉంటాడు. తెలుగు చలనచిత్ర సీమను ఒక మలుపు తిప్పేస్తాననే అప్పల్రాజు సినిమా రంగంలోకి వచ్చినట్టుగా, ప్రకాశ్ ప్రపంచ రాజకీయ చరిత్రను తిరగ రాస్తాను - అని గ్రామ రాజకీయాల్లోకి ప్రవేశించారు.


 పంచాయితీలో ఒక వార్డు గెలవడానికి ఒక లక్ష ఖర్చుపెడితే ఆయన మొత్తం గ్రామంలో పది లక్షలు ఖర్చు పెట్టి ఒక్కవార్డులో గెలిచాడు. ఓహో ఎన్నికల సంస్కరణలు అంటే ఇవేనా అని ఆయన ప్రత్యర్థులు ఆయన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. మీరు మరీ సంకుచితత్వంతో మీ మీ కులాల గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. మా కులం గురించి చెప్పుకోవాలంటే వినడానికి మీకు జీవిత కాలం సరిపోదు కానీ నేను మీలా ఆలోచించే వాడిని కాదు. నిజానికి మన గ్రామస్థులే కాదు మొత్తం మన దేశీయులు అసమర్ధులు, తిండిపోతులు, పనికిరాని చవటలు అంటూ ప్రకాశ్ చెప్పుకుపోతూనే ఉన్నాడు. ఒక్క క్షణం ఆగి ఇంతటి అసమర్ధుల్లో నాలాంటి కొద్దిమంది మేధావులు కూడా లేకపోలేదు.


 మనం మూర్ఖులం అని తెలవడానికి సైతం కొంత తెలివి అవసరం. నేను తెలివైన వాడిని కాబట్టే మన దేశీయులు మూర్ఖులనే విషయం పసిగట్టాను. నేను ఇప్పుడు పసిగట్టిన విషయాన్ని చర్చిల్ కూడా ఒప్పుకున్నాడు. భారతీయులకు తొందరపడి స్వాతంత్య్రం ఇవ్వవద్దు కులం మతం పేరుతో కొట్టుకు చస్తారని అన్నాడు. 60 ఏళ్ల క్రితంకాక, నాలాంటి మేధావి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈ కాలంలో స్వాతంత్య్రం వచ్చి ఉంటే దేశం అద్భుతమైన ప్రగతి పథంలో పయనించేది. కానీ తొందరపడి నేను పుట్టక ముందు స్వాతంత్య్రం లభించడం వల్ల ఇప్పుడు దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.
 స్వాతంత్య్రం కోసం అనేక వందల ఏళ్లు నిరీక్షించిన భారతీయులు మరో 60 ఏళ్లు ఓపిక పట్టి ఉంటే ఎంత బాగుండేది? భారతీయులు పందికొక్కులని, మహాత్మాగాంధీ హాఫ్‌నేకెడ్ ఫకీర్ అని చర్చిల్ అంటే , తిండిపోతులని జార్జిబుష్ ఆ మధ్యే చక్కని మాట అన్నాడు ’’ అని ప్రకాశ్ చెబుతుంటే దడేల్ మని శబ్దం వినిపించింది. ‘‘నా ఉపన్యాసం నిన్ను అంతగా కదిలిస్తే భుజం తట్టాలి కానీ డిఫరెంట్ అంటూ కొట్టడం నాకేమీ నచ్చలేదు’’, అని కోపంగా వెనక్కి చూశాడు ప్రకాశ్ . అంత గుంపులో ఆ పని చేసింది ఎవఠో గుర్తుపట్టలేదు.
హాయ్ అంటూ దూరం నుంచి ఒక వ్యక్తి చేతులూపాడు. ఎన్నాళ్లకెన్నాళ్లకు అని ఇద్దరు కౌగిలించుకున్నారు. ఈ గ్రామంలో ఉన్నావని తెలిసి వచ్చాను అని ఆగంతకుడు నవ్వుతూ పలికాడు. 



గ్రామస్థులంతా అతన్ని ప్రశ్నార్థకంగా చూస్తుంటే ప్రకాశ్ సంతోషగా ‘‘వీడు నా క్లోజ్ ఫ్రెండ్ ఒకేసారి ఉద్యోగాల్లో చేరాం అచ్చం నాలానే వీడూ డిఫరెంట్‌గా థింక్ చేయాలని చదువుకునేప్పటి నుంచే భావించేవాడు’’ ’ అని పరిచయం చేశాడు. ‘‘నేను డిఫరెంట్‌గా థింక్ చేయడాన్ని అర్థం చేసుకునే తెలివి తేటలు లేని ప్రభుత్వం నన్ను ఉద్యోగంలోంచి తీసేసింది’’ అని ఆగంతకుడు చెప్పుకొచ్చాడు. ‘‘ఉద్యోగాన్ని ఊడబెరికించిన డిఫరెంట్ థింకింగ్ ఏమిటో?’’ అని అప్పారావు ఆసక్తిగా అడిగాడు.‘‘నేను పోలీసు అధికారిని , సాహసం ఎక్కడున్నా అభినందిస్తాను.
 కొత్తగా సెలక్ట్ అయిన పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తూ , ‘కసబ్‌లా ధైర్యసాహసాలు అవసరం’అని చెప్పాను. ఒకే ఒక్క వ్యక్తి అంత సాహసంతో మనదేశంపై దాడికి వచ్చాడని మెచ్చుకున్నాను....దీన్ని అర్ధం చేసుకోలేక ప్రభుత్వం నా ఉద్యోగాన్ని ఊడబెరికింది, విలక్షణంగా ఆలోచించే వారికి ఇలాంటి కష్టాలు తప్పవు’’ ’ అని వాపోయాడు ఆగంతకుడు !(భారతీయులను , భారతీయ నాయకులను తిట్టిన చర్చిల్ ను మెచ్చుకున్న ఒక నేతకు అంకితం ) 

24, ఏప్రిల్ 2011, ఆదివారం

సాయిబాబా నా దృష్టిలో దేవుడే .... దేవుడికి నివాళి

సత్యసాయి బాబా కు నివాళి సాయిబాబా నా దృష్టిలో దేవుడే .. పేదలకువిద్యా  సేవ అందించాడు. కార్పోరేట్ ఆస్పత్రులలు లక్షలు వసులు చేసే చికిస్తాను ఆయన తన ఆస్పత్రిలో ఉచితంగా అందించాడు. ఎన్నో ప్రాంతాలకు తాగు నీరు అందించాడు.  మహిమలు ఉన్నాయా లేవ అనవసరం . రాజకీయ పార్టిలు ఓట్ల కోసం సేవ కార్యక్రమాలు చేస్తాయి. కానీ ఏ ఓట్లు ఆశించకుండా మంచి చేసిన బాబా దేవుడే .. దేవుడికి నివాళి 

23, ఏప్రిల్ 2011, శనివారం

దేవుడా ఏమి నా కోరిక

దేవతలకు పాలకుడైన ఇంద్రుడు నిరంతరం తన పదవి కాపాడుకోవడంలోనే మునిగిపోయేవాడట.. ఎవరు తపస్సు చేసినా తన పదవి కోసమేననే భయం ఇంద్రుడికుండేది. నాటి ఇంద్రుడి నుండి నేటి ముఖ్యమంత్రుల వరకు అందరిదీ ఇదే బాధ. ఎవరేం చేసినా తమ పదవికి ఎసరు వస్తుందేమోనని నిరంతరం కలవరపడుతుంటారు.

 తమ పనులు కావాలంటే ఆ శాఖలకు తమ మనుషులే మంత్రులుగా ఉండాలని నీరా రాడియా వంటి శక్తివంతమైన మహిళలను పారిశ్రామిక వేత్తలు ఎలా ఉపయోగించుకుంటారో 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో తెలిసొచ్చింది. ఇంద్రుడు సైతం ఇలానే ఎవరు తపస్సు చేసినా తన కుర్చీని జాగ్రత్త చేసుకోవడం కోసం రంభా ఊర్వశి మేనకలను పంపే వారు. నీరా రాడియా ఇప్పుడేదో నోయిసి కన్సల్టెన్సీ అని ఏర్పాటు చేసుకున్నట్టు అప్పుడే రంభా ఊర్వశి మేనకలు ఇంద్రుడి కన్సల్టెన్సీ సభ్యులన్న మాట!
ఎవరు తపస్సు చేసినా తన కుర్చీని జాగ్రత్త పర్చుకోవడానికి ఇంద్రుడీ కన్సల్టెన్సీ సభ్యులను వారిపైకి ఉసిగొల్పేవాడు. నీరా రాడియాకు ఎదురు లేనట్టే రంభాఅండ్ కో వెళ్లారంటే ఎంతటి ఘోర తపస్సులో ఉన్న వారైనా వీరి వలలో పడాల్సిందే! అయితే నిజంగా ఆ మునులు ఇంద్రుడి సింహాసనాన్ని ఆశించే అంత ఘోరమైన తపస్సు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు.

 తుమ్మితే ఊడే ముక్కు లాంటి ఇంద్ర పదవి కోసం ఆశపడతారా? ఏమో ఏ కాలంలోనైనా అధికారం అంటే మక్కువే కదా! అప్పుడు ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడు తన కుర్చీ కోసమే అని వణికిపోయినట్టే ఇప్పుడు ముఖ్యమంత్రులు తమ ఎదురుగా ఎవరు కనిపించినా? ఎవరు నోరు మెదిపినా తన కుర్చీలాగేందుకే అని చిరాకు పడుతున్నారు.
 ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఎవరు దేనికి తపస్సు చేస్తున్నారా అంచనా వేయడం కష్టమే కాబట్టి చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్నట్టు కుర్చీపై కూర్చున్న వారు అందరినీ అనుమానంగా చూస్తునే ఉంటారు. అయినా కోరికలు లేనిది తపస్సు చేసే వారెవరు? కోరికలు లేని సమాజం ఏర్పడాలనే బలమైన కోరికతోనే కదా! బుద్ధుడు తపస్సు చేశాడు.

 రూపాలు మారాయి కానీ కోరికలు తీరాలంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు తపస్సులు తప్పడం లేదు. అప్పుడు గడ్డాలు పెంచుకుని చుట్టూ పుట్టలు పెరిగే వరకు తపస్సు చేసే వారు. ఇది ప్రజాస్వామ్యం కోరికలు తీరాలంటే జనం వద్దకు వెళ్లాల్సిందే, గడ్డం పెరిగేట్టు, కాళ్లు అరిగేట్టు జనం చుట్టు తిరిగి వారిని ప్రసన్నం చేసుకునేందుకు జన తపస్సు చేస్తే కానీ కోరికలు తీరవు.

 ప్రజల మధ్య ఓదార్పు అంటూ తిరిగేది సైతం కోరికలు తీర్చుకోవడానికి సాగించే తపస్సే. కోరికలు తీరాలంటే 40 రోజుల వ్రతం, ఆరు వారాల ఉపవాసం అంటూ రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ చిన్నచిన్న కోరికలకు సంబంధించిన వ్రతాలు. పిల్లలు బాగా చదవాలనో మొగుడి ఉద్యోగం నిలవాలి వీలుంటే ఒక ప్రమోషన్ లభించాలని భార్యలు చేసే చిన్నచిన్న తపస్సులివి. 


ఆ కాలంలో చాలా వేగంగా గడ్డాలు పెరిగిపోయేవి, దేవుళ్ళు తొందరగా ప్రసన్నం అయి వరాలు ఇచ్చేసేవారు. ఏదైనా డిమాండ్ సప్లైను బట్టే ఉంటుంది కదా! అప్పుడున్న ముక్కోటి దేవతలే ఇప్పుడున్నారు. కానీ జనం కోటాను కోట్ల మంది పెరిగిపోయారు. దాంతో తపస్సు చేసే వారి సంఖ్య ఎక్కువ వరాలిచ్చే దేవుళ్ల సంఖ్య తక్కువ కావడంతో అంత సులభంగా కోరికలు తీరడం లేదు. ఇంద్రుడి కుర్చీ సంగతి అటుంచి అమ్మాయి మనసు దోచుకోవడానికి సైతం ఘోరమైన తపస్సు చేసినా ఫలితం ఉండడం లేదు చాలా మందికి దాంతో వాళ్లు తపస్సు మానేసి గడ్డాలు పెంచుతున్నారు. నాయకుడికి సామాన్యుడి కోరిక తుచ్చమైనదనిపించవచ్చు, సామాన్యుడికి తన ప్రేమ ముందు నాయకుడు కుర్చీ కోసం సాగించే తపస్సు అధ్వాన్నమైన కోరిక అనిపించవచ్చు. ఎవరి తపస్సు వారికి ముఖ్యం . నిధిచాల సుఖమా రాముడి సన్నిధి సేవ సుఖమా? అంటే తెలివైన వాడు రాముడి సన్నిధి సుఖమనాలి.. దేవుడు మెచ్చి నిధీ ఇస్తాడు, తన సన్నిధీ ప్రసాదిస్తాడు. ఐఐటి చేయాలని ఎల్‌కెజిలో చేరినప్పుడు నిర్ణయించుకున్నట్టు తపస్సు మొదలు పెట్టినప్పుడే ఏం కోరాలి, దేవున్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో- సరైన విజన్ ఉండాలి. అందుకే దేవుడా ఏమి నా కోరిక అని దేవుణ్ణి ముందుగానే అడిగి తీరుస్తననె గ్యారంటి తీసుకోని తపస్సు ప్రారంభిస్తే పుణ్యం పురుశార్త్ధం 

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

ముద్రా రాజకీయం..రావణుడుమంచిబాలుడు.. దుర్యోధనుడికి అన్యాయం జరిగింది



మహాత్మాగాంధీ సింప్లీసిటీకి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని సరోజినీ నాయుడు చమత్కరించే వారట! పంచ, చేతిలో కర్ర ఇంతకు మించిన సింప్లీసిటీ ఇంకేముంటుంది. రాజకీయాల్లో బ్రాండ్ ఇమేజ్ ఏంటో ఆ కాలంలోనే మహాత్మాగాంధీ గ్రహించారు. సింప్లీసిటీ బ్రాండ్‌తో దేశ ప్రజలందరినీ ఒక్క మాటమీద నిలబెట్టవచ్చునని, నాయకుడికి ముద్ర అవసరమని దేశ రాజకీయాల్లో మొట్టమొదటి గ్రహించింది ఆయనే. సింప్లీసిటీకి మారుపేరుగా నిలిచిన మహాత్మాగాంధీ ఆధునిక భావాలు ఉట్టిపడే జవహర్‌లాల్ నెహ్రూను దేశ తొలి ప్రధానిగా ముందే నిర్ణయించడం మరో విచిత్రం.


 శివాజీ అనగానే హిందూదేశ పరిరక్షణకు శత్రువుల గుండెలు చీల్చడానికి కత్తిపట్టుకుని గుర్రం మీద పరుగులు తీస్తున్న ముద్ర కనిపిస్తుంది. ఆనాటి కాలం నుండి నేటి వరకు నాయకులు తమకు తెలియకుండానే తమ ముద్రను తాము ప్రజలకు విడుదల చేస్తుంటారు.
ఆనాటి కాలంలో అది తమ ముద్ర అని తెలియకుండానే తమ జీవన శైలి, వ్యవహార శైలి ద్వారా ఒక ముద్రను ఏర్పాటు చేసుకునే వారు కానీ నేటి కాలంలో అలా కాదు.. చక్కని ముందు చూపుతో ఏ కాలానికి ఏది అవసరం వస్తుందో ఆ ముద్ర కోసం నాయకులు తంటాలు పడుతుంటారు. ఐటి జోరుగా నడిచే కాలంలో ఐటి వీరునిగా ముద్ర వేయించుకోవడానికి కోట్లు ఖర్చు చేస్తారు.

 ఐటికి ఓట్లు రాలేట్టు లేదు, రైతు ముద్ర వేయించుకుందామని ఒకేసారి యూటర్న్ తీసుకుంటారు. ఇలాంటి వారికి చివరకు జనం గాలి వాటం ముద్ర వేస్తారు. ఒక ముద్రను నమ్ముకుంటే కాలానికి ఎదురీది ఆ ముద్రకు కట్టుబడి ఉండాలి కానీ గాల వాటంగా ముద్రలు మార్చుకుంటే చివరకు జనం గిరీశం అనే ముద్ర వేస్తారు.
 ముద్ర అనేది వారి పనుల ద్వారా ఏర్పడుతుంది కానీ ప్రయత్నాలతో కాదని గ్రహించే సరికి పుణ్యకాలం ముగిసిపోయి పదవి లేకుంటే బతక లేని జీవి ఇదిగో ఇలానే ఉంటాడు అనే ముద్ర పడుతుంది. కొందరికి మహాత్మాగాంధీ హిందుత్వముద్రలో కనిపిస్తే, నాథూరామ్‌గాడ్సేకు మహాత్ముడు హిందుత్వవ్యతిరేకముద్రలో కనిపించారు.
దేవుళ్లకు సైతం ముద్రలు తప్పవు. శంకరునికి  బోళా అనే బలమైన ముద్ర ఉంది! ఎంతో మంది రాక్షసులకు ఈ ముద్ర సంగతి బాగా తెలుసునని పురాణాలు చెబుతున్నాయి. ఏడుకొండల వెంకన్నకు ఆ కాలం నుండి ఈ కాలం వరకు కోరిన కోరికలు తీర్చే దేవుడని బలమైన ముద్ర ఉండడం వల్లనే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది
. పాపం ఇంద్రుడు దేవుళ్లకు అధిపతి అయినా  తన కున్న ముద్ర వల్ల ఎవరి ఆదరణ సంపాదించలేకపోయారు. చాటు మాటు వ్యవహారాలు ఈయనకు ఎక్కువ అనే ముద్ర నిజమే కదా! 

కుక్కను చంపేప్పుడు అది పిచ్చికుక్క అని ప్రచారం చేయమని ఊరికే అనలేదు. అంటే పిచ్చి అనే ముద్ర వేస్తే చంపినా ఇబ్బంది ఉండదన్నమాట! అలానే రాజకీయ నాయకులు తమపై తాము మంచి ముద్ర వేసుకోవడానికి తమ ప్రత్యర్థులపై పిచ్చి ముద్ర వేయడానికి తెగ తంటాలు పడుతుంటారు.

 సినిమాల్లో నటించేప్పుడు ఎన్టీఆర్‌కు ప్రజలు కనిపించే దైవం అన్నట్టుగా ముద్ర వేశారు. ఆయన అధికారంలోకి రావడానికి ఆ ముద్రే ఉపయోగపడింది. తిరిగి అధికారం నుండి దించడానికి ఆయన కున్న పాత ముద్రను చెరిపేసి కొత్త ముద్ర వేయడానికి అల్లుళ్లతో సహా కుటుంబ సభ్యులు తీవ్రంగానే కష్టపడి విజయం సాధించారు.
 రాజకీయ రంగంలో ఈ ముద్రలు వేసే దానిలో హిట్లర్ ప్రపంచానికే పాఠాలు చెప్పేస్థాయిలో ఉన్నారు. తనను తాను ఆర్య జాతిని ఉద్దరించడానికి జన్మించిన మహనీయునిగా హిట్లర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇలాంటి ముద్రల కోసం ఆయన వద్ద ఒక మంత్రి కూడా ఉండేవారు. ఆయనే గోబెల్స్, నేటి నాయకులకు ఆదర్శ ప్రాయుడు! అబద్ధాన్ని పదే పదే చెప్పించి నిజమని నమ్మించాలని ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని చాలా మంది నాయకులు ఇప్పటికీ అమలు చేస్తూ, తాము గోబెల్స్‌ను అనుసరిస్తూ ఎదుటి వారికి గోబెల్స్ అని ముధ్ర వేస్తారు.
 ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై ఓటరు ముద్ర పడాలంటే ముందు నాయకులు వారి మనస్సుల్లో మంచి ముద్ర వేసుకోవాలి. వైఎస్‌ఆర్ ప్రధాన ప్రత్యర్థిగా మారబోతున్నాడని తెలిసిన వెంటనే అధికారంలో ఉన్న బాబు ఆయన ఫ్యాక్షనిస్టు అని ఫ్యాక్షన్ ముద్ర జనం హృదయాల్లో ముద్రించడానికి తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ వైఎస్ ఆధికారంలోకి వచ్చాక పథకాల ద్వారా ఊహించనంతగా ప్రజానాయకుడనే బలమైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు జగన్ పై లక్ష కోట్ల అవినీతి ముద్ర కోసం ప్రయత్నాలు బలంగానే సాగుతున్నాయి.
భాగవతం రచించిన పోతన మొదలుకుని సమైక్యాంధ్ర వాదానికి ఆధికారిక గీతం లాంటి ‘‘తెలుగుజాతి మనది నిండుగు వెలుగు జాతి మనది ’’ అని రాసిన డాక్టర్ సి నారాయణరెడ్డి వరకు తెలంగాణలో పండితులెంతమంది ఉన్నా.  తెలంగాణ వారు అనగానే యాదగిరి అనే పేరుతో ఇంట్లో పనిమనుషులుగా, మేయిన్ రౌడీకి అసిస్టెంట్‌గా ఉంటూ ఉర్దూ తెలుగు కలగలిపి మాట్లాడతారు అనే  ముద్ర  ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మన తెలుగు సినిమాలు తెలంగాణా వారిపై వేసిన బలమైన ముద్ర.

 రాయలసీమ అంటేనే కత్తులు పట్టుకుని తిరుగుతారని, వారు కక్షలనే తిని పెరుగుతుంటారని మన మెదడులో బలంగా నాటుకున్న ముద్ర. శాసన మండలిలో పురాణాలతో ఉదహరిస్తూ పద్యాలతో ఉపన్యసించే సభ్యుడొకరు ఉన్నారంటే ఔనా అనిపిస్తుంది. ఆయన ముస్లిం అని, ఎమ్మెల్సీ షేక్ హుసేన్ అని తెలిశాక మరింత ఆశ్చర్యం కలుగుతుంది. మన మెదడులో సినిమాలు వేసిన ముద్ర ప్రకారం ముస్లిం అంటే అటు తెలుగు, ఇటు ఉర్దూ కాకుండా మాట్లాడాలి మరి.
 పాత ముద్రలు తొలగించి కొత్త ముద్రలు వేసే ప్రయత్నాలు సైతం చాలా కాలం నుండి సాగుతూనే ఉన్నాయి. రావణుడు మంచిబాలుడు,   దుర్యోధనుడికి అన్యాయం జరిగింది, పాండవులందరి కన్నా అతనే వీరాధి వీరుడనే కొత్త ముద్రల ప్రయత్నం తెలుగునాట బలంగానే సాగింది. పాశ్చాత్యుల దృష్టిలో భారత్‌కున్న ముద్ర పాములాడించే వాళ్ల దేశం, సన్యాసుల దేశం. చాలా విషయాల్లో ముద్రలకు వాస్తవానికి సంబంధం ఉండదు. అయినా ఎవరి ముద్రకు వారే బాధ్యులు.

21, ఏప్రిల్ 2011, గురువారం

నాటకాంధ్ర ప్రదేశ్ ...... సరదా కబుర్లు

ఏవండోయ్ సాయంత్రం తొందరగా రండి రవీంద్రభారతిలో నాటక ప్రదర్శనకు వెళదాం. పిల్లలూ ముచ్చటపడుతున్నారు- అంటూ తాయారు పలికింది. నాకు కుదరదోయ్ అని నీలకంఠం సింపుల్‌గా చెప్పేశాడు. అజాత శత్రువే అలిగిన నాడు - అంటూ తాయారు పద్యం అందుకుని అటు సూర్యుడు ఇటు పొడిచినా మనం నాటకానికి వెళుతున్నాం వెళ్లి తీరాల్సిందే అని హుకూం జారీ చేసింది. మన పక్కనున్న తమిళనాడు, కర్నాటకల్లో ఇప్పటికీ నాటకాలు సజీవంగా ఉన్నాయి. టికెట్లు కొని నాటకాలు చూస్తారు. అదేం దరిద్రమో కానీ తెలుగునాట నాటకాలంటేనే తెలియకుండా పోయింది. అప్పుడెప్పుడో 60-70 ఏళ్ల క్రితం నాటి నాటకాల గురించే ఇప్పుడు కూడా గొప్పంగా చెప్పుకోవడం తప్ప మనకు నాటకాలు ఎక్కడ ఏడిచాయి అని తాయారు కాస్త ఆవేదనగానే పలికింది.



పిచ్చి తాయారు నీ అమాయకత్వం కాకపోతే తెలుగునాట నాటక కళ చచ్చిపోవడం ఏమిటి? మన జీవితాల్లో కలిసిపోయింది. తమిళనాడులో, కర్నాటకలో మహా అయితే రెండు మూడు డజన్ల థియోటర్లలో నాటకాలు వేస్తే, రోజుకో వెయ్యి మంది నాటకాలు చూస్తూ ఉండొచ్చు, అంతేనా? అని నీలకంఠం కాస్సేపు ఆగి, కాలంతో పాటు నాటకాల రూపూ మారిపోయింది. ఆ విషయం నీకు తెలియక నాటకాలు లేవనుకుంటున్నావు.

తెలుగునాట సాంప్రదాయకంగా నాటకాల ప్రదర్శలు లేవు అను ఒప్పుకుంటాను. నాలుగు గోడలు, డజను మంది నటులు, ఐదు వందల మంది ప్రేక్షకులు నాటకం అంటే ఇదే అనుకుంటున్నావేమో తెలుగు నాట నాటకానికి నిర్వచనమే మారిపోయింది. గతంలో  రాష్ట్రం పేరును స్వర్ణాంధ్రగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ గారు స్వర్ణాంధ్ర పేరును మూలన పడేసి హరితాంధ్ర అన్నారు. నిజానికి మన రాష్ట్రానికి ఈ పేర్లేమి సరిపోవు. నాటకాంధ్ర ప్రదేశ్ మన రాష్ట్రానికి బాగా సరిపోయే పేరు ఏమంటావు అని నీలకంఠం భార్యను అడిగాడు.


ఆమె ప్రశ్నార్థకం ముఖం పెట్టడంతో రాష్ట్రంలో ఎవరైనా సహజంగా కనిపిస్తున్నారా? నాయకులు, మేధావులు, మీడియా అంతా తమ తమ పాత్రల్లో జీవించేస్తున్నారు ఇలాంటి రాష్ట్రాన్ని నాటకాంధ్ర ప్రదేశ్ అనకుండా ఇంకేమంటాం. బాబు గారు పరిపాలనను వీధినాటకంగా మార్చేస్తే రోశయ్య ,కిరణ్ జమానా వచ్చేసరికి జన జీవితమే నాటకంగా మారిపోయింది. ఒకరిని మించి ఒకరు నటించేస్తున్నారు. గవర్నర్ తన పాత్ర పరిధి దాటి నటించేస్తున్నారనేది మిగిలిన వారి విమర్శ. ఇక తనది దారిన పోయే దానయ్య పాత్ర - అని స్వయంగా రోశయ్య ప్రకటించా రు  .  ఇక కిరణ్ కుమార్ కు తనపాత్ర   ఏమిటో తనకే అర్ధం కాకుండా నటించేస్తున్నాడు. ఇంతకు మించిన నటన ఏ ముంటుంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను మీరు పొమ్మన్నా పోను నేను సమైక్యవాదిని కాదు వీర తెలంగాణ వాదిని అనే అభిప్రాయం కలిగించే విధంగా తెలంగాణ వాదుల ముందు, తెలంగాణ మంత్రులు వద్దన్నా పరీక్షలు నిర్వహించాను చూడండి అంటూ వీర సమైక్య వాదిగాసీమాంధ్ర నాయకుల ముందు రోశయ్య నటన సామాన్యమైనదా? టెలిఫోన్లు వచ్చిన కొత్తలో పక్కన ఫోన్ పెట్టుకుని గదవ మీద చేయి పెట్టుకుని ఫోటోలు దిగడం ఫ్యాషన్‌గా ఉండేది. ముఖ్యమంత్రి అయిన కొత్తలో అచ్చం అలానే కంప్యూటర్ ముందు వౌస్ పట్టుకుని ఉన్న బాబుగారి ఫోటోల ప్రకటనలు పత్రికల్లో నిండిపోయేవి. అప్పుడు కంప్యూటర్ ముందు తెగనటించేసిన బాబు హఠాత్తుగా రైతుపాత్రలో జీవించేశారు. రాముడిగా జనాన్ని రంజింపజేసిన ఎన్టీఆర్, రావణాసురిడిగా నటించలేదా? జనం విరగబడి చూడలేదా? నటుడు అన్నాక ఒకే పాత్రకు ఎలా పరిమితం అవుతారు, ఏ పాత్రలోనైనా పాలలో నీళ్లలా కలిసిపోవాలి కదా! ఈ విషయం తెలియక బాబు కొత్త పాత్ర మీద చాలా మంది విమర్శలు చేశారు. బాబు మాత్రం ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమవుతున్నానని అనుకుంటున్నారు. అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇప్పుడు మాట్లాడేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదీ ఉచితంగా రాదు అని సెలవిచ్చిన బాబు ఇప్పుడు విద్యార్థులందరికీ ఉచితంగా చదువు చెప్పించక పోతే తాట ఒలిచేస్తానంటూ చక్కని డైలాగులు చెబుతున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలు బట్టలారేయడానికే పనికి వస్తాయనే పాపులర్ డైలాగును చక్కగా చెప్పిన ఆయన ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇచ్చి తీరాల్సిందే దాని కోసం ఉద్యమిస్తామనే డైలాగు అంత కన్నా బలంగా చెబుతున్నారు.


వీళ్లిద్దరేనా పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కళాకారులు ఇంట పుట్టిన బిడ్డ కచ్చితంగా కళాకారుడు అయి తీరుతాడు అన్నట్టు తండ్రి డైలాగులను అచ్చం తండ్రి లానే చెబుతూ జగన్ ఎంత బాగా నటిస్తున్నాడు. ఓటర్లంతా తన కుటుంబమేనని, తనకు తండ్రి ఇంత పెద్ద కుటుంబం అప్పగించాడని చక్కని డైలాగులు చెబుతూ పాత్రలో జీవించేస్తున్నాడు. నటన విషయం ఎలా ఉన్నా డైలాగుల విషయంలో మాత్రం కెసిఆర్‌ దూసుకెలుతున్నరు  .
 వీళ్లేనా టీవిల్లో చర్చలు చూడు.... అడిగే వారు, చెప్పేవారు ఎంత బాగా నటిస్తారో? వెర్రి చర్చ అని చర్చ జరిపే వాడికి, మాట్లాడే వాడికి, వినేవాడికి తెలుసు. మళ్లీ అంతా నటించేస్తుంటారు. మన చుట్టే నాటకాలు సాగుతుంటే రాష్ట్రంలో నాటక కళ అంతరించిపోయిందనడం భావ్యమా తాయారు ’’ అని నీలకంఠం ప్రశ్నించాడు. మీ మాటలు చూస్తుంటే నాటకానికి తీసుకు వెళ్లకుండా ఉండేందుకు మీరు నటిస్తున్నారేమోననిపిస్తోందండి అని తాయారు మెల్లగా పలికింది. 

20, ఏప్రిల్ 2011, బుధవారం

ప్రమదావనం: ప్రమాదవనం

 ఆమధ్య గూగుల్ గ్రూపులో  ఒకరు మహిళల బ్లాగులకు  ప్రమదావనం  అని పేరు పెట్టుకున్నారు కదా మరి మగ వారి బ్లాగులకు ఏపేరు బాగుంటుంది అని   ప్రశ్నించారు .  ప్రమాదవనం  అని పెడితే బాగుంటుంది అని సరదాగా కామెంట్ చేశాను.  భిన్నాభిప్రాయం  ఉన్నా , పోస్ట్ నచ్చాక పోయిన   సభ్యతతో ఎలాంటి అభిప్రాయమైన చెప్పవచు . ఓ వ్యక్తి  అభ్యం తర కరమైన రీతిలో రాయడంతో  కామెంట్స్ పరిశీలించాకే పోస్ట్ చేస్తున్నాను . . బ్లాగ్ అనేది డైరి లాంటిది అని ఈ మద్య లాహిరి బ్లాగ్ లో చుసిన కామెంట్ బాగా నచ్చింది . బ్లాగ్ లో అంశాలు అందరికి నచాలని లేదు .తన అభిప్రాయలు భిన్నగా ఉంటె తన బ్లాగ్ లో రాసుకోవచు ఇష్టం ఉన్నవారు చదువుతారు . అంతేకాని ఇతరుల బ్లాగ్లో అసబ్య భాషలో కామెంట్స్ రాయడం ఎవరికి మంచిది కాదు .. మాలాంటి వారిని వదిలేస్తే చాలామంది పరాయి దేశాల్లో ఉంటూ తెలుగు భాష మిద అభిమానం తో  బ్లాగ్ లు నిర్వహిస్తూ, బ్లాగ్ లను చదువుతో తెలుగును బ్రతికిన్చేందుకు చేస్తున్న కృషి సంతోషం కలిగించింది.  బ్లాగ్ లో అనాగరిక మైన కామెంటు ఉంటె ఒకరిద్దరికి సంతోషం కలిగించ వచ్చు  కాని దానివల్ల నష్టమే ఎక్కువ . బ్లాగ్ పేరు గుర్తు రావడం లేదు కాని పురాణాల గురించి రాసే ఒక బ్లాగ్లో ఎవరు చెత్త కామెంట్స్ రాశారట అడిచాదివిన వారు ఫోన్ చేసి చేభితే బ్లాగ్ నిర్వాహకుడు వారికి పాస్ వర్డ్ చెప్పి కామెంట్స్ తిసేయించాడు దిఇనిని ఆటను తన బ్లాగ్ లో రాసుకున్నాడు ఒకరికి భక్తీ ఉంటె మరొకరు నాస్తిక వాదాన్ని నమ్మ వచ్చు ఎవరిష్టం వారిది . ఒకరు తెలంగాణా వాది ఐతే మరొకరు సమై క్యా   వాది  కావచ్చు . ఎవరి బ్లాగ్  కు  వారే సుమన్ అని ఒక బ్లాగ్ లో చాల రోజుల క్రితం చదివాను . బ్లాగ్ ఎలా నిర్వహించాలో  చెబుతున్నారు అలానే పాటించాల్సిన మర్యాదల గురించి చర్చించి . కొన్ని నిభందనలు మనకు మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి . బెంగాలురుకు చెందినా  సాహిత్య అభిమాని బ్లాగ్ నిర్వాహకులు కామెంట్స్ పోస్ట్ చేయడం పై  అతని బ్లాగ్ లో అనుసరిస్తున్న విదానం బాగుంది ఒకసారి చుడండి . 

చెడిపోవడం అంత సులభం కాదండీ!


మనం అనుకుంటాం కానీ చెడిపోవడం అంత ఈజీ కాదు. కష్టమైన పని కొద్దిమందే చేయగలరు అందుకే చెడిపోయిన వారెప్పుడూ కొద్దిమందే ఉంటారు. పూర్వజన్మ సుకృతం వల్ల కొంత మంది సునాయాసంగా చెడిపోతారు కానీ అది అందరి వల్ల కాదు చెడిపోవడం అనే లక్షణం నేర్చుకుంటే వచ్చేది కాదేమోనిపిస్తోంది. అందరు చేసేది ఒకే ఉద్యోగం, కొందరు మాత్రమే చేతివాటానికి అలవాటు పడతారు....
చెడులో ఉన్నంత ఆకర్షణ మంచిలో ఉండదు అయితే చెడులో ఉన్నంత కష్టం మంచిలో ఉండదు. ఓసారి ఇదే విషయాన్ని ఓషో రజనీశ్‌చెప్పుకొచ్చాడు. ‘మంచివాడి గురించి చెప్పడానికి ఏ ముంటుంది మంచి వాడు చాలా మంచి వాడు ఇంకా ఇంకా మంచివాడు అంతకు మించి చెప్పలేం కానీ అదే చెడ్డవాడి గురించి చెప్పాలంటే కథలు కథలుగా వర్ణించ వచ్చు. రాముడు మంచి వాడు అనే ఒక్క ముక్కతో మంచితనం ముగిసిపోతుంది. అదే రావణుడి గురించైతే శక్తిసంపన్నుడైన రాక్షసుడు సీతను అపహరించాడు. లంకలో దాచిపెట్టాడు. ఇలా ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు.

ఎంత కన్నీరు కార్పించే సినిమా అయినా శుభంతో ముగిసినట్టు చివరకు మంచే గెలిచిందని చెప్పుకుంటారు కానీ ఏ సినిమా ఐనా చూడండి చెడు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. అసలు చెడు లేకపోతే మంచికి విలువే లేదు. విలన్ శక్తిసామర్ధ్యాలపైనే హీరోకు గుర్తింపు ఉంటుంది. లక్ష మంది మంచివాళ్లను తయారు చేయవచ్చు కానీ ఒక చెడ్డవాడిని తయారు చేయడం అంత సులభం కాదు. మన కార్పొరేట్ కాలేజీలు చూడండి ఏటా లక్షలాది మంది విద్యార్థులను బంజరు దొడ్లొ తోలినట్టు తోలేసి పాఠాలు రుబ్బేసీ మంచి వాళ్లుగా మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నారు. పార్సల్ చేయడానికి వీలుగా ఉండేందుకు జపాన్‌లో పుచ్చకాయలను ముందు నుంచే చతురస్రాకారంలో పండిస్తారు. పండ్లనే మన ఇష్టం వచ్చిన డిజైన్‌లోకి మార్చుకోగలిగినప్పుడు కార్పొరేట్ కాలేజీలు పిల్లలను ఇష్టం వచ్చిన ఆకారంలోకి మార్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఈజీగా కార్పొరేట్ కాలేజీలు లక్షలాది మందిని మంచివాళ్లుగా మార్చేస్తున్నాయి కానీ ఆ కాలంలో ఒక్కడిని చెడ్డవాడిగా మార్చమని మహారాజు అంతటి వాడు వేడుకున్నా రాక్షస గురువులకు సైతం సాధ్యం కాలేదు. అదే నండి హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు రాక్షస లక్షణాలు మరిచిపోయి విష్ణు భక్తుడిగా మారిపోతే చిర్రెత్తుకొచ్చిన తండ్రి ఎంత ఖర్చయినా, ఎంత కష్టమైనా సరే మావాడ్ని అర్జంట్‌గా చెడ్డవాడిగా మార్చేయండి అంటూ చండామార్కులకు అప్పగించేస్తాడు. చండామార్కుల వారి వద్ద అసిస్టెంట్ విలన్లలా బోలెడు మంది ఉంటారు. వీరంతా కలిసి నానా తంటాలు పడినా ప్రహ్లాదుడ్ని చెడ్డవాడిగా మార్చలేకపోయారు. నాకు ఎమ్‌సెట్ వద్దు అంటూ కాళ్లు నేలకేసి అరిచి గీ పెట్టినా, కార్పొరేట్ కాలేజీ హాస్టల్‌లో పరేస్తే అవసరం అయితే ఆస్థాన రౌడీలను ఉపయోగించి వాళ్లు వారం రోజుల్లో ఆ కుర్రాడ్ని మంచివాడిగా మార్చేస్తారు. కానీ పాపం చండామార్కుల బృందం ఎంత కష్టపడ్డా ప్రహ్లాదుడిని చెడ్డవాడిగా మార్చలేకపోయారు.
 దేవతలను గజగజలాడించిన హిరణ్యకశిపునికి సైతం తన కన్నకొడుకును చెడ్డవాడిగా మార్చడం సాధ్యం కాలేదు. దీన్ని బట్టి అర్ధం కావడం లేదా? చెడ్డవాడు కావడం అంత ఈజీ కాదని. ఎప్పుడైనా హిప్నాటిజం షో చూస్తే, హిప్నటైజ్ కావడానికి సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే తాము హిప్నటైజ్ చేయగలమని హిప్నాటిస్ట్‌లు ముందే చెబుతారు. అలానే చెడిపోవాలని ముందు తమకు తాము మనసా వాచా కర్మణ నిర్ణయించుకున్న వారు మాత్రమే చెడిపోగలరు కాని ఎంతటి శిక్ష విధించినా చెడకొట్టడం సాధ్యం కాదని నాటి రాక్షస రాజు హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడని నుంచి సచివాలయంలో నేటి క్లర్కు కుటుంబరావు కొడుకు ప్రహ్లాద్ వరకు అందరి విషయంలో రుజువవుతూనే ఉంది. ప్రహ్లాదుని విషయం కొంచం నయం గురువులు తండ్రి మాత్రమే చెడగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. హరిశ్చంద్రున్ని చెడగొట్టేందుకు మొత్తం దేవతలంతా ఉమ్మడిగా మారి ఎన్ని ప్రయత్నాలు చేశారు? రాజ్యాన్ని, గృహలక్ష్మిని , కొడుకును, అన్నింటిని వదులుకుని కాటకాపరిగా బతికేందుకైనా సిద్ధపడ్డాడు కానీ ఆయన్ని చెడ్డవాడిగా మారలేకదు. నీ కర్మ నీ తలరాత అలా రాసిపెట్టి ఉంటే మేమేం చేయగలమని దేవతలు చేతులెత్తేశారు కానీ హరిశ్చంద్రున్ని చెడ్డవాడిగా మార్చలేకపోయారు. రవి అస్తమించని బ్రిటీష్ వాడినే ఓడించిన మహాత్మాగాంధీ సైతం చిన్నప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా చెడ్డవాడిగా మారలేపోయారు. 


మహాత్మాగాంధీ ఆత్మకథ చదివితే దేశానికి స్వాతంత్య్రం సాధించడం కన్నా చెడ్డవాడుగా మారడం చాలా కష్టం అని మహాత్ముని జీవితం చెబుతుంది. స్కూల్‌లో కాపీ కొట్టడం వంటి చిన్నపాటి చెడ్డపనే ఆయనకు సాధ్యం కానప్పుడు ఇక పెద్దపెద్ద చెడుపనులు ఆయనవల్లేం అవుతాయి?
మళ్లీ మనం రజనీశ్ వద్దకే వస్తే ఓసారి ఆయన ఉపన్యాసం ముగిసిన తరువాత ఒక వ్యక్తి లేచి మా ఆఫీసులో మిగిలిన వారు లంచాలు తీసుకుని సంతోషంగా ఉంటున్నారు. నేను లంచాలు తీసుకోవడం లేదు , అది నా వల్ల కాదు మరి నేను వారంత సుఖంగా లేను ఇది అన్యాయం కదా! అని ప్రశ్నించాడు. దానికి రజనీశ్ నవ్వి చెడ్డవాడు కావడం అంత సులభం కాదు. లంచం తీసుకునే నీ సహచరులు నిరంతరం పట్టుపడకుండా ఉండేందుకు చురుగ్గా ఉంటారు. నీకా శక్తి లేదు కానీ ఎలాంటి ప్రమాదం లేకుండా వారి మాదిరిగానే పై సంపాదన ఉంటే బాగుండుననే కోరిక నీలో ఉంది. లంచం తీసుకోకుండా ఉండడం నీ బాధ్యత, అంతే తప్ప తీసుకునే వారి కన్నా నేను ఎక్కువ సంతోషంగా ఉండాలని కోరుకోవడం చాలా స్వార్థం. చెడ్డతనం కూడా అంత ఈజీ కాదు అని క్లాస్ తీసుకున్నాడు

. చాలా మంది చెడు వల్ల కలిగే ప్రయోజనాలు ఉండాలని, అదే సమయంలో మంచివాడిగా గుర్తింపు ఉండాలని కోరుకుంటారు, ఇలాంటి వారి కన్నా కల్తీలేని చెడ్డవాడే బెటర్ కదా! చెడ్డవాడు కనిపించినప్పుడు జెలసీ వద్దు, పూర్వజన్మ సుకృతం అనుకుని వదిలేయండి.

19, ఏప్రిల్ 2011, మంగళవారం

జీవితం అంటే రెండు ఏడుపుల మధ్య నున్న విరామ సమయం

జీవితం అంటే రెండు ఏడుపుల మధ్య నున్న విరామ సమయం. మనిషి పుట్టినప్పుడు తానేడ్చి, పోయినప్పుడు ఇతరులను ఏడిపిస్తాడు. మరి మనందరి జీవితం రెండు ఏడుపుల మధ్య నుండే సమయమే కదా! పిల్లలు తాము కోరుకున్నది సాధించుకోవాలంటే ఏడుపును మించిన ఆయుధం లేదని మాటలు రాకముందే గ్రహించేస్తారు. 


రామాయణమంతా కైక ఏడుపుతోనే కదా! కైక ఏడిస్తే దశరథుడు శ్రీరామున్ని అడవులకు పంపి తాను ఏడ్చి జీవితం చాలించాడు. కైకనే కాదు ఇప్పుడు నాయకులు సైతం ఏడుపు ద్వారానే ఏదైనా సాధించవచ్చునని భావిస్తున్నారు. మీ జీవితం ఎంత దుర్భంగా ఉందో మీకు తెలియదు, మీ బాధలు చూస్తే నాకే ఏడుపొస్తుంది అంటూ నాయకులు ఏడుపుగొట్టు రాజకీయాలు మొదలు పెట్టారు.
 నిజానికి వీరి ఏడుపులో ఎదుటివారి ఏడుపును పోగొట్టాలనే కోరిక కన్నా ఏడవడం ద్వారా వారి జీవితం పట్ల వారు ఏడ్చేట్టు చేసి అధికారం సాధించాలని ఉంటుంది. జలుబు,కండ్ల కలక లానే ఏడుపు సైతం అంటు వ్యాధి. ఇది ఒకరి నుండి ఒకరికి చాలా వేగంగా విస్తరిస్తుంది.
మొదట్లో ఏడుపును ఆధారం చేసుకున్న సినిమాలు నిర్మాతలకు కనకవర్షం కురిపించేవి. టీవిలు వచ్చిన కొత్తలో సీరియళ్లు కూడా ఏడుపునే నమ్ముకున్నాయి. ఏడుపు వల్ల మనసు తేలికపడుతుందని, గుండె జబ్బులు రావని అంటారు. మనసులోనే ఏడవడం కన్నా బిగ్గరగా బయటకు ఏడవడం మనిషి ఆరోగ్యానికి మంచిది, నాయకుల రాజకీయ జీవితానికి అంతకన్నా మంచిది.

కొందరు జీవితమంతా ఏడుస్తూ జీవించడానికి ఇష్టపడతారు. మనుషులే కాదు వ్యవస్థలు, నాయకులు, పార్టీలు సైతం ఈ ఏడుపుకు అతీతులు కారు. అసలు రాజకీయ సిద్ధాంతాలే ఏడుపులు. ఒక రాజకీయ సిద్ధాంతంపై ఏడ్చి ఇంకో సిద్ధాంతాన్ని నమ్మమని ఏడవడమే కదా? ఇజాలన్నింటికి కాలం చెల్లిందని అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన నేత   అధికారం పోయాక ఏడుపిజాన్ని నమ్ముకున్నారు. ఆయనే కాదు ఇప్పుడు రాష్ట్రంలో నాయకులంతా ఏడుపిజానే్న నమ్ముకుని ఏడ్చేస్తున్నారు. ఒకప్పుడు ఈ తెలుగునేలను కమ్యూనిజం కమ్మేస్తుందేమోననుకున్నారు.

 కమ్యూనిజం కనిపించకుండా పోవడమే కాదు చివరకు కమ్యూనిస్టులు సైతం తమ పార్టీ సిద్ధాంతం కన్నా ఏడుపిజానే్న ఎక్కువగా నమ్ముకున్నారు. మీరు మాకు ఎన్ని సీట్లు విదుల్చుతారనేది కాదు ముఖ్యం మా పక్క పార్టీ సిపిఐ కన్నా ఒక్కసీటు ఎక్కువ ఇస్తేనే పొత్తు అని సిపిఐ-ఎమ్- అంటుంది. మాకే ఒకసీటు ఎక్కువ కావాలని సిపిఐ అంటుంది. గత తార్కిక భౌతిక వాదం, మావోయిజం వీటన్నింటి కన్నా పక్కవాడిపై ఏడుపులోనే ఈ రెండు పార్టీలు సంతోషాన్ని పొందుతున్నారు. కాంగ్రెస్‌తో జత కడుతున్నారా? టిడిపితోనా? పిఆర్‌పితో జతకడతారా? అనే తేడా లేదు సిపిఐ కన్నా ఒక్కసీటు మాకెక్కువ కావాలనేది సిపిఎమ్ ఏడుపు.
 రష్యాలో కమ్యూనిజం విఫలమయ్యాక సిద్ధాంతాలను పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉందనే చర్చ పార్టీలో సాగింది కానీ పక్కవాడికన్నా ఒక్క సీటు ఎక్కువ పొందాలనే సిద్ధాంతంలో మాత్రం ఎలాంటి మార్పుకు అంగీకరించలేదు. ఒక్కసీటుపై వీరి ప్రేమను చూసి ప్రజలు సైతం ఈసారి ఎన్నికల్లో సిపిఎమ్‌ను ఒక్కసీటుకే పరిమితం చేశారు.
 ఎన్నికల్లో తాము ఓడిపోయినందు కన్నా బాబు అధికారంలోకి రానందుకు ఎక్కువ ఏడ్చిన రాఘవులు పార్టీకి తమ కన్నా సిపిఐకి మూడు సీట్లు ఎక్కువ వచ్చినందుకు మరింత ఎక్కువ దుఃఖం !ఇక  వీరి అభిమాన నాయకుడు అధికారంలోకి రాలేకపోయాననే ఏడుపు కన్నా అందరూ అధికారం అనుభవించేస్తున్నారు, మేం అధికారంలో ఉండగా, ఇంతేసి ఆదాయం వస్తుందని ఊహించలేదు అని ఏడ్చేస్తున్నారు. కుంభకోణాలు అంటూ ఇప్పుడాయన చెబుతున్న వన్నీ ఆయన హయాంలో ఆయన ప్రారంభించినవే. అనుమతులిచ్చింది నేను కాబట్టి ఇప్పటి ఆదాయంలో నాకూ రాయల్టీ చెల్లిస్తామని ఒక్క మాటైనా చెప్పవచ్చు కదా? అనే ఆవేదన కూడా ఆయన మాటల్లో కనిపిస్తుంది.
 హీరోగారికి కష్టం వస్తే సినిమాల్లో ప్రకృతి స్థంబించినట్టుగా, తాను అధికారంలో లేనందున మొత్తం రాష్ట్రం స్థంబించి పోవాలనేది ఆయన కోరిక. ఆయన హయాంలో కరవుతో పొలాలు బీడుబారాయి ఇప్పుడు వర్షాలు బాగుండడం వల్ల పచ్చగ కలకలలాడుతున్నాయి. పొలాలను దోచేసుకుంటున్నారంటే ఎలా? అనేది కొందరి వాదన. అధికారం అంటేనే దోచుకోవడం కదా? మేం ఉన్నప్పుడు 20 ఏళ్ల వరకు ఉంటాం అని కొద్దికొద్దిగా తిన్నాం, ఇప్పుడు మీరు స్పీడ్‌గా తినేస్తున్నారని ఏడిస్తే ఏం లాభం.
పిల్లవాడికి అవకాశం కల్పించకుండా ఈ పెద్దాయన  రోశయ్య కు అవకాశం ఇచ్చరేమిటని పిల్లగాడి గ్రూపు ఏడుస్తున్నారు. ఏడాది నుండి మంత్రి పదవుల కోసం ఏడుస్తున్నాం మా గురించి పట్టించుకునేవారేరి అంటూ ఆశావాహులు లోలోన కుమిలిపోతున్నారు. ఇంట్లో గుక్కపట్టి ఏడుస్తున్నారు.  రాకరాక వచ్చిన అధికారాన్ని అనుభవించనీయకుండా అందరూ నన్ను చూసి ఏడుస్తున్నారేంటి అని రోశయ్య ఏడ్చి ఇంటికెళ్ళి పోయారు .
. కెసిఆర్ అంటే గిట్టని వాళ్లు ఫ్రంట్ పెట్టుకుని ఆయనపై ఏడుస్తున్నారు. అందరి మీద ఏడిస్తేనే కదా నేను ఏదో ఒకటి రాయగలిగేది  

విగ్రహాల వెనుక నక్కిన వికృత రాజకీయాలు: విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శకాలు


రాష్ట్రం లో విగ్రహ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి . ఏ అంశం పై నైన ఆరోగ్య కరమైన చర్చ జరగాలి . ట్యాంక్ బండ్ పై విగ్రహాల కుల్చివేతకన్న ముందుగా టిడిపి జగన్ ల మద్య విగ్రహలపై సాగిన రాజకీయం పై గత యాడాది  అక్టోబర్ లో ఒక వ్యాసం ఆంద్రభూమిలో రాసాను . ఇప్పుడు విగ్రహలపై ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటి వేసినందున ఆసక్తిగా ఉంటుందని అప్పటి వ్యాసం జత చేస్తున్న . విమర్శలు మర్యాదకరమైన భాషలోనే ఉంటె బాగుంటుంది


 విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శకాలు


 రాష్ట్రంలో సామాజిక, రాజకీయ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శక సూత్రాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విధి విధానాల రూపకల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం చైర్మన్‌గా పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం జీవో ఆర్‌టి నెంబర్ 1607ను జారీ చేసింది. ఈ సంఘంలో మున్సిపల్ శాఖ మంత్రి మహీధర రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. మంత్రివర్గ ఉపసంఘం మార్గదర్శక సూత్రాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది.



విగ్రహాల వెనుక నక్కిన వికృత రాజకీయాలు

- బుద్దా మురళి

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య అధికారం కోసం సాగుతున్న పోరులో భాగంగా విగ్రహాల ఏర్పాటు పోటీ సాగుతోంది. వర్షాకాలంలో పొలాల్లో విత్తనాలు నాటినంత ఉధృతంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ విగ్రహాలను ఏర్పాటు సాగుతోంది. ముఖ్య నాయకులు ఒకవైపు తమ నాయకుల విగ్రహాలను ఆవిష్కరిస్తూ పనిలో పనిగా తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుని విగ్రహాలను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితం (సెప్టెంబర్ 26) రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ముగ్గురు మహనీయుల విగ్రహాలను ఒకే రోజు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా హిందుపూర్‌లో చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాన్ని, ప్రకాశం జిల్లాలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని జగన్మోహన్‌రెడ్డి, గుంటూరులో మహానటుడు ఎస్‌వి రంగారావు విగ్రహాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబు ఆవిష్కరించారు. ఎస్వీఆర్, ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ వారి వారి రంగాల్లో నిస్సందేహంగా గొప్పవారు. జనంలో పూజలందుకున్న మహానటులు ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లు, ఈ తరంలో కూడా రాజకీయ నాయకులకు జనంలో గ్లామర్ ఉంటుందని నిరూపించిన గొప్ప నాయకుడు వైఎస్‌ఆర్. ఈ ముగ్గురి గొప్పతనాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ ఆ ముగ్గురి విగ్రహాలను ఒకే రోజు ఆవిష్కరించింది వారి వారి సామాజిక వర్గాలకు చెందిన వారే. ఇది యాదృచ్చికంగా జరిగిందా? అదే నిజమైతే సంతోషమే. కానీ మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో మూడు కులాల మధ్య అధికారం కోసం రాజకీయాల్లో సాగిన పోరుకు కొనసాగింపుగా ఇప్పుడు విగ్రహాల ఏర్పాటులో సాగుతోంది. కులాలకు, మతాలకు అతీతంగా గొప్పవారిగా గుర్తింపు పొందిన ఈ ముగ్గురు మహనీయులను నాయకులు సామాజిక వర్గం పరిధిలోకి లాగడం ద్వారా వారిని కీర్తిస్తున్నారో, వారి కీర్తిని తక్కువ చేస్తున్నారో వారికి వారే ఆలోచించుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ ఎస్వీ రంగారావును ఆశ్రయించింది. దురదృష్టవశాత్తు ఎస్వీరంగారావు మన దేశంలో పుట్టారు, అదే పాశ్చాత్య దేశంలో పుట్టి ఉంటే ప్రపంచంలోని ఐదుగురు గొప్పనటుల్లో ఆయన ఒకరుగా ఉండేవారని ఆయన సమకాలీనడు గుమ్మడి ఒకసారి చెప్పారు. ఎస్వీఆర్ విగ్రహాన్ని ఎప్పుడో ఏర్పాటు చేయకపోవడం పెద్దతప్పు. తెలుగువారు గర్వించదగ ఆ మహానటుని విగ్రహాలను కళాకారులకు ప్రేరణ కలిగించేందుకు ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది. ఎస్వీ రంగారావు 1919లో జన్మించి 1974లో మరణించారు. 36 ఏళ్ల క్రితం మరణించిన ఎస్వీఆర్ విగ్రహాన్ని హఠాత్తుగా ఇప్పుడు ఏర్పాటు చేయడం అంటే రెండు పార్టీలకు మూడో పార్టీ పోటీ కాదంటామా? వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టి గ్రామ గ్రామాన వైఎస్‌ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం టిడిపి నాయకులకు కంటగింపుగా మారింది. విగ్రహం ఏర్పాటు చేయడానికి ఒక నాయకుడికి ఉండాల్సిన అర్హతలపై వారు చర్చను లేవదీశారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన ప్రకాశం పంతులు విగ్రహం ప్రకాశం జిల్లాలో ఒక్కటి మాత్రమే ఉంది, వైఎస్‌ఆర్ విగ్రహాలు జిల్లాలో లెక్కలేనన్ని ఏర్పాటు చేస్తున్నారు, ప్రకాశం కన్నా వైఎస్ గొప్పవాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సరే బాబు వాదన బాగానే ఉంది మరి ఎన్టీఆర్ విగ్రహాలు ఇప్పటికే రాష్ట్రంలో లెక్కలేనన్ని ఉన్నాయి, ఇప్పుడు బాబు మళ్లీ ఆవిష్కరణలు మొదలు పెట్టారు. బాబే ప్రశ్నించినట్టు ప్రకాశం పంతులుకు ఒక్క విగ్రహం ఉంటే ఎన్టీఆర్‌కు ఇనె్నందుకు? నిజానికి బాబుకు ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలనే పెద్ద కోరికేమీ లేదు. తప్పని పరిస్థితుల్లో పోటీ కోసం ఆయనా పని చేయక తప్పడం లేదు. 96లో ఎన్టీఆర్ మరణిస్తే , పార్టీ నాయకుల సూచన మేరకు ఎన్టీఆర్ భవన్‌లో 2008లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మరణించిన పనె్నండేళ్లకు కానీ పార్టీ కార్యాలయంలోనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఎన్టీఆర్ మరణం తరువాత ఆయన పేరు పూర్తిగా మరిచిపోయి పార్టీ మొత్తం తన ముద్ర కొనసాగాలని బాబు కోరుకున్నారు. చివరకు పార్టీ సభ్యత్వ రసీదుల పై నుండి ఎన్టీఆర్ ఫోటో తొలిగించారు. బాబు ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తుంటే మరోవైపు హరికృష్ణ ఒకేసారి ఎన్టీఆర్, పరిటాల రవిల విగ్రహాలను ఆవిష్కరించారు.
వైఎస్‌ఆర్ నుండి ప్రజలు ఏం నేర్చుకోవాలని విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారనేది చంద్రబాబు ప్రశ్న. 74 ఏళ్ల వయసులో సన్యాసాన్ని వదిలిపెట్టి పెళ్లయిన దంపతులను విడదీసి రెండో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ రాష్ట్రాన్ని బ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి నుండి తొలిగించారు. మరి అలాంటి వారి నుండి ప్రజలు ఏం నేర్చుకోవాలని విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారనే ప్రశ్న బాబుకు ఎదురు కాదా?
ఆ మధ్య తెలంగాణ ఉద్యమం సాగేప్పుడు అసెంబ్లీ ముట్టడికి ఆందోళన కారులు పిలుపును ఇచ్చారు. విలేఖరుల మాట అటుంచి ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి వెళ్లడం కష్టంగా మారింది. పోలీసులు మొత్తం నగరాన్ని దిగ్బంధించారు. ఇలాంటి పరిస్థితుల్లో పది మంది బృందం అసెంబ్లీ ఆవరణలో లోనికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వీరు లోనికి ఎలా వచ్చారా?అని విలేఖరులు ఆలోచిస్తుంటే వారు వచ్చిన పని మరింత ఆశ్చర్యం కలిగించింది. మాజీ ఎంపి ఉపేంద్ర విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని చిరంజీవి ద్వారా ముఖ్యమంత్రిని కోరేందుకు వారు వచ్చారని తెలిసి అంతా విస్తుపోయారు. తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు తెలంగాణలో కొందరు నాయకుల విగ్రహాలను కూల్చారు. అదే విధంగా సీమాంధ్రలో తెలంగాణ నాయకుల విగ్రహాలు కూల్చాలని కొందరు ఆందోళన కారులు ప్రయత్నిస్తే, ఒక్క విగ్రహం కూడా కనిపించలేదని పిచ్చాపాటిగా మాట్లాడుతూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రకు చెందిన ఒక పోలీసు అధికారి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుల విగ్రహాలు మాత్రం మనకు కనిపించవు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల్లో నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిన రావి నారాయణరెడ్డి విగ్రహం కనిపించదు. రావినారాయణరెడ్డి సంస్మరణ సభలో నగరంలో ఆయన విగ్రహం లేదనే విషయం తెలిసి వైఎస్‌ఆర్ విస్తుపోయారు. అంతటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయకపోవడం మనం సిగ్గుతో తలదించుకోవలసిన విషయం అని, విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని 2006లో ప్రకటించారు. ఇప్పటికీ అలాంటి త్యాగజీవి విగ్రహం లేదు. నిజాం కొలువులో ఉద్యోగం చేసిన శ్రీశ్రీ విగ్రహం నగరంలో ఏర్పాటు చేశారు. మంచిదే మహాకవిని మనం స్మరించుకోవలసిందే. కానీ నిజాంను ఎదిరించి పోరాడిన దాశరథి విగ్రహం మాత్రం ఏర్పాటు చేయలేదు. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ఇప్పుడు వైఎస్‌ఆర్ విగ్రహమో, ఎన్టీఆర్ విగ్రహమో కనిపిస్తుంది.
ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చిన నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారిని స్మరించుకోవలసిందే. అదే సమయంలో సామాజిక వర్గం ఆధిపత్యాన్ని చాటి చెప్పే విధంగా విగ్రహాల ఏర్పాటు ఎంత మాత్రం తగదు. పూజలందుకున్న వారి విగ్రహాలను రష్యాలో కూల్చివేయడం మనం చూడలేదా?(October 3rd, 2010) http://www.andhrabhoomi.net/sub-feature/3sf1-090

18, ఏప్రిల్ 2011, సోమవారం

అంబానీ సోదరులు హీరోలుగా మల్టీస్టార్ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది?

అనిల్ అంబానీ పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దడంతో పాతిక మంది గాలిలో ఎగిరిపోయారు. కాలిని నేలపై బలంగా కొట్టగానే ఐదారు సుమోలు గాలిలో లేచాయి. అనీల్ అంబానీ వీరవిహారానికి అక్కడున్న గాలి ఒక్కసారిగా కమ్ముకుంది. విలన్ విస్తుపోయాడు.
 హీరోయిన్ మురిసిపోయి అనిల్ చేయి పట్టుకుని తన్మయంగా చూసింది. ఒక చేతితో హీరోయిన్ చేయి పట్టుకున్న అనిల్ మరో చేతితో విలన్ మెడ పట్టుకున్నాడు. వెనక నుండి పొడిచేందుకు కత్తిపైకెత్తిన విలన్ ముఖ్య అనుచరుడిని చేతిలోని కత్తిని కంటి చూపుతో ముక్కలు చేశాడు.
అమితాబ్ గోవిందలు బడేమియా చోటే మియాలో కలిసి నటించినట్టు అంబానీ సోదరులు హీరోలుగా మల్టీస్టార్ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? బహుశా వాళ్లింట్లో వాళ్లు కూడా ఆ సినిమా చూసేందుకు ఇష్టపడరేమో కదూ! ఇప్పుడు దేశంలోకెల్లా సంపన్నులుగా నిలిచి మరో రెండు మూడేళ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ సంపన్న కుటుంబంగా ఎదగనున్న అంబానీలు ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా ఎదురు లేకపోవచ్చు.



 అంత మాత్రాన హీరోలుగా కూడా వారు రాణిస్తారనుకుంటే అమాయకత్వమే అవుతుంది. ఒక రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్లిన వారు ఏ రంగంలో అడుగుపెట్టినా నెట్టుకొస్తారని కొందరు గట్టిగా నమ్ముతారు. అమితాబ్ సినిమాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడు తన పేరుమీదనే ఒక భారీ కంపెనీ ఏర్పాటు చేసి దివాళా తీసేశారు. చివరకు మళ్లీ నటననే నమ్ముకుని అప్పులు తీర్చి బోలెడు సంపాదించారు. 67 ఏళ్ల వయసులో కూడా ఇప్పుడాయన ప్రకటనల్లో, నటనలో, టీవి కార్యక్రమాల్లో అత్యధిక పారితోషకం తీసుకునే నటునిగా నిలిచారు.
అంబానీలు నటించలేరు, నేను వ్యాపారం చేయలేను అనే జీవన సత్యం బోధపడిన తరువాత అమితాబ్ బుద్ధిగా నటనకే పరిమితం అయ్యారు. పోయిన చోటే వెతుక్కోవాలని మన వాళ్లు ఊరికే అనలేదు. అలానే టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ పాట పాడితే ఎలా ఉంటుంది?

 ఇప్పుడున్న నాయకుల్లో అద్భుతమైన వాగ్దాటి గల నాయకుడు ఆయనే. సూటిగా ఏం చెప్పాలో? ఎంత వరకు చెప్పాలో? ఆయనకు తెలిసినంతగా ఇప్పటి నాయకులెవరికీ తెలియదు. కొందరు నాయకులు మాట్లాడుతుంటే అబ్బా ఇంకెంత సేపు మాట్లాడతారు అని వాచీవంక చూసుకోవలసి ఉంటుంది. మీరు వాచి వంక చూసినా క్యాలండర్ వైపు చూసినా మేం మాట్లాడాలనుకున్నంత సేపు మాట్లాడేస్తాం అన్నట్టుగా ఉంటుంది వారి దోరణి. కానీ కెసిఆర్ ఉపన్యాసం ఐపోతే ఏంటి అప్పుడే ఐపోయిందా? అనుకునేట్టుగా ఉంటుంది. తెలుగులోనే కాదు ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో సైతం ఆయన అలానే మాట్లాడతారు. 


తెలుగులో ఐతే తెలంగాణ మాండలికలు, సామెతలు గుప్పిస్తారు. ఉర్దూ షాహెరీలతో మైనారిటీలను ఆనందంలో ముంచెత్తుతారు. అలా అని ఆయన పాట పాడారనుకోండి ఎలా ఉంటుంది? ఆ సాహసం ఆయన చేయలేదు, ప్రేక్షకులు అసలే చేయలేరు. ఆ సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఆ ప్రయత్నం ఆయన చేయడం లేదు. 


అలానే గద్దర్ పాడితే ఎవరికైనా చిందేయాలనిపిస్తుంది. అద్భుతమైన గాయకుడు రాజకీయాల్లో రాణిస్తాడా? ఏమో ఆయన మాత్రం పాటల్లో రాణించినప్పుడు రాజకీయాల్లో ఎందుకు రాణించలేనని అంటున్నారు. ఆయన రాజకీయ ఆరంగ్రేటమే వివాదాస్పదంగా మారింది. రాజకీయ అవతారం ఎత్తాలనుకున్న ఆయన ఫ్రంట్ పెడితే పోటీ చేయాలని కొందరు, వద్దే వద్దని కొందరు రెండు వర్గాలుగా చీలిపోయారు. 
పార్టీనో ఫ్రంటో తేల్చి చెప్పండని కొందరడుగుతున్నారు. రాజకీయ అవతారం దాల్చాలని ఆయనకు బలంగా ఉన్నా మెజారిటీ అభిమానులు పోటీ వద్దనడంతో ఆయన ఎటూ తేల్చడం లేదు. అక్షరాలతో రక్తాన్ని ఎలా ఉడికెత్తించాలో ప్రజలకు చాటి చెప్పిన శ్రీశ్రీ సైతం రాజకీయ అవతారం ఎత్తాలనుకున్నారు. భూ మార్గం పట్టిస్తా, భూ కంపం సృష్టిస్తానని కవిత్వం రాసిన ఆయన రాజకీయాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తెలుగుభాష ఉన్నంత వరకు ఆయన కవిత్వం ఉంటుంది.
 కానీ ఎన్నికల్లో మాత్రం ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు. ఆయన మీద గెలిచిన వారెవరూ జనానికి గుర్తు లేదు కానీ శ్రీశ్రీ మాత్రం రాజకీయాల్లో ఓడిపోయారు. కవిత్వంలో శ్రీశ్రీకి ఎదురు లేకపోవచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం స్థానమే లేదు కదా! తెలుగువారింట్లో ఘంటసాల పాట ఉండి తీరుతుంది. అలానే అస్సాంలో బుపెన్ హజారికా పాటల క్యాసెట్ లేని ఇళ్లు లేదు. గౌహతిలో ఆయన్ని దైవంగా ఆరాధిస్తారు. అలాంటి బుపెన్ హజారికా బిజెపి తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తే పనె్నండు వందల ఓట్లు వచ్చాయి.
మన దేశంలో, రాష్ట్రంలో వాణిజ్య దిగ్గజాలెవరూ ఎంబిఏ చేసిన వారు కాదు. ధీరూబాయి అంబానీ ఆర్థిక శాస్తవ్రేత్త కాదు, ఆర్థిక శాస్త్రంలో పరిజ్ఞానం లేదు. ఆయన కొడుకులిద్దరు ఆర్థిక శాస్త్రం పాఠాలు ఆరగంట పాటు కూడా బోధించలేరు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆ కుటుంబం చేతిలో ఉంది. చాలా మంది ఆర్థిక శాస్తవ్రేత్తల ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

 డబ్బు సంపాదించడం వేరు ఆర్థిక శాస్త్రం పాఠాలు చెప్పడం వేరు. ఎంఎ పొలిటికల్ సైన్స్ చేస్తే ఏ కాలేజీలోనూ పార్ట్‌టైం లెక్చరర్‌గా ఉద్యోగం దొరకవచ్చు అంతే కానీ రాజకీయాల్లో రాణించాలంటే ఎంఎ చదవాలనుకోవడం అమాయకత్వం. ప్రధానమంత్రి మన్ మోహన్‌సింగ్ ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులు. రాజకీయాల కన్నా ఆయనకు ఆర్థిక శాస్త్రం పాఠాలు చెప్పడమే ఎక్కువ ఆసక్తి. కానీ ఆయన సొంత ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. అంతెందుకు ? నటనలో అవకాశాలు రాని వారు తమ వైఫల్యాలను పాఠాలుగా మార్చుకుని ఎలా నటించాలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటు చేసి నేర్పిస్తుంటారు.
ఎవరు ఏ రంగంలో రాణించగలరో ఎవరికి వారే సరైన అంచనా వేసుకోవడమే అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోవడమే జీవితంలో పెద్ద లోపం. *

కడప ఉపస్వరం మారుతోంది: మంత్రులంటే మనుషులోయ్!




కడప,పులివెందుల ఉప ఎన్నికలపై హడావుడి చేసిన అధికార పక్షంలోను, ప్రతిపక్షంలోను రోజులు గడుస్తున్న కొద్దీ స్వరం మారుతోంది. గెలిచి తీరుతామని ప్రకటించిన వారు ఇప్పుడు మాట మార్చి , ‘‘ ఈ ఎన్నికలను మేమంత ముఖ్యమైనవని భావించడం లేదు’’ అని అంటున్నారు.... ఉత్తర కుమారుడు మాత్రమే మిగలడంతో యుద్ధానికి అతన్ని పంపక తప్పనట్టుగా వెతికి వెతికి చివరకు కడప బరిలో మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని ఎంపిక చేశారు.

 అప్పటి వరకు ఆయన వైఎస్‌ఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. నేను మాత్రం పోటీ చేయను అని ఆయన మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. జిల్లాలో పార్టీలో పోటీకి ఎవరూ దొరకక పోవడంతో చివరకు చుట్టుపక్కల పార్టీల వైపు చూశారు. ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందంటే పక్కింటి నుంచి చేబదులు తీసుకోనైనా కాఫీ తాగుతాం కానీ తాగడం మానేయం కదా!
 టీ పొడి అడుక్కున్నట్టుగానే చివరకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరక్క టిడిపిని బదులడుక్కున్నారు. కందుల బ్రదర్స్‌కు రాత్రికి రాత్రి కాంగ్రెస్ తీర్థం ఇచ్చారు. గుర్రం నాడ దొరికింది ఇక గుర్రం దొరికితే చాలు అని సంబర పడ్డట్టు అభ్యర్థి దొరక గానే ఎన్నికల్లో విజయం సాధించినంత సంతోషంగా కేంద్రానికి కందుల రాజ్‌మోహన్‌రెడ్డి పేరును పంపించారు.

 ఎంతో కష్టపడి ఒక అభ్యర్థిని సంపాదించాం మీరు ఓకే అనడమే తరువాయి అని చెప్పుకొచ్చారు. గెలిచేదెలాగూ లేదు అభ్యర్థి కూడా దిక్కులేక పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారనే విమర్శ ఎందుకనుకున్నారేమో చివరకు హై కమాండ్ కందులను కాదని డిఎల్‌నే రంగంలో దింపింది.
కాళ్లు కడిగిన నాడే కాపురం ఎలా చేస్తుందో తెలిసిపోయిందన్నట్టు అభ్యర్థిని ఎంపిక చేసినప్పుడే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తేలిపోయింది.
 కడప ఎన్నికల గురించి హై కమాండ్‌తో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో మకాం వేస్తే స్వయంగా పోటీ చేస్తున్న సాటి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని గెలిపించేందుకు మొత్తం క్యాబినెట్ కడపకు పయనమైంది. ఉప ఎన్నికలకు ఇంత మంది మంత్రులెందుకండి అని పిసిసి అధ్యక్షున్ని ప్రశ్నిస్తే ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయం మీడియాకు చెప్పారు.
 ‘‘మంత్రులంటే మనుషులే నండి ఉప ఎన్నికల్లో మనుషులు ప్రచారం చేస్తారు.... చేయెద్దా?’’ , అని ఎదురు ప్రశ్నించారు. మంత్రులంటే మనుషులే అనే దేవరహస్యాన్ని డిఎస్ విప్పి చెప్పారు. మొత్తం క్యాబినెట్‌ను ఇలా ఉప ఎన్నికలకు తరలించడం కాంగ్రెస్‌కు వచ్చిన సొంత ఆలోచన ఏమీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనుసరించిన చిట్కానే ఇది. కులానికో మంత్రిని, గ్రామానికో నేతను పంపి హడావుడి చేసేవారు. కొన్ని సార్లు ఇది బాగానే ఫలిచించింది.
 కానీ కొన్ని సార్లు ఈ ఓవర్ యాక్షనే దెబ్బతీస్తుంది. పాతపట్నం ఉప ఎన్నికల్లో లక్ష్మీపార్వతి పోటీ చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మొత్తం క్యాబినెట్‌ను, ఎమ్మెల్యేలను పాతపట్నం తరలించారు. ఒక మహిళ పోటీ చేస్తుంటే ఇంత మంది ముట్టడి చేస్తారా? అని జనం మంత్రులను తరిమి కొట్టారు. అనేక చోట్ల మంత్రులతో ప్రజలు ఘర్షణ పడ్డారు. ఇంతా చేస్తే చివరకు మొత్తం క్యాబినెట్ రంగంలో దిగినా లక్ష్మీపార్వతే గెలిచారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలు నిజానికి జగన్‌కే చావుబతుకుల సమస్య లాంటివి. మూడేళ్లు అధికారంలో నిలబెట్టుకుంటే చాలు అనేదే కాంగ్రెస్ లక్ష్యం. దారితెన్ను లేని కాంగ్రెస్‌కు తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం ఏ మాత్రం లేదు. కాబట్టి ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనేమి లేదు. 

ఇక టిడిపికి కొత్తగా వచ్చేదేమీ లేదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే కొత్తగా పోయేదేమీ లేదు. జగన్‌కు అలా కాదు గెలిచి తీరాలి సొంత నియోజక వర్గంలోనే గెలవలేనప్పుడు ఆయన పార్టీ బతికి బట్టకట్టే ప్రసక్తే ఉండదు. మొత్తం మీద కడప ఎన్నికలు జగన్ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేట్టుగా, కాంగ్రెస్ పునాదులు కదిలించేట్టుగా ఉన్నాయి.ఇక తెలుగుదేశం మాత్రం ముందునుంచే చేతులు ఎత్తేసింది .
 ఎన్నికల్లో పోటి కన్నా జగన్ పై పిర్యాదులకే ప్రాదాన్యత ఇస్తోంది  .దమ్ముంటే రెండులక్షల మెజారిటీ తెచ్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు జగన్ కు  సవాల్ చేయడం విశేషం . మేం గెలుస్తామని సవాల్ చేయలి కాని ఇలా సవాల్ చేయడం తోనే ఓటమి అన్గికరించినట్టు కావడం లేదా ? ఇక పలితాల తరువాత నైతిక విజయం మాదే గగన్ వందల కోట్లు కర్చు చేసి ఓట్లు కొన్నాడు అని ప్రకటించేందుకు టిడిపి సిద్దమవ్తోంది 

17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఒడార్పునకు వేళాయెరా

వావ్... నిజమా! ఏవండోయ్-అంటూ సుశీల గట్టిగా అరిచింది. పట్టలేని సంతోషం వస్తే తప్ప సుశీ అలా పిలవదు ఏంటో ఆ శుభవార్త అనుకుంటూ భర్త చలపతి చదువుతున్న పేపర్ పక్కన పడేసి వరండా లోంచి ఒక్క గెంతులో గదిలోకి వచ్చి పడి ‘‘ఏంటీ’’ అని అడిగాడు.


 ‘‘మీ పిన్ని వాళ్ల అమ్మాయి పెళ్లికి బంధువులంతా బస్సులో వెళుతుంటే ప్రమాదం జరిగిందట! ఎవరూ పోలేదు కానీ తీవ్రంగానే గాయాలయ్యాయట! అది చెప్పడానికి పిలిచాను’’ అంది. ‘‘ పాపం ఎలా జరిగిందో, లీవు దొరక్క కానీ లేకపోతే మనమూ బస్సులోనే ఉండేవాళ్లం. అయినా ఏదో శుభవార్త లా అలా పిలిచావేం’’ అని చలపతి అడిగాడు.‘‘ మీ సందేహాలు తరువాత కానీ ముందు పదండి మీ బంధువులందరి ఇళ్లకు వెళ్లి ఓదార్చి వద్దాం’’ అని సుశి చిన్నపిల్లలా గోముగా అడిగింది.
‘‘సర్లే నేను వెళ్లొస్తా కానీ నువ్వెందుకులే’’అని చలపతి వెళ్లడానికి సిద్ధపడితే, ‘‘మీతో పాటు నేను వచ్చి తీరుతాను అంతే’’ అని సుశీల మొండికేసింది. ‘‘దీని వాలకం ఈ రోజు అస్సలు అర్ధం కావడం లేదు. శుభవార్త చెప్పినట్టుగా ప్రేమగా అరిచింది. ఇప్పుడేమో నేను వచ్చి తీరుతానంటోంది ఏంటో అంతా గందర గోళంగా ఉంది’’ అనుకుంటూ చలపతి ప్రశ్నార్ధకంగా మొఖం పెట్టాడు.



 ‘‘మీ సందేహం నాకర్ధమైంది కానీ నా సంతోషాన్ని అడ్డుకోకండి. ఆ రోజు మనం ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడి మనం గాయపడితే మన బంధువులు, మీ ఆఫీసు వాళ్లు ఎంత మంది వచ్చి ఓదార్చారు. ఆ రోజు మీ పిన్ని ఓదార్పు మాటలు విన్నాక, ఈ రోజు కోసమే ఎదురు చూశాను. ప్రతీకారంతో రగిలిపోయాను. అన్ని రోజులు వాళ్లవే కాదు.. నాకూ మంచి రోజులు రాకుండా పోతాయా? అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఒకరి తరువాత ఒకరిని అందరినీ ఓదార్చే చాన్స్ నాకా భగవంతుడు ఇస్తాడండి.


 నేను నోచిన నోములు వృధా కావు ’’ అంటూ సుశీల ఏకధాటిగా చెప్పుకుపోతూనే ఉంది. మధ్యలో అడ్డుకుంటే ఏమవుతుందో చలపతికి బాగా తెలుసు కాబట్టి వౌనంగానే వింటూ ఉండిపోయాడు. ఎవరైనా బాధలో ఉంటే మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఓదార్చడానికి వస్తారు దానికి ప్రతీకారం ఏంటే? ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావో నాకంతా కంగారుగా ఉందే సుశీ’’ అని చలపతి దీనంగా పలికాడు.
ఎప్పుడైనా ఓదార్చే వాళ్ల ముఖం నువ్వు చూశావా? అని సుశీల అడిగింది. చూశాను అన్నట్టు కాకుండా చూడలేదు అన్నట్టు కాకుండా చలపతి తల అటూ ఇటూ తిప్పాడు. ఓదార్చడానికి వచ్చిన వాళ్ల మాటలు మాత్రమే మీరు విన్నారేమో కానీ నేను మాత్రం వాళ్ల ముఖాలను చూసి వాళ్ల భావాలను చదివేశాను’’ అంది సుశీల. గాయపడిన వారింటికి వచ్చి ఓదార్చే వారి కళ్లల్లో చూడండి



. ఏ పాపం చేశాడో వీడికి దెబ్బలు తగిలాయి అనుకునే వారు కొందరు, అమ్మయ్య దెబ్బలు తగిలితే ఇంత బాధపడతారా? థ్యాంక్ గాడ్ దేవుడు నాకీ శిక్ష విధించలేదు అనుకునే వాళ్లు కొందరు అని సుశీల చెబుతుంటే చలపతి అడ్డు తగిలి నువ్వన్నట్టు అలాంటి వారు కూడా కొందరుంటే ఉండొచ్చే కానీ ఎక్కువ మంది మాత్రం మేమున్నామని మద్దతు ప్రకటించడానికే ఓదార్పు కోసం వస్తారు అయినా ఓదార్పులో ఇంత రాజకీయం ఉంటుందటావే సుశీ !’’ అని చలపతి మెల్లగా అడిగాడు.
‘‘ఎందుకుండదండి ఆ మధ్య పత్రికల్లో చదివాను సీతారామమ్మ అనే ఒక మహిళా నాయకురాలు తమ నియోజక వర్గంలో ఎవరు చచ్చినా ఎవరింట్లో బిడ్డ పుట్టినా, ఎక్కడ శుభకార్యం జరిగినా ఠంచనుగా హాజరయ్యేదట! ఈ దెబ్బతో ఎన్నికల్లో ఆమె గెలిచిపోయింది. చనిపోతే ఇంటికెళ్లి ఓదారిస్తే ఊరికే పోదని ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంది. నిజంగా చాలా మంది ఓదార్చే వారు వాస్తవానికి వారే ఓదార్పు పొందే స్థితిలో ఉంటారు.అప్పుడు జై తెలంగాణ , జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమీ మాట్లడలేని చంద్రబాబు చివరకు ఓదార్పునే ఆశ్రయించాడు. 



ఆయన అదృష్టం కొద్ది రోజూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మరణించే వారు, ప్రమాదాలు జరిగేవి. ఆ సమయంలో దాదాపు నెల పాటు బాబు ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన పరిస్థితి చూసి పార్టీలోనే చాలా మందికి జాలేసి రోజూ వెళ్లి ఆయన్ని ఓదార్చేవారు. ఆ ఓదార్పు నుంచే ఆయనకో ఐడియా వచ్చింది. దాంతో ఆయన ఓదార్పు యాత్ర చేపట్టి వరుసగా నాలుగు రోజుల పాటు జిల్లాలు వెళ్లి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వచ్చారు. పెద్దగా ఆత్మవిశ్వాసం లేని వాళ్లు ఆత్మవిశ్వాసంపై చక్కని ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటారు.


 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా జగన్‌కు సోనియా అనుగ్రహం దక్కనందుకు పాపం పిల్లాడికి అన్యాయం జరిగింది అని అంతా అనుకున్నారు. రోజూ ఆయన్ని ఎమ్మెల్యేలు వాళ్లింటికి వెళ్లి ఓదార్చేవారు. అందరి ఓదార్పుల తరువాత స్వయంగా ఆయనే ప్రజలందరినీనెలల తరబడి వోదర్చారు .  వోదార్పు లో జనం స్పందన చూసాకే కదా ఇప్పుడు ఆయన ఏకంగా ఒక పార్టీనే స్తాపించారు 
. ఇక చాలా ఇంకా చెప్పమంటావా? ’’అంటూ సుశీల గుక్క తిప్పుకోకుండా గడ గడా చెప్పడంతో చలపతికి కళ్లు తిరిగి పోయాయి. ఆయోమయంగా చూస్తూ కుర్చీలో కూలబడ్డాడు.‘‘మీకేమీ కాదండి నేనున్నాను అంటూ చలపతి గదవ పట్టుకుని సుశీల ఓదార్చింది .ఆల్ దీ  బెస్ట్ ఓడర్పుకు వెళ్ళు ని సంతోషాని నేనెందుకు అడ్డుకోవాలి అని సీతయ  పలికాడు .