10, ఏప్రిల్ 2011, ఆదివారం

మనకూ కావాలి ఓ అన్నా హజారే :మన నేతలు మీడియా కలిసి ఉద్యమించిన జనం ఎందుకు పట్టించుకోలేదు .మనకు నిజాయితి పరుడైన నాయకుడు ఒక్కరైన ఉన్నారా



లిబియాలో ఒక సాధారణ మహిళ ఫేస్ బుక్ ద్వారా ఉద్యమానికి నాంది పలికింది. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని ఫేస్‌బుక్‌లో ఆమె ఇచ్చిన పిలుపునకు లక్షల సంఖ్యలో దేశ ప్రజలు స్పందించారు. చివరకు నియంత అధికారం నుంచి తప్పుకోక తప్పలేదు.

సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతిపై సాగిస్తున్న ఉద్యమానికి సైతం ఇప్పుడు ఇదే విధంగా అనూహ్యంగా దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. మరి ఆయనకు ఎటువంటి అండదండలూ లేవు. కేవలం మామూలు దుస్తుల్లో కనిపించే సాధారణ వ్యక్తి అన్నా హజారే.
మహారాష్టల్రోని ఒక చిన్న గ్రామాన్ని తన కార్యక్షేత్రంగా చేసుకుని ప్రజలకు మంచి చేసిన నాయకుడు ఈరోజు దేశాన్ని కదిలిస్తున్నాడు. దీనిలో హజారే గొప్పతనం కన్నా రాజకీయ వ్యవస్థ వైఫల్యమే ఎక్కువగా ఉంది. హజారేకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు.
ఒక సామాజిక కార్యకర్త చేపట్టిన ఉద్యమానికి దేశం కదిలితే, మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, మీడియా కలిసి ఉద్యమించినా జనంలో స్పందన లేకపోవడం ఎందుకో ఆలోచించాలి.
పైగా 2004 నుంచి 2009 వరకు అవినీతిపైనే ప్రధాన ప్రతిపక్షం ప్రచారం చేసినా అదే కాంగ్రెస్‌కు జనం తిరిగి పట్టం కట్టారు. హజారే దీక్ష ప్రారంభించగానే దీక్షకు మా మద్దతు అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, ఆయ న బావ మరిది నందమూరి హరికృష్ణ ప్రకటించారు.
అన్నా హజారే దీక్ష గురించి ప్రకటించడానికి కన్నా ముందే మన రాష్ట్రంలో అవినీతి ఉద్యమంపై రాజకీయ పక్షాలు కొన్నిహడావుడి చేశాయి. అక్టోబర్ రెండున గాంధీఘాట్ వద్ద టిడిపి నాయకత్వంలో అవినీతి ఉద్యమం ప్రారంభించారు. మాజీ ఎన్నికల ప్రధానాధికారి లింగ్డోను సైతం చంద్రబాబు ఆహ్వానించారు.

అదే రోజు లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ నిర్వహించిన ర్యాలీకి హాజరైన లింగ్డో బాబు ఉద్యమంవైపు కనె్నత్తి చూసేందుకు ఇష్టపడలేదు. బాబు అవినీతి ఉద్యమాన్ని ప్రారంభించగానే అన్ని చానల్స్‌లో అవినీతిపై మొదలైన చర్చ చివరకు చంద్రబాబు అవినీతిపై రచ్చకు దారి తీసింది.

చివరకు టిడిపి నాయకులు తల పట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిపై మీడియా ఎంత ప్రచారం చేసినా ప్రజలు స్పందించడం లేదంటే మీడియా ప్రభావం తగ్గటమే కారణమని బాబు వాపోయారు. కానీ మీడియాను అత్యధికంగా ఉపయోగించుకుంది చంద్రబాబు, ఆయన పార్టీ మాత్రమే!
ఒక నాయకుని కోసం, ఒక పార్టీ కోసం మీడియా పని చేస్తోంది అనే అభిప్రాయం కలిగినప్పుడు సహజంగా మీడియా ప్రభావం తగ్గిపోతుంది. రాష్ట్రంలో జరిగింది అదే.
బాబు లేవనెత్తిన కుంభకోణాలు మొత్తం ఆయన హయంలో మొదలైనవే.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి నిర్మూలన కోసం అంటూ ఒక కమిటీ వేశారు. అన్నా హజారే, మాజీ విజిలెన్స్ చీఫ్ కమిషనర్ విఠల్, ఐఎఎస్ అధికారి మహంతి తదితరులతో కమిటీ వేశారు. ఆ కమిటీ ఒకే ఒక సమావేశం జరిపింది. తొలి సమావేశం చివరి సమావేశం అదే అయింది. ఇక్కడ అన్నా హజారేకు, విఠల్‌లకున్న మంచిపేరును ఉపయోగించుకోవాలనుకున్నారే తప్ప నిజంగా అవినీతి నిర్మూలన ఆయన లక్ష్యం కాదు.
ప్రాణిక్ హీలింగ్‌కు జనంలో క్రేజి ఉందంటే ప్రాణిక్ హీలింగ్ చేసే వ్యక్తిని పిలిపించి మంత్రులు, అధికారులందరితో పాటు బాబు తానూ ప్రాణిక్ హీలింగ్ చేశారు. చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనే ఉండదు.
ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత 1984లో చంద్రబాబు తమ సొంత పార్టీ మంత్రి రామచంద్రరావు (ఖైరతాబాద్ నియోజక వర్గం) తనకు లంచం ఆఫర్ చేశారని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు (మీడియాకు చెప్పారు).
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత అదే రామచంద్రరావుకు 96లో సికింద్రాబాద్ పార్లమెంటు సీటును బాబు ఇచ్చారు. అవినీతిపై పోరాడేందుకు ఎన్టీఆర్ భవన్‌లో ఒక సెల్ ఏర్పాటు చేశారు. సెల్ బాధ్యతలు నిర్వహించిన పిఎన్‌వి ప్రసాద్ టిడిపిని వీడి జగన్ పంచన చేరి బాబు అవినీతి వ్యవహారాలపై మాట్లాడుతున్నారు. ఇక సెల్ ఏర్పాటు తరువాత నాదర్‌గుల్ భూ కుంభకోణంపై ఉద్యమించారు.

గూండాలతో దాడులు జరిపారని ఆరోపించిన వ్యక్తిని బాబు పార్టీలో చేర్చుకుని పార్లమెంటు సీటిచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పక్షాల్లో అంతో ఇంతో ప్రజల్లో మంచి వాడు అనుకున్న వ్యక్తి జయప్రకాశ్ నారాయణ్. 2009 ఎన్నికల్లో టిడిపి ఓడిపోగానే జయప్రకాశ్ నారాయణ్‌పై విమర్శలు గుప్పించారు. బాబు అవినీతి వ్యవహారాలపై జెపి గతంలో అనేక సార్లు విమర్శించారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉద్యమాల్లో పని చేస్తున్నారు.
బాబు అవినీతిపై సిపిఎం గతంలో పుస్తకాలు విడుదల చేసింది. ఇప్పుడు అదే బాబుతో కలిసి ఆ పార్టీ నేతలు పని చేస్తున్నారు. ఇక హజారే ఉద్యమానికి మద్దతు ప్రకటించిన మోహన్‌బాబు గతంలో బాబుపై కోపం వచ్చి అవినీతిపై రాజీలేని పోరాటం సాగిస్తామని చెప్పి ఖైరతాబాద్‌లో దీక్షకు కూర్చున్నారు. అది ఒక రోజుకే పరిమితం అయింది. తరువాత సర్దుబాట్లు జరిగాయి. నైతికంగా ఇంత పతన స్థితిలో ఉన్న మన నాయకులు, వారి మద్దతు దారులు సాగించే ఉద్యమాలకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుంది

? ప్రజల్లో స్తబ్దత లేదని చెప్పడానికి అన్నా హజారే సాగిస్తున్న ఉద్యమానికి వారి నుంచి వస్తున్న మద్దతే సాక్ష్యం. రాష్ట్రంలో మద్యనిషేధ ఉద్యమానికి గ్రామ గ్రామాన స్పందన లభించింది. అంతటి స్పందన ఇప్పటి వరకు రాష్ట్రంలో మరే ఉద్యమానికి లభించలేదు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమించిన మీడియా బాబు అధికారంలోకి రాగానే నిషేధం సడలిస్తే వౌనంగా ఉండిపోయింది.
ఒక రాజకీయ పక్షానికో, ఒక పార్టీకో ప్రయోజనం కలిగించే ఉద్యమాల పట్ల ప్రజల్లో ఏ మాత్రం స్పందన ఉండదని రాష్ట్రంలో తేలిపోయింది. రాష్ట్రంలో అవినీతి పాపంలో అందరికీ భాగస్వామ్యం ఉంది. అందుకే మన పార్టీలను జనం నమ్మడం లేదు. ఇది తెలుసుకొనే కొన్ని పార్టీలు ఉద్యమాన్ని సైతం ఔట్ సోర్సింగ్‌కు ఇస్తున్నాయి. అదే మన దౌర్భాగ్యం. మనకూ కావాలి ఒక అన్నా హజారే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం