18, ఏప్రిల్ 2011, సోమవారం

కడప ఉపస్వరం మారుతోంది: మంత్రులంటే మనుషులోయ్!




కడప,పులివెందుల ఉప ఎన్నికలపై హడావుడి చేసిన అధికార పక్షంలోను, ప్రతిపక్షంలోను రోజులు గడుస్తున్న కొద్దీ స్వరం మారుతోంది. గెలిచి తీరుతామని ప్రకటించిన వారు ఇప్పుడు మాట మార్చి , ‘‘ ఈ ఎన్నికలను మేమంత ముఖ్యమైనవని భావించడం లేదు’’ అని అంటున్నారు.... ఉత్తర కుమారుడు మాత్రమే మిగలడంతో యుద్ధానికి అతన్ని పంపక తప్పనట్టుగా వెతికి వెతికి చివరకు కడప బరిలో మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని ఎంపిక చేశారు.

 అప్పటి వరకు ఆయన వైఎస్‌ఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. నేను మాత్రం పోటీ చేయను అని ఆయన మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. జిల్లాలో పార్టీలో పోటీకి ఎవరూ దొరకక పోవడంతో చివరకు చుట్టుపక్కల పార్టీల వైపు చూశారు. ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందంటే పక్కింటి నుంచి చేబదులు తీసుకోనైనా కాఫీ తాగుతాం కానీ తాగడం మానేయం కదా!
 టీ పొడి అడుక్కున్నట్టుగానే చివరకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరక్క టిడిపిని బదులడుక్కున్నారు. కందుల బ్రదర్స్‌కు రాత్రికి రాత్రి కాంగ్రెస్ తీర్థం ఇచ్చారు. గుర్రం నాడ దొరికింది ఇక గుర్రం దొరికితే చాలు అని సంబర పడ్డట్టు అభ్యర్థి దొరక గానే ఎన్నికల్లో విజయం సాధించినంత సంతోషంగా కేంద్రానికి కందుల రాజ్‌మోహన్‌రెడ్డి పేరును పంపించారు.

 ఎంతో కష్టపడి ఒక అభ్యర్థిని సంపాదించాం మీరు ఓకే అనడమే తరువాయి అని చెప్పుకొచ్చారు. గెలిచేదెలాగూ లేదు అభ్యర్థి కూడా దిక్కులేక పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారనే విమర్శ ఎందుకనుకున్నారేమో చివరకు హై కమాండ్ కందులను కాదని డిఎల్‌నే రంగంలో దింపింది.
కాళ్లు కడిగిన నాడే కాపురం ఎలా చేస్తుందో తెలిసిపోయిందన్నట్టు అభ్యర్థిని ఎంపిక చేసినప్పుడే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తేలిపోయింది.
 కడప ఎన్నికల గురించి హై కమాండ్‌తో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో మకాం వేస్తే స్వయంగా పోటీ చేస్తున్న సాటి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని గెలిపించేందుకు మొత్తం క్యాబినెట్ కడపకు పయనమైంది. ఉప ఎన్నికలకు ఇంత మంది మంత్రులెందుకండి అని పిసిసి అధ్యక్షున్ని ప్రశ్నిస్తే ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయం మీడియాకు చెప్పారు.
 ‘‘మంత్రులంటే మనుషులే నండి ఉప ఎన్నికల్లో మనుషులు ప్రచారం చేస్తారు.... చేయెద్దా?’’ , అని ఎదురు ప్రశ్నించారు. మంత్రులంటే మనుషులే అనే దేవరహస్యాన్ని డిఎస్ విప్పి చెప్పారు. మొత్తం క్యాబినెట్‌ను ఇలా ఉప ఎన్నికలకు తరలించడం కాంగ్రెస్‌కు వచ్చిన సొంత ఆలోచన ఏమీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనుసరించిన చిట్కానే ఇది. కులానికో మంత్రిని, గ్రామానికో నేతను పంపి హడావుడి చేసేవారు. కొన్ని సార్లు ఇది బాగానే ఫలిచించింది.
 కానీ కొన్ని సార్లు ఈ ఓవర్ యాక్షనే దెబ్బతీస్తుంది. పాతపట్నం ఉప ఎన్నికల్లో లక్ష్మీపార్వతి పోటీ చేస్తే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మొత్తం క్యాబినెట్‌ను, ఎమ్మెల్యేలను పాతపట్నం తరలించారు. ఒక మహిళ పోటీ చేస్తుంటే ఇంత మంది ముట్టడి చేస్తారా? అని జనం మంత్రులను తరిమి కొట్టారు. అనేక చోట్ల మంత్రులతో ప్రజలు ఘర్షణ పడ్డారు. ఇంతా చేస్తే చివరకు మొత్తం క్యాబినెట్ రంగంలో దిగినా లక్ష్మీపార్వతే గెలిచారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలు నిజానికి జగన్‌కే చావుబతుకుల సమస్య లాంటివి. మూడేళ్లు అధికారంలో నిలబెట్టుకుంటే చాలు అనేదే కాంగ్రెస్ లక్ష్యం. దారితెన్ను లేని కాంగ్రెస్‌కు తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం ఏ మాత్రం లేదు. కాబట్టి ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనేమి లేదు. 

ఇక టిడిపికి కొత్తగా వచ్చేదేమీ లేదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే కొత్తగా పోయేదేమీ లేదు. జగన్‌కు అలా కాదు గెలిచి తీరాలి సొంత నియోజక వర్గంలోనే గెలవలేనప్పుడు ఆయన పార్టీ బతికి బట్టకట్టే ప్రసక్తే ఉండదు. మొత్తం మీద కడప ఎన్నికలు జగన్ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేట్టుగా, కాంగ్రెస్ పునాదులు కదిలించేట్టుగా ఉన్నాయి.ఇక తెలుగుదేశం మాత్రం ముందునుంచే చేతులు ఎత్తేసింది .
 ఎన్నికల్లో పోటి కన్నా జగన్ పై పిర్యాదులకే ప్రాదాన్యత ఇస్తోంది  .దమ్ముంటే రెండులక్షల మెజారిటీ తెచ్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు జగన్ కు  సవాల్ చేయడం విశేషం . మేం గెలుస్తామని సవాల్ చేయలి కాని ఇలా సవాల్ చేయడం తోనే ఓటమి అన్గికరించినట్టు కావడం లేదా ? ఇక పలితాల తరువాత నైతిక విజయం మాదే గగన్ వందల కోట్లు కర్చు చేసి ఓట్లు కొన్నాడు అని ప్రకటించేందుకు టిడిపి సిద్దమవ్తోంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం