గెలుపు ఖాయమని ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్న అధికార పక్షం అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కనట్టు అంత దిగులుగా ఉన్నావేంటి సుజాతొదినా అంటూ వనజ చమత్కరించింది. ‘‘ఏమీ లేదు’’ అని సుజాత ముక్తసరిగా చెప్పింది.
‘‘ చెప్పకూడని విషయం అయితే సరే’’ అని వనజ కాస్త నిష్టూరంగా పలికింది.‘‘చెప్పకూడనిదే.. కొడుకు గురించి ఇలా చెప్పుకోవలసి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు’’ అంటూ సుజాత మొదలు పెట్టింది.
‘‘ పెళ్లికావలసిన వాడు నువ్వు ఎవరితో చెప్పవనే నమ్మకంతో నీకు చెప్పుకుంటున్నాను. మా అబ్బాయి తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు లైట్ వెలుగుతుంటే తలుపు తట్టాను భయం భయంగా తలుపు తీయడంతో అనుమానం వేసింది. చేతులు వెనక్కి పెట్టుకుని ఏదో దాచాడు.
మర్యాదగా చెప్పమని అడిగితే దాచింది చూపించాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. గుండె ఆగినంత పనైంది. కాళ్లు చేతులు ఆడలేదు. కన్నీళ్లు ఇంకిపోయేంత వరకు ఏడ్చాను’’ అంటూ సుజాత పైట కొంగుతో కళ్లు తుడుచుకుంది.
‘‘ఇంతకూ ఏం చూశావ్ అని వనజ ఆసక్తిని తట్టుకోలేక అడింది. ఇంకేం చూడాలి వాడి చేతిలో మహాభారతం చూసిన తరువాత నా పెంపకాన్ని చూసి నేనే సిగ్గుపడ్డానొదినా. గది మొత్తం వెదికితే మహాభారతం, రామాయణమే కాకుండా పురాణాలన్నీ ఉన్నాయి ’’ అని సుజాత బాధగా చెప్పింది.
‘‘ఈ వయసులో ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దొదినా’’ అని వనజ అనునయించింది. తన తోటి పిల్లలంతా మందుబాటిల్స్, సిగరేట్ , హెరాయిన్‌లో మునిగితేలితూ క్లబ్బుల్లో కనిపిస్తుంటే ఏ తల్లికైనా తన కుమారుడు మహాభారతం చదవడం బాధగానే ఉంటుంది అని వనజ అనుకుంది.
‘‘మా వాడికి నేనేం తక్కువ చేశానొదినా వాడిలా మంచివాడై చెడిపోయాడు. స్నేహితులతో బార్లకు వెళుతున్నాడనుకున్నా కానీ బైక్‌పైన లైబ్రరీకి వెళుతున్నాడని ఊహించలేకపోయాను’’ అని దీనంగా సుజాత అంది. ‘‘మొన్న మేడపైకి ఎక్కి చూస్తే మీ అబ్బాయిని వాళ్ల ఫ్రెండ్స్‌ను చూస్తే ఎంతో సంతోషం వేసింది. మీ వాడు నీళ్లు కూడా కలుపుకోకుండా ఆఫ్ బాటిల్‌ను గడగడా తాగేస్తుంటే ముచ్చటేసింది. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా మత్తులో జోగుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాల లేదనుకో! అదే వయసులో ఉన్న మా అబ్బాయి రామాయణం, మహాభారతం చదువుతున్నాడు. నువ్వు చేసిన పుణ్యం ఏమిటి? నేను చేసిన పాపమేమిటొదినా’’ అని సుజాత గద్గద స్వరంతో అడిగింది. ‘‘వాడు ఇంటర్ చదవివేప్పుడు తరుచుగా డబ్బులడుగుతుంటే లంబా థియోటర్‌లో కనె్నరాత్రులు సినిమాకెళుతున్నాడనుకున్నా కానీ ఇలా అప్పటి నుంచే నాకు తెలియకుండా పౌరాణిక పుస్తకాలు కొని రహస్యంగా చదువుతున్నాడని ఊహించలేదు’’ అంది సుజాత. ‘‘ ఈ వయసులో మనం చేయగలిగిందేమీ లేదొదినా భగవంతుడు నీకు అంతే రాసిపెట్టాడనుకోవాలి. మీ వాడు ఎందుకూ పనికిరాకుండా మంచి వాడుగానే మిగిలిపోతాడేమోననిపిస్తోంది’’ అని వనజ చెప్పింది.
‘‘గుండె దిటవు చేసుకోవాలి.మన కాలనీలో జులాయిలులతో స్నేహం చేయించడానికి ప్రయత్నించు ఏమైనా మార్పు వస్తుందేమో! అని వనజ చెప్పింది.
కాసేపు ఆగి ‘‘ నువ్వు ఏమనుకున్నా సరే ఒదినా మీ వాడ్ని మావాడితో మాట్లాడవద్దని చెప్పు. మావాడిమీద మేం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మీవాడి పరిచయంతో మావాడు మంచివాడిగా మారితే మేం తట్టుకోలేం ’’ అని వనజ కఠినంగానే చెప్పింది
.‘‘ నీ స్థానంలో నేనున్నా అలానే అనేదాన్ని’’ అని సుజాత పెద్ద మనసుతో అంది. ‘‘మంచివాడిగా మిగిలిపోతే వాడికి ఎవరైనా పిల్లనిస్తారా? అని సుజాత అనుమానంగా అడిగింది.
‘‘ మొన్నటికి మొన్న మా రఘు బాబాయ్ కొడుక్కు సంబంధం కుదిరాక, అమ్మాయి తమ్ముడొచ్చి పబ్బుకెళదాం రా బావా అనిపిలిస్తే నాకు అలవాటు లేదు అని అన్నాడట!
అంతే అమ్మో చూస్తుంటే అబ్బాయి మంచోడిలా ఉన్నాడు అని సంబంధం క్యాన్సల్ చేసుకున్నారు. పాపం వాడు మరీ అంత మంచోడేమీ కాదు పబ్బుకెళ్లడు కానీ ఇంట్లోనే రోజూ మందు కొడతాడు ఎంత చెప్పినా వారు వినలేదు’’ అని వనజ చెప్పింది.
సుజాత దీర్ఘంగా నిట్టూరుస్తూ, ‘‘అబ్బాయిని అనేం లాభం ఈ రోగం మాకు వంశ పారంపర్యంగా ఉంది. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. లంచం తీసుకోకూడదు అనే జబ్బుండేది. మా అన్న జర్నలిస్టు తన కన్నా జూనియర్లు ఓనర్లుగా, పరిశ్రమల యజమానులుగా మారి టీవిల్లో, కాలేజీల్లో నైతిక విలువలపై చక్కని ఉపన్యాసాలు ఇస్తుంటే వీడేమో ఇంకా పనికి రాని ఉద్యోగంలోనే ఉన్నాడు. ఇప్పుడు మా వాడికి కుటుంబ జబ్బే వచ్చినట్టుంది. విలువల గురించి ఇతరులకు బోధిస్తూ నిత్యానందలా జీవించే వాడే జీవితంలో ఎదుగుతాడు. మాకొద్దీ తెల్లదొరతనం అని అప్పుడు నినదించినట్టు మాకొద్దీ మంచి తనం అని గట్టిగా అరవాలనిపించిది సుజాతకు.
***
పత్రికల్లో వార్త చూడగానే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. తాలిబాన్ల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పుడు, అమెరికా వీసా నిరాకరించినప్పుడు కూడా అంతగా కలవరపడలేదు. తనను అధికారం నుంచి దించేయడానికేదో కుట్ర జరుగుతుందని కలవరపడ్డాడు.
నరేంద్ర మోడిని పాలనను అన్నా హజారే మెచ్చుకున్నాడు, ఆయన్ని చూసి నేర్చుకోవాలని ఇతర నాయకులకు హితబోధ చేశాడు. తన గురించి మీడియాలో పాజిటివ్ వార్తలు వచ్చాయంటే తాను మూడోసారి గెలవడం సాధ్యమవుతుందా? అని మోడీకి భయం వేసింది.
. దేశంలోని మీడియా 2004లో చంద్రబాబును ఆకాశానికెత్తింది, నరేంద్ర మోడీని జాతీయ విలన్‌గా చిత్రీకరించింది. దాంతో మోడీ గెలిచాడు, బాబు 47 సీట్లకు పరిమితం ఆయ్యారు. 2009లో సైతం మీడియా తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే కదా వైఎస్‌ఆర్ రెండోసారి గెలిచింది. అమెరికాలో సైతం ఇదే జరిగింది. ఇరాక్‌పై యుద్ధం చేసినందుకు ప్రపంచమంతా జార్జిబుష్‌ను వ్యతిరేకిస్తే, అమెరికన్లు బుష్‌ను గెలిపించారు.
నేటి మాట: ఎంత చెట్టుకు అంత గాలి ఎంత చెడ్డపేరుంటే అంత అవకాశాలు..
.మరి మీ పిల్లలలు రామాయణం, మహాబారతం చదవకుండా జాగ్రత్త పడుతున్నారా ? ఏమరుపాటుగా ఉంటె మంచివాళ్ళుగా మారే ప్రమాదం ఉంది జాగ్రత్త ఏమంటారు నా మాట నిజమే నంటారా కాదా ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం